Share News

Tribute to Lok Kavi Andesri: అందేశన

ABN , Publish Date - Nov 17 , 2025 | 05:17 AM

సుకుమారమైన సుందరమైన అందమైన జీవితం కాదది కారం మెతుకులతో కడుపు నింపుకున్న గరీబ్‌తనం కడుపునిండా కాయిపాయిగా తినలేదు! కంటి నిండా నిద్రపోలేదు!...

Tribute to Lok Kavi Andesri: అందేశన

సుకుమారమైన సుందరమైన

అందమైన జీవితం కాదది

కారం మెతుకులతో కడుపు నింపుకున్న గరీబ్‌తనం

కడుపునిండా కాయిపాయిగా తినలేదు!

కంటి నిండా నిద్రపోలేదు!

జీవితమంతా అందేశననే!

పల్లె మమకారాన్ని ప్రకృతి ఆత్మను

వొడి నింపుకొని పొలిమేర గాసేది

పోత లింగమయి

ఆధిపత్యాల మీద ఝంఝామారుతమై

జే గంటలు మోగించిన కవీంద్రుడు

భగభగ మండి బాధల అగ్గి గుండాల్లో

మరిగిన అక్షరాలను గురి జూసి

పాటల వొడిసెల విసిరేది

బతుకు సంచాలమై ఆకలితో అలమటించి

నెత్తిమీద అవమానాల వొల్లెడను

తలకిరీటం ధరించి రగరగా మండేది

ఆ కంఠం కంచు జమిడికె మోత

ఆ పదాలు నిప్పుల ప్రవాహమై

లోకాన్ని మేలుకొలిపేది

బడిబాట తొక్కని ఆ పాదాలకు

విశ్వవిద్యాలయాలు తలవంచేది

శిల్ప నైపుణ్యాలు కవితా నిర్మాణ సొగసులు

అలంకార శాస్త్రాలు

పిల్లికూనలై తన కాలి అందెలతో కలిసి నడిచేది

మనిషి గుండె ముక్కలు శెక్కలై దుక్కిస్తున్నప్పుడు

మానవత్వపు పల్లవుల ఊటశెల్మై దూప తీర్చేది

రగుతాన్ని అక్షరాలుగా మలిసి

బొండిగె నరాలు తెగేతట్టు రాగమెత్తి పాడి

పాండిత్యం కాదు పాటకు

తన ఊపిరితో పాణం పోసేది

అణచబడ్డ జాతి నుండి ఆత్మగౌరవ జెండై

తెలంగాణ తల్లికి పాటతో పట్టాభిషేకం జేసి

పరిగె పరిగె పులుకు పులుకు పులుకాషిబతుకును

మొగులు నిండా విరపూయించిన పాటల సింగిడి

పెదవాగు వొడ్డుకు పుట్టి

రేబర్తి జీవపరిమళాలతో వెలిగే తెలంగాణ కీర్తి

(లోక కవి అందెశ్రీకి)

పొన్నాల బాలయ్య

99089 06248

ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్‌ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో..

KTR petition: తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్‌.. రేపు విచారణ

Updated Date - Nov 17 , 2025 | 05:17 AM