South Africa Cricket: టెంబా టీమ్ దక్షిణాఫ్రికా క్రికెట్‌కు జేజేలు
ABN , Publish Date - Nov 30 , 2025 | 05:33 AM
నేను చదివిన అత్యుత్తమ స్పోర్ట్స్ పుస్తకాలలో ఒకటి జాన్ కార్లిన్ రాసిన ‘ప్లేయింగ్ ది ఎనిమీ: నెల్సన్ మండేలా అండ్ ది గేమ్ దట్ మేడ్ ఎ నేషన్’. దక్షిణాఫ్రికా ఆతిథ్యమివ్వడంతో పాటు విజయం సాధించిన....
నేను చదివిన అత్యుత్తమ స్పోర్ట్స్ పుస్తకాలలో ఒకటి జాన్ కార్లిన్ రాసిన ‘ప్లేయింగ్ ది ఎనిమీ: నెల్సన్ మండేలా అండ్ ది గేమ్ దట్ మేడ్ ఎ నేషన్’. దక్షిణాఫ్రికా ఆతిథ్యమివ్వడంతో పాటు విజయం సాధించిన చరిత్రాత్మక ‘రగ్బీ వరల్డ్ కప్–1995’ గురించిన విపుల కథనమిది. రగ్బీ అనేది దక్షిణాఫ్రికాలో అమానుష జాతి వివక్షా వ్యవస్థకు కారకులైన జాత్యహంకార, ఆధిపత్యవాద ఆఫ్రికానర్ల(దక్షిణాఫ్రికాలో నివసించే డచ్ మూలాలున్న శ్వేతజాతి సమూహం) ఆట. మనకు నమ్మడానికి కష్టంగా అనిపించే ఓ వ్యక్తి, ఆ ఆటకు అభిమానిగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నెల్సన్ మండేలా! ఆఫ్రికానర్ల వివక్షాపూరిత పాలనలో దశాబ్దాల పాటు జైలులో మగ్గిపోయిన మండేలా రగ్బీకి ఎలా అభిమాని అయ్యారనే విషయాన్ని కార్లిన్ చాలా సున్నితంగా వివరించారు. జైలు నుంచి విడుదలైన తరువాత దక్షిణాఫ్రికా అధ్యక్షుడుగా మండేలా ఎన్నికయ్యారు. దేశాధ్యక్షుడి హోదాలో ఆయన శ్వేతజాతీయుల ప్రాబల్యంలో ఉన్న రగ్బీ టీమ్‌కు అనధికారిక చిహ్నం (మస్కట్) అయ్యారు. టీమ్ కెప్టెన్ ఆఫ్రికానర్ అయిన ఫ్రాంకోయిస్ పియెనార్‌తో ఆయన ప్రత్యేక స్నేహ సంబంధాలు నెలకొల్పుకున్నారు.
కార్లిన్ పుస్తకం (దీని ఆధారంగా నిర్మించిన ‘ఇన్విక్ట్’ అనే ఫీచర్ ఫిల్మ్‌లో మండేలాగా మోర్గాన్ ఫ్రీమన్ నటించారు) రగ్బీ ఆటను దాని సామాజిక, రాజకీయ సందర్భంతో చక్కగా మేళవించింది. మహోన్నత దార్శనిక నేత అయిన నల్లజాతి రాజకీయవేత్త, పక్షపాత రహితంగా ఆలోచించే శ్వేతజాతి క్రీడాకారుల మధ్య సన్నిహిత స్నేహ సంబంధాలు– గతంలో పరస్పర విరోధులుగా ఉన్న వేర్వేరు జాతి సమూహాలను ఎలా సమైక్యపరిచాయో సవివరంగా వెల్లడించింది. క్రికెట్ గ్రౌండ్స్‌లో అత్యంత పవిత్రమైనది, ప్రతిష్ఠాత్మకమైనదిగా భావించే ‘లార్డ్స్’లో దక్షిణాఫ్రికా జట్టు ఈ ఏడాది ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్’ (డబ్ల్యూటీసీ)ను గెలుచుకున్న సందర్భంలో కార్లిన్ పుస్తకాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఈ క్రికెట్ విజయానికి 1995 నాటి రగ్బీ విజయానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం గానీ, సామాజిక ప్రభావం గానీ లేవు. ఇది పూర్తిగా క్రికెట్ విజయం. అయినప్పటికీ ఇది, జాతీయవాద ఆర్భాటాలు, ఉన్మాదాలు లేని క్రికెట్ ప్రేమికులకు ఎల్లెడలా ఎనలేని ఆనందోత్సాహాలను ఇచ్చింది. ఇందుకొక కారణమున్నది. తమను తాము క్రికెట్ ప్రపంచ గొప్ప అగ్రత్రయంగా భావించుకునే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్‌లు– దక్షిణాఫ్రికా క్రికెటర్లు అంతగా గౌరవించదగినవారు కాదని విశ్వసించడం కద్దు. ఈ మూడు దేశాలు వారికి రెండు లేదా మూడు టెస్ట్‌ల సిరీస్ కంటే ఎక్కువ ఇచ్చేవి కావు. దక్షిణాఫ్రికా తన డబ్ల్యూటీసీ విజయాన్ని డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాపై సాధించడం నన్ను ఎంతో ఉద్వేగపరిచింది. అందునా విజేత జట్టుకు నల్లజాతీయుడు అయిన టెంబా బవుమా నేతృత్వం వహించడం నాకు ప్రత్యేకంగా అమితానందాన్ని కల్పించింది. జట్టును విజయానికి నడిపించడంతో పాటు జాతిపరంగా వైవిధ్య నేపథ్యాలు ఉన్న 11 మంది ఆటగాళ్లు విజయానికి పోరాడేలా చేయడంలో బవుమా వ్యవహరించిన తీరు ప్రశంసార్హమైనది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌ను దాదాపు పూర్తిగా టెలివిజన్‌లో వీక్షించాను. అది టెస్ట్ క్రికెట్ కావడం ఒక కారణమైతే, దక్షిణాఫ్రికా జటిల చరిత్రలో నాకు ఎంతో కాలంగా ఆసక్తి ఉండడం మరొక కారణం. ఎయిడెన్ మార్‌క్రమ్, టెంబా బవుమాలు తమ పరుగుల వేటను జయప్రదంగా పూర్తి చేయడాన్ని చూసిన తరువాత ఎంతో సంతృప్తితో ఆనందంతో భోంచేసి నిద్రపోయాను. ఆ మరుసటి ఉదయం నా ఫోన్‌పై వార్తలు చూసినప్పుడు క్రితం రాత్రి నేను పొందిన ఆనందోత్సాహాల అనుభూతులు ఒక్కసారిగా రోతపుట్టే తీరులో అణగారిపోయాయి.. సౌందర్యపరంగా, రాజకీయంగా అవి ఉల్లంఘనకు గురయ్యాయి. ఈ నా చేదు అనుభవాన్ని మరికొంచెం వివరిస్తాను. డబ్ల్యూటీసీ ఫైనల్‌ను గౌరవించే పేరిట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక వీడియోను సామాజిక మాధ్యమాలలో పెట్టింది. అందులో ప్రధాన పాత్రలు వహించింది టెంబా, ఆయన సహచర ఆటగాళ్లు అనుకుంటున్నారా? కానేకాదు. మరి ఎవరో ఊహించగలరా? జై షా! అవును, ఐసీసీ అధ్యక్షుడు. 45 సెకన్ల ఆ వీడియోలో కన్పించే 23 షాట్‌లలో 11 పూర్తిగా షాను ఒక స్టార్‌గా చూపిస్తున్నవేనని ఒకరు లెక్క వేశారు. క్రికెట్ బ్యాట్‌ను ఎలా పట్టుకోవాలో లేదా 22 గజాల పిచ్‌పై ఎలా బౌలింగ్ చేయాలో జై మహాశయునికి తెలీదు. అయితే ఆయన ఐసీసీ అధ్యక్షుడు కదా. ప్రపంచ క్రికెట్‌ను సమర్థంగా నడిపిస్తున్నది బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి). మరి బీసీసీఐని (తద్వారా ఐసీసీని) అమోఘంగా నడిపిస్తున్నది భారతీయ జనతా పార్టీ. బీజేపీలో (ఆ కారణంగా భారత్‌లో) అత్యంత శక్తిమంతుడైన రెండవ వ్యక్తి జై షా తండ్రి.
బవుమా, మార్‌క్రమ్, రబాడ, మహరాజ్, తదితర దక్షిణాఫ్రికా జట్టు సభ్యుల విజయోత్సాహాన్ని ఒక భారతీయ రాజకీయవేత్త కుమారుడి వినయరాహిత్యం, మొరటుతనం, తనను తాను గొప్ప చేసుకునే స్వభావం భగ్నం చేసింది, భ్రష్టపరిచింది. జై షా తీరును అనేక మంది ఆక్షేపించారు. అయితే బీసీసీఐ పెత్తందారులు చాలా కాలంగా దక్షిణాఫ్రికా క్రికెటర్లను చులకనగా చూస్తున్న తీరుతెన్నులకు జై షా అభ్యంతరకర వ్యవహారం కేవలం పరాకాష్ఠ మాత్రమే అన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. దక్షిణాఫ్రికాలో ఇండియా 2012లో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఆడవలసి ఉంది. వెస్టిండీస్‌తో ఒక సిరీస్‌ను హడావుడిగా ముంబైలో ఏర్పాటు చేశారు. కారణమేమిటి? సచిన్ టెండూల్కర్ తన 200వ టెస్ట్ మ్యాచ్‌ను ముంబైలో ఆడే వీలు కల్పించేందుకే. 2025 సంవత్సరాంతంలో కూడా మన దేశంలో పర్యటించిన దక్షిణాఫ్రికా జట్టుకు రెండే రెండు టెస్ట్‌ల సిరీస్ ఇచ్చారు. ఇది దక్షిణాఫ్రికా క్రికెటర్లను తక్కువగా చూడడమే కాదూ? రెండే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆఫర్ చేసినా టెంబా, ఆయన సహచర ఆటగాళ్లు ‘మేము వచ్చాము, మేము ఆడాము, మేము గెలిచాము’ అన్న వీరోచిత రీతిలో విజయం సాధించారు. భారతీయ స్పిన్నర్స్‌కు తోడ్పడే విధంగా ఉండే కోల్‌కతా పిచ్‌పై దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మన జట్టు కంటే మెరుగ్గా బౌలింగ్, బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్ బవుమా తన శక్తియుక్తులు అన్నిటినీ వినియోగించి ఆడారు. గౌహతిలో ఆడిన రెండో టెస్ట్‌లో కూడా టెంబా, ఆయన సహచరులు దీటుగా ఆడారు. ముఖ్యంగా మార్కో యాన్సెన్ మన జట్టుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించారు.
అంతర్జాతీయ రగ్బీలో 1995 దక్షిణాఫ్రికా సంవత్సరమైతే అంతర్జాతీయ క్రికెట్‌లో 2025 దక్షిణాఫ్రికా సంవత్సరం, సందేహం లేదు. ఐదు రోజుల క్రికెట్ మ్యాచ్ చాలా కష్టమైన క్రీడ. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లు గెలవడమనేది టీ20, వన్‌డే, టెస్ట్ మ్యాచ్‌లలో గెలవడం కంటే గొప్ప క్రీడా విజయంగా పరిగణన పొందుతోంది. ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్న దక్షిణాఫ్రికా క్రీడాకారులు మన దేశానికి వచ్చారు. మిగతా ప్రపంచం మొత్తం మీద కంటే అధిక క్రికెటర్లు, అత్యధిక క్రికెట్ అభిమానులు ఉన్న మన దేశంలో టీమ్ ఇండియాతో పోటీపడటమనేది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకే చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చరిత్ర, పరిస్థితులను ధిక్కరిస్తూ రెండు టెస్టులలోను గొప్పగా ఆడి, మన జట్టును చిత్తుగా ఓడించారు.
ఈ అనూహ్య ఓటమి భారతీయ క్రికెట్ అభిమానులను ఎనలేని ఆందోళనకు గురి చేసింది. ‘తమ పోటీదారుల కంటే తమకే బాగా తెలిసిన పిచ్‌పై మన జట్టు అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయింది?’ అని అసంఖ్యాక అభిమానులు మథనపడ్డారు. స్వదేశంలోని పిచ్‌లపై అసాధారణ రికార్డులను సాధించిన సర్ఫరాజ్ ఖాన్‌ను ఎందుకు టీమ్ ఇండియాలో చేర్చలేదు అని ఎంతోమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఉద్వాసన చెప్పనున్నారా అని కూడా చాలామంది ఊహాగానం చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌ల పట్ల మితిమీరిన మక్కువ మూలంగా టెస్ట్ క్రికెట్‌లో మనం సమర్థంగా పోటీపడలేకపోతున్నామా? అని మెరుగైన అవగాహన ఉన్న అభిమానులు ప్రశ్నించారు. దక్షిణాఫ్రికా క్రికెటర్లకు బీసీసీఐ సరైన గుర్తింపు, సమున్నత గౌరవం ఇవ్వడంలో ఇప్పటికే క్షమార్హం కాని రీతిలో చాలా జాప్యం జరగలేదా? కోల్‌కతాలోనూ, గౌహతిలోనూ దక్షిణాఫ్రికా క్రికెటర్ల చేతుల్లో టీమ్ ఇండియా పరాజయం పాలయిన తీరుతెన్నుల దృష్ట్యా ఆ కఠిన ప్రశ్నను సైతం భారతీయ క్రికెట్ అభిమానులు అడిగి తీరాలి.
