కాసుల గలగలలే వృద్ధికి ఉద్దీపన
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:58 AM
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ శనివారం 2025–26 ఆర్థిక సంవత్సరానికి కొత్త బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఏదో ఒక రకమైన సంక్షోభంలో...

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ శనివారం 2025–26 ఆర్థిక సంవత్సరానికి కొత్త బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఏదో ఒక రకమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ మాత్రం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ వృద్ధిని నిలబెట్టుకుంటూ దాని ఫలాలు అందరికీ అందేలా చేయడం ఆర్థికమంత్రికి కత్తిమీద సాముగానే భావించాలి. గత కొన్నేళ్లుగా ఉన్న సానుకూలతలు కొంతమేరకు క్షీణించి ప్రతికూలతలు పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్ ఎలా ఉండబోతోంది అన్న ఉత్కంఠ ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. ప్రస్తుత వాతావరణంలో బడ్జెట్ రూపకల్పన విషయంలో ఆర్థికమంత్రి ముందు సానుకూలతలెంతగా ఉన్నాయో సవాళ్లు కూడా అంతగానే ఉన్నాయి.
ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే మన దేశంలో వృద్ధిరేటు ప్రోత్సాహకరంగా ఉండడం తొలి సానుకూలాంశం. ప్రస్తుత ప్రతికూలతల కారణంగా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో 7 శాతం వృద్ధిరేటు సాధించడం కొంచెం కష్టంగానే కనిపిస్తున్నప్పటికీ 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని ఖాయంగానే చెప్పవచ్చు. రుతుపవనాలు సానుకూలంగా ఉన్నందువల్ల గ్రామీణ వినియోగం పెరిగింది. సేవల రంగం కూడా మంచి వృద్ధిని కొనసాగిస్తోంది. ఎలక్ర్టానిక్స్, సెమీ కండక్టర్స్ వంటి అధిక విలువ గల వస్తువుల ఎగుమతులు కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. సీజన్లవారీగా ఏర్పడే పరిణామాల్లో భాగంగా ఆహార వస్తువుల ధరలు అధికంగానే ఉన్నప్పటికీ సాధారణ ద్రవ్యోల్బణం మాత్రం ఆర్‌బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన 4 శాతం పరిధికి సమీపంలోనే ఉంది. దేశంలో పొదుపు రేటు 30 శాతంగా ఉంది. జీడీపీలో రుణాల నిష్పత్తి కూడా అదుపులోనే ఉంది. పన్ను వసూళ్లు కూడా అత్యంత సానుకూలంగా ఉన్నాయి. నవంబరు నాటికే బడ్జెట్‌లో నిర్దేశించిన లక్ష్యంలో 60 శాతం మేరకు పన్ను వసూళ్లుండడం ఆదాయపు పన్ను, జీఎస్‌టీల్లో మంచి వృద్ధి నమోదవుతోందనేందుకు సంకేతం. ప్రజల్లో కూడా నిజాయతీగా పన్నులు చెల్లించే వైఖరి పెరిగింది. అందుకే గత రెండు మూడేళ్లుగా బడ్జెట్ లక్ష్యాన్ని మించి పన్నులు వసూలవుతున్నాయి.
సమాంతరంగా ఆర్థికమంత్రి ముందు కొన్ని పెను సవాళ్లు కూడా ఉన్నాయి. అధిక విలువ గల వస్తువుల ఎగుమతులు పెరిగినా, స్థూల ఎగుమతులు మాత్రం గణనీయంగా తగ్గాయి. ఫలితంగా దేశంలో పారిశ్రామికోత్పత్తి తగ్గింది. ప్రపంచ దేశాల్లో డిమాండు తగ్గడంతో గత ఏడాది 3.0 శాతం ఉన్న ఎగుమతుల వృద్ధిరేటు ఈ ఏడాది 2.8 శాతానికి క్షీణించింది. వారం రోజుల క్రితం గద్దెనెక్కిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆత్మరక్షణ చర్యలకు దిగుతున్నారు. తమ దేశంతో వాణిజ్య మిగులు ఉన్న దేశాల నుంచి దిగుమతులు అదుపు చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఆ జాబితాలో చైనాతో పాటు మన దేశం కూడా ఉంది. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దుతామని మన దేశం హామీ ఇచ్చినందువల్ల అందుకు అనుగుణంగా జరిగే సర్దుబాట్లలో అమెరికాకు ఎగుమతులు తగ్గవచ్చు. చైనా దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించినట్టయితే ఆ వస్తువులన్నింటినీ మన దేశంలో డంప్ చేయడానికి చైనా ప్రయత్నించవచ్చు. ఈ కారణంగా ఒక పక్క అమెరికాతో వాణిజ్య బంధాన్ని దృష్టిలో ఉంచుకుని సుంకాల్లో సర్దుబాటు చేసుకుంటూనే, చైనా డంపింగ్‌ను అడ్డుకునేందుకు కూడా చర్యలు చేపట్టాలి. ఇతర ప్రతికూలతల విషయానికి వస్తే బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్, రుణ వృద్ధిరేటు తగ్గింది. ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడులు నిరంతరం తరలిపోతూ ఉండడం వల్ల స్టాక్‌మార్కెట్ తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ పెట్టుబడులు కూడా గతంతో పోల్చితే తగ్గాయి. 2023–24 సంవత్సరంలో రూ.10 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే 7–8 లక్షల కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేయగలిగింది. అలాగే 2024–25 సంవత్సరంలో రూ.11 లక్షల కోట్లు లక్ష్యం అయితే చివరి లెక్క ఎంత తేలుతుందో వేచి చూడాలి. స్థూల దేశీయ పెట్టుబడుల (జీసీఎఫ్) వృద్ధిరేటు కూడా గణనీయంగా తగ్గింది. ఉదాహరణకి 8 శాతం వృద్ధిరేటు రావాలంటే జీసీఎఫ్ 40 నుంచి 50 శాతం ఉండాలి. గత ఏడాది జీసీఎఫ్ వృద్ధిరేటు 49 శాతం ఉంటే ఈ ఏడాది ఇప్పటివరకు 5.4 శాతం మాత్రమే ఉంది. నగరజీవులపై ద్రవ్యోల్బణ ప్రభావం, పన్ను భారం కారణంగా వారు చేసే వ్యయాలు గణనీయంగా తగ్గాయి.
ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి కొత్త బడ్జెట్‌లో పట్టణ వినియోగాన్ని పెంచడంపై ప్రప్రథమంగా దృష్టి సారించవచ్చు. ఎగుమతులు తగ్గిన నేపథ్యంలో దేశీయ వినియోగాన్ని పెంచడం అత్యంత అవసరం. వినియోగం పెరగాలంటే ప్రజల చేతిలో ఖర్చు చేయడానికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉండాలి. ఇందుకోసం సగటు మనిషికి కొంత ఊరట కల్పించే చర్యలకు ఆర్థికమంత్రి పెద్దపీట వేయవచ్చు. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను (ఐటీ) శ్లాబ్‌లలో కొన్ని సర్దుబాట్లు చేసే ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఉన్న శ్లాబ్‌లకు అదనంగా మరో శ్లాబ్ పెట్టే ఆస్కారం ఉన్నదని వినిపిస్తోంది. ప్రస్తుతం 20 లక్షలు దాటితే తదుపరి శ్లాబ్ 30 లక్షలుగా ఉంది. ఈ రెండింటికీ మధ్య 25 శాతం శ్లాబ్ ఒకటి ప్రవేశపెట్టవచ్చు. దీనికి తోడు స్టాండర్డ్ డిడక్షన్స్ కూడా పెంచవచ్చు. అలాగే అన్ని రకాల బీమా పాలసీలపై మినహాయింపు పరిమితులు పెంచాలని దీర్ఘకాలికంగా డిమాండు చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఇందుకు కూడా చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది. అలాగే బీమాపై జీఎస్‌టీ రేటు తగ్గించాలనే డిమాండు కొన్నేళ్లుగా వస్తోంది. దీనికి కేంద్రం సానుకూలంగానే ఉన్నా రాష్ర్టాల నుంచి వస్తున్న వ్యతిరేకతల కారణంగా ఈ ప్రతిపాదన జీఎస్‌టీ కౌన్సిల్ వరకు వెళ్లి వాపసు వస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో దానిపై ఒక విధాన నిర్ణయం ప్రకటించవచ్చు. ఈ చర్యలతో ప్రజల చేతిలో ఖర్చు చేయదగిన నగదు నిల్వ పెరుగుతుంది.
అలాగే ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లలో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులపై దీర్ఘకాలిక లాభాల పన్ను (ఎల్‌టీసీజీ), సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) తగ్గించవచ్చు. కొవిడ్ అనంతర కాలంలో దేశీయంగా రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగింది. విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నప్పటికీ మార్కెట్ నిలదొక్కుకోవడానికి ఇది సహాయకారి అయింది. అందువల్ల వీరిని ప్రోత్సహించే చర్యలు బడ్జెట్‌లో తీసుకోవడం తప్పనిసరి. నానాటికీ తీసికట్టుగా ఉన్న రూపాయి విలువను కాపాడేందుకు మరిన్ని ఎగుమతి ప్రోత్సాహకాలు కూడా కల్పించవచ్చు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం మౌలిక వసతులపై పెట్టుబడులు పెంచుతూ వస్తోంది. ఇదే వరుసలో ఈసారి కూడా మౌలిక వసతులపై పెట్టుబడులు పెంచవచ్చు. దేశంలో పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ మౌలిక వసతులకు ఈ ఏడాది ప్రాధాన్యం ఇవ్వవచ్చు. పారిశ్రామికోత్పత్తిని పెంచడం లక్ష్యంగా కొత్తగా ఉత్పత్తి ప్రారంభించే కంపెనీలకు ఆదాయపు పన్ను ప్రోత్సాహకాలు తిరిగి ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. గతంలో ఇలాంటి కంపెనీలకు 80(ఐ), 80(జె) వంటి సెక్షన్ల కింద ప్రోత్సాహకాలిచ్చేవారు. దేశీయంగా వస్తూత్పత్తిని పెంచి పారిశ్రామిక రంగాన్ని ఉత్తేజితం చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్‌ఐ) 14 రంగాలకు వర్తిస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో మరిన్ని రంగాలకు పీఎల్‌ఐని విస్తరించవచ్చు. పీఎల్‌ఐ అమలు గడువును కూడా పెంచవచ్చు.
శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి విలువైన విదేశీమారక ద్రవ్యం ఆదా చేసే లక్ష్యంతో గత కొన్నేళ్లుగా విద్యుత్ వాహనాలు, సోలార్ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇందుకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించే ఆస్కారం ఉంది. ద్విచక్ర వాహనాల్లో ఇథనాల్ మిశ్రమ ఇంధనం వినియోగించేందుకు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చు. ఇందుకోసం ద్విచక్ర వాహనాల ఇంజన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇలా ఇంజన్‌లో మార్పులు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలందించే ప్రకటన బడ్జెట్‌లో ఉండవచ్చు. అంతే కాదు, వివిధ వస్తువులపై కస్టమ్స్ సుంకాలు ఎలా ఉన్నాయి అన్నది సమీక్షించి బడ్జెట్‌లో వాటిని హేతుబద్ధం చేయవచ్చు.
ప్రస్తుతం ఏఐ (కృత్రిమ మేధ) అనేది అందరి నోళ్లలో నానుతున్న పదం. ఏఐ ఆధారిత హెల్త్‌కేర్, భిన్న రంగాల్లో ఏఐ వినియోగం వంటివి ప్రోత్సహించడం కోసం ఏఐ ఆధారిత పెట్టుబడులపై ప్రోత్సాహకాలు కల్పించే విధానం కూడా బడ్జెట్‌లో ప్రకటించవచ్చు. భారతీయ రైల్వేలు, లాజిస్టిక్స్ వంటి విభాగాలపై కూడా పెట్టుబడులు పెంచే ఆస్కారం ఉంది. లాజిస్టిక్స్ రంగంలో మన దేశ పోటీ సామర్థ్యం పెంచడం అత్యంత అవసరం. అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న మరో కీలక రంగం రియల్ ఎస్టేట్. ఈ రంగంలో కొద్దికాలంగా స్తబ్దత ఆవరించి ఉంది. ఇటీవల కాలంలో మధ్యతరగతి ఇళ్లకు డిమాండు గణనీయంగా పెరిగింది. ఇప్పుడిప్పుడే లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు కూడా వేగం అందుకుంటున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రియల్టీ రంగానికి కూడా కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చు. గత మూడు, నాలుగు సంవత్సరాల బడ్జెట్లు చూసినట్టయితే వ్యవసాయం, డ్రోన్ల వినియోగం, పంటల అనంతర నష్టాల అదుపు వంటి వాటిపై అధికంగా విధాన నిర్ణయాలు ప్రకటిస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. అలాగే సహకార రంగాన్ని కూడా ప్రోత్సహించే చర్యలుండవచ్చు. మొత్తం మీద కొత్త బడ్జెట్‌లో ప్రభుత్వం సగటు జీవికి ఊరట కల్పించే చర్యలతో పాటు దేశీయ ఉత్పత్తి, డిమాండ్‌ను ఉద్దీపింపచేయడం, పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలందించడం వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించే ఆస్కారం ఉంది.
కె. నరసింహమూర్తి
ఆర్థికవేత్త, బ్యాంకింగ్ నిపుణుడు
Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం