వర్గీకరణ సమస్య–కుల నిర్మూలన దృక్పథం
ABN , Publish Date - Jan 16 , 2025 | 04:32 AM
రాజ్యం అందులో భాగమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి నుండి రిజర్వేషన్లను అమలు చేయడంలో గాని, వెనుకబడిన కులాలకు ఫలాలు అందించడంలో గాని పూర్తిగా విఫలమయ్యారు. కనుక అందరికీ సమాన అవకాశాలు కల్పించినా అన్ని కులాలు...

రాజ్యం అందులో భాగమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి నుండి రిజర్వేషన్లను అమలు చేయడంలో గాని, వెనుకబడిన కులాలకు ఫలాలు అందించడంలో గాని పూర్తిగా విఫలమయ్యారు. కనుక అందరికీ సమాన అవకాశాలు కల్పించినా అన్ని కులాలు సమానంగా అవకాశాలను అందుకోలేదు. దీనికి పాలక కులాల దీర్ఘకాలిక నిర్లక్ష్యం తోడైంది. ఈ అణగారిన కులాలను ఓటు బ్యాంకుగా పరిగణించి, రాజకీయ స్వార్థంతో రాజ్యాంగబద్ధంగా రావలసిన వాటాలను అందించలేదు. ఉదాహరణకు రిజర్వేషన్లు ఉపయోగించుకోవడానికి విద్య అత్యంత కీలకమైనది. ఇందులో ఉన్న అన్ని కులాలకు పాఠశాల విద్య, కాలేజీ విద్య, యూనివర్సిటీ విద్య, సాంకేతిక విద్య అందించకుండా, విద్యా సంస్థలను వారికి అందుబాటులోకి తేకుండా జాగ్రత్త పడ్డారు. ఫలితంగా అత్యధికంగా వెనుకబడిన కులాలకు విద్యయే లేకుండా పోయింది. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా విద్యను కొంతమందికే గాని అందరికీ అందే విధంగా చూడకుండా దానిని ఎన్నికల స్వార్థ రాజకీయాలకు ఉపయోగపడేలా చేశారు. అంతేగాని అది ఒక రాజ్యాంగపరమైన సామాజిక న్యాయంగా పరిగణించ లేదు. ఫలితంగా మెజారిటీ కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. అయితే ఈ అణగారిన కులాలలో చారిత్రకంగా ముందంజలో ఉన్న కొన్ని కులాలలోని కొంతమంది ఎంతో కొంత విద్యావకాశాలను, ఉద్యోగావకాశాలను పొందడం సహజం.
ఇలా కొంత ప్రయోజనం పొందినవాళ్లను స్వార్థ రాజకీయ పార్టీలు, ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులు తమ స్వార్థం కోసం వాడుకొని రిజర్వేషన్లను పూర్తిగా అమలు చేయకుండా, అత్యంత వెనుకబడిన పీడిత కులాలకు చేరకుండా, ఆయా కులాలలో కూడా అత్యధికంగా వెనుకబడిన కుటుంబాలకు చేరకుండా చూశారు. ప్రభుత్వాలు ఐదేళ్ళకు ఒకసారైనా రిజర్వేషన్ల అమలు గురించి సమీక్ష జరపకుండా, రిజర్వేషన్లు పొందిన వాళ్లలో కొద్ది మందిని తమకు ఊడిగం చేసే విధంగా తయారు చేసుకున్నారు. ఫలితంగా ఫలాలు పొందిన వాళ్ళలో చాలామంది తమ సొంత ప్రయోజనాల కోసం తమ సంబంధిత కులాలనే కాకుండ తమ కులంలోని వెనుకబడిన కుటుంబాలను గాలికి వదిలేసారు.