దక్షిణాఫ్రికా క్రికెటర్ల పట్ల గతంలో మన అహంకారపూరిత ప్రవర్తనకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తగు సమయం ఆసన్నమైన వెంటనే దక్షిణాఫ్రికాలో టీమ్ ఇండియా నాలుగు లేదా ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడడమే ఆ ప్రాయశ్చిత్తానికి మంచి పద్ధతి అని నేను భావిస్తున్నాను. ఇది మన క్రీడా పాటవానికి నిజమైన పరీక్ష అవుతుంది. మనం ఎంతగానో మెచ్చుకుంటున్న, ఆరాధిస్తున్న ఆటగాళ్ల సామర్థ్యాల నిగ్గు తేల్చేందుకూ అది మనకొక అవకాశమిస్తుంది.
దక్షిణాఫ్రికాలో జాతివివక్షా పాలన ముగిసి, ప్రప్రథమ ప్రజాస్వామిక ఎన్నికలు జరిగిన వెన్వెంటనే ఆ దేశ రగ్బీ ఆటగాళ్లు సాధించిన విజయాలు పుస్తకం రూపేణా, ఒక అద్భుత సినిమాగాను క్రికెట్ అభిమానుల మనసుల్లో కలకాలం జ్ఞాపకముండేలా నిలిచిపోయాయి. మూడు దశాబ్దాల అనంతరం ఇప్పుడు ఒక ‘ఇంద్రధనస్సు దేశం’ (రెయిన్‌బో కంట్రీ)గా దక్షిణాఫ్రికా పట్ల శ్రద్ధాసక్తులు, ఆనందోత్సాహాలు చెప్పుకోదగ్గ విధంగా లేవు. అందునా నెల్సన్ మండేలా కీర్తిశేషుడయి కూడా చాలా కాలమయింది. 2025లో దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఆడిన టెస్ట్ మ్యాచ్‌లపై టెంబా బవుమా ప్రధాన పాత్రగా ఒక ఫీచర్ ఫిల్మ్ రావడమనేది చాలా అసంభవం. అయితే యువతరానికి చెందిన దక్షిణాఫ్రికా రచయిత (లేదా యువ భారతీయ రచయిత) ఎవరైనా ఈ టెస్ట్ మ్యాచ్‌ల గురించి ఒక స్ఫూర్తిదాయక పుస్తకం రాయాలని ఆశిస్తున్నాను. ఒక కీలక విషయంలో 2025 క్రికెటర్లు 1995 నాటి రగ్బీ ఆటగాళ్ల కంటే మరింత ముఖ్యమైన విజయాన్ని సాధించారనే వాస్తవాన్ని ఆ సంభావ్య రచయిత తప్పక గుర్తిస్తాడని నేను భావిస్తున్నాను. 2025 దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్‌లో మూడు దశాబ్దాల నాటి రగ్బీ టీమ్‌లో కంటే జాతిపరమైన వైవిధ్యం మరింతగా ఉన్నదనేదే ఆ వాస్తవం. పైగా ఈ నిజమైన ‘ఇంద్ర ధనస్సు జట్టు’ను నల్లజాతీయుడు అయిన కెప్టెన్ ప్రతిభావంతంగా విజయ శిఖరాలకు నడిపించాడు.
టెస్ట్ క్రికెట్ నా తరం వారు అభిమానించిన క్రికెట్ ఫార్మాట్. ఇప్పుడు నేను వృద్ధాప్యంలోకి ప్రవేశించాను. జాతీయవాద సంకుచితత్వాలు లేని క్రికెట్ అభిమానిగా టెంబా బవుమా జట్టును అభినందిస్తున్నాను. ఈ అభినందనలో భాగంగా జాతి వివక్షా పాలనానంతర దక్షిణాఫ్రికా క్రికెటర్లలో 11 మంది సార్వకాలిక అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాను ప్రతిపాదిస్తున్నాను: 1. గ్రేమ్ స్మిత్ 2. హెర్షల్ గిబ్స్ 3. హషీమ్ ఆమ్లా (వైస్ కెప్టెన్) 4. జాక్వెస్ కలిస్ 5. టెంబా బవుమా (కెప్టెన్) 6. ఏబీ డివిల్లీర్స్ (వికెట్ కీపర్) 7. షాన్ పొలాక్ 8. డేల్ స్టెయిన్ 9. కేశవ్ మహరాజ్ 10. కగిసో రబాడ 11. అలెన్ ఆంథోనీ డొనాల్డ్. 12వ ఆటగాడు: జాంటీ రోడ్స్.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
భూములు అమ్ముకునేందుకు ప్లాన్ చేశారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News