A Journey Through Creative Consciousness: రచయిత పాత్రల రహస్య బంధం
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:24 AM
కల్పన కల్పనే; వాస్తవం వాస్తవమే. పాత్రలు పాత్రలే; వ్యక్తులు వ్యక్తులే. తెలియందెవరికి? అయితే పాఠకులు, రచయితలు కల్పిత పాత్రల్ని వాస్తవ వ్యక్తులుగా భావించటం ఒక కళారహస్యం. బాల్య కౌమారాల్లో, ‘చందమామ’ గహన మాంత్రిక గుహల్లో, అడవుల్లో...
కల్పన కల్పనే; వాస్తవం వాస్తవమే. పాత్రలు పాత్రలే; వ్యక్తులు వ్యక్తులే. తెలియందెవరికి? అయితే పాఠకులు, రచయితలు కల్పిత పాత్రల్ని వాస్తవ వ్యక్తులుగా భావించటం ఒక కళారహస్యం. బాల్య కౌమారాల్లో, ‘చందమామ’ గహన మాంత్రిక గుహల్లో, అడవుల్లో కథానాయకుడే కాదు, ఈ చదివే పిల్లాడూ తిరుగాడేవాడు. అది రసాత్మక దూరం (aesthetic distance) లేకపోవటం. ఆ దూరం లేనప్పుడు చదువరి కథ లోపలి మనిషే అవుతాడు. అలాగే రచయిత కూడా భావనా ప్రపంచంలో తన పాత్రలతో కలిసి తిరుగుతుంటాడు. అతని ఊహాలోక విహారాన్ని బట్టి ఆ తిరుగుడు ఉంటుంది. దాన్ని పుస్తకం మూసేసినట్టు ఆపేసి, వెలుపలికి వచ్చేవాళ్ల హాయి వేరు.
అపారమైన కావ్య ప్రపంచంలో కవే బ్రహ్మ అని, అతని అభిరుచికి అనుగుణంగా ఆ ప్రపంచం ప్రవర్తిల్లుతుందని ఆనందవర్ధనుడు అనే ఆలంకారికుడు చెప్పాడు. సాహిత్య సృష్టి అనేది రెండో ప్రపంచం. ఆ ప్రపంచంలో అనేక పాత్రలు పుడతాయి, పెరుగుతాయి, మాట్లాడతాయి, ఏడుస్తాయి, నవ్వుతాయి. అవి రచయిత మనస్సులో పుట్టి, పాఠకుల మనస్సులో నివాసం ఏర్పరచుకుంటాయి. ఇక్కడే Wayne C. Booth (The Rhetoric of Fiction) తెలిపిన విశేషమైన సంగతి చెప్పుకోవాలి. పాత్ర నిర్మాణాన్ని రచయిత, పాఠకుల సహసృష్టిగా అతను భావించాడు. అంటే రచయిత చేసే రూపకల్పనతో పాటు పాఠకుడు ఆ పాత్రల స్వరూప స్వభావాలను తన ఊహలతో, నిర్ధారణలతో కలిపి ఏర్పరుచుకుంటాడన్నమాట. అది రచయిత కల్పనకి కాస్త వేరుగా ఉండవచ్చు. ఒక పాత్ర ప్రవర్తన లేదా మొత్తం వాచకం కూడా రచయితకి పెడగా విభిన్న పాఠకులకి విభిన్నంగా తోచవచ్చు. అంటే పాత్రల భిన్న కోణాలతో పాటు వాటిని గమనించే పాఠకుల దృష్టి కోణం కూడా ఉంటుంది.
కథ లేదా నవల రచనాక్రమంలో రచయిత అంతరంగంలో జరిగే రసచర్య (alchemy) బహుశా అందరికీ తెలియకపోవచ్చు. రచయిత పాత్రను సృష్టించటం అంటే అతని మనస్సులో ఒక కొత్త ప్రాణి జన్మించటమే. అతను తన ఆలోచనలతో, అనుభవాలతో, సమాజ పరిశీలనతో పాత్రల్ని రూపొందించి, జీవరేఖ దిద్దుతాడు. ఈ క్రమంలో రచయిత, పాత్రల మధ్య ఒక ఒక ఆత్మీయ సంబంధం నెలకొంటుంది. అవి అతని మనస్సులో సజీవంగా తిరుగాడుతుంటాయి. ప్రపంచంలో మన ఆత్మీయులు కళ్లముందు లేకున్నా మానసిక ప్రపంచంలో ఉంటారు. అది ద్వితీయ వాస్తవికత (second reality). అట్లాగే ఈ క్రమంలో రచయిత తన పాత్రతో ‘మాట్లాడుతూ’ ఉంటాడు. పాత్ర రచయితతో మాట్లాడుతుంది. రచయితకు, అతని పాత్రలకు మధ్య ‘సంభాషణ’ సాహిత్య సృష్టిలో ఒక మర్మం. ప్రారంభంలో పాత్రలు రచయిత ఆజ్ఞకు లోబడి నడుస్తాయి. కథనం లోతుకు వెళ్లే కొద్దీ, మారే కొద్దీ అవి రచయిత కాదనలేని విధంగా స్వతంత్ర వర్తన కోరుకుంటాయి. రచయిత అనుకున్న ముగింపును పాత్ర కాదనవచ్చు కూడా! అది రచయితకీ సంతోషమే. సృజన క్రమంలో ఈ అన్యోన్యచర్య మానసిక సంక్లిష్ట విశేషం. పాత్రలు, రచయిత ఎదురుబొదురుగా నిలబడే సృజనాత్మక వాదోపవాద సందర్భాలు తెర వెనుక అత్యంత రసవత్తర ఘట్టాలు.
