Share News

Telangana politics BC Reservations: రాజ్యాధికారం దిశగా రిజర్వేషన్ల పోరు!

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:13 AM

తెలంగాణలో బీసీ జనాభాకు అనుగుణంగా ఆ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల పెంపుదల యత్నాలు సందిగ్ధంలో పడిన నేపథ్యంలో, బీసీల సంయుక్త కార్యాచరణ కమిటీ ఇటీవల తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. విశేషమేమంటే...

Telangana politics BC Reservations: రాజ్యాధికారం దిశగా రిజర్వేషన్ల పోరు!

తెలంగాణలో బీసీ జనాభాకు అనుగుణంగా ఆ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల పెంపుదల యత్నాలు సందిగ్ధంలో పడిన నేపథ్యంలో, బీసీల సంయుక్త కార్యాచరణ కమిటీ ఇటీవల తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. విశేషమేమంటే, ఆ బంద్‌కు అన్ని రాజకీయ పక్షాలూ మద్దతునిచ్చాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు రాజకీయ పార్టీలు ప్రకటించిన ఈ మద్దతులో చిత్తశుద్ధి ఉన్నదా? అన్న సందేహం బీసీ విద్యావంతులలో వ్యక్తమవుతోంది. ఇది సహేతుకమైనదే.

కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ నాయకత్వంలో 1959 మూడంచెల ప్రజాస్వామిక వికేంద్రీకరణ వ్యవస్థ నేర్పాటు చేసింది. రెవెన్యూ, శాంతి–భద్రతలు మినహాయించి, గ్రామ పాలనకు సంబంధించిన విధులు, అధికారాలు స్థానిక సంస్థలకు అప్పగించడం వల్ల, కేంద్ర–రాష్ట్రాలతో సమానంగా ప్రజలకు సేవలను అందించాయి. అయితే 1980వ దశకం నుంచి బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములవుతున్న క్రమంలో భూస్వామ్య అగ్రకులాలు తమ ఆధిపత్యం పోతుందనే భావనతో రాష్ట్ర నాయకత్వంపై ఒతిడి తెచ్చి పంచాయత్‌రాజ్‌ వ్యవస్థలు నిర్వీర్యమయ్యేలా చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలు ఆరంభమయిన తరువాత పంచాయతీరాజ్ వ్యవస్థలు అందించే పౌర సేవలు కూడా ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఈ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయడం తగ్గి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసే ఫీల్డ్ ఏజెన్సీ స్థాయికి దిగజారిపోయాయి. ఇప్పుడు ఈ స్థానిక పాలనా వ్యవస్థలకు తగిన అధికారాలు కొరవడ్డాయి. నిధులూ తగ్గిపోయాయి. ఫలితంగా నామమాత్ర పాలనా వ్యవస్థలుగా మిగిలిపోయాయి. స్థానిక పాలనా సంస్థలకు ఎన్నికైనవారు రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిస్థితులలో బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు పోరాటం కేవలం సంఖ్య పెరుగుదలకా? లేక రాజ్యాధికార సాధనకా? అనే విషయమై నిశిత విశ్లేషణ జరగవలసి ఉన్నది. బోధకుడుగా, పరిశోధకుడుగా దశాబ్దాల అనుభవం ఆధారంగా కొన్ని అంశాలను చర్చకు ప్రతిపాదిస్తున్నాను. ఈ చర్చ సామాజిక న్యాయం, సమాజ సమగ్ర అభివృద్ధికి దోహదం చేసేదిగా ఉండాలి. అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ), మహిళల ఆకాంక్షలను సమతుల్యం చేసే సూక్ష్మమైన చర్చలు జరిగితీరాలి.


ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈబీసీ) 10శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడంలో, రాజకీయ పార్టీలు తమ సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి 103వ రాజ్యాంగ సవరణను వేగంగా ఆమోదించాయి. ఈ చట్టాన్ని న్యాయ వ్యవస్థ కూడా సమర్థించింది. అయితే సామాజికంగా వెనుకబడిన కులాలకు 50శాతం పరిమితిని పెంచడంలో మాత్రం పార్టీల మధ్య అలాంటి ఏకాభిప్రాయం కనిపించదు! అంతేకాక, న్యాయ వ్యవస్థ కూడా ఈ పరిమితిని అధిగమించడంలో సానుకూలత చూపడం లేదనే భావన బీసీలలో విస్తృతంగా ఉంది. 1992లో 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. అధికరణ 243(6) ప్రకారం బీసీల రిజర్వేషన్ల పరిమితిని ఆయా రాష్ట్రాల శాసనసభల అభిప్రాయానికే వదిలివేయడం జరిగింది. 1994లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సంస్థల చట్టం 50శాతం పరిమితి పరిధిలో 27శాతం బీసీల రిజర్వేషన్లను కల్పించింది. తమిళనాడు, మహారాష్ట్రలు ఈ పరిమితిని అధిగమించగా, కర్ణాటక ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లను పునర్వ్యవస్థీకరించేందుకు చర్యలు తీసుకున్నది. ప్రస్తుతం స్థానిక పాలనా సంస్థల ఉపసర్పంచ్‌లు,, ఉపాధ్యక్షులు/చైర్మన్లకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల, ఈ సంస్థల నిర్ణయాలను ఉన్నత ఆధిపత్య కులాలే ప్రభావితం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర పరిపాలనను నిశితంగా పరిశీలిస్తే పోలీస్, రెవెన్యూ, పురపాలక, పట్టణాభివృద్ధి, నీటిపారుదల, రోడ్లు–భవనాలు, ఆహారం, పౌరసరఫరాలు, ప్రసార వ్యవస్థ, విద్య వంటి కీలక మంత్రిత్వ శాఖలు ప్రధానంగా ఒకే ఆధిపత్య కుల నియంత్రణలో ఉన్నాయి. బీసీలు రాష్ట్ర జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ, రాష్ట్ర మంత్రివర్గంలో వారి ప్రాతినిధ్యం అత్యంత తక్కువగా ఉంది. అంతేకాక, వారికి అప్పగించిన శాఖలు ప్రాధాన్యత లేనివిగా ఉన్నాయి. బీసీల అభ్యున్నతి పాలకవర్గం నిబద్ధత స్థాయిని ఇది స్పష్టంగా ప్రతిబింబించడం లేదా?

