Share News

Chandrababus Real Challenge: టెక్నాలజీ కాదు ఓటర్ల వెనక పడాలి

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:59 AM

2004కు ముందు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు టెక్నాలజీ, ఐటీ అంటూ దేశాలు పట్టుకు తిరుగుతూ, తమను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని గ్రామీణ ఓటర్లు బలంగా భావించారు. గ్రామీణ ఓటర్లు– అంటే రైతులు, రైతు కూలీలు...

Chandrababus Real Challenge: టెక్నాలజీ కాదు ఓటర్ల వెనక పడాలి

2004కు ముందు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు టెక్నాలజీ, ఐటీ అంటూ దేశాలు పట్టుకు తిరుగుతూ, తమను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని గ్రామీణ ఓటర్లు బలంగా భావించారు. గ్రామీణ ఓటర్లు– అంటే రైతులు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారు, నిరుపేద మహిళలు. వీరిలో అత్యధికులు డ్వాక్రా సంఘాల సభ్యులు. గ్రామీణ దళితులు. సమాజంలో వీరే అరవై శాతం వరకూ ఉంటారని గణాంక వివరాలు చెబుతాయి. నిజానికి వీరే ఓటర్లు. కడుపునిండిన వర్గాలకు (కులాలకు అతీతంగా) చెందినవారు పోలింగ్ కేంద్రాల మొహాలు పెద్దగా చూడరు. ఈ గ్రామీణ పేదలలో అత్యధికులు 2004 ఎన్నికలలో టీడీపీకి ప్రత్యామ్నాయంగా కనపడుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి వైపు తిరిగారు. ఆ ఎన్నికలకు ముందు అలిపిరిలో జరిగిన బాంబు దాడిలో బయటపడిన చంద్రబాబుపై పెల్లుబికిన సానుభూతి కూడా చంద్రబాబును ఎన్నికల వైతరణిని దాటించలేదు. ‘‘సానుభూతి దారి సానుభూతిదే. ఓటు దారి ఓటుదే’’ అని ఓటర్లు ఆ ఎన్నికల్లో తేల్చి చెప్పారు. ఇది చంద్రబాబు ‘టెక్నాలజీ పాలనపై’ ఉమ్మడి రాష్ట్ర ఓటర్లు ఇచ్చిన తీర్పు ఇది. ఫలితంగా టీడీపీకి మొత్తం 294 స్థానాలకు గాను, 47 సీట్లు మాత్రమే వచ్చాయి. అదే 1999లో 180 అసెంబ్లీ స్థానాలు లభించాయి. 2014 వచ్చే సరికి రాష్ట్రం విడిపోయింది. రాజధాని హైదరాబాద్‌ను తెలంగాణకు ఇచ్చేసి, ఆంధ్ర వారిని కొత్తగా కట్టుకోమన్నారు. దాంతో ఆంధ్రుల ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఆ ఎన్నికల్లో తెలుగువారు రెండు తీర్పులు ఇచ్చారు. 1. రాష్ట్రాన్ని అన్యాయంగా, అరాచకంగా, అడ్డగోలుగా విభజించి పారేసిన కాంగ్రెస్ పార్టీని నిలువునా గోతిలో పాతి పెట్టారు. 175 నియోజకవర్గాలలో ఏ ఒక్క స్థానంలోనూ కనీసం డిపాజిట్ కూడా రాలేదు. 2. విభజితమై, అనాథగా కనపడుతున్న 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ను పునరుజ్జీవింపచేయడానికి చంద్రబాబు నాయుడే తగిన పరిపాలనానుభవం కలిగిన నేత అనే బలమైన భావనతోను 2014లో ఓటర్లు టీడీపీకి ఓటు వేశారు.