కథలో గమ్య గమన సుస్థిర జ్ఞానం గల రచయితలకైతే ఆయా పాత్రల జీవన యాత్ర మొత్తం మనోగతమే. ఎక్కడా అది బెసగదు. మొదటినుంచి చివరదాకా ఆ మనోగతి చొప్పున అవి సాగిపోతాయి. నాబోటి అసంతృప్త రచయిత, యజమాని లాగా ఆ పాత్రని కాసేపు అటు తిరగమంటాడు, అంతలోనే ఇటు మెల్లగా నడవమని, కాదు కాదు, అటు లగెత్తమని, ఇదుగో ఈ మాటలు కాదు, ఆ పలుకులు వల్లించమని నానా తిప్పలు పెడతాడు. చూసి చూసి, ‘ఇక చాల్లే సంబడం’ అని అది తోచిన నాలుగు ముక్కలు చెప్పేసి, ‘వీడ్కోలు’ చెప్పి నచ్చిన దారిన వెళ్లిపోతుంది. ఇక సదరు ‘యజమాని’ హాయిగా పడక్కుర్చీలో జేరగిల బడతాడు! కనుకనే రచనాక్షేత్రంలో కొంత దూరం వెళ్లినాక, పాత్రలు తమ మాట వినటం లేదని, వాటి దారి అవి చూసుకున్నాయనీ రచయితలు అనటం కద్దు.
హృదయానుభూతి గాఢత గల రచయితకు, అతని పాత్రలకు మధ్య ఒక మానసిక, భావోద్వేగ సంబంధం ఏర్పడుతుందనుకుంటాను. విశిష్ట పాత్రలు రచయితకు కోల్పోరాని వాస్తవ వ్యక్తులుగా, అంతరంగ స్నేహితులుగా మారతాయి. కనుమోడ్పులో, మెలకువలో అతని పక్కనే ఉంటాయి. వాటి ఊపిరి అతనికి సోకుతుంటుంది. రచన ముగిసినా ఆ బంధం తెగదు. అట్లా పాత్రలతో ఆ ఆత్మీయత చదువరులకూ ఏర్పడుతుంది. వాటిని వాళ్లెప్పటికీ కోల్పోరు. ఇక నైపుణ్యం గల నిర్మమకార రచయితలు సాధారణంగా తమ పాత్రలతో వ్యక్తిగత భావోద్వేగాలను మేళవించరు. కథనం మీద వాటి ‘పెత్తనం’ ఒప్పుకోరు. అక్కడ వాళ్లకున్న బాధ్యత పాత్రలను ఉన్నవి ఉన్నట్లు చూపించటం మాత్రమే గాని వాటితో కలిసి మెలగటం కాదు. కనుక వాటి ఊపిరి తాకనంత కాస్త ఎడంగా నిలబడతారు. అది దోసతీగ బంధం. అది detached attachment. దీన్నే ‘impassibilite’ (impassivity) అన్నాడు Flaubert. అంటే పాత్రల సంవేదనలతో రచయిత తన భావోద్వేగాలను మేళవించకపోవటం. ఈ ‘రసాత్మక’ దూరం పాత్రలను మరింత సమంగా చిత్రించేటందుకు సాయపడవచ్చు. కాగా, వృత్తిపర/ వ్యాపార రచయితలకు పాత్రలతో యాంత్రిక సంబంధం తప్ప ఎలాంటి హృదయ సంబంధం ఉండదు. అది total detachment. వాళ్లు పాత్రలకు ఆమడ దూరంలో నిలబడతారు. ‘అవసరం’ అనుకుంటే వాటిని నయానా భయానా ఏ ఏట్లోనో దూకించగలరు!
