Share News

వర్గీకరణలో ‘వాటా’లు సరిచేయాలి!

ABN , Publish Date - Mar 18 , 2025 | 03:17 AM

వర్గీకరణ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందడుగు వేయడం హర్షించదగ్గ విషయమే అయినప్పటికి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ నివేదికలో ఉన్న అంశాల మీద...

వర్గీకరణలో ‘వాటా’లు సరిచేయాలి!

వర్గీకరణ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందడుగు వేయడం హర్షించదగ్గ విషయమే అయినప్పటికి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ నివేదికలో ఉన్న అంశాల మీద ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేయకపోవడం, అమలు చేయాల్సిన అంశాల మీద చర్చించి నిర్దిష్ట నిర్ణయాలను తీసుకోకపోవడం విచారకరం.

ఏకసభ్య కమిషన్‌ నాలుగు ప్రధానమైన సిఫారసులలో క్రిమిలేయర్‌ ప్రతిపాదనను తిరస్కరించి మిగతా మూడు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. దీని ప్రకారం గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3గా ఎస్సీ వర్గీకరణ జరిగింది. 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లను మూడు గ్రూపులుగా వర్గీకరించి వాటాలు కేటాయించారు. మొదటి గ్రూప్‌కు అత్యంత వెనుకబడిన షెడ్యూల్డు కులాలుగా, రెండవ గ్రూప్‌కు మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్డు కులాలుగా, మూడవ గ్రూప్‌కు మెరుగైన ప్రయోజనాలు పొందిన షెడ్యూల్డు కులాలుగా కమిషన్‌ పేరు పెట్టింది. ఈ మూడు గ్రూపుల్లో గ్రూప్‌–1 కేటగిరీలో 15 కులాలను గుర్తించి వారికి 1శాతం (జనాభా 1,71,625), గ్రూప్‌–2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 కులాలను గుర్తించి వారికి 9 శాతం (జనాభా 32,74,377), మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలుగా 26 కులాలను గుర్తించి వారితో గ్రూప్‌–3 ఏర్పాటు చేసి 5శాతం (జనాభా 17,71,682) రిజర్వేషన్లు కల్పించారు. ఈ నివేదికలో ఒక గ్రూప్‌కు వెనుకబాటుతనం ఆధారంగా, మరొక గ్రూప్‌కు జనాభా ఆధారంగా, మరొక గ్రూప్‌కు ఏ ఆధారం లేకుండా వర్గీకరణ చేశారు. అందువల్ల ఈ మొత్తం వర్గీకరణ ప్రక్రియలో కమిషన్‌ నిష్పక్షపాత కొలమానాన్ని, సూత్రబద్ధతను ఎంచుకోలేదనేది స్పష్టం.


ఎస్సీ వర్గీకరణలో గ్రూప్‌–1లో చేర్చబడ్డ 15 కులాలలో ప్రధానంగా మాదిగ అనుబంధ కులాలైన బేడ బుడగ జంగం, డక్కలి, మాతంగిలతో పాటు మరికొన్ని కులాలను తీసుకున్నారు. అయితే ఇదే గ్రూపులో మాల అనుబంధ కులాలైన మన్నే, పంబాల కులాలను కూడా చేర్చారు. దీనివల్ల గ్రూప్‌–1కు కేటాయించబడిన 1శాతం రిజర్వేషన్‌ కూడా మాల అనుబంధ కులాలైన పంబాల, మన్నె కులాలకు చెందేలా కుట్రపూరితమైన వ్యూహ రచన జరిగింది. 1998లోనే మూడవ శ్రేణి అయిన ‘సి’ గ్రూపులో చేర్చబడ్డ మాల, పంబాల కులాలను నేడు 2025లో అత్యంత వెనుకబడ్డ కులాలుగా గుర్తించి గ్రూప్‌–1లో చేర్చడం అతిపెద్ద తప్పిదం.