ఆయన ముఖ్యమంత్రి కావడం అది మూడోసారి. అయితే, 1999–2004 మధ్య ఆయన ఏమి చేశారో... 2014–2019 మధ్య కూడా ఆయన అదే చేశారనేది పలువురి విశ్లేషకుల భావన. రోజుకు 18 గంటలు పని చేశారనేది వాస్తవం. పనిచేయడం అనేది ఆయనకు ఓ వ్యసనం. ప్రజా జీవితంలో పనిచేయకుండా ఆయనను నిలువరించడం... ఆ బ్రహ్మ తరం కూడా కాదు. అయినప్పటికీ, ఆయన నేల విడిచి సాము గరిడీలు చేశారనే భావం జనంలో బలంగా నాటుకుపోయింది. 2019 ఎన్నికల్లో ఆయన ఓటమికి ‘సింగపూర్’ కూడా ఓ ముఖ్య కారణం. ‘‘అమరావతిని సింగపూర్ చేస్తా’’ అంటూ చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందూ చెప్పారు. గెలిచాకా చెప్పడం నిర్విరామంగా కొనసాగించారు. ‘సింగపూర్ ఎలా ఉంటుందో చూసి రండి’ అంటూ కొంతమంది రాజధాని రైతులను సింగపూర్‌కు కూడా పంపించారు. నిజానికి సింగపూర్‌కు, మన రాష్ట్రానికి లేదా మనకు అస్సలు పోలికే లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అక్కడ చట్టాన్ని ఎవరూ అతిక్రమించరు. రాజకీయ, అధికార అవినీతిని అక్కడి పౌర సమాజం క్షమించదు. చట్టాలను ఏ మాత్రం ఉల్లంఘించినా జైలే. చివరకు మంత్రులు అయినా సరే. ఉదాహరణకు– సుబ్రహ్మణియన్ ఈశ్వరన్ అనే క్యాబినెట్ మంత్రి పరిమితులకు మించి కొన్ని ఫేవర్స్ పొందారని జైల్లో పడేశారు. అదికూడా ఫుట్‌బాల్ మ్యాచ్‌కి టిక్కెట్లు, హోటల్స్‌లో రూములు వంటి ఫేవర్స్ అక్రమంగా పొందారనే అభియోగంపై ఏడాది ఖైదు విధించారు. మరి, మన దగ్గర!? అలాగే, అధికార యంత్రాంగం. అక్కడ లంచగొండితనం అనే ప్రశ్నే లేదు. మరి ఇక్కడ!? మన సమాజం అవినీతికి ఆలవాలం. రాజకీయం అనేది ఒక లాభసాటి వ్యాపారం. అటువంటి సమాజాన్ని సింగపూర్‌గా మార్చుతాం అంటే... మన సమాజానికి డయాలసిస్ చేయాలి. ఆ పని చేయకుండా డెవలప్‌మెంట్... డెవలప్‌మెంట్.... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సంపద సృష్టి అంటూ ప్రజలిచ్చిన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు వృథా చేస్తున్నారేమో అని తెలుగుదేశం శ్రేయోభిలాషులు పలువురు ఆందోళన చెండుతున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు (కూటమి)ని ప్రజలు గెలిపించింది ఇందుకు కాదు. వారి ఎజెండా చాలా సింపుల్. 1. బకాసురుల బారి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయండి. 2. మా బతుకులు మమ్మల్ని సగౌరవంగా, స్వేచ్ఛగా బతకనీయండి. 3. మళ్ళీ అటువంటి పీడకల పునరావృతం కాకుండా, మమ్మల్ని నరక యాతనలకు గురి చేసిన మొత్తం కాలకేయులందరినీ జైళ్లకు పరిమితం చేసి, నిరంకుశ పాలనలోకి అడుగు పెట్టకుండా కాపాడండి. నిజానికి, చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌ ఈ మేరకు ఎన్నికలకు ముందు తమ పర్యటనలలో ఇవే అంశాలపై పదే పదే హామీలు ఇచ్చారు. అవి విని పులకించిపోయిన ప్రజలు చంద్రబాబుకి సంపూర్ణాధికారం అప్పగించి అప్పుడే ఓ ఏడాది గడిచిపోయింది.


చివరి ఏడాది ఎన్నికల వాతావరణంలో రాష్ట్రం మునిగిపోయి ఉంటుంది అనుకుంటే... చంద్రబాబు బృందానికి ఇక మిగిలింది నికరంగా మూడేళ్ల వ్యవధి మాత్రమే. ఇప్పుడు ఆయన చెబుతున్న క్వాంటం వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బనకచర్ల ప్రాజెక్ట్, అమరావతికి అదనపు భూ సమీకరణ, సింగపూర్ అనుకరణ మొదలైనవి ఏవీ కూడా వచ్చే మూడేళ్ళల్లో ఫలితాలు ఇచ్చేవి కావు. ప్రజా బాహుళ్యపు వినియోగంలోకి వచ్చేవి కావు. ఇవి ఓట్లు రాల్చవు. ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, చంద్రబాబు పాలనలో ప్రజలు డెమోక్రసీ ఫలాలను ఆస్వాదిస్తున్నారు. కానీ, ఆయన ఇప్పుడు అధికారంలోకి రాక ముందు, రాష్ట్రంలో నడిచింది డెమోక్రసీ కాదు, క్లెప్టోక్రసీ. అంటే సామాజిక ద్రోహాలకు పాల్పడే కొంతమంది దొంగలు, హంతకులు లాంటి వ్యక్తులు మాయ మాటలతో అధికారం చేజిక్కించుకుని, వనరులన్నింటినీ నిలువునా దోచేసే వ్యవస్థ. మళ్ళీ అటువంటి వ్యవస్థను రుచి చూడాలని ప్రజలు కోరుకోవడం లేదు. ఆ ప్రజాభీష్టాన్ని చంద్రబాబు మనసా.. వాచా.. కర్మణా.. నెరవేర్చి, తెలుగు ప్రజలకు క్లెప్టోక్రసీ నుంచి విముక్తి కలిగించిన మహానేతగా చరిత్రలో నిలిచిపోతారా లేదా అనే ప్రశ్న రాష్ట్ర శ్రేయోభిలాషుల మనసులను తొలిచి వేస్తున్నది. చంద్రబాబు బృందం పడవలసింది సింగపూర్ వెనుక కాదు. ఎందుకంటే ఆ మోడల్ మనకు నప్పదు. ఆయన బృందం పడవలసింది... తనకు 164 సీట్లు బంగారం పళ్లెంలో పెట్టి అధికారం అప్పగించిన ఓటర్ల వెనకాల. తెలుగుదేశం పార్టీకి వాళ్ళే ‘బ్రెడ్ విన్నర్స్’.

భోగాది వేంకటరాయుడు

ఇవీ చదవండి:

ఫ్లాట్ కొనడమంటే అతిపెద్ద ఆర్థిక తప్పిదం.. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధిపతి వార్నింగ్

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

Read Latest and Business News

Updated Date - Aug 08 , 2025 | 01:00 AM