మనం మరచిపోయిన జాతీయవాదం
ABN , Publish Date - May 29 , 2025 | 01:30 AM
భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని వ్యవస్థాపించిన భారత జాతీయవాదం భ్రష్టమైపోలేదూ? ఇటీవలి భారత్–పాకిస్థాన్ సైనిక సంఘర్షణలు, తదనంతర పరిణామాలే ఆ పతనానికి నిదర్శనం. మనం ‘అతి జాతీయవాదులు’గా రూపొందామని నేను అనడం లేదు. మన జాతీయవాదం...
భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని వ్యవస్థాపించిన భారత జాతీయవాదం భ్రష్టమైపోలేదూ? ఇటీవలి భారత్–పాకిస్థాన్ సైనిక సంఘర్షణలు, తదనంతర పరిణామాలే ఆ పతనానికి నిదర్శనం. మనం ‘అతి జాతీయవాదులు’గా రూపొందామని నేను అనడం లేదు. మన జాతీయవాదం అతిగా అనుకరణప్రాయమైపోవడమే అసలు సమస్య. భారత జాతీయవాద సమున్నత వారసత్వాన్ని ఒక కాపీ క్యాట్ (అంధానుకర్త) జాతీయవాదం స్వాయత్తం చేసుకున్నది. ఒక హిందూ–పాకిస్థాన్‌ను సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. ఈ పథ భ్రష్టత్వానికి నరేంద్రమోదీని, బీజేపీని, ఆరెస్సెస్‌ను తప్పుపట్టలేము.
అలీఖాన్ మహమూదాబాద్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు (అతడి సోషల్ మీడియా పోస్టులపై దర్యాప్తునకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది) మాత్రమే కాకుండా ఆ కేసు విచారణ జరిగిన తీరుతెన్నులూ దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని చెప్పక తప్పదు. పౌరుల హక్కుల కంటే జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నట్టు ఆ కేసు విచారణ తేటతెల్లం చేసింది. యుద్ధకాలంలో అయినా ఒక మోస్తరు భిన్నాభిప్రాయాలను, ప్రశ్ననూ సహించలేక పోవడం భారత జాతీయవాద సంప్రదాయానికి విరుద్ధం. జాతీయవాదం, పౌర స్వేచ్ఛల మధ్య పోటీ పెట్టడం, వాటిలో ఒకదాన్ని ఎంచుకోమనడం భారత జాతీయవాద సంప్రదాయం కానేకాదు. క్విట్ ఇండియా ఉద్యమ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్‌ను అడగండి. తన జాతీయవాదం, కశ్మీర్, నాగాలాండ్ వ్యవహారాలపై సత్యం చెప్పడంలో తన విధ్యుక్త ధర్మం మధ్య ఘర్షణ ఉన్నదని ఆయన భావించలేదు. 1962 యుద్ధం అనంతరం కూడా ఆయన చైనా ప్రజల పట్ల తన స్నేహ భావాన్ని నిర్భయంగా వ్యక్తం చేశారు.
పౌరుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు వ్యతిరేకంగా జాతీయవాదానికి ప్రాధాన్యమివ్వడమంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జాతీయవాదానికి ప్రాముఖ్యమివ్వడమే. ఆపరేషన్ సిందూర్‌ను హృదయ పూర్వకంగా సమర్థించినవారు సైతం ప్రజాస్వామిక జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తే పాలకుల దృష్టిలో జాతి వ్యతిరేకులు అయిపోతున్నారు! కాల్పుల విరమణ విషయమై మన ప్రభుత్వ అధికారిక వైఖరికి భిన్నమైన అభిప్రాయాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలుమార్లు వ్యక్తం చేశారు. ఇబ్బందికరమైన వాదనలూ ఆయన బహిరంగంగా చేశారు. అయితే ఈ విషయమై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించడం లేదు. ప్రభుత్వ మౌనాన్ని నిశితంగా విమర్శించిన వారిపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
అటల్ బిహారీ వాజపేయిని గుర్తుచేసుకోండి. 1962 యుద్ధంలో భారత్ పరాజయంపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నెహ్రూ అనుసరించిన చైనా విధానాన్ని రామ్‌మనోహర్ లోహియా తీవ్రంగా విమర్శించారు. వాజపేయిని కానీ, లోహియాను కానీ ఎవరూ జాతి వ్యతిరేకులు అని నిందించలేదు.
దేశ ప్రజల కంటే జాతే ముఖ్యమని ప్రతిపాదిస్తున్నారు. సైద్ధాంతిక, సాంస్కృతిక భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను జాతి వ్యతిరేకమైనవిగా పరిగణిస్తున్నారు. తర్కాన్ని తలకిందులు చేస్తున్నారు. పహల్గాం అనంతరం కశ్మీరీలు, ముస్లింలపై దాడి చేసినవారు కాకుండా మతపరమైన చీలికలు సృష్టిస్తున్నారనే ఆరోపణను అలీఖాన్ మహమూదాబాద్ ఎదుర్కొంటున్నారు. కల్నల్ సోఫియా ఖురేషిని పాకిస్థాన్ సోదరి అని బీజేపీ మంత్రి విజయ్ షా ఆక్షేపించగా, ఆమెను అవమానపరిచారనే ఆభియోగాన్ని మహమూదాబాద్‌పై మోపారు. సమైక్యత స్థానంలో ఏకరూపతకు ప్రాధాన్యమిస్తున్నారు. పహల్గామ్ అమానుష విషాదం సమస్త భారతీయులను ఏకం చేసిన తరుణంలో కూడా ఒక అంతర్గత శత్రువు అవసరమయ్యాడు. ఈ ధోరణి భారత జాతీయవాదానికి పూర్తిగా విరుద్ధం. భిన్నసామాజిక వర్గాలవారిని, భిన్న ప్రాంతాలను సమైక్యపరిచిన సర్దార్ పటేల్ స్ఫూర్తి ఏమైపోయింది?
మహోన్నత భారత స్వాతంత్ర్య పోరాటం నుంచి మనకు వారసత్వంగా సంక్రమించిన జాతీయవాదం చాలా భిన్నమైనది. అమెరికన్ న్యాయశాస్త్ర కోవిదుడు జాన్ ఎ పొవెల్ ప్రతిపాదించిన ఒక భావన ప్రకారం భారత జాతీయవాదం మౌలిక లక్ష్యం, లక్షణం ‘స్వ–పర తేడా లేకుండా ఒక విశాల సమ్మిళిత సమూహంలో భాగస్వాములం కావడమే’. బాహ్య, అంతర్గత శత్రువులను కల్పించుకోకుండా ఒక ప్రగాఢ జాతీయ అనుబంధ భావనను సృష్టించి పెంపొందించడం ద్వారా జాతిని నిర్మించేందుకు ఆనాటి మన జాతీయవాదం ప్రయత్నించింది. దాని శత్రువు వలసవాదమే కాని ఒక దేశం లేదా ఒక జాతి కానే కాదు. భారత జాతీయవాదం మనలను ఇరుగుపొరుగు దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించేందుకు పురిగొల్పలేదు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల వలసపాలన వ్యతిరేక ఉద్యమాలతోను, దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటంతో మమేకం చేసింది. సమస్త భారతీయుల మధ్య ఒక సమైక్యతా భావం సంపూర్ణంగా వర్ధిల్లేలా చేసేందుకు భారత జాతీయవాదం అంకితమయింది. భారతీయ అస్తిత్వానికి ఒక సమగ్ర గుర్తింపును సమకూర్చేందుకు భాషల బహుళత్వాన్ని, ప్రాంతాల వైవిధ్యాన్ని, మతాల విలక్షణతలను అది సంపూర్ణంగా గౌరవించింది. జాతీయ ఐక్యత ఒక స్వతస్సిద్ధ స్థితిగా ఉందని భావించలేదు. అందరూ ఒకేలా ఉండాలని ఒత్తిడి చేయకుండా తేడాలు విలువైనవని అంగీకరిస్తూ కలిసి మెలిసి ఉండేలా జాతీయ ఐక్యతను దృఢతరం చేసేందుకు అంకితభావంతో కృషి చేసింది. మైనారిటీ వర్గాల వారి హక్కుల రక్షణకు మెజారిటీ వర్గం కృషి చేసింది. హిందీయేతర ప్రాంతాల వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు హిందీ భాషీయులను పురిగొల్పింది. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు హిందీ భాషా సాహిత్యాల అధ్యయనానికి పూనుకునేలా ప్రోత్సహించింది. ఏకరూపత (యూనిఫార్మిటి) ఆధారిత యూరోపియన్ జాతి–రాజ్యం (నేషన్ స్టేట్) నమూనాను అనుసరించడానికి బదులు ప్రజాస్వామ్యాన్ని సకల వ్యత్యాసాలతో సమన్వయీకరించే రాజ్యం–జాతి (స్టేట్ నేషన్) నమూనాను భారత జాతీయవాదం సృష్టించింది. యూరోపియన్ జాతీయవాదం వలే కాకుండా ఒక జాతిగా ఉండడమంటే ఏమిటి అనే విషయమై చర్చలను ప్రోత్సహించింది.
ఈ సమున్నత భారత జాతీయవాదంపై నేడు దాడి జరుగుతోంది. ఆమోదయోగ్యం కాని కొత్త జాతీయవాదం ప్రబలమవుతోంది. ఇది ‘వారు–మనము’ అనే భావనకు తావివ్వకుండా సకల సామాజికవర్గాల మధ్య సమైక్యత పరిఢవిల్లేందుకు సంకల్పించడం లేదు. మణిపూర్‌లో జాతుల ఘర్షణ, పంజాబ్, హర్యానా; కర్ణాటక, తమిళనాడుల మధ్య నదీజలాల పంపకాలు మొదలైన అంతర్ రాష్ట్ర వివాదాలను పరిష్కరించేందుకు ఈ తప్పుడు జాతీయవాదం పూనుకోవడం లేదు. కశ్మీర్‌కే అగ్రప్రాధాన్యమిస్తోంది, అదీ ఒక స్థిరాస్తిగా మాత్రమే సుమా! ముస్లింలను శత్రువులుగా చిత్రీకరిస్తూ భారతదేశ సమైక్యతను బలహీనపరుస్తోంది. బాహ్య శక్తుల విషయంలో సాధ్యమైతే కలహశీల వైఖరితో వ్యవహరిస్తోంది; తప్పనిసరి అయినచోట నమ్రతతో లొంగుబాటు వైఖరి ప్రదర్శిస్తోంది. ఎంతకూ పాకిస్థాన్‌ను ఎలా దెబ్బతీయాలా అన్నదే దాని నిరంతర ఆలోచనగా ఉన్నది. ఫలితమేమిటి? అంతర్జాతీయ వేదికలపై ఇప్పుడు అందరూ భారత్‌ను పాకిస్థాన్‌తో కలిపి ప్రస్తావిస్తున్నారు! ఇరుగు పొరుగు దేశాలపై పెత్తనం వహించేందుకు ప్రయత్నించడం వల్లే ఇప్పుడు మన దేశం అన్ని వైపులా శత్రుపూరిత ప్రభుత్వాలతో పరివేష్టితమై ఉన్నది. నిక్కచ్చిగా చెప్పాలంటే ఇదొక మిథ్యా జాతీయవాదం. చైనా విస్తరణవాదాన్ని సమర్థంగా ప్రతిఘటించగలుగుతుందా? లేదు. డోనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దీటుగా ప్రతిస్పందిస్తుందా? లేదు. జాతీయ ప్రయోజనాల విషయమై దీని అవగాహన సూత్రబద్ధమైనది కాదు. కనుకనే భారత్‌కు ఆపత్సమయంలో ఆదుకునే మిత్ర దేశాలు లేకుండా పోయాయి. పాకిస్థాన్‌తో ఇటీవలి ఘర్షణలే ఇందుకు తార్కాణం.
వివిధ భారతి జాతీయవాదం నుంచి హిందీ– హిందూ–హిందుస్థాన్ జాతీయవాదంగా భారత జాతీయవాదం భ్రష్టమవడం మన కాలం చవిచూస్తున్న ఒక మహా విషాదం. ఇందుకు బాధ్యులు ఎవరు? ప్రస్తుత పాలనా వ్యవస్థ, దాని సైద్ధాంతిక సమర్థుకులే పూర్తి బాధ్యులుగా భావించడం ఒక శుద్ధ పొరపాటు. అలా ఆలోచించడం మేధో సోమరితనమే. ప్రస్తుత శోచనీయ పరిస్థితులకు ఉదారవాద, లౌకిక, ప్రగతిశీల మేధోశ్రేణులు తమ వంతు బాధ్యతను అంగీకరించి తీరాలి. భారతదేశ సమగ్ర, అభ్యుదయాత్మకమైన జాతీయవాదంపై సంకుచిత యుద్ధోన్మాద ధోరణులు, మతమౌఢ్యవాదాలు ఆధిక్యత ఎలా సాధించాయి? స్వాతంత్ర్యానంతర పాలకుల భావజాలమే అందుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు. అదొక సారహీన ఆధునికతా భావజాలమది. భావోద్విగ్నత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సారం లేని ఆ భావజాలం సమస్త భారతీయులతో మన జాతీయోద్యమానికి ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని నిలుపుకోవడంలో పూర్తిగా విఫలమయింది. యూరోపియన్ జాతీయవాద దుష్కృత్యాల వల్ల కలిగిన అపరాధభావనతో భారతీయ మేధావులు జాతీయవాద భావనకు నిబద్ధతను పూర్తిగా ఉపసంహరించుకున్నారు. మరి భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి ఏ మాత్రం దోహదం చేయని శక్తులు జాతీయవాదాన్ని స్వాయత్తం చేసుకోవడంలో ఆశ్చర్యమేముంది? ప్రగతిశీల భారతీయులు ఇప్పటికైనా మహోన్నత భారత జాతీయవాదం ఇలా భ్రష్టమైపోవడంలో తమ పాత్రను అంగీకరించి, దాని వారసత్వాన్ని రక్షించుకోవడానికి పూనుకుంటారా? ఇది చాలా అత్యవసరంగా నిర్వర్తించాల్సిన రాజకీయ, మేధో కర్తవ్యం అనడంలో సందేహం లేదు.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News