ఇక రెండో విషయానికొస్తే రిజర్వేషన్లలో మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 కులాలను గుర్తించారు. గ్రూప్‌–2లో ఉన్న ఈ కులాలకు రిజర్వేషన్లు కేటాయించడంలో మద్యస్థమైన సూత్రబద్ధతను ఎంచుకోలేదు. అత్యంత వెనుకబడిన వారికి, అత్యంత అభివృద్ధి చెందినవారికి మధ్యగా ఉన్న ఈ మధ్యస్థ కులాల గ్రూప్‌కు రిజర్వేషన్లు కేటాయింపులు కూడా సగటు మధ్యస్థంగానే ఉండడం ఏ కోణంలో చూసినా న్యాయబద్ధం. కానీ ఆ సగటు మద్యస్థమైన విధానాన్ని రిజర్వేషన్ల కేటాయింపుల్లో పాటించలేదు. గ్రూప్‌–2లో ఉన్న మధ్యస్థ కులాలకు 1శాతం రిజర్వేషన్‌ కేటాయించడానికి 3,63,819 జనాభాను ఆధారంగా తీసుకున్నారు. అదే మెరుగైన ప్రయోజనాలు పొందిన గ్రూప్‌–3లో ఉన్న కులాలకు 1శాతం రిజర్వేషన్‌ కేటాయించడానికి 3,54,336 జనాభాను ఆధారంగా తీసుకున్నారు. ఇక్కడ రెండింటికి మధ్య వ్యత్యాసం దాదాపు 10 వేల జనాభా. న్యాయబద్ధంగా అయితే మెరుగైన కులాలకు రిజర్వేషన్‌ కేటాయించడానికి ఎక్కువ జనాభాను, మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలకు రిజర్వేషన్‌ కేటాయించడానికి తక్కువ జనాభాను పరిగణనలోకి తీసుకోవాలి. దీనికి విరుద్ధంగా మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలకు తక్కువ జనాభాను (3,54,336), మధ్యస్థంగా ప్రయోజనాలు పొందిన కులాలకు (3,63,819) జనాభాను ఎక్కువగా పరిగణలోకి తీసుకున్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలను పూర్తి విరుద్ధచర్య.


గ్రూప్‌–3 కేటగిరిలో మాలలతో పాటు మిగతా 25 కులాలను చేర్చి 5శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఇక్కడ ఎస్సీలలో జనాభా ప్రకారం మూడవ అత్యంత జనాభా కలిగి ఉన్న నేతకాని కులానికి మరికొన్ని కులాలను కలిపి ఒక ప్రత్యేకమైన గ్రూపును ఏర్పాటు చేయడానికి అవకాశం, ఆస్కారం ఉన్నాయి. మాల సామాజిక వర్గంతో పోల్చితే ఈ గ్రూపులోని నేతకాని, మహార్‌, హోలియదాసరి, మాల దాసరి, మితయల్వార్‌ మొదలగు కులాలు తీవ్ర వెనుకబాటుతనంతో ఉన్నాయి. కానీ కమిషన్‌ వీరి ఆకాంక్షను పట్టించుకోలేదు. గతంలో మాదిగలతో కలిసి ఉన్న బుడగ జంగం కులానికి 1,11,710 జనాభా ఉందనే కారణంతో ప్రత్యేకంగా వేరు చేసి వారికి తోడుగా మరికొన్ని వెనుకబడిన కులాలను చేర్చి గ్రూప్‌–1 ఏర్పాటు చేసి ఒక శాతం రిజర్వేషన్‌ కల్పించినప్పుడు బుడగజంగం కులం కన్నా ఎక్కువ జనాభా 1,33,072 ఉన్న నేతకాని కులాన్ని మాలల నుండి వేరు చేసి వారికి మరికొన్ని వెనుకబడ్డ కులాలను కలిపి ఒక ప్రత్యేకమైన గ్రూపు చేసి వారికి కూడా ఒక శాతం రిజర్వేషన్‌ ఎందుకు ఇవ్వలేదు?

మాలల్ని ఇంకొన్ని మెరుగైన కులాలను గ్రూప్‌–4గా ఏర్పాటు చేసి వారికి ఎంత శాతం రిజర్వేషన్లు న్యాయబద్ధంగా చెందుతాయో ఆ ప్రకారం కేటాయింపులు చేయాలి. ఈ ప్రకారం గతంలో మాదిరిగా ఎస్సీ వర్గీకరణను నాలుగు గ్రూపులుగా అమలు చేయవచ్చు. మాలల జనాభా, మాల అయ్యవార్‌లతో కలిపి 15,27,143 మాత్రమే. కానీ వీరి రిజర్వేషన్‌ శాతాన్ని పెంచడం కోసం పక్షపాత దృష్టితో ఆలోచించి నేతకానితో పాటు మరికొన్ని కులాలను కలిపి గ్రూపులు ఏర్పాటు చేశారని నివేదికను బట్టి అర్థమవుతుంది.


కమిషన్‌ సిఫారసుల ప్రకారం ప్రభుత్వం ఆమోదించిన ఎస్సీ వర్గీకరణలో అనేక లోపాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాలలకు 6శాతం రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణలో కేటాయించబడ్డాయి. ఇప్పుడు తెలంగాణలోనూ 6శాతం రిజర్వేషన్లు (గ్రూప్‌–3లో 5శాతం, పంబాల, మన్నె కులాలు ఉన్న గ్రూప్‌–1లో 1శాతం మొత్తం 6శాతం) కేటాయించబడ్డాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జనాభా యూనిట్‌గా తీసుకుంటే 6శాతం రిజర్వేషన్లు లభించాయి. కానీ తెలంగాణ జనాభాను యూనిట్‌గా తీసుకుంటే యథావిధిగా 6శాతం ఎలా కేటాయించబడ్డాయనేది అర్థం కాని అంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాలల జనాభాతో పోల్చితే తెలంగాణలో మాలల జనాభా చాలా తక్కువ. అందువల్ల రిజర్వేషన్ల వర్గీకరణ కేటాయింపుల్లో 6శాతం కన్నా తక్కువ వాటా రావాలి.


ఎవరికి సంతృప్తి మిగల్చని పద్ధతిలో ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాధించేది ఏమి ఉన్నదో ఆలోచన చేసుకోవాలి. ఈ మొత్తం నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్టమైన అంచనాకు వచ్చిన ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ వివిధ కులాల నేతలతో ముఖ్యమంత్రిని స్వయంగా కలిశారు. కమిషన్‌ నివేదికలో లోపాలను ముఖ్యమంత్రికి సవివరంగా వివరించారు. ముఖ్యమంత్రి సానుకూల దృక్పథంతో ఏకసభ్య కమిషన్‌ గడువును పొడగించి మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే అంతిమంగా లోపాలు సవరించబడాలి. మార్పులు లేకుండా మళ్లీ పాత నివేదికనే అమలు చేస్తే ఆపరేషన్‌ సక్సెస్‌ పేషెంట్‌ డెడ్‌ అన్నట్లుగా ఉంటుంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కీలక ఘట్టంలో ఉన్నది. కాలం ఇచ్చిన అవకాశాన్ని రేవంత్‌రెడ్డి సద్వినియోగం చేసుకుంటారని, మాదిగలతో పాటు మిగతా 57 కులాలు మాత్రం బలమైన విశ్వాసంతో, నమ్మకంతో ఎదురు చూస్తున్నాయి.

గోవిందు నరేష్‌ మాదిగ

ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు

ఇవి కూడా చదవండి...

KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన పాపం ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్

Pawan Kalyan on NREGS: ఉపాధి హామీ పథకంలో అవకతవకలను బయటపెట్టిన పవన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 18 , 2025 | 03:17 AM