ఫూలే, అంబేడ్కర్, పెరియార్ ఆలోచనల ప్రకారం రిజర్వేషన్ల విధానం కులరహిత సమాజం కోసం అన్ని రకాల అసమానతలు లేని సమసమాజం నిర్మాణ దిశగా నడవాలి. కాని పాలకులు ఈ విధానాన్ని కుల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా దిగజార్చారు. నిజానికి రిజర్వేషన్లు పొందిన వ్యక్తులు రెండు రకాల పోరాటాలు చేయవలసి ఉన్నది. ఒకటి వారు పని చేస్తున్న సంస్థలలో అణగారిన కులాలకు ప్రాతినిధ్యం, జనాభా దామాషా ప్రకారం పెంచటానికి చేయవలసిన పోరాటం. రెండవది పౌర సమాజంలో అణగారిన కులాల పైన ఆధిపత్య కులాలు సాగిస్తున్న దోపిడీ, దౌర్జన్యాలు, హత్యలకు వ్యతిరేకంగా జరపవలసిన పోరాటంలో వీలైన చోట ప్రత్యక్షంగా, కానిచోట పరోక్షంగా పాల్గొని, ఇతరులను పాల్గొనే విధంగా చైతన్య పరిచే పోరాటం. ముందు వరుసలో ఉండి రిజర్వేషన్లు పొందిన వ్యక్తులు ఈ రెండు పోరాటాలు అవసరం ఉన్నంత మేరకు చేయలేదు. కొంత మేరకు సైద్ధాంతిక, రాజకీయ పోరాటం చేసి అణగారిన కులాలను ఐక్యం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కారంచేడు, చుండూరు కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటం చేసి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల్ని సాధించుకున్న దళిత ఉద్యమం కూడా ఈ సమస్యను పరిష్కరించుకోలేకపోయింది. దేశ వ్యాపితంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా ఈ జమిలి పోరాటాలు చేయకపోవడం వలన ఈ అణగారిన కులాల్లో రిజర్వేషన్లు పొందటంలో కుల అసమానతలు మరింత పెరిగాయి. స్వాతంత్ర్యానంతరం రాజ్యాధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాని తర్వాత కాలంలో కాంగ్రెస్ నాయకత్వంలో నడిచిన యూపీఏ ప్రభుత్వం కాని, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్‌డిఏ ప్రభుత్వం కాని మనువాద దృక్పథంతో ఈ వ్యక్తులను జమిలి పోరాటాలు చేయకుండా చాలా జాగ్రత్త వహించి, కొద్ది మంది వ్యక్తులనే అణగారిన కులాల ప్రతినిధులుగా చిత్రీకరించి, వీరిలో అట్టడుగున ఉన్న కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేశారు.
ఈ కులాలలో అసమానతలు పెంచి, వైరుధ్యాలు సృష్టించి వాళ్ల ముందున్న కులాలను పీడకులుగా, వెనకబడ్డ కులాలను పీడితులుగా చిత్రీకరించి, పీడితులనే శత్రువులుగా చూపించి తమాషా చూస్తున్నారు. అంతే కాకుండా రిజర్వేషన్లను అంతమొందించే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను తీసుకొచ్చిన పాలకులు వీరిని మద్దతు ఇచ్చే విధంగా తయారుచేసి పావులుగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా పీడిత కులాలు ఈ మనువాద పార్టీల కుట్రలకు, కుయుక్తులకు బలి కాకుండా ఈ సమస్యను ప్రజాస్వామికంగా, సామాజిక న్యాయ ప్రాతిపదికన పరిష్కరించుకోవాలి. ఇప్పుడు రాజ్యాంగపరంగానైనా అణగారిన కులాలు సంఘటితమై జనాభా దామాషా ప్రకారం పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా జరగటానికి రాజ్యాంగంలో అవసరమైన సవరణలు తీసుకురావడానికి పోరాటం చేసి మరింత సంఘటితమై రాజ్యాధికారం కోసం పోరాడాలి.
అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో తలెత్తిన వర్గీకరణ సమస్య పరిష్కారానికై భేషజాలకు పోకుండా కావలసిన గణాంకాలు, సమాచారం ప్రాంతాల వారీగా నిజాయితీగా, నిష్పక్షపాతంగా సేకరించాలి. ఈ సమస్య పరిష్కారం కొరకై కొన్ని ప్రతిపాదనలు మేము చర్చ కోసం మీముందు పెడుతున్నాం.
మొదటి పద్ధతి: 1) ఇప్పటికీ బడి ముఖం చూడని, ఎటువంటి ఉద్యోగాలు పొందని అత్యంత వెనుకబడిన కులాలను ఒక ప్రత్యేక సమూహంగా లేదా గ్రూపుగా ఏర్పాటు చేసి వీరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. 2) ఎస్సీ కులాలలో ఇప్పటికే కొద్ది తేడాలతో రిజర్వేషన్ల ప్రతిఫలాలను అనుభవిస్తున్న మాల మాదిగ కులాలను ఒక సమూహంగా లేదా గ్రూపుగా చేసి వీరికి రెండవ ప్రాధాన్యత ఇవ్వాలి.
