Share News

Telugu Poetry: కల్లోల దశాబ్దపు కవిత్వ కలల మేఘం

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:29 AM

1991 సంవత్సరం అక్టోబర్‌లో, ఒక సాయంత్రం ఖైరతాబాద్ ద్వారకా హోటల్‌లో కలిసినప్పుడు శివారెడ్డి గారు స్వామీ మొత్తం ఎన్ని పోయెమ్స్‌ ఉంటాయి అని అడిగారు.

Telugu Poetry: కల్లోల దశాబ్దపు కవిత్వ కలల మేఘం

1991 సంవత్సరం అక్టోబర్‌లో, ఒక సాయంత్రం ఖైరతాబాద్ ద్వారకా హోటల్‌లో కలిసినప్పుడు శివారెడ్డి గారు ‘‘స్వామీ మొత్తం ఎన్ని పోయెమ్స్‌ ఉంటాయి?’’ అని అడిగారు. ‘‘వందకు పైనే ఉండొచ్చు సర్. కానీ అన్నీ ఒక చోట లేవు’’ అని నసిగాను. ‘‘ఇప్పటి దాకా నువ్వు రాసినవన్నీ ఒకచోట చేర్చి వాటిలో నీకు నచ్చిన యాభై పోయెమ్స్‌ తీసుకురా. పదేళ్లు కావస్తోంది. ఇక పుస్తకం రావాల్సిందే’’ అన్నారు. వెతికితే కొన్ని డైరీలో, కొన్ని అప్పటికే విద్య అందంగా తెలుగులో టైప్ చేసి ఇచ్చిన కాగితాల్లో, కొన్ని అజాగ్రత్తగా ‘భద్రపరిచిన’ చిత్తు కాగితాల్లో దొరికాయి. అట్లా చాలా వరకు సంపాదించి శివారెడ్డి గారి దగ్గరికి తీసికెళ్లాను. వాటిని వడపోసి నలభై దాకా ఎంపిక చేసి ‘‘ఇది బ్రహ్మాండమైన సంపుటి అవుతుంది స్వామీ,’’ అన్నారు ఉత్సాహంగా.


అప్పటికే విరసంలో చురుకైన సభ్యునిగా, కార్యవర్గంలో ఉన్నాను. ఈ పుస్తకాన్ని విరసం సిటీ యూనిట్ ప్రచురణగా తెద్దామని నిర్ణయించుకున్నాను. కరీంనగర్ రైతాంగ పోరాటా లపై నిర్బంధం గురించి రాసిన ‘కల్లోల కలల మేఘం’ కవిత శీర్షికను సంపుటికి పేరుగా బాగుంటుందనీ, శివారెడ్డి, వరవరరావు గార్లతో ముందుమాట రాయించాలనీ అనుకున్నాను. మిత్రులు విమల, సుధాకిరణ్, సురేష్‌లు కూడా ఏకీభవించి తోడు నిలిచారు. నన్నూ, నా కవిత్వాన్ని 1983 నుంచి దగ్గరగా చూస్తున్న ఆప్తులు రమా మెల్కోటే మేడమ్ ‘‘కవర్ మీద కె. లక్ష్మాగౌడ్ గారితో బొమ్మ వేయిస్తే బాగుంటుంది,’’ అన్నారు. బెరుకు బెరుగ్గా లక్ష్మాగౌడ్ గారి దగ్గరికి కవిత్వం తీసుకుని వెళ్లాను. ఆయన ఆప్యాయంగా పలకరించి, కవిత్వం మొత్తం చదివినంక, వారం రోజులకు ఒక అద్భుతమైన రేఖాచిత్రాన్ని గీసిచ్చారు. నా ఆనందానికి అవధుల్లేవు. లక్ష్మా గౌడ్ గారికి బోలెడన్ని ధన్యవాదాలు చెప్పుకుని, సరాసరి శీలా వీర్రాజు గారి దగ్గరికి వెళ్లాను. ఆయన అద్భుతంగా కవర్ డిజైన్ చేశారు. తన అక్షరాలు కాకుండా కంప్యూటర్ ఫాంటే బాగుంటుందని తానే సూచించిన ఉదాత్త స్వభావుడు శీలావీ గారు.


వరవరరావు సర్, శివారెడ్డి గారు ముందుమాటలు ఇవ్వగానే పుస్తకం ప్రెస్ కాపీ సిద్ధమైంది. లక్ష్మాగౌడ్ గారి బొమ్మ చూసాక రాసిన మరో కవిత కూడా చేరింది. మిత్రుడు శేఖర్ కంపోజ్ చేసి, నాని ప్రింటర్స్ గాంధీనగర్‌లో పుస్తకం ప్రింట్ చేయించాడు. కవర్‌ని నలుపు తెలుపుల్లో (అక్షరాలు జేగురు రంగులో) ప్రగతి ప్రింటర్స్ హనుమంతరావు ప్రేమతో అందంగా ముద్రించి ఇచ్చారు. కవర్ వెనుక అట్ట మీద కొత్తగా రాసిన కవితను వేశాను. అది నా కవిత్వానికి మేనిఫెస్టో లాంటి కవిత. నాకు జీవితాన్నిచ్చి అర్ధాంతరంగా వెళ్ళిపోయిన బాపుకు, నా కవిత్వానికి చూపునిచ్చిన విప్లవోద్యమం కోసం అమరులైన కృష్ణారెడ్డి, కవి నూతన్‌లకూ అంకితం ఇచ్చాను.


చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగిన ఆవిష్కరణలో శివారెడ్డి ఆవిష్కర్త. విరసం సభ్యులు రామ్మోహన్ సర్, విమల, జనసాహితి కొత్తపల్లి రవిబాబు వక్తలు. విప్లవ కవిత్వం నినాదప్రాయమని, మూస పద్ధతిలో విప్లవం గురించి రాయడం తప్ప శిల్పం గురించి, జీవితంలోని భిన్న పార్శ్వాలను, పట్టించుకోలేదనే అపవాదు బలంగా ప్రచారంలో ఉండేది. ఆ అపవాదుని, 1990ల్లో వచ్చిన విప్లవ కవిత్వంలో భాగంగా ‘కల్లోల కలల మేఘం’ కొంతైనా పూర్వపక్షం చేసిందనే అనుకుంటాను. విప్లవోద్యమంతో మమేకమై, విరసం సభ్యునిగా కవిత్వం రాస్తున్నప్పుడు నిబద్ధత, నిమగ్నత ఉండడం సహజం. అవసరం కూడా. అది ఒక ప్రాపంచిక దృక్పథంగా మలుచుకుని అనుభవాలను, మానవ సంబంధాలను, వైరుధ్యాలను కవిత్వీకరించడం వల్ల ‘కల్లోల కలల మేఘం’ బలమైన సంకలనంగా వచ్చింది. ఒక దశాబ్ద కాలం తెలుగు సమాజపు చరిత్రను సమర్థవంతంగా రికార్డ్ చేసింది.


‘అరుణతార’లో ఎన్. వేణుగోపాల్, నా కవిత్వంలోని బలాన్నీ బలహీనతలనూ చాలా ప్రేమతో అయినా, ఆబ్జెక్టివ్‌గా అద్భుతంగా సమీక్షించాడు. హరనాథ్ అనే ఒకాయన మాత్రం, ‘విశాలాంధ్ర’లో సమీక్ష చేస్తూ శివారెడ్డి మీద, దేవిప్రియ మీద ఉన్న అక్కసునంతా నా కవిత్వం మీద వెళ్లగక్కాడు. అయితే దానికి జవాబుగా ‘నారాయణస్వామి కవిత్వం పావు కాదు పావురమే’ అని అఫ్సర్ దీటైన జవాబు ఇచ్చాడు. నా ‘వానొస్తద’ కవిత్వ సంపుటి వచ్చేంతవరకు ‘కల్లోల కలల మేఘం’ నాకు ఇంటి పేరులా మారిపోయింది.


ఒక ఆదివారం ఉదయాన్నే శీలా వీర్రాజు, నాళేశ్వరం శంకరం వచ్చి ‘కల్లోల కలల మేఘం’కు 1994 ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు ఇవ్వాలనుకున్నాం అని చెప్పారు. ఎటువంటి ప్రలోభాలు కానీ రాజ్య సంబంధాలు కానీ లేకుండా, కవిత్వం మీద అవ్యాజ్యమైన ప్రేమతో ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ఫ్రీ వర్స్ ఫ్రంట్ అవార్డు నాకు రావడం గొప్ప విషయంగా భావించాను. ఈ విషయాన్ని విరసం సిటీ యూనిట్‌లో చర్చకు పెట్టాను. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరికి తీసుకోవడం సరైందే అని నిర్ణయమయ్యాక, వీర్రాజు గారికి ఆ విషయం తెలియ జేసాక అవార్డు ప్రకటించారు. ‘కల్లోల కలల మేఘం’ కవిగా నా సాహిత్య ప్రయాణంలో ఒక గొప్ప మైలు రాయిగా భావిస్తాను. ఆదరించిన తెలుగు సాహిత్య లోకానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.

-నారాయణస్వామి వెంకటయోగి

Updated Date - Jul 14 , 2025 | 12:29 AM