సానుకూల పాత్రలు రూపొందే క్రమంలో ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటాయి. రచయితే అలా రూపొందించినా ఆ పాత్రల్లోని విలక్షణత వ్యతిరేక క్రమంలో రచయిత మీద తిరిగి ప్రభావం చూపించవచ్చు. అతని వ్యక్తిత్వాన్ని అంతో ఇంతో మెరుగు పరచవచ్చు. ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తులూ అప్పుడప్పుడు అనివార్యంగా కష్టాల కడలిలో కదలిపోతారు. ఆ అనివార్యత కోమల మనస్కుడైన రచయితనీ బాధిస్తుంది. నా పాత్రల వేదన నేను అనుభవించిన వేదనే అన్నాడు శరత్ చంద్రుడు. అయినా అతను నిస్సహాయుడు. ఆ పాత్రల జీవనయాత్రలో అనవసర జోక్యం చేసుకునే అధికారం రచయితకి లేదు. అయితే ఇది అందరి విషయంలో అనలేం. కొంతమంది నిరంకుశులూ ఉంటారు! (నిరంకుశాః కవయః) వాళ్లు పాత్రలు కిక్కురుమననీకుండా వేలు చూపిస్తూ నడిపిస్తారు!
ఒక్కొకసారి రచయితే పాత్రగా రూపాంతరం చెందుతాడు. అందీ అందని తన ఆశయాలకు ప్రతీకగా ఒక పాత్రని సృష్టిస్తాడు. అందులో తన ప్రతిబింబాన్ని చూసుకొని సంతోషిస్తాడు. అది ఇచ్ఛాపూర్వక ఆలోచన (wishful thinking). ముఖ్యంగా అతని అనుభవాలే సానుకూల/ ప్రధాన పాత్రల అనుభవాలుగా మారతాయి. తనలోని కలల్ని, ఆశల్ని, ఆశాభంగాల్నీ పాత్రల ద్వారా వ్యక్తం చేస్తాడు. (రచయిత చెప్పలేని సంగతుల్ని పాత్రలు చెపుతాయి.) అవి అతని సంపూర్ణ అనుభవాలు కావచ్చు; పాక్షిక అనుభవాలు కావచ్చు. అవి పరాయి అనుభవాలుగా, ప్రథమ పురుషలో చెప్పవచ్చు; లేదా ‘నేను’గా ఉత్తమ పురుషలో చెప్పవచ్చు. అయితే ఉత్తమ పురుషలో ‘నేను’గా ఉన్నది రచయిత కానక్కర లేదు. అంటే అక్కడ కథకుడు (నేను) వేరు; రచయిత వేరు. ఆ అనుభవాలన్నీ రచయిత అనుభవాలేనని కొంతమంది పొరపాటు పడుతుంటారు.
రచయిత పాత్రల్ని గాక సజీవ వ్యక్తుల్ని సృష్టించాలన్నాడు హెమింగ్వే. అంటే నిజ జీవితంలో తారసపడిన మనుషుల్ని ఎత్తుకొచ్చి కథలో నిలపటం కాదు. అలా అయితే వాస్తవ వ్యక్తులకు ప్రతిరూపాలు తయారవుతాయి. ఆ వ్యక్తుల పట్ల కోపతాపాలు ఈ ప్రతిరూపాల మీద తీర్చుకునే వాళ్లూ అక్కడక్కడ తగులుతారు. అది మట్టం తక్కువ పని. అట్లా కాక కంటిముందు మనుషుల స్వభావానికి మరో రూపం ఇవ్వవచ్చు. ఆయా వ్యక్తుల గుణగణాలు గమనించి, రంగరించి వేరే మూసలో పొయ్యాలన్నమాట. ఆ గుణగణాలు ఎంత సహజంగా, మట్టసంగా అమరితే ఆ పాత్రలు అంతగా సజీవ వ్యక్తులు అవుతాయి. అందుకే మార్కెజ్, నిజ జీవితంలో వ్యక్తులే తన రచనల్లో వేరే రూపం దాల్చారన్నాడు. అదే అభిప్రాయం మహాశ్వేతాదేవి కూడా వెలిబుచ్చింది.
ఒక ఆదర్శ/ సౌందరాత్మక/ ఆత్మసౌందర్యాత్మక పాత్రను కల్పించినప్పుడు బహుశా అది ఆ రచయితతో మానసిక సహజీవనం చేస్తుందనుకుంటాను. ఈ క్రమంలో రచయిత స్వీయ కల్పితపాత్రతో ప్రేమలో పడటం సాధ్యమేనా!? సాధ్యమే అని నా అనుభవం. (‘మట్టి గుండె’లో సీత, ‘సముద్రం’లో వనమాలి, ‘స్పర్శ’లో మణిమాల ఇప్పటికీ నన్ను మక్కువతో పలకరిస్తారు.) అది అవాస్తవ వాస్తవం. కథా నవలారచనలో ఒకానొక రహో రసాయనిక ప్రక్రియ. అది మామూలు చదువరులకు అవగతం కాదు. అందరు రచయితల అనుభవమూ కాకపోవచ్చు.
