Share News

T N Seshan The Fearless Reformer: ఒకే ఒక్కడు

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:02 AM

దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ఠక్కున గుర్తుకొచ్చే పేరు టీఎన్‌ శేషన్‌. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నది ఆరేళ్ళయినా, దశాబ్దాలపాటు చెరగని ముద్రవేశారాయన. అహంకారి, నియంత, జగమొండి అని...

T N Seshan The Fearless Reformer: ఒకే ఒక్కడు

దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ఠక్కున గుర్తుకొచ్చే పేరు టీఎన్‌ శేషన్‌. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నది ఆరేళ్ళయినా, దశాబ్దాలపాటు చెరగని ముద్రవేశారాయన. అహంకారి, నియంత, జగమొండి అని ఎన్ని విమర్శలు వచ్చినా, నాయకులు అభిశంసన హెచ్చరికలు చేసినా, ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళించేవరకూ ఈయన విశ్రమించలేదు. కేరళలో పుట్టిన తిరునెల్లయ్‌ నారాయణ అయ్యర్‌ శేషన్‌ చంద్రశేఖర్‌ ప్రభుత్వం హయాంలో ఎన్నికల సంఘం ప్రధానాధికారి అయ్యారు. వచ్చీ రావడంతోనే కార్యాలయంలో దేవుళ్ల, నాయకుల ఫోటోలు ఉండనివ్వకుండా, రాజ్యాంగ విహితంగా పనిచేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే మన విధి అని స్పష్టం చేశారు. అప్పటికి ఉత్తరాది రాష్ట్రాల్లో చేతిలో తుపాకీ ఉన్నవాడిదే అధికారం. డబ్బు, మద్యం, విచ్చలవిడి హింస, కిడ్నాప్‌లతో ఎన్నికల్లో నెగ్గుకువచ్చే భయానకమైన పరిస్థితులను మార్చి, ఓటరు ధైర్యంగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్ళే వాతావరణాన్ని ఆయన కల్పించాడు. ప్రవర్తనానియమావళి అంటే పట్టని పార్టీలూ, అభ్యర్థులూ దానిని తూచ తప్పకుండా అనుసరించేట్టు చేశాడు. మారుమూల ప్రాంతాల్లో అభ్యర్థులు సైతం శేషన్‌ ఏ క్షణాన వస్తాడోనన్న భయంతో వొణికి పోయేవారు. ఏ చిన్న తప్పుజరిగినా ఎన్నిక రద్దవుతుందన్న ఆందోళనలో పార్టీలు ఉండేవి. తాను కోరిన అధికారిని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కేటాయించనందుకు ఎన్నికలు జరిపేది లేదని హెచ్చరించి దారికి తెచ్చుకున్న ఘనుడు శేషన్‌. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ తన కుమారుడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు ఆ నియోజకవర్గం ఎన్నికను నిలిపివేశారు శేషన్‌. యూపీలో ప్రచార సమయం ముగిసినా కూడా ప్రసంగిస్తున్నందుకు ఒక మంత్రిని వేదికమీద నుంచి అమాంతం దించేసిన సాహసి. కొన్ని గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కావాల్సిన పంజాబ్‌లో ఏకంగా ఎన్నికలే రద్దుచేశారాయన. మద్యం, డబ్బు, కుల, మత ప్రచారాలకు ఆయన సమర్థవంతంగా అడ్డుకట్టవేశారు. రామన్‌ మెగసెసే పురస్కారం అందుకున్న ఈ చండశాసనుడు 2019 నవంబరు 10న కన్నుమూశారు.

టి.సేవకుమార్‌

ఇవి కూడా చదవండి...

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 09 , 2025 | 01:02 AM