Share News

BC Reservations: ఇంకా తీరం చేరని బీసీ రిజర్వేషన్ల నావ

ABN , Publish Date - Dec 18 , 2025 | 05:56 AM

వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లపై రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించటాన్ని ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనంగా గాక సామాజిక బాధ్యతగా భావిస్తేనే బీసీ రిజర్వేషన్ల సమస్యకు...

BC Reservations: ఇంకా తీరం చేరని బీసీ రిజర్వేషన్ల నావ

వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లపై రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించటాన్ని ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనంగా గాక సామాజిక బాధ్యతగా భావిస్తేనే బీసీ రిజర్వేషన్ల సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. బీసీ వర్గాల రిజర్వేషన్ల నావ సురక్షితంగా తీరం చేరుతుంది. కానీ దేశంలోని అన్ని పార్లమెంటరీ రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్లపై తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాయి తప్ప, చిత్తశుద్ధితో అమలు చేయాలన్న ఆలోచన చేయడం లేదు.

ఇచ్చేవారి చెయ్యి పైన, తీసుకునే వారి చెయ్యి కింద ఉన్నంత వరకూ, ఇచ్చేవాళ్ళ దృష్టిలో తీసుకునేవాడు లోకువే! ఈ సామాజిక సంప్రదాయాన్ని తారుమారు చేసే వరకు, రిజర్వేషన్లు తమ హక్కుగా భావించి ఒక బలమైన సామాజిక ఉద్యమ నిర్మాణం జరగనంతవరకు– వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు పై వర్గాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి ఉంటుంది. చివరకు ఇది దానధర్మాలకు సంబంధించిన అంశంగా పరిగణించబడుతుంది. దీనికి పై వర్గాల వారిని నిందించే బదులు రాజకీయ పార్టీలలో ఉన్న వెనుకబడిన వర్గాల సబ్బండ కులాలవారు అంతర్మథనం చేసుకోవలసిన, శక్తిమంతమైన గొంతుగా అవతరించాల్సిన అవసరం ఉన్నది.

కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ అనన్య సామాన్యంగా కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా చేపట్టిన ‘భారత్‌ జోడో’ యాత్రతో మళ్లీ ఒకసారి సామాజిక న్యాయం తెరమీదికి వచ్చింది. ‘ఇన్ కీ జిత్‌నీ ఆబాదీ, ఉన్‌కీ ఉత్‌నీ భాగీధారీ’ అంటూ రాహుల్ ఇచ్చిన నినాదంతో వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం అనే ఎజెండా దేశ రాజకీయ పార్టీలకు ప్రధానమైపోయింది. రాహుల్‌గాంధీ సామాజిక న్యాయ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కుల సామాజిక గణన చేపట్టారు. అంతేగాక, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కావాలని సంకల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. దీన్ని గవర్నర్‌కు, తద్వారా రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపాయి. కానీ ఇప్పటివరకు దానికి ఆమోదం లభించలేదు. కోర్టులు కూడా బీసీ రిజర్వేషన్ల పిటిషన్లను కొట్టివేసి మోకాలు అడ్డుతున్నాయి. రాజ్యాంగంలో ఎక్కడా 50శాతం రిజర్వేషన్లు దాటరాదన్న నిబంధన లేకున్నా, న్యాయస్థానాలు సైంధవుడి పాత్ర పోషిస్తున్నాయి. కారణం కోర్టులలో న్యాయమూర్తుల ఎన్నిక ప్రక్రియలో ఎలాంటి రిజర్వేషన్ లేకపోవడమే!


ప్రతి రాజకీయ పార్టీకి చెందిన బీసీ నాయకులంతా తమ వాదనలను గుట్టకు కట్టెలు మోసినట్టు వినిపిస్తూనే ఉన్నారు. కానీ ఈ అంశాన్ని వారి వారి పార్టీల రాజకీయ ఎజెండా మీదికి తీసుకురాలేకపోతున్నారు. తమ అధిష్ఠానాలపై ఒత్తిడి తేలేకపోతున్నారు. మొత్తానికి బీసీ రిజర్వేషన్లు అమలు కాకపోవడం పైన ఆయా రాజకీయ పార్టీల నాయకులు, మీరు కారణం అంటే మీరే కారణం అంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు తప్ప అమలు విషయంలో ఒక్క తాటి మీద నిలబడలేకపోతున్నారు. దేశంలో వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు, ముఖ్యంగా రాహుల్‌గాంధీ ఒత్తిడి వలన, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2026 జనాభా లెక్కలు, కులగణనకు అంగీకరించింది. బీసీల పక్కా లెక్కలు తేలిన తర్వాతైనా బీసీల రిజర్వేషన్ల సమస్యకు ముగింపు దొరుకుతుందో లేదో ఎదురుచూడాల్సిందే!

జూకంటి జగన్నాథం

కవి, రచయిత

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

Updated Date - Dec 18 , 2025 | 05:56 AM