BC Reservations: రిజర్వేషన్ల సాధనకు పోరాటమే ఆయుధం
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:15 AM
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో మొత్తం 40 శాతం మంది బీసీలు సర్పంచులుగా గెలిచారు. జనరల్ కేటగిరీలో దాదాపు 51శాతం మంది బీసీలు సర్పంచులుగా గెలిచారు. 2019లో...
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో మొత్తం 40 శాతం మంది బీసీలు సర్పంచులుగా గెలిచారు. జనరల్ కేటగిరీలో దాదాపు 51శాతం మంది బీసీలు సర్పంచులుగా గెలిచారు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనరల్ కేటగిరిలో 40శాతం మంది బీసీలు గెలిచారు. 2025 పంచాయతీ ఎన్నికలలో 10శాతం ఎక్కువగా బీసీ అభ్యర్థులు గెలిచారు. ఇది రాష్ట్రంలో బీసీలలో పెరుగుతున్న రాజకీయ చైతన్యానికి నిదర్శనం.
స్వతంత్ర భారతదేశంలో బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కానీ ఈ మాత్రమైనా లభించాయంటే అది సుదీర్ఘ ఉద్యమాల ఫలితమే. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు 1992లో ప్రారంభమయ్యాయి. నాడు పీవీ నరసింహారావు ప్రభుత్వం ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా 243 ఆర్టికల్ చేరుస్తూ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఇచ్చింది. దీంతో తొలిసారి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మొదలయ్యాయి. 2005లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ కేంద్ర విద్యా సంస్థల్లో బీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించారు.
అయితే అనంతరామన్ కమిషన్ నివేదిక ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 25శాతం రిజర్వేషన్లు 1972లో అమలు చేశారు. 1986లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మురళీధర్‌రావు కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు 44శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేశారు. అగ్రవర్ణాలు హైకోర్టుకు వెళ్లి ఆ రిజర్వేషన్లను కొట్టివేయించారు. 2007లో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బీసీ–ఈ కేటగిరీ కింద ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు 4శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. దీనిని కూడా హైకోర్టు కొట్టివేసింది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ రిజర్వేషన్లు అమలయ్యేట్టు స్టేను తీసుకొచ్చింది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు మొత్తం 29శాతం విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఈ రిజర్వేషన్లే కొనసాగుతున్నాయి. బీసీల జనాభా పెరుగుతున్నా, వారికి రావలసిన న్యాయమైన రిజర్వేషన్లు నేటికీ అందడం లేదు.
త్వరలో జరగనున్న దేశ జనాభా లెక్కలలో బీసీల కులగణన చేస్తామని తప్పని పరిస్థితుల్లో కేంద్రం ప్రకటించింది. దీంతో స్వతంత్ర భారతదేశంలో మొట్ట మొదటిసారిగా అధికారికంగా బీసీల కులగణన జరగబోతుంది. ఇది ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, బీసీ సంఘాల విజయం. ఈ లెక్కల తర్వాత దేశంలోని బీసీ కులాల సామాజిక, ఆర్థిక, విద్యా విషయాలలో స్పష్టత రాబోతుంది. ఇది బీసీ ఉద్యమాలకు ఒక స్పష్టమైన పోరాట రూపాన్ని చూపుతుంది. ఇక, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ దగ్గరికి తీసుకువెళ్లాలి. రాహుల్‌గాంధీ ద్వారా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ చట్టాన్ని తీసుకువచ్చేలా, న్యాయ రక్షణ కోసం 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి.
చట్టసభలలో బీసీలకు ప్రాతినిధ్యం సాధించడమే బీసీ సంఘాల అంతిమ లక్ష్యం. ఇది నిరంతర రాజకీయ చైతన్యంతో మాత్రమే సాధ్యమవుతుంది. దేశంలోని బీసీ రిజర్వేషన్ల సాధన గత చరిత్ర కూడా ఇదే చెబుతోంది. ఈ దిశగా ఉద్యమాలను రూపొందించాల్సిన బాధ్యత బీసీ విద్యార్థి, కుల సంఘాలు, మేధావులపై ఉంది. బీసీ ఉద్యమాలకు మద్దతుగా మిగతా సామాజిక వర్గాలలోని ప్రజాస్వామికవాదులను అందరినీ కలుపుకొని ముందుకు పోవాలి. బలమైన ఉద్యమాన్ని నిర్మించి పార్లమెంటును, సుప్రీంకోర్టును సామాజిక న్యాయం వైపు అడుగులు వేసేలా చేయాలి
మాసంపల్లి అరుణ్‌కుమార్
ఇవి కూడా చదవండి..
బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. బ్రిటన్‌లో వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ Qల మధ్యలో O ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..