ఉగ్రవాదం ఒక మతాన్ని మించినది
ABN , Publish Date - Jun 17 , 2025 | 03:02 AM
భారత్ ఒక్కటే ఉగ్రవాద సమస్య ఎదుర్కొంటోందని, దీనికి హిందువులు అధికంగా బలవుతున్నారన్న ప్రచారం బలంగా ఉంది. వాస్తవానికి గణాంకాల ప్రకారం: ఉగ్రవాదం వల్ల మరణించినవారిలో అత్యధికులు ముస్లిం మతస్థులే, ఈ మరణాలు...
భారత్ ఒక్కటే ఉగ్రవాద సమస్య ఎదుర్కొంటోందని, దీనికి హిందువులు అధికంగా బలవుతున్నారన్న ప్రచారం బలంగా ఉంది. వాస్తవానికి గణాంకాల ప్రకారం: ఉగ్రవాదం వల్ల మరణించినవారిలో అత్యధికులు ముస్లిం మతస్థులే, ఈ మరణాలు ఇండియాలో కంటే పాకిస్థాన్‌లోనే ఎక్కువ. పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ వగైరా ప్రాంతాల్లోని ‘ముస్లిం ఉగ్రవాదులు’ పాకిస్థాన్ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. ఇండియాలో కూడా ఉగ్రవాదం, దాని అణచివేత పేరుతో సాగిన కార్యకలాపాల వల్ల మరణించిన అత్యధికులు ముస్లింలే. నాగాలాండ్, అస్సాం, పంజాబ్, మణిపూర్ తదితరచోట్ల కొనసాగుతున్న ఉగ్రవాదానికీ ముస్లిం మతానికీ సంబంధం లేదు. లోగడ అస్సాంలోనూ, ఎల్‌టీటీఈ కాలంలో తమిళనాడులోనూ, నేడు మణిపూర్‌లోనూ ఉగ్రవాదుల్లో అత్యధికులు హిందువులే. కశ్మీర్‌లో నేటివరకూ లక్షమంది ప్రజలు చంపబడ్డారని అంచనా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాలుగువేలమంది అని పార్లమెంటులో ప్రకటించారు. సంఖ్య ఎంతైనా, వీరిలో 90శాతం ముస్లింలే. భారత, పాకిస్థాన్ దేశాల్లోని పాలకులు ఉగ్రవాదాన్నీ, మతాన్నీ మేళవించి వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకానీ, అది కేవలం హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలు సాగిస్తున్నది కాదన్నది సుస్పష్టం.
బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందినప్పుడు భారతదేశం మతం ఆధారంగా గాక భాషాజాతులకు స్వయం నిర్ణయాధికారం ఉండే రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సింది; ఈ భాషాజాతులు ఐచ్ఛికంగా ఒక ప్రజాస్వామిక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సింది. అలా జరిగి వుంటే ఉపఖండంలో ఐక్యత, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మతసామరస్యం పరిఢవిల్లేవి. పంజాబ్, బెంగాల్, కశ్మీర్లతో పాటు బహుజాతుల భారత్ ఐక్యంగా వుండి, కొనసాగి, బలపడేది. కానీ, జిన్నా వంటి ముస్లిం లీగ్ నాయకులూ, సావర్కర్ వంటి హిందుత్వశక్తులూ మతం ఆధారంగా ఉపఖండ ప్రజలు ‘రెండు జాతుల’ వారన్న అవాస్తవ, అశాస్త్రీయ సిద్ధాంతాన్ని ముందుకుతెచ్చారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులూ, వారిపైన ఆధారపడిన ఉపఖండంలోని బడా పెట్టుబడిదారులు, ఫ్యూడల్ శక్తులూ ఈ సిద్ధాంతాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్నారు. వారి కోసమే నెహ్రూ, పటేల్ తదితర నాటి కాంగ్రెస్ నాయకులూ దీన్ని ఆమోదించారు. అంతా కలిసి, మతప్రాతిపదికపై, భారత్ – పాకిస్థాన్ అనే రెండు రాజ్యాలను ఏర్పాటు చేసారు. ఈ రెండు రాజ్యాలలోని కశ్మీర్, బెంగాల్, పంజాబ్, ఈశాన్య భారత్ తదితర జాతుల ప్రజలు తమకు స్వయం నిర్ణయాధికారం/ స్వయంప్రతిపత్తి కావాలని, లేదా రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలనీ ఆనాటి నుండీ పోరాడుతూనే ఉన్నారు. ఈ ప్రజల పోరాటాలన్నింటినీ ‘ఉగ్రవాదం’ అని ముద్ర వేసి, పాశవికంగా అణచివేసే నిరంకుశ విధానాలు అమలు చేయడంవల్ల సమస్య పరిష్కారం కాదని అనుభవాలు చెబుతున్నాయి.
దీనికితోడు అమెరికా, రష్యా అగ్రరాజ్యాల మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య బంగ్లాదేశ్ యుద్ధంగా పరిణమించింది. రష్యా అగ్రరాజ్యానికి లోబడిన విధానాలను భారత పాలకులు, అమెరికా అగ్రరాజ్యానికి లోబడిన విధానాలను పాకిస్థాన్ పాలకులు అనుసరించారు. ఆఫ్ఘనిస్థాన్‌పై రష్యా దురాక్రమణ, అమెరికా అక్కడ తన ప్రాబల్యంకోసం తాలిబాన్, ఆల్‌ఖైదా వంటి సాయుధశక్తులను పెంచిపోషించడం, దానికి పాకిస్థాన్‌ను వాడుకోవటం వంటి పరిణామాలు దక్షిణాసియాలో ఉగ్రవాదానికి ఆజ్యం పోసాయి. ఒకవైపు బంగ్లా యుద్ధంతో పాకిస్థాన్ విచ్ఛిన్నం, మరోవైపు స్వయం నిర్ణయాధికారం కావాలని పోరాడుతున్న కశ్మీర్ జాతిప్రజలపై భారత ప్రభుత్వ దమనకాండ, ఇస్లాం ఉగ్రవాదం అణచివేత పేరిట అమెరికా గ్లోబల్ యుద్ధం, దీనికి ఇండియా, పాక్ ఇరుదేశాల పాలకుల మద్దతు– వీటన్నిటి పర్యవసానంగా ఉగ్రవాదశక్తులూ, వాటికి పాకిస్థాన్ మద్దతూ బలపడుతూ వచ్చాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వారసత్వం కొనసాగిస్తూ, దక్షిణాసియాలో భారత పాలకులు అనుసరిస్తున్న విస్తరణవాద విధానాలు కూడా ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి.
కశ్మీర్‌లో స్వయం నిర్ణయాధికారం కోసం కశ్మీరీ పండిట్లు కూడా లోగడ ఉద్యమాల్లో పాల్గొన్నారు. తర్వాతి కాలంలో పాలకులు దాన్ని మతపరంగా మలచటానికి ప్రయత్నించారు. నిజానికి నాటి కశ్మీర్ రాజు ‘‘కేంద్రానికి మూడే అధికారాలు, కశ్మీర్ జాతి ప్రజలకే ఇతర అన్ని అధికారాలు’’ వుండే షరతుపై ఇండియాలో చేరటానికి సంతకం చేసారు. కనీసం ఆ మేరకైనా స్వయంప్రతిపత్తిని అమలు చేయాలని కశ్మీర్ ప్రజలు, శాసనసభ కోరుతుంటే అంగీకరించకుండా అణచివేత విధానాలనే కొనసాగిస్తుండటం వల్ల సమస్య జటిలమవుతోంది. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఆచరణలో కాంగ్రెస్ పాలకులూ, ఆర్టికల్–370 రద్దు పేరుతో బీజేపీ పాలకులూ లాగివేయటం, కశ్మీర్‌ను మూడు ముక్కలుగా, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించటం– ఇవన్నీ ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నాయి.
భారత పాకిస్థాన్ దేశాల పాలకులు ఇరువురూ స్వతంత్రంగా చర్చల ద్వారా అన్ని సమస్యలకూ పరిష్కారం సాధించుకోవాలి. తన చైనా–వ్యతిరేక ప్రపంచాధిపత్య వ్యూహంలో భాగంగా, దక్షిణాసియాలో తన పట్టు, ప్రాబల్యం పెంచుకోవడానికి అమెరికా అనేక కుతంత్రాలు పన్నుతోంది. అటువంటి అమెరికా తోక పట్టుకుపోవడం నష్టదాయకం. ప్రజలు చారిత్రక వాస్తవాలను అవగాహన చేసుకుని, ఉగ్రవాదాన్ని మాత్రమే గాక, మతవిద్వేషం, జాతీయ దురహంకారం, యుద్ధోన్మాదాలను కూడా బలంగా వ్యతిరేకించాలి. అదే శాంతికీ, అభివృద్ధికీ దోహదం చేస్తుంది.
సిహెచ్.ఎస్.ఎన్. మూర్తి
ప్రధాన కార్యదర్శి, ఎఫ్.ఐ.టి.యు
ఇవి కూడా చదవండి
షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest AP News And Telugu News