పార్ట్ టైం సహాయ ఆచార్యులకు ఇది తీరని అన్యాయం
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:27 AM
తెలంగాణలో రాష్ట్రస్థాయి స్వయంప్రతిపత్తి గల 12 ప్రభుత్వ యూనివర్సిటీలు పనిచేస్తున్నాయి. పన్నెండేళ్లకు పైగా శాశ్వత ప్రాతిపదిక ఆచార్యుల ఉద్యోగ భర్తీ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ...

తెలంగాణలో రాష్ట్రస్థాయి స్వయంప్రతిపత్తి గల 12 ప్రభుత్వ యూనివర్సిటీలు పనిచేస్తున్నాయి. పన్నెండేళ్లకు పైగా శాశ్వత ప్రాతిపదిక ఆచార్యుల ఉద్యోగ భర్తీ నిరీక్షణకు ముగింపు పలుకుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నియామకమైన అత్యున్నత కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదిస్తూ జీవో నెంబర్ 21ను తీసుకొచ్చింది. ఫలితంగా రాష్ట్రంలోని 12 ప్రభుత్వ యూనివర్సిటీలకు మార్గదర్శకాలు వెలువడ్డాయి. అయితే ఈ మార్గదర్శకాల ద్వారా మహాభారతంలోని బర్బరీకుడి లాగా యూనివర్సిటీల పార్ట్ టైం సహాయ ఆచార్యులు బలి కానున్నారు. వీరు వేరువేరు ఉద్యోగాలు చేసుకునే ఇచ్ఛాపూర్వక పార్ట్ టైం ఆచార్యులు కాదు. యూనివర్సిటీలలోనే పూర్తి సమయం కేటాయిస్తూ, సమస్త పనులు నిర్వహిస్తూ కూడా యాజమాన్యం చేత ఉద్దేశపూర్వకంగా పార్ట్ టైం ఆచార్యులుగా పిలువబడుతున్న పీడితులు.
విషయాన్ని సంక్షిప్తంగా అర్థం చేసుకోవాలంటే... 12 యూనివర్సిటీలకు కలిపి మంజూరైన సహాయ ఆచార్యుల పోస్టులు 1524. అయితే కేవలం 463 మంది మాత్రమే నియమించబడగా, 1061 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ పోస్టులతో విద్యాబోధన, పరిశోధన యూనివర్సిటీలలో సమగ్రంగా జరగదు, కాబట్టి కాంట్రాక్టు పద్ధతిన సహాయ ఆచార్యులను తీసుకొచ్చారు. వీరికి వారానికి 16 గంటల బోధన చేయాలనే నిబంధన పెట్టి, ప్రతి నెలా జీతం ఇస్తున్నారు. నిజానికి శాశ్వత సహాయ ఆచార్యుని జీతంలో 30 నుంచి 40 శాతం కూడా వీరి జీతం ఉండదు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థలేని తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తానని కేసీఆర్ చెప్పారు. విద్యార్థి ఉద్యమ ఫలితంగా కావలసిన బోధన కోసం పూర్తి మొత్తంలో కాంట్రాక్టు పద్ధతిన తీసుకునే క్రమంలో 2014లో నూతనంగా ఏర్పాటైన కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఫలితంగా కాంట్రాక్టు వ్యవస్థ కంటే దారుణమైన ఈ పార్ట్ టైం ఆచార్య వ్యవస్థ ఇక్కడ నుంచి అధికమైంది. వీరికి ఒక గంటకు 700 రూపాయలు చెల్లిస్తారు. సెలవు రోజులు వచ్చినా, పరీక్షలు జరుగుతున్న జీతం చెల్లించరు. సంవత్సరానికి 6 నెలలు మాత్రమే ఉద్యోగం. శాశ్వత సహాయ ఆచార్యులతో సమానమైన విద్యార్హతలు ఉన్నా, వారు చేసే పనులన్నీ చేస్తున్నా యూనివర్సిటీ యాజమాన్యాల నుంచి అవమానాలు లెక్కలేనన్ని ఉన్నాయి. 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పార్ట్ టైం ఆచార్యులకు భద్రతతో కూడిన స్థిరమైన వేతనం చెల్లిస్తామని మాట ఇచ్చి, మ్యానిఫెస్టోలో కూడా పెట్టింది. అధికారంలోకి వచ్చారు, కనుక మాట తప్పరని కోటి ఆశలతో ఉన్న పార్ట్ టైం ఆచార్యుల గుండెల్లో పిడుగు లాంటి మార్గదర్శకాలను జీవో నెంబర్ 21 ద్వారా తీసుకొచ్చారు. వాటిని నిశితంగా పరిశీలిద్దాం.
1) బోధన అనుభవానికి గరిష్టంగా 10 మార్కులు పొందుపర్చారు. ప్రతి సంవత్సరానికి ఒక్క మార్కు చొప్పున కేటాయించారు. దీనికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్ శాశ్వత సహాయ ఆచార్యులతో పాటు యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా అర్హత ఇచ్చారు. చివరికి రాటిఫికేషన్ జరిగిన ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీ అధ్యాపకులకు కూడా అర్హత ఇచ్చారు. కానీ యూనివర్సిటీల పార్ట్ టైం సహాయ ఆచార్యులకు అవకాశం లేదు. యూనివర్సిటీ యాజమాన్యం రాటిఫికేషన్ చేయని కారణంగా పార్ట్ టైం సహాయ ఆచార్యులు అవకాశం కోల్పోతున్నారు.
2) ఒక అధ్యాపకుడికి ప్రథమ ఆయుధాలు కంఠస్వరం, ఆకర్షించబడే బోధన. వీటితోనే ఉత్తమ బోధన, అత్యుత్తమ ఫలితాలు అందించగలుగుతారు. కానీ ఇక్కడ అధ్యాపకుడి బోధన సామర్థ్యం గుర్తించే డెమోకు కేవలం 10 మార్కులు మాత్రమే కేటాయించారు. ఇది ఎంతవరకు సమర్థనీయం?
3) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) వచ్చిన వారికి పది మార్కులు కల్పించారు. అలాగే డాక్టరేట్ సాధించినా 10 మార్కులే అని ఉంది. ఇటీవల కాలంలో ఖాళీలు భర్తీ చేసిన కేంద్ర యూనివర్సిటీలలో కూడా పీహెచ్‌డీకి అత్యధికంగా 25 నుంచి 30 మార్కులు కేటాయించారు. 2018 యూజీసీ మార్గదర్శకాలల్లో కూడా పీహెచ్‌డీకి 30 మార్కులు ఇవ్వాలని ఉంది. కానీ ఈ మార్గదర్శకాలల్లో కేవలం పీహెచ్‌డీకి 10 మార్కులు కేటాయించడం సమంజసమేనా? పీహెచ్‌డీ చదువుతున్నప్పుడు JRF మాత్రమే కాకుండా RGNF ద్వారా, ICSSR ద్వారా, మెరిటోరియల్ ఫెలోషిప్ ద్వారా ఆర్థిక సహాయం పొందిన వారికి ఎటువంటి మార్కులు పొందుపరచలేదు. ఈ అన్యాయం ఎందుకు?
4) యూజీ, పీజీలలో పొందిన మార్కులకు 20 మార్కుల వెయిటేజ్‌ను ఇచ్చారు. 15 సంవత్సరాల వయసు తేడా ఉన్న పోటీదారుల మధ్య ఇది మరింత వ్యత్యాసం చూపనున్నది. దాదాపు 15–20 సంవత్సరాల క్రితం డిగ్రీ, పీజీ పాసవడమే గగనమయ్యేది. గూగుల్ ఫ్లాట్ ఫామ్ వేదిక మీద నిలబడిన నేటి విద్యార్థికి, నాటి విద్యార్థికి ఒకే తూకం వేసి చూడడం అవమానకరం. ఇకపోతే జాతీయ, అంతర్జాతీయ నిధులు సమకూర్చిన ఏజెన్సీలు, సంస్థలలో పీహెచ్‌డీ అనంతరం పనిచేసిన వారికి 5 మార్కులు కేటాయించిన ఉద్దేశం అసలు అంతుపట్టడం లేదు.
అరకొర జీతంతో, పస్తులు ఉంటూ యూనివర్సిటీ బోధన బాధ్యతలను భుజానికి ఎత్తుకొని నడిచిన పార్ట్ టైం సహాయ ఆచార్యులను బజారున పడేసే విధంగా ఈ మార్గదర్శకాలు ఉన్నాయి. దాదాపు పదిహేనేళ్ల నుంచి పార్ట్ టైం అధ్యాపకులుగా భవిష్యత్తు మీద వీరు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. అట్టడుగున ఉండి నలిగిన వారికి భరోసా ఇవ్వకపోతే అది ప్రజాపాలన అనిపించుకోదు. వెట్టిచాకిరి చేసి సర్వం కోల్పోయిన వారిని ముందుకు నడిపించడమే సుభిక్ష పాలనవుతుంది. ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు మార్చాలని, పార్ట్ టైం సహాయ ఆచార్యులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
డాక్టర్ దుబ్బ రంజిత్
ఉస్మానియా యూనివర్సిటీ
ఈ వార్తలు కూడా చదవండి...
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు
Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..
Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
Read Latest Telangana News And Telugu News