‘విద్యార్థి ఎన్నికల’పై నిషేధం ఎత్తివేయాలి
ABN , Publish Date - Feb 13 , 2025 | 06:16 AM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థి సంఘం ఎన్నికల నిర్వహణపై నిషేధం విధించి 36 ఏళ్ళు గడుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 1988లో ఉస్మానియా విశ్వవిద్యాలయ..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థి సంఘం ఎన్నికల నిర్వహణపై నిషేధం విధించి 36 ఏళ్ళు గడుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 1988లో ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ నిజాం కళాశాలలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణలో దేవేందర్ యాదవ్ అనే విద్యార్థి హత్య జరిగిందనే నెపంతో అప్పటి పాలకులు ఈ ఎన్నికలపై నిషేధం విధించారు. ఎనభయ్యవ దశకంలో విద్యార్థి సంఘం ఎన్నికలు విద్యార్థుల ఆలోచనలను మెరుగుపరిచి, అభివృద్ధి వైపు నడిపించాయి. విద్యాసంస్థల్లో ఈ ఎన్నికల నుంచి ప్రేరణ, చైతన్యం పొంది రాజకీయాలలోకి వచ్చిన అనేక మంది సాధారణ విద్యార్థులు నేడు భారత పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో తమ ప్రభావాన్ని చూపుతున్నారు. నాడు క్యాంపస్‌లలో స్టూడెంట్ బాడీ ఎన్నికలలో ఎన్నికైన విద్యార్థులు విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి ముందు వరుసలో ఉండేవారు. దాంతో యూనివర్సిటీలు జ్ఞాన కేంద్రాలుగా, ఉద్యమ కేంద్రాలుగా సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి.
నేడు విద్యార్థి ఎన్నికలు లేకపోవడంతో విద్యార్థుల డిమాండ్లను లేవనెత్తడం, ఆయా యాజమాన్యాలు, ప్రభుత్వాలను సంప్రదించి, పరిష్కరించడం సవాలుగా మారింది. కొన్నేళ్లుగా తెలంగాణ యూనివర్సిటీలు, కళాశాలలకు సరైన నిధుల కేటాయింపులు లేక మౌలిక సదుపాయాలు అందక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రొఫెసర్ల నియామకం జరగడం లేదు. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కూడ జరగడం లేదు. దీంతో యూనివర్సిటీలలో విద్యాబోధన నిలిచిపోయి పరిశోధనలు కుంటుపడ్డాయి. యూనివర్శిటీల ప్రతిష్ఠ మసకబారుతోంది.
ప్రతి ఏడాది జరిగే విద్యార్థి సంఘం ఎన్నికల్లో అనేక సమస్యలు చర్చకు వస్తాయి. వివిధ బావజాలాల మధ్య స్నేహపూర్వక చర్చ–ఘర్షణ ఉంటుంది. ఇది గమనిస్తూ ఎన్నికలలో పాల్గొనే సాధారణ విద్యార్థులు కూడా సమాజం పట్ల కొంత జ్ఞానాన్ని పెంపొందించుకొని మార్పు వైపు ప్రయాణించేవారు. విద్యార్థుల హక్కులకై, వారి సమస్యల పరిష్కారానికి యాజమాన్యాలతో, పాలక ప్రభుత్వాలతో నిత్యం సంప్రదింపులు, పోరాటం కొనసాగడం వల్ల విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందేవి. బహుజన సమూహాల విద్యార్థులు నాయకులుగా ఎదిగేవారు. ఇది ఇష్టం లేని పాలకవర్గాలే ఈ మూడున్నర దశాబ్దాలుగా ఎన్నికల వైపు తొంగి చూడటం లేదు. పైగా నిషేధాన్ని కొనసాగిస్తూనే ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలను, సంఘాలను అణచివేస్తున్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి విద్యార్థుల పోరాటాలతోనే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని, విద్యార్థులు రాజకీయాలలోకి రావాలని పిలుపునిచ్చారు. ఒకవైపు విద్యార్థి సంఘం ఎన్నికలపై నిషేధాన్ని కొనసాగిస్తూ, మరోవైపు విద్యార్థులు రాజకీయాలలోకి రావాలనడం మోసం చేయడమే. తక్షణమే విద్యార్థి ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలి. అందుకు గతంలో భారత మాజీ ఎన్నికల అధికారి జె.యం లింగ్డో కమిటీ సూచనలు పాటిస్తూ, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) విడుదల చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి.
లింగ్డో నివేదికను అమలు చేస్తూ స్టూడెంట్ బాడీ ఎన్నికలు జరపాలని 2006లో సుప్రీంకోర్టు మరో ఆర్డరు జారీచేసింది. తరువాత 2007లో ఎన్నికల నిర్వహణకై యూజీసీ ఆదేశాలు జారీ చేయగా, దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థి సంఘం ఎన్నికలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. కానీ నిషేధం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగడం లేదు. విద్యార్థి సంఘం ఎన్నికల అంశం తెరమీదకు వచ్చినప్పుడల్లా ఈ రాష్ట్రాల పాలక వర్గాలు, ఆయా యూనివర్సిటీల యాజమాన్యాలు శాంతిభద్రతల అంశాన్ని సాకుగా చూపుతున్నాయి. శాంతిభద్రతలే సమస్యైతే సాధారణ ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలి. విద్యార్థి సంఘం ఎన్నికల ప్రాధాన్యం గుర్తిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో ఎన్నికలు తక్షణమే జరపాలని డిమాండ్‌తో పోరాడాల్సిన అవసరం వుంది.
కోట ఆనంద్,
విద్యార్థి నాయకులు
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News