రెండవ పద్ధతి: 1) అత్యధికంగా వెనుకబడిన, మాదిగ అనుబంధ కులాలను ఒక సమూహంగా లేదా గ్రూపుగా చేసి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. 2) అలాగే అత్యధికంగా వెనుకబడిన మాల అనుబంధ కులాలను ఒక సమూహంగా లేదా గ్రూపుగా చేసి రెండవ ప్రాధాన్యత ఇవ్వాలి. 3) మాదిగ కులాన్ని ఒక గ్రూపుగా చేసి మూడవ ప్రాధాన్యత ఇవ్వాలి. 4) అలాగే మాల కులాన్ని ఒక గ్రూపుగా చేసి నాలుగవ ప్రాధాన్యత ఇవ్వాలి.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. అంటరానితనం, కులపీడనే రిజర్వేషన్లకు క్రైటేరియా అనేది మరిచి పోకూడదు. ఇప్పటివరకూ రిజర్వేషన్ల ద్వారా కొన్ని షెడ్యూల్డ్ కులాలు ఆర్థికంగా, రాజకీయంగా విద్య, ఉద్యోగ రంగాలలో ఎంతో కొంత మేరకు అభివృద్ధి చెందిన ఒక సమూహం ముందుకు వచ్చింది. కాని ఇదే అణగారిన కులాలలో చారిత్రకంగా ఎన్నో కులాలు రిజర్వేషన్లను ఉపయోగించుకోలేకపోయాయి. రాజ్యాంగపరంగా ఈ కులాలను సంక్షేమ మంత్రిత్వ శాఖల ద్వారా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉన్నది. కాని ఈ శాఖలను ప్రాధాన్యత లేని శాఖలుగా పాలకులు దిగజార్చారు. ఇప్పటికైనా ఈ శాఖలను కుల నిర్మూలన దృక్పథంతో అవసరమైనన్ని నిధులను కేటాయించి విద్యా ఉద్యోగాలలో ఈ కులాలకు సామర్థ్యం, నైపుణ్యాలను పెంచి, కుల వృత్తులకు సంబంధంలేని నూతనంగా అభివృద్ధి చెందుతున్న శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఉపాధి అవకాశాలను అందుకునేలాగా చేయాలి. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను అదే కులంలో పంచుకోవడానికి, ఇంతవరకు రిజర్వేషన్లను ఉపయోగించుకోలేని ప్రస్తుతం ఉపయోగించుకునే స్థితిలో ఉన్న మొదటితరానికి తప్పకుండా అందేలా చూడాలి. ఆ తర్వాతనే క్రమానుగతంగా రెండవ తరం, ఆ తర్వాత మూడవ తరం కుటుంబాలకు అందాలి. అంతే కాని అంటరానితనం, కులపీడన ఉన్నంత వరకూ క్రిమీలేయర్ పద్ధతి ప్రవేశ పెట్టకూడదు.
అణగారిన కులాలు అన్నీ కలిసి, ప్రజాస్వామికవాదులను కలుపుకొని ఇప్పటివరకు రిజర్వేషన్ల ఫలాలను పొందలేని, విద్యారంగంలో అత్యంత వెనుకబడిన కులాలకు, సంచార కులాలకు నాణ్యమైన విద్య అందించడానికి తక్షణమే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్థాయిలో ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు, డే–కేర్ పాఠశాలలు, కాలేజీలు స్థాపించటానికి కృషి చేయాలి. అలాగే ఈ అణగారిన కులాల విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే విద్యాప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాలి. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టుగానే ప్రస్తుతం ఉనికిలో ఉన్న ప్రైవేటు రంగంలో కూడా అదే సామాజిక న్యాయ ప్రాతిపదికన మాదిగ, మాల, షెడ్యూల్డ్ కులాలలో అత్యంత వెనుకబడిన ఇతర కులాలకు, ఆదివాసీలకు, వెనుకబడిన తరగతులకు, స్త్రీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసే విధంగా అందరూ కలిసి పోరాడాలి.
ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ,
ప్రొఫెసర్ కె.వై. రత్నం
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్