ప్రస్తావిత సవాళ్లు తెలిసికూడా అణగారిన కులాల వారికి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాజకీయ పార్టీలు తరచుగా పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. అందువల్ల, రాజకీయ పార్టీలు నిజంగా బీసీల రాజకీయ సాధికారతకు కట్టుబడి ఉన్నాయా లేక కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మద్దతు తెలుపుతున్నాయా అన్న సందేహం బలపడుతోంది. ఈ సందర్భంలో రెండు అంశాల గూర్చి బీసీ సంయుక్త కార్యాచరణ కమిటీ, బీసీ విద్యార్థులు చర్చించుకోవాలి. మొదటిది– సామాజికంగా వెనుకబడిన కులాలకు 50శాతం రిజర్వేషన్ల పరిమితిని పెంచే విషయంలో రాజ్యాంగ సవరణ, న్యాయపరమైన సమీక్ష, రాజకీయ పార్టీల మద్దతు, అగ్రకులాల సానుకూలత, సామాజికంగా వెనుకబడిన కులాల ఐక్యత వంటి విషయాలలో రూపొందించుకోవాల్సిన వ్యూహం. ఈ వ్యూహం దీర్ఘకాలికమైనది. రెండవది– ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు రాజ్యాధికార సాధన దిశగా పయనించే వ్యూహం. తక్షణమే రాష్ట్ర చట్ట–పరిపాలనా పరిధిలో ఉన్నా చర్యలను ప్రభుత్వం తీసుకొనే విధంగా ఉద్యమ కార్యాచరణకు చర్చలు జరపడం, కార్యాచరణకు స్పష్టమైన రూపాన్ని ఇవ్వడం. ఈ చర్చకు కేంద్రంగా ఉండాల్సిన ముఖ్య అంశాలు ఎన్నో ఉన్నప్పటికి క్రింద పేర్కొన్న అంశాలు మరీ ముఖ్యమైనవి:


(అ) రాజ్యాంగ 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న 29 విధులకుగాను కేవలం 10, 11; 12వ షెడ్యూల్‌లోని 18 విధులకుగాను 6, 8 మాత్రమే పట్టణ స్థానిక సంస్థలకు బదిలీ చేశారు. వాటి అమలుకు అవసరమైన నియమ నిబంధనలు స్పష్టంగా పేర్కొనకపోవడమే కాకుండా, తగిన ఆర్థిక వనరులు కూడా కల్పించలేదు. అందుకే పంచాయతీరాజ్‌ సంస్థలు నిర్వీర్యమయ్యాయి; (ఆ) రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో కనీసం 30–33శాతం నిధులను నేరుగా గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు కేటాయించి, వాటి ద్వారా అమలయ్యే విధంగా చట్టబద్ధత కల్పించాలి. కేరళ, కర్ణాటకలు ఇటువంటి నమూనాను ఇప్పటికే అవలంబిస్తున్నాయి. ఒక రకంగా ఇది మన రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ఉప–ప్రణాళిక నమూనాగా భావించవచ్చు; (ఇ) ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక పాలనా వ్యవస్థల్లో జోక్యాన్ని నివారించి, అవి స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలి. నేడు పంచాయతీరాజ్ సంస్థలు ‘ఎమ్మల్యే రాజ్’గా మారిపోయాయి. ఇది స్థానిక స్వయంప్రతిపత్తికి విరుద్ధంగా ఉంది; (ఈ) జిల్లా ప్రణాళికా కమిటీలకు, రాష్ట్ర ఆర్థిక కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి, తగిన వనరులు కల్పించాలి. స్థానిక పాలనా వ్యవస్థలో రెండవ స్థాయి నాయకత్వ స్థానాలకు కూడా రిజర్వేషన్ అమలు చేయాలి.

ఈ ప్రతిపాదనలకు షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, స్త్రీల నుంచే కాకుండా అగ్రకులాల మద్దతు కూడా ఉంటుంది, ఎందుకంటే, స్థానిక సంస్థలకు ఎన్నికైనవారు తమ పరిధిలోని అంశాలపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటే, ప్రజలకు కావలిసిన సేవలను సులభంగా అందించవచ్చు. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర పరిపాలనా పరిధిలో ఉన్నాయి కాబట్టి వాటిని ప్రభుత్వం అమలులోకి తీసుకురావాలి. అప్పుడే ప్రభత్వానికి బీసీల రాజ్యాధికారంపై నిజమైన నిబద్ధతత ఉన్నట్లుగా భావించాలి. ఈ అంశాలపై సమిష్టి చర్చ జరిపి, బీసీల రాజ్యాధికార సాధనానికి స్పష్టమైన ఉద్యమ ప్రణాళికను రూపొందించాలి. ఈ ప్రణాళిక లక్ష్యాలు సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే రాజ్యాధికార సాధన దిశగా అర్థవంతమైన అడుగు పడుతుంది.

చిన్నాల బాలరాములు

విజిటింగ్ ప్రొఫెసర్, ‘సెస్‌’

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్

ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం

Updated Date - Nov 12 , 2025 | 01:13 AM