Share News

Reality Behind Unanimous Elections: ఈ ఏకగ్రీవాల మతలబేమిటి

ABN , Publish Date - Dec 04 , 2025 | 03:07 AM

ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా నిలవాల్సిన గ్రామపంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాలు, వేలం పాటలుగా మారిపోయాయి. సర్పంచ్, వార్డు స్థానాలు ఈ ఎన్నికల్లో బేరసారాలకు వేదికలుగా మారిపోయాయి. ఒకప్పుడు....

Reality Behind Unanimous Elections: ఈ ఏకగ్రీవాల మతలబేమిటి

ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా నిలవాల్సిన గ్రామపంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాలు, వేలం పాటలుగా మారిపోయాయి. సర్పంచ్, వార్డు స్థానాలు ఈ ఎన్నికల్లో బేరసారాలకు వేదికలుగా మారిపోయాయి. ఒకప్పుడు గ్రామంలో బడి, రోడ్లు, తాగునీరు... వంటి సదుపాయాలు కల్పించి, గ్రామంలోని సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నవారిని సర్పంచ్‌గా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. ఏకగ్రీవ గ్రామాలకు ప్రభుత్వం సైతం కొన్ని నిధులను ఇచ్చేది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో డబ్బే ప్రధానపాత్ర పోషిస్తోంది. ఈ ఏకగ్రీవాల ద్వారా పెత్తందారుల చేతుల్లోకి స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ జారుకుంటుంది. ‘మంత్రుల దగ్గరకు వెళ్లి పని చేయించుకొనే వారికే ఓటు వేయాలి’ అంటూ సీఎం రేవంత్‌ ఇటీవల బహిరంగంగా చెప్పడం ఏ విలువలకు ప్రాతిపదిక? అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తరచుగా కన్పించే ఓట్ల కొనుగోలు విధానం గ్రామ పంచాయతీ ఎన్నికల్లోకి కూడా ప్రవేశించింది. స్థానిక ఎన్నికల వ్యవస్థను ధన ప్రభావితంగా మార్చివేసింది. గత ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్ అభ్యర్థి 50లక్షల నుంచి కోటి రూపాయల వరకూ ఖర్చు చేశారు. అనంతరం గ్రామంలో చేపట్టిన పనులకు నిధులు విడుదల కాక అప్పుల పాలయ్యారు. బిల్లులు రాక కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మతం కూడా ప్రధానపాత్ర పోషిస్తోంది. గుడి, చర్చి, మసీదుల నిర్మాణ ప్రతిపాదనలతో ‘పంచాయతీ’ అభ్యర్థులు ప్రజల ముందుకు వస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అక్కడి పెత్తందారులే ఏకగ్రీవం పేరుతో తమకు అనుకూలమైన, ఆర్థిక పరిపుష్టి ఉన్నవారిని రంగంలో దింపుతున్నారు. దీనివల్ల ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చే పేద ప్రజలకు పోటీచేసి, నాయకులుగా ఎదిగే అవకాశం సన్నగిల్లుతోంది.

ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతున్న ఇలాంటి ఏకగ్రీవ విధానాల్లో ప్రభుత్వం, న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(జి) స్థానిక స్వపరిపాలన ఉద్దేశ్యం– ‘పరిపాలన, రాజకీయ, సాంఘిక సమానత్వం సాధించడం’ అని నిర్దేశించింది. ధన, కుల, మత ప్రమేయంతో జరిగే ఈ ఏకగ్రీవాలు చట్టవిరుద్ధం. ఇలాంటి తప్పుడు విధానాలను ఎన్నికల్లో నిరోధించడానికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని తొలగించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టవలసిన ప్రధాన బాధ్యత ప్రభుత్వంపైన, గ్రామీణ ఓటర్లపైన ఉంది.

– ఎన్.తిర్మల్

ఇవి కూడా చదవండి

ఎంసీడీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీదే పైచేయి.. రెండో ప్లేస్‌లో ఆప్

సచిన్ రికార్డు సాధ్యమయ్యేనా.. కింగ్ కోహ్లీ అరుదైన సెంచరీ ప్రత్యేకతలివే..

Updated Date - Dec 04 , 2025 | 03:07 AM