Share News

Vemuri Satyanarayana: శిల్పం ఎలా ఉన్నా, చదివించే లక్షణం ముఖ్యం

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:45 AM

వేమూరి సత్యనారాయణ వేమూరి సత్యం కథారచయితగా, సినీ రచయితగా ఎన్నదగిన కథలు రాశారు.

Vemuri Satyanarayana: శిల్పం ఎలా ఉన్నా, చదివించే లక్షణం ముఖ్యం

వేమూరి సత్యనారాయణ (వేమూరి సత్యం) కథారచయితగా, సినీ రచయితగా ఎన్నదగిన కథలు రాశారు. ‘జ్యోతి’ మాసపత్రికకు ఎడిటర్‌గా పని చేస్తూ కొన్ని వందల కథలను ఎంపిక చేసి ప్రచురించారు. ఒకప్పుడు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన ‘మీరా’ నవలా రచయిత్రి సత్యంగారి డిస్కవరీనే! అలాంటి సత్యంగారు ఇటీవల ఒక అరుదైన ఫీట్ చేశారు. తన ఎనభయ్ ఏళ్ళ వయసులో ‘ఎనభయ్‌లో ఇరవై’ అంటూ మొదటి కథాసంపుటిని ప్రచురించారు. ఈ సందర్భంగా ఆయనతో చిన్న సంభాషణ!


ఎనభయ్ ఏళ్ళ వయసులో మొదటి కథా సంపుటి! ఎలా ఉంది మీ అనుభూతి? అనుభూతి ఆశించి పుస్తకం తీసుకురాలేదు. ఒక స్నేహితుడి ఆలోచన, నా శ్రీమతి ప్రోత్సాహంతో యాంత్రికంగానే మొదలుపెట్టి పుస్తకం తెచ్చాను. పుస్తకం వచ్చి మంచి అనుభూతిని మిగిల్చింది. చివరలో నా ఎనభై ఏళ్ళ ప్రయాణం పేరుతో రాసిన ఒక చిన్న వ్యాసం నా జీవితాన్ని క్లుప్తంగా రికార్డ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. పుస్తకం మొదటి పరిచయ కార్యక్రమం కూడా నా 80వ పుట్టినరోజు వేడుకతో కలిపి కుటుంబ సభ్యుల మధ్య సాహితీ మిత్రుల మధ్య జరగడం దాదాపు ఆనందాశ్రువులు తెచ్చేంత అనుభూతినే మిగిల్చింది. ఐ యామ్ హాపీ!


ఈ పుస్తకంలో మొదటి కథను డెబ్భయ్యవ దశకంలో రాశారు. దాన్ని మళ్ళీ యాభయ్ ఏళ్ళ తరువాత 2024లో తిరగ రాశారు? ఈ కాలంలో రచయితగా మీలోను, మీ దృక్పథంలోను వచ్చిన మార్పును కథ తిరగ రాసినప్పుడు కథలో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. దీని వలన మీరు సాధించిన అదనపు ప్రయోజనం ఏదయినా ఉన్నదా? ఈ సంపుటి ప్రచురించే క్రమంలో నా మొదటి కథ గురించి ఆలోచించినప్పుడు నేను గ్రహించినది ఏమిటంటే, ఒక అనూహ్య సంఘటన నన్ను స్పందింప చేసి ఆ కథగా ఎవాల్వ్ అయింది అని. ఆ కథను రాసినప్పటి ప్రతి ఇప్పుడు లేకపోయినా నాకు స్పష్టంగా గుర్తుండటం వలన తిరగ రాయగలిగాను. ఆ కథ ఎలా వుండి ఉంటుందో జ్ఞాపకం చేసుకుని రాసాను. ఇలా ఎందుకు రాసాను అంటే అప్పటి నా స్పందనను, సంఘర్షణను శాశ్వతం చేసుకోవడానికే. బహుశా మొదటగా రాసి జాగ్రత్త పరచని ఆ కథ ఇప్పటి కథకి దగ్గర గానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నా స్వభావంలో ఎలాంటి మార్పు లేదు గనుక.


