Share News

Free Schemes India: దుర్వినియోగమవుతున్న ఉచితాలు

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:04 AM

రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. అయితే ఉచితాలలో కొన్ని నిజంగా మానవవనరుల అభివృద్ధికి, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంటే, చాలా వరకు...

Free Schemes India: దుర్వినియోగమవుతున్న ఉచితాలు

రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. అయితే ఉచితాలలో కొన్ని నిజంగా మానవవనరుల అభివృద్ధికి, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంటే, చాలా వరకు దుర్వినియోగం అవుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్‌ పథకం ప్రకటించాక జిల్లాల్లో స్థానికంగా ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్న మహిళలు తమ పిల్లలు హైదరాబాద్‌లో చదువుకుంటున్నారని ఇక్కడికి మకాం మారుస్తున్నారు. ఫ్రీ బస్‌ వల్ల నిత్యం హైదరాబాద్‌ నుంచి సమీప జిల్లాలకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇంకా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను దర్శించడానికి ఉచిత బస్సు పథకం ఉపయోగించుకుంటున్నారు. ఉచిత విద్యుత్ సరఫరా కారణంగా మా గ్రామంలో విద్యుత్ బిల్లు కట్టేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఇక 500 రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌ పుణ్యమాని కట్టెలపొయ్యి మాని దాదాపు అన్ని కుటుంబాలు గ్యాస్ పొయ్యికి అలవాటుపడ్డాయి. కానీ ఇటీవల ఉచిత కరెంటు పథకం వల్ల, డబ్బులెందుకు వృథా చెయ్యాలని ఏకంగా ఇండక్షన్ ఎలక్ట్రిక్ స్టవ్‌లు గ్రామాల్లో బహుళ ఉపయోగంలోకి వచ్చాయి. ఎలాగూ రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తూనే ఉన్నారు.

గత ప్రభుత్వాలు, ఇప్పటి ప్రభుత్వం కూడా ఇబ్బడి ముబ్బడిగా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వటం వల్ల దాదాపు చాలా మంది రేషన్ బియ్యానికి అర్హులయ్యారు. అయితే గతంలో దొడ్డు బియ్యం ఇవ్వటం వల్ల వాటిని తినకుండా గొర్రెలకు, బర్రెలకు పెట్టడమో... లేదా ఇడ్లీ, దోశ వంటి వాటికి వాడుకోవడమో చేసేవారు. చాలామంది దొడ్డు బియ్యాన్ని అమ్మేసుకునేవారు. ఈ బియ్యాన్ని గ్రామంలో ఒక శాతం ప్రజలు కూడా తినేవారు కాదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వటంతో కొందరైనా తింటున్నారు. ఇక మరొక ఉచితం వృద్ధుల పెన్షన్. ఇది నిరుపేదలకు, పోషణ లేని వారికిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆస్తిపాస్తులున్న వ్యవసాయ కుటుంబాల వారు కూడా దీనిని పొందుతున్నారు. ఈ డబ్బులను బెల్టు షాపులకు ధారాదత్తం చేస్తూ వ్యసనాల బారిన పడుతున్నారు.


ఎన్నికల్లో విజయం సాధించటానికి ఈ ఉచితాలను ప్రకటించటం, కొన్నిటిని అమలు చేసి, మరికొన్ని ఆలస్యమైతే ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి. ఒకసారి ప్రభుత్వం ఒక ఉచిత పథకాన్ని అమలు చేసాక, అధికారంలోకి వచ్చిన మరో ప్రభుత్వం కూడా ఆ పథకాన్ని తొలగించే సాహసం చేయలేక ఆర్థిక భారం మోస్తున్నాయి. రాజకీయాల్లో రెండు రకాల నాయకులుంటారు ఒక రకం రాజనీతిజ్ఞులు, మరొక రకం ఫక్తు రాజకీయ నాయకులు. ఈ రెండో రకం భావి తరాల గురించి, వారి అభివృద్ధి గురించి పట్టించుకోరు. ఎలాగైనా అధికారంలోకి రావటం, సంపాదించుకోవటమే వారి ఎజెండా. రానురానూ రాజనీతిజ్ఞులు కరువవుతున్నారు.

ఈనాడూ ప్రజలు కూడా ఉచితం తమ జన్మహక్కు లాగా భావిస్తున్నారు. ఈ ఉచితాల డబ్బంతా కూడా ప్రభుత్వం టాక్స్ పేయర్స్ నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నదే. ఈ ఉచితాల వల్ల ప్రభుత్వం అధిక అప్పులు చేయటం, బడ్జెట్ లోటు పూడ్చలేనంతగా దిగజారడం, టాక్సులు పెంచటం చేస్తాయి... ఇదంతా రాష్ట్ర ప్రజలే భరించాలి; బడ్జెట్‌లో ప్రాధాన్యత క్రమాలు మారుతాయి. ఉదాహరణకు కొత్త రోడ్ల నిర్మాణాలు, ఉన్నవాటికి మరమతులు మందగిస్తాయి. తద్వారా ప్రజలు ఇబ్బందులు పడతారు. అలాగే విద్యుత్ కేంద్రాల నిర్మాణం, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు కుంటుపడతాయి. ఉచితాలకు అలవాటుపడ్డ ప్రజలు పనులు చేయటానికి ముందుకు రారు. గ్రామాల్లో ఇప్పటికే లేబర్ దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఉచితాల వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చే మధ్యాహ్న భోజనం వల్ల పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతుంది. కాలేజీ విద్యార్థులకిచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల మానవ వనరులు పెరుగుతాయి. ఆరోగ్య సంరక్షణకు పెట్టే ఖర్చు వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. అయితే ఉచిత పథకాలను సంస్కరించాల్సిన అవసరం ఉంది. కేవలం అర్హులకు మాత్రమే ఇవి అందాలి, అనర్హులను ఏరిపారేయాలి. ఉచితాలను వృథా చేసేవారికి కూడా ముకుతాడు వేయాలి.

డా. కొండి సుధాకర్‌రెడ్డి

రిటైర్డ్ లెక్చరర్

ఇవి కూడా చదవండి

5 బీసీ కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమించిన ప్రభుత్వం

అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్

Updated Date - Nov 27 , 2025 | 01:04 AM