Share News

Minority Rights In India: హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం

ABN , Publish Date - Dec 18 , 2025 | 06:00 AM

దేశంలో ముస్లిం జనాభా సుమారు 19.7 కోట్లు. మొత్తం జనాభాలో 14.2 శాతం. ఈ విస్తృత జనాభాలో పెద్ద భాగం ఇప్పటికీ ఆర్థికంగా వెనుకబడి జీవిస్తోంది. దీనికి ప్రధాన కారణం విద్యా లోపం. ఇందుకు...

Minority Rights In India: హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం

దేశంలో ముస్లిం జనాభా సుమారు 19.7 కోట్లు. మొత్తం జనాభాలో 14.2 శాతం. ఈ విస్తృత జనాభాలో పెద్ద భాగం ఇప్పటికీ ఆర్థికంగా వెనుకబడి జీవిస్తోంది. దీనికి ప్రధాన కారణం విద్యా లోపం. ఇందుకు ముస్లింల అవగాహనా రాహిత్యంతో పాటు, పాలకుల నిర్లక్ష్యం కూడా ఉంది. 2011 జనగణన గణాంకాల ప్రకారం దేశంలోని ముస్లింల అక్షరాస్యత రేటు 57.28 శాతం. ఇతర మత సమూహాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువే. విద్యా సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ఖర్చు చేశాక కూడా ముస్లింల విద్యా స్థితిలో గణనీయమైన మార్పు రాలేదు. ఇంకో విషయం ఏమిటంటే, 2011 తర్వాత మతాల వారీగా అక్షరాస్యతపై తాజా అధికారిక గణాంకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు.

కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ఏఐఎస్‌హెచ్‌ఈ (ఆలిండియా సర్వే ఆన్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌) గణాంకాల ప్రకారం, దేశంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల్లో ముస్లింల వాటా ఐదు శాతం లోపే ఉంది. అంటే జనాభాలో 14 శాతానికి పైబడి ఉన్న సమాజం.. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో మూడో వంతు కూడా ప్రాతినిధ్యం పొందలేకపోతోంది. ఈ వాస్తవం ఉద్యోగ రంగాల్లో వారి వెనుకబాటుకు ప్రత్యక్ష కారణమవుతోంది. ఆర్థిక వెనుకబాటు, విద్యా లోపం... ముస్లిం సమాజాన్ని రెంటికీ చెడ్డ రేవడిలా మార్చాయి. ప్రభుత్వ పాఠశాలలు బాధ్యతాయుతంగా పనిచేయకపోవడం, ప్రైవేట్ లేదా కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ముస్లిం పిల్లలు మధ్యలోనే చదువును వదిలేస్తున్నారు. ఐదు నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయసున్న ముస్లిం పిల్లల్లో ఎక్కువ మంది పాఠశాలల వెలుపలే ఉన్నారని ప్రభుత్వ సర్వేలు చెబుతున్నాయి. ఏదో ఒక విధంగా ఉన్నత చదువులు పూర్తిచేసినా ఉద్యోగాలు అంత సులభంగా దొరకడం లేదు. ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా వారిపై వివక్ష కొనసాగుతోంది. కొన్ని రంగాల్లో ముస్లింలకు ఉద్యోగాలు ఇవ్వకూడదన్న ధోరణి అనధికారికంగా కొనసాగుతోంది.


2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 సభ్యుల్లో కేవలం 24 మంది మాత్రమే ముస్లిం ఎంపీలు ఉన్నారు. అంటే వీరి ప్రాతినిధ్యం సుమారు 4.4 శాతం మాత్రమే. వారి జనాభా వాటాతో పోలిస్తే ఇది చాలా తక్కువ. రాష్ట్ర శాసనసభల్లో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అనేక రాష్ట్రాల్లో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. దేశంలోని అతిపెద్ద మైనారిటీ సమాజం అన్ని రంగాల్లో హక్కుల నిరాకరణకు గురవుతుంటే స్వాతంత్ర్యానికి, అభివృద్ధి–వికాసాలకు అర్థం ఏముంటుంది? భారత్ లాంటి లౌకిక, ప్రజాస్వామ్య దేశానికి ఇది ఎంతమాత్రం శోభించదు. మైనారిటీల హక్కుల ఉల్లంఘన, వివక్ష, పక్షపాత విధానాలను ఇలాగే కొనసాగిస్తే, అనేక త్యాగాలతో సాధించుకున్న స్వతంత్ర భారత భవిష్యత్తు కచ్చితంగా మసకబారుతుంది.

ఇప్పటికైనా పాలకవర్గాలు కళ్లు తెరిచి ముస్లిం మైనారిటీల సంక్షేమానికి, రాజ్యాంగబద్ధమైన హక్కులను వారికి అందించడానికి నిజాయితీగా ప్రయత్నించాలి. సచార్ కమిటీ నివేదికను సమగ్రంగా అమలు చేయాలి. అదే సమయంలో ముస్లింలు కూడా ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడకుండా, తమ హక్కుల సాధనకు సామాజిక చైతన్యంతో, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలి. ప్రజాప్రాతినిధ్య చట్టాల్లో తమ హక్కుల వాటా కోసం కార్యాచరణ రూపొందించుకోవాలి.

యం.డి. ఉస్మాన్ ఖాన్

(నేడు జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం)

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

Updated Date - Dec 18 , 2025 | 06:00 AM