మీ కథలు కొన్ని ఓపెన్ ఎండెడ్‌గా ఉంటాయి. అలా ఉంచడం వలన పాఠకుడు తనకు కావలసిన ముగింపు ఏదో తాను వెతుక్కునే సౌలభ్యం ఉంటుంది. కానీ అలా ఓపెన్ ఎండెడ్‌గా వదిలేయడం రచయిత బలహీనత కాదా? తానేం చెప్పదలచుకున్నాడో అది స్పష్టంగా కథలో చెప్పాలి కదా? ఓపెన్ ఎండెడ్‌గా ఉంచడం ఉంచకపోవడం అనేది ఒక కథ ముగింపుకి రచయిత ఎన్నుకునే వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది. ఓపెన్ ఎండెడ్‌గా ఉంచకుండా రచయిత ముగింపు చెప్పినా ఆ ముగింపు నచ్చకపోతే పాఠకుడు తనకు నచ్చిన ముగింపు తాను రాసుకుంటాడు. మరెందుకు అలా ఓపెన్ ఎండెడ్‌గా ఉంచడం అంటే అది రచయిత నిర్ణయం.


మీరు కథ రాసే పద్ధతి? కథకి సంబంధించిన ఆలోచన అనే మొలక మనసులో పడ్డాక నెమ్మది నెమ్మదిగా ఆకులు తొడుగుతూ, రెమ్మలుగా పెరుగుతూ వస్తుంది వస్తువు. అయితే నాకున్న ఒక ప్రత్యేకమైన అలవాటు వలన, అనుకున్న కథని రాయడానికి ముందే స్నేహితులకి, ఇంట్లో సభ్యులకి కథగా చెప్తాను. ఇలా ఒక నేరేషన్ నుంచి మరొక నేరేషన్ లోకి ప్రయాణించడంలో వాక్యాలు అలవోకగా వచ్చి చేరతాయి, పాత్రలు పుడతాయి, వస్తువు చివరకు ఒక కథగా ఎవాల్వ్ అవుతుంది. అలా ఎవాల్వ్ అయిన కథని రాసి పక్కన పడేసి మరో వారం తరువాత తీరికగా చదువుకుంటాను. లోపాలు సరి చేసుకుంటాను. ఆ తరువాత ఒకరికో ఇద్దరికో చూపించి అభిప్రాయం తీసుకుని మళ్ళీ తిరగ రాస్తాను. మూడోసారి రాసే వెర్షన్ ఫైనల్‌ కథగా పాఠకుడి ముందుకు వస్తుంది.


కథలు సరే, నవల రాసే ఉద్దేశం ఉందా? అంతకుముందు లేదు. ఇప్పుడు వుంది. యెస్! నా జీవితం, నా అనుభవాలు, నా పోరాటాలు, నా ఆనందాలు, దుఃఖాలు, వీటితో పాటుగా నా జీవితం లోని కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులు, అందరినీ తలచుకుని, ఆ బంధాల మధ్య ఉన్న ఆరోహణా అవరోహణలు అన్నీ గుదిగుచ్చి ఒక నవలగా తేవచ్చేమో! కొంత వాస్తవమూ, కొంత కల్పనా కలిపి నవల రాయగలనేమో! చూడాలి.


ఈ తరానికి మీరిచ్చే సలహా? ప్రత్యేకంగా ఏమీ లేదు. రాయాలనుకున్నపుడు రాయండి. రాసిన వాటి గురించి మిత్రుల తోనూ, మీ ముందుతరం రచయితలతోనూ చర్చించండి. శిల్పం ఎలా ఉన్నా కథకి చదివించే లక్షణం ముఖ్యం అని నేను నమ్మి చెపుతున్నాను. అలా కాకుండా మరోలా రాసి మెప్పించగల ప్రతిభ మీలో ఉంటే రాయండి. అంతా మీ ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత రాసినా, ఎలా రాసినా చదవడం మాత్రం ఆపొద్దు. నిరంతర పఠనం మిమ్మల్ని పుటం పెడుతుంది.

-వంశీకృష్ణ

Updated Date - Jul 14 , 2025 | 12:45 AM