Share News

Ramachandra Guha: సామాజిక న్యాయంతో సుస్థిరాభివృద్ధి

ABN , Publish Date - Feb 22 , 2025 | 05:26 AM

మధ్య తరగతి ప్రజల నుంచి రావడం యాదృచ్ఛికమేమీ కాదు. అధికమవుతున్న, ఉద్యోగ, ఉపాధి రాహిత్యంతో కునారిల్లుతున్న పేదలు అధికస్థాయిలో ఆకాంక్షిస్తున్నారు’

Ramachandra Guha: సామాజిక న్యాయంతో సుస్థిరాభివృద్ధి

ర్యావరణ విధానాలకు ముఖ్య మద్దతు ధనిక దేశాలు, సుఖజీవనులు అయిన సంపన్నులు, మధ్య తరగతి ప్రజల నుంచి రావడం యాదృచ్ఛికమేమీ కాదు. అధికమవుతున్న, ఉద్యోగ, ఉపాధి రాహిత్యంతో కునారిల్లుతున్న పేదలు అధికస్థాయిలో ఆకాంక్షిస్తున్నారు’ అని ప్రముఖ మార్క్సిస్టు చరిత్రకారుడు ఎరిక్‌ హాబ్స్‌ బామ్‌ తన ‘The Age of Extremes’ (1994)లో రాశారు. పేదలు ఎక్కువగా ఆరాటపడుతున్నది ఏమిటి? మరిన్ని వినియోగ సరుకులు, విలాస వస్తువులు, మరింత ఆర్థికాభివృద్ధిని కోరుతున్నట్టు ఆ చరిత్రకారుడు భావించాడు. పేదలు ఆశిస్తున్నవి సిద్ధించడానికి పర్యావరణ రాజకీయాలు అవరోధంగా, ప్రతిబంధకంగా ఉన్నాయని హాబ్స్ బామ్‌ ముక్తాయించాడు.

నేను ఈ మాటలను మొదటిసారి చదివిననాటికే, రెండు దశాబ్దాలుగా పేద ప్రజల పర్యావరణ ఉద్యమాలను అధ్యయనం చేస్తున్నాను. చిప్కోగా సుప్రసిద్ధమైన హిమాలయ ప్రాంతాల రైతుల నిరసనోద్యమంపై నా డాక్టోరల్‌ థీసిస్‌ను రాశాను. సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిస్తూ ధ్వంసమైన అడవుల పునరుద్ధరణకు జరిగిన పర్యావరణ పరిరక్షణ మహోద్యమమది. 1973లో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా అటువంటి ఉద్యమాలు వెల్లువెత్తడానికి స్ఫూర్తిగా నిలిచింది. అడవులు, జలవనరులు, పచ్చిక భూములపై ప్రజల ఉమ్మడి హక్కుల సంరక్షణకు సాగిన ఉద్యమాలవి.

చిప్కో ఉద్యమం ప్రభావంతో భారత్‌ ఒక ప్రత్యామ్నాయ, మరింత పర్యావరణ హితకరమైన అభివృద్ధి నమూనాను అనుసరించాల్సిన అవసరమున్నదా అనే విషయమై తీవ్ర చర్చ జరిగింది. వైజ్ఞానికులు, సామాజిక శాస్త్రవేత్తలు, పాత్రికేయులు, ప్రజా ఉద్యమాల క్రియాశీలురు అందరూ ఈ చర్చలో పాల్గొన్నారు. ఉన్నత స్థాయి సైద్ధాంతిక వాదోపవాదాలుగా కాకుండా రంగాల వారీ నిర్దిష్ట ప్రశ్నలపై ఈ చర్చ జరిగింది. అడవులపై రాజ్య వ్యవస్థ యాజమాన్య నమూనా కంటే స్థానిక జనసముదాయాల ఉమ్మడి నియంత్రణ శ్రేయోదాయక, సామాజిక న్యాయసమ్మతమైన ఫలితాలను ఇస్తుందా? హైవేలు, డ్యామ్‌లు మొదలైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల ఫలితంగా నిర్వాసితులు అయిన రైతులు, గిరిజనులకు ఆర్థిక నష్ట పరిహారం చెల్లిస్తే సరిపోతుందా?


లేక వారికి ప్రత్యామ్నాయ జీవనాధారాలు, ఉపాధి ఉద్యోగాలను సమకూర్చాలా? పట్టణీకరణ ప్రక్రియలు గ్రామీణ ప్రాంతాల వనరులను నగరాలు మితిమీరిన స్థాయిలో ఉపయోగించుకునేందుకు దారి తీస్తున్నాయా? వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాలు పులుల, ఏనుగుల జనాభాను కాపాడడానికే ప్రాధాన్యమిస్తూ మాగాణి భూములు, తుప్పలు, పొదలను, ప్రమాదంలో పడిన సహజావాసాలను పరిరక్షించడాన్ని ఉపేక్షిస్తున్నాయా?

ఇవీ, ఇంకా ఇటువంటి ఎన్నో ప్రశ్నలను వైజ్ఞానిక జర్నల్స్‌, వెబ్‌సైట్‌లు, ఉద్యమ వేదికలపై చురుగ్గా చర్చిండం జరిగింది. అయితే ఇదే సమయంలో ‘భారత్‌ పేద దేశమని, పర్యావరణాన్ని హరితంగా ఉంచుకోగలగడం సాధ్యంకాని విషయమని, అది అభిలషణీయం కూడా కాదు’ అన్న అభిప్రాయం ఒకటి మన అధికార, ప్రభావశీలవర్గాలలో బలంగా ఉన్నది.

భారతదేశ విద్యావంతుల మాటా మంతీలోగానీ, సామాన్యుల పిచ్చాపాటీలో గానీ పర్యావరణ విషయాలు ఏవైనా ప్రస్తావనకు వస్తే అవి వాతావరణ మార్పుకు సంబంధించినవి మాత్రమే అవుతాయి. ఇక్కడ సైతం వాతావరణ మార్పు పర్యవసానాల తీవ్రతను యథాలాపంగా త్రోసిపుచ్చడం జరుగుతుంది మనం శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని, పూర్తిగా స్వచ్ఛఇంధన వినియోగానికి త్వరితగతిన పరివర్తన చెందాలని పాశ్చాత్య సంపన్న దేశాలు మనకు ఉపదేశాలు చేయడాన్ని తీవ్రంగా ప్రశ్నించడం జరుగుతోంది.

వర్తమాన భారతదేశం ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లలో వాతావరణ మార్పు ఒకటి మాత్రమే. బహుశా అది అంత ప్రధానమైనది కూడా కాదు. ఢిల్లీ, ఇతర ఉత్తర భారతావని నగరాలలోని వాయు కాలుష్యం స్థాయి ప్రపంచంలో మరెక్కడ కంటే అధికంగా ఉంటోంది. మన మాతృభూమిని పావనం చేస్తున్న నదులలో చాలా భాగం జైవికంగా మరణించినవే. వాటిలో పారుతున్న నీరు నిర్మలమైనది కాదు. మనుషులుగానీ, పశువులు గానీ ఆ నీటిని తాగలేకున్నాయి. భూగర్భ జలాలు అంతకంతకూ ఇంకి పోతున్నాయి. భారతదేశ ధాన్యాగారంగా ప్రసిద్ధి పొందిన పంజాబ్‌లో కూడా భూగర్భ జలాలు ఆందోళనకరంగా అడుగంటిపోయాయి. పంటభూముల్లో రసాయన కాