Share News

Left Parties In India: ఏకమైతేనే వామపక్షాలకు భవిష్యత్తు

ABN , Publish Date - Dec 19 , 2025 | 02:00 AM

లాటిన్ అమెరికా, ఫ్రాన్స్, నార్వే వంటి యూరోపియన్ దేశాల్లో సైతం నేడు వామపక్షాలు బలపడుతుంటే, అత్యధికంగా పేదలున్న మన దేశంలో మాత్రం పార్టీ చీలికలతో బలహీనపడటం ఆశ్చర్యకరం....

Left Parties In India: ఏకమైతేనే వామపక్షాలకు భవిష్యత్తు

లాటిన్ అమెరికా, ఫ్రాన్స్, నార్వే వంటి యూరోపియన్ దేశాల్లో సైతం నేడు వామపక్షాలు బలపడుతుంటే, అత్యధికంగా పేదలున్న మన దేశంలో మాత్రం పార్టీ చీలికలతో బలహీనపడటం ఆశ్చర్యకరం. బ్రిటీష్ కాలం నుంచే వివాదాస్పదంగా ఉన్న సరిహద్దు సమస్యపై భారత్–చైనా మధ్య 1962లో యుద్ధం జరిగి,‌ కమ్యూనిస్టులు సిద్ధాంతపరంగా చీలిపోయారు. ఆ తర్వాత తీవ్రవాద భావజాలంతో మరి కొందరు నక్సలిజం, మావోయిజం అంటూ జన స్రవంతి వీడి, అడవిబాట పట్టడంతో పార్టీ ఇంకా బలహీనపడింది. ఇక మన రాష్ట్రంలో పార్టీ చీలికల‌ వల్ల సొంతంగా పోటీ చేసే బలం లేక ఏదో ఒక ‌పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీలు బలపడుతూ క్రమంగా కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడుతున్నాయి. మరో వైపు బీజేపీ ఒకే దేశం–ఒకే ప్రజ, ఉమ్మడి పౌరసత్వం, ట్రిపుల్ తలాక్‌ రద్దు, ప్రజలంతా ఒక్కటే అంటూ జాతీయ భావాలు రెచ్చగొడుతూ ప్రజల్లోకి దూసుకెళుతోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో మతమౌఢ్యుల దాడులకు భయపడి వచ్చే హిందువులు, బౌద్ధులు, సిక్కులు వంటి అక్కడి మైనార్టీలకు భారతీయ పౌరసత్వం ఇచ్చే బిల్లు కేంద్ర ప్రభుత్వం తెస్తే, పౌరసత్వం అందరికీ ఇవ్వాలని వామపక్షాలు వాదించాయి. అలా చేస్తే పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో తీవ్రవాదం పెరుగుతుందని బీజేపీ వాదించింది.

ఇటువంటి వివాదాస్పద అంశాలను పక్కనబెట్టి సమాజానికి నిత్య సమస్యలైన నిరుద్యోగం, రైతు సమస్యలు, అవినీతి, అక్రమాలు వంటి సమస్యలపై గట్టిగా ఉద్యమించాలి. నేడు మన దేశంలో ప్రభుత్వాలు ఆచరిస్తున్న‌ కార్పొరేట్ అనుకూల విధానాల‌తో కుబేరులే కాదు కుచేలుర సంఖ్య కూడా పెరిగిపోతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో విధిస్తున్న సంపద పన్ను, వారసత్వ పన్నులు మన ప్రభుత్వాలు విధించక‌పోవటం‌ ఈ అడ్డగోలు ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోవటానికి కారణం. అంతేకాక ఇప్పుడు లాభాలను ఆర్జించే ప్రభుత్వ సంస్థలను, ప్రకృతి సంపదలను‌ కూడ ఈ ప్రభుత్వాలు అతి చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నాయి. ఫలితంగా కార్పొరేట్ సంస్థల ఆదాయం భారీగా పెరిగి, దేశ తలసరి ఆదాయం పెరిగినా కూడా సామాన్య ప్రజల ఆదాయం మాత్రం గొర్రె తోక బెత్తెడు అనే సామెత వలె ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది.


అధికారం, సంపాదన, పదవీ కాంక్ష లేని సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు భేషజాలకు పోకుండా, బేషరతుగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ అనే స్వదేశీ పేరుతో విలీనమైతే ఆ పార్టీ బలం ద్విగుణీకృతమవుతుంది. అవసరమైతే పదవుల‌ పంపకంపై పార్టీ సభ్యుల అభిప్రాయం కూడా సేకరించవచ్చు. మన ప్రజాస్వామ్యంలో ఎన్ని లోటుపాట్లున్నా తమకు నచ్చిన పార్టీని గద్దె నెక్కించే స్వేచ్ఛ ప్రజలకు ఉంది. హింసా మార్గంలో అధికారం‌ వచ్చే అవకాశం లేదు. సాయుధ పోరాటాల్లో, ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయేది ప్రజల రక్షణ కోసం పనిచేసే సామాన్య పోలీసులు, సామాజిక న్యాయం కోరే మావోయిస్టులే గాని దోపిడీదారులో, సంఘ విద్రోహులో కాదు. తాజాగా మావోయిస్టులు కూడ సాయుధ పోరాటం విరమిస్తామని ప్రకటించారు గనుక, వారు కూడ జనజీవన స్రవంతిలో కలిసి ఈ కొత్త పార్టీలో చేరి ఐక్యంగా పోటీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.

తిరుమలశెట్టి సాంబశివరావు, గుంటూరు

Also Read:

జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట

పాలిచ్చే స్త్రీలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా?

Updated Date - Dec 19 , 2025 | 02:00 AM