‘I love my characters as if they were my children’ అన్నాడు దొస్తోయెవ్‌స్కీ. నిజానికి ప్రతి ముఖ్యపాత్రా అతని ఆత్మవాచకమే/ స్వరమే. అవి తన అంతస్తత్వాన్ని అన్వేషించటానికి సాయపడ్డాయి కనుక వాటిని ప్రేమించాడు. ఆ చీకటి వెలుగుల, సందేహాత్మక, మేధాసంపన్న, స్వయంవ్యక్త పాత్రలన్నీ అతని విరూపాలే. బహుశా ‘క్రైమ్ అండ్ పనిష్‌మెంట్’లో విచ్ఛిన్న పాత్ర రాస్కోల్నికోవ్‌లో దొస్తోయెవ్‌స్కీ ఉండే ఉంటాడు. ప్రిన్స్ మిష్కిన్ (‘ద ఇడియెట్’) లాంటి సంపూర్ణ సజ్జనుల్ని కల్పించటం కష్టమని అతను గ్రహించాడు. ఇక టాల్‌స్టాయ్ అన్నా కరెనినాని ప్రేమించినా ఆమెను సమర్థించలేదు.
ఒక కవికి, లేదా రచయితకి తాము సృష్టించిన పాత్రలతో ఎలాంటి అంతరానుబంధం ఉందో తేల్చలేము. బాగా వెనక్కి వెళితే ‘సీతాయాః చరితం పుణ్యమ్’ అన్న వాల్మీకికి, ద్రౌపదిని ‘పుణ్య గంధ’ అన్న వ్యాసుడికి వారితో ఆత్మీయ బంధం ఉందా? లేక స్థితప్రజ్ఞులుగా వారిని గమనించారా? శకుంతలను అంపకం చేసేటప్పుడు కణ్వ మహర్షితో పాటు కాళిదాసుకీ ‘వైక్లబ్యం’తో కన్నులు చెమ్మగిల్లి ఉంటాయా? ‘శ్రీకాంత’లో రాజ్యలక్ష్మిని శరత్ ప్రేమించాడా? ‘పథేర్ పాంచాలి’లో చిన్నారి దుర్గ మరణం విభూతిభూషణ్‌నీ బాధించి ఉంటుందా? ఇవన్నీ జవాబు తెలియని ప్రశ్నలు. తెలుగులో ఏయే రచయితలకి తమ పాత్రల పట్ల నిర్మమకారం, లేదా భావోద్వేగ సంబంధం ఉందో తెలియదు. అయితే గురజాడకి మధురవాణి పట్ల, ఉన్నవకి ‘మాలపల్లి’లో రామదాసు పట్ల, రామస్వామికి ‘శంబుక వధ’లో శంబుకుడి పట్ల, శ్రీపాదకి ‘కలుపు మొక్కలు’లో శేషాచలం పట్ల, బుచ్చిబాబుకి ‘చివరికి మిగిలేది’లో అమృతం పట్ల, సీతాదేవికి ‘మట్టి మనిషి’లో వరూథిని పట్ల, బైరాగికి ‘దరబాను’ పట్ల లోలోపల ఏదో మమకారం ఉందనిపిస్తుంది. మరెన్నో ఉదాహరణలతో మనం ఆలోచించవచ్చు. అయితే ఈ ఉండటం, లేకపోవటం అనేది ఆ రచనాశిల్పానికి గీటురాయి కాదు. కాకపోతే రచయిత ఆత్మీయ/ భావోద్వేగ బంధంలో రూపొందిన పాత్రలు పాఠకుల భావోద్వేగాలతో తేలిగ్గా అంటుకుపోతాయి. ఆప్యాయంగా మనసు లోగిలిలోకి వచ్చి కూర్చుంటాయి. ఒకందాన తొలగిపోవు.
మరొక సంగతి. రచయిత నిరాశోపహతుడైనప్పుడో, ఒంటరి గుహలో కూరుకుపోయిన క్షణాల్లోనో అతడు కల్పించిన, జీవం పోసిన, ప్రేమించిన ఏదో ఒక దయామయ ధీర పాత్ర చటుక్కున ప్రత్యక్షమై అతనిని అక్కున జేర్చుకుంటుందా? ఏదో ఒక సంకల్ప సాధనం చేతికిచ్చి, ముందుకు పదమని ప్రేమగా చెపుతుందా? అట్లాగే ఒకానొక ఉదాత్త కవిత తదనంతర కాలంలో తన జన్మదాతకే స్ఫూర్తినిచ్చే సందర్భాలుంటాయా? నన్నడిగితే అవునంటాను.
పాపినేని శివశంకర్
85008 84400
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో..
KTR petition: తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్.. రేపు విచారణ