Share News

బీసీల సమగ్రాభివృద్ధే తెలుగుదేశం లక్ష్యం

ABN , Publish Date - May 21 , 2025 | 05:40 AM

బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న నేతలనే ఇన్నాళ్లూ చూశాం. బీసీల అభ్యున్నతి గురించి చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న నేత ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాత్రమే. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వృద్ధిలోకి తెచ్చేలా తెలుగుదేశం పార్టీ బాటలు...

బీసీల సమగ్రాభివృద్ధే తెలుగుదేశం లక్ష్యం

బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న నేతలనే ఇన్నాళ్లూ చూశాం. బీసీల అభ్యున్నతి గురించి చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న నేత ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాత్రమే. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వృద్ధిలోకి తెచ్చేలా తెలుగుదేశం పార్టీ బాటలు వేస్తోంది. ఆది నుంచి కూడా ఈ పార్టీ బీసీల కోసమే పనిచేస్తోంది. బీసీల హక్కులను కాపాడింది. బీసీ విద్యార్థుల చదువుల కోసం పాటుపడింది. వారికి ఉపాధి అవకాశాల కోసం, విదేశాల్లో చదివేందుకు కృషి చేసింది. స్పీకర్‌గా, కేంద్ర మంత్రులుగా, జాతీయ స్థాయిలో బీసీలకు గుర్తింపు తెచ్చింది. మూడుసార్లు పార్టీ పగ్గాలు బీసీలకే అప్పగించిన ఘనత టీడీపీది. బీసీల అభ్యున్నతికి పాటుపడిన జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి మరిన్ని బాటలు వేస్తున్నది. ఆర్థిక బడ్జెట్లో ఇప్పటివరకు రూ.లక్షల కోట్లు నిధులు కేటాయించి బీసీలను మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు పార్టీ కృషి చేస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు టీడీపీకి బలమైన మద్దతుదారులుగా నిలబడ్డారు.

బీసీలకు రాజ్యాధికారం దిశగా సీఎం చంద్రబాబు నాయుడు అద్భుతమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. కేవలం బీసీలకే కాదు, వెనకబడిన వర్గాల ఉన్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. గత పాలకులు వసతిగృహాల నిర్వహణను గాలికొదిలేశారు. ఆయా భవనాలకు కనీస మరమ్మతులు కూడా నిర్వహించలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ వసతి గృహాలను, గురుకుల పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేసే ప్రణాళికలు అమలుపరుస్తోంది. వసతిగృహాలకు టాయిలెట్లు, సురక్షిత తాగునీటికి ఆర్వో ప్లాంట్, టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఇన్వర్టర్ వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. విద్యార్థుల ఉన్నతి కోసం డిజిటల్ క్లాసెస్, స్పోకెన్ ఇంగ్లీష్, యోగ, వ్యాయామ విద్య వంటి వాటిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సంబంధిత జిల్లా కలెక్టర్లు వసతి గృహాలను తప్పనిసరిగా నెలకోసారి పరిశీలించి సమీక్షించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 108 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రస్తుతం 28 రెసిడెన్షియల్స్‌కే సొంత భవనాలున్నాయి. మిగిలిన వాటికి కూడా సొంత భవనాలు నిర్మించేందుకు రూ.1200 కోట్లతో ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసింది.


బీసీల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేలా గతంలో ఉమ్మడి జిల్లాల్లో స్థలాలు కేటాయించి జిల్లాకు ఒకటి చొప్పున తెలుగుదేశం పార్టీ 13 బీసీ భవన్‌ల నిర్మాణాన్ని చేపట్టింది. కానీ అనంతర కాలంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ నిర్మాణాలను పక్కనపెట్టి బీసీలను అవమానించింది. రూ.75,760 కోట్ల బీసీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించి వారిని వంచించింది. మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల మేలు కోసం ప్రస్తుతం 26 జిల్లాల్లో 26 బీసీ భవనాలు ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించింది. ఇప్పటికే చిత్తూరు, శ్రీకాకుళంలో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల కూడా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బీసీ యువతకు స్వయం ఉపాధిని కల్పించేలా చంద్రన్న స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్, MSMEల ద్వారా పలు రుణాలను, రాయితీలను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న బీసీ అభ్యర్థులకు స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందిస్తోంది.

కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించడంలో టీడీపీ ప్రభుత్వం అధిక శ్రద్ధ చూపుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కులవృత్తులు చేసుకుంటున్న వారికి ‘ఆదరణ 3.0’ ద్వారా అధునాతన పనిముట్లను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బీసీలకు రాజ్యాధికారం లభించింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీల నుంచి వేలాదిమంది నాయకులుగా ఎదిగారు. చట్టసభల్లో వారికి గౌరవప్రదమైన స్థానాలు కేటాయించి గౌరవించింది. రూ.1.50 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్‌ను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బీసీల సామాజిక, ఆర్థిక, మౌలిక సంక్షేమం కోసమే ఏటా రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనుంది.


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,110 బీసీ వసతిగృహాల్లో 660 మాత్రమే ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నారు. మిగిలిన వాటికి కూడా సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. బ్యాంక్ లింకేజీల ద్వారా రుణాలు అందజేసి బలహీనవర్గాలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను బలోపేతం చేసి బీసీలకు శిక్షణా కార్యక్రమాలు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాజకీయంగా కూడా బీసీలను తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తోంది. శాసనసభ్యుల కోటా నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చిన మూడు ఎమ్మెల్సీలను బలహీనవర్గాల వారికే కేటాయించింది. బీద రవిచంద్రయాదవ్, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ వంటి వారిని చట్టసభలకు పంపింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా బీసీలకే ప్రాధాన్యం ఇస్తూ... ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్‌గా పి.కృష్ణయ్య, శాసనమండలి చీఫ్‌విప్‌గా పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణతోపాటు కేంద్ర, రాష్ట్ర కేబినెట్ భర్తీలో కూడా బీసీలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బ్యాంక్ లింకేజీతో సంబంధం లేకుండా NBC FDC (వెనుకబడిన వర్గాల జాతీయ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) పథకం ద్వారా 50 శాతం సబ్సిడీతో రుణాలు అందించడం, మినీ డెయిరీ యూనిట్లు, జనరిక్ మెడికల్ షాపులు, టైలరింగ్‌పై శిక్షణా తరగతులు నిర్వహించి కుట్టుమిషన్ల పంపిణీ, MSME ద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించే ఎన్నో కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోంది.

అనగాని సత్యప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి

ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 05:41 AM