‘వైకుంఠపురం’ అమరావతికి జలహారం!
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:04 AM
గుంటూరు జిల్లా, అమరావతి మండలం వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత 2018లో బ్యారేజ్ నిర్మాణం చేపట్టింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. వరదల సమయంలో...

గుంటూరు జిల్లా, అమరావతి మండలం వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత 2018లో బ్యారేజ్ నిర్మాణం చేపట్టింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. వరదల సమయంలో వృధాగా పోతున్న కృష్ణా జలాలను ఒడిసి పట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన నుంచి పుట్టిందే ఈ బ్యారేజ్ నిర్మాణం. ఇది పూర్తి అయితే బహుళ ప్రయోజనాలు చేకూరేవి. ఈ ప్రాజెక్టుకు 2018 ఫిబ్రవరి 13న చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కృష్ణా జలాలను ఒడిసి పట్టేందుకు 10 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుకు రూ.2,169 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. టెండర్లు కూడా పిలిచి పనులు కూడా ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నిర్మాణ పనులు నిలివేసింది. వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణం సాకారమై ఉంటే నేడు రైతులకు వరప్రదాయిని అయ్యేది.
బ్యారేజ్ నిర్మాణం చేస్తే, లోకల్ క్యాచ్‌మెంట్ ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకు ఉపనదులు మున్నేరు, పాలేరు, కట్టలేరు, ఇతర వాగుల నుంచి వచ్చే వరద నీటిని నిల్వ చేసుకొని సాగునీటికి వినియోగించుకోవచ్చు. విజయవాడ–గుంటూరు, అమరావతి, చుట్టుపక్కల ఎగువ ప్రాంతాల మండలాలకు స్థిరమైన సాగు, తాగు నీరు సౌకర్యం కల్పించవచ్చు. భూగర్భ జలమట్టం పెరుగుతుంది. పర్యాటకం, నావిగేషన్ మెరుగుపరచవచ్చు. చేపల పెంపకం, హార్టీకల్చర్ అభివృద్ధి చెందుతుంది. కృష్ణా డెల్టా కింద 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చు. గోదావరి–పెన్నా నదుల అనుసంధానానికి ఉపయోగం. పులిచింతల నుంచి 62 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం, అక్కడ నుంచి 23 కి.మీ దిగువకు ప్రకాశం బ్యారేజ్, అక్కడ నుంచి 12 కి.మీ దిగువకు చోడవరం బ్యారేజ్ ఉంటాయి. మొత్తం 97 కిలోమీటర్లు మేర నదిలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుంది. అమరావతిని అందమైన నగరంగా నిర్మించాలన్నది అసలు ప్రణాళిక.
ఇరవై ఏళ్ళ నుంచి ఇసుక క్వారీయింగ్ మూలంగా కృష్ణా జిల్లా వైపు కాసరబాద గ్రామం వద్ద పెద్ద ఎత్తున రెండు కిలోమీటర్లు మేర ఇసుక మేట వేయడంతో కృష్ణా నది ప్రవాహం మొత్తం గుంటూరు జిల్లా వైపు మళ్లింది. దీంతో కృష్ణా జిల్లా వైపు నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు నీరందని పరిస్థితి నెలకొంది. కృష్ణా నది పరివాహక ప్రాంతం కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలో 28 స్కీమ్స్ ఉన్నాయి. వీటి కింద కృష్ణా జిల్లాలో 28,456 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 6 స్కీముల కింద 4,263 ఎకరాలు, మొత్తం 32,719 ఎకరాలలో వరి, మిర్చి, పత్తి ఇతర పైర్లను రైతులు సాగు చేస్తుంటారు. వీటికి నీరందక ఉత్తపోతల పథకాలుగా మిగిలిపోయాయి. వైకుంఠపురం బ్యారేజ్ పూర్తి అయితే పల్నాడు ప్రాంతం కోసూరు, అమరావతి మండలాల్లో సాగర్ కాల్వల చివరి ఆయకట్టుకు వరకు నీరు అందించవచ్చు. కాబట్టి వైకుంఠపురం బ్యారేజ్‌ను వేగంగా పూర్తి చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
– నీరుకొండ ప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి...
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు
Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..
Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
Read Latest Telangana News And Telugu News