Share News

జాతికిబాట పైడిమర్రి ప్రతిజ్ఞ

ABN , Publish Date - Jun 10 , 2025 | 03:47 AM

జాతీయ గీతం, జాతీయ గేయాలను ఎవరు రచించారని విద్యార్థులనడిగితే.. ఠక్కున సమాధానం చెప్తారు. ఆ రచయితలకు చరిత్రలో సముచిత స్థానం లభించింది. ‘ప్రతిజ్ఞ’ రచయిత ఎవరని అడిగితే మాత్రం కొందరే సమాధానం చెప్తారు! జూన్‌ 10, 1916లో...

జాతికిబాట పైడిమర్రి ప్రతిజ్ఞ

జాతీయ గీతం, జాతీయ గేయాలను ఎవరు రచించారని విద్యార్థులనడిగితే.. ఠక్కున సమాధానం చెప్తారు. ఆ రచయితలకు చరిత్రలో సముచిత స్థానం లభించింది. ‘ప్రతిజ్ఞ’ రచయిత ఎవరని అడిగితే మాత్రం కొందరే సమాధానం చెప్తారు! జూన్‌ 10, 1916లో నల్లగొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో పైడిమర్రి వెంకటసుబ్బారావు జన్మించారు. పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి.. వెట్టిచాకిరి, భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పలు రచనలు చేశారు. ఆయన తన 18వ ఏటనే ‘కాలభైరవుడు’ కలం పేరుతో ఓ నవల రాశారు. ‘ఉషస్సు కథలు’ కథా సంపుటిని రచించారు. దేవదత్తుడు, తులసీదాస్‌, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు, బ్రహ్మచర్యం, గృహస్థ జీవితం, స్త్రీధర్మం, ఫిరదౌసి, శ్రీమతి అనే నాటకాలు రాశారు. అనేక అనువాద రచనలూ చేశారు. 1945–46సంవత్సరాల్లో నల్లగొండలో నిర్వహించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభల్లో ప్రముఖ పాత్ర వహించారు. ప్రతిజ్ఞను పైడిమర్రి 1962లో రచించారు. దాన్ని చదివి ఉప్పొంగిపోయిన సాహితీవేత్త తెన్నేటి విశ్వనాథం, నాటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లారు. తరువాత బెంగళూరులో నిర్వహించిన కేంద్ర విద్యా సలహా మండలి సమావేశంలో ఈ రచనను జాతీయ ప్రతిజ్ఞగా ఆమోదించారు. ‘భారతదేశం నా మాతృభూమి..’ అంటూ సాగే ప్రతిజ్ఞ (జనవరి 26, 1965 నుంచి) దేశంలోని ప్రతి పాఠశాలలో రేపటి పౌరుల గుండెల నిండా దేశభక్తిని పాదుకొల్పుతున్నది. పైడిమర్రి పేరు అంతగా ప్రాచుర్యంలో లేకపోవడం పెద్ద చారిత్రక తప్పిదంగా నేటితరం రచయితలు, మేధావులు గుర్తించారు. ఎలికట్టి శంకర్రావు 2011లో ‘ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి’ అనే పేరుతో ప్రత్యేక సంచికను ప్రచురించారు. అంతకుముందు ఇదే పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వ్యాసాన్ని ప్రచురించింది.


పైడిమర్రి జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని జన విజ్ఞాన వేదిక డిమాండ్‌ చేసింది. ఫలితంగా 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో పైడిమర్రి జీవిత చరిత్రను పొందుపర్చారు. పైడిమర్రి జీవిత చరిత్రను ఎం.రాంప్రదీప్‌ తెలుగులో ‘భారతదేశం నా మాతృభూమి’ పేరుతోనూ, ఆంగ్లంలో ‘ది ఫర్గాటెన్‌ పేట్రియాట్‌’ పేరిట ప్రచురించారు. పైడిమర్రి విగ్రహాన్ని ఆయన స్వగ్రామంలో ఏర్పాటు చేయిస్తామని ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా 2016లో తెలంగాణ సాహితీవేత్తలు ప్రకటించారు. కానీ అది నేటికీ కార్యరూపం దాల్చకపోవడం విచారకరం. దేశానికి ‘ప్రతిజ్ఞ’ను అందించిన పైడిమర్రిని సముచితంగా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యం. రాంప్రదీప్

(నేడు పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి)

ఇవి కూడా చదవండి

ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్

పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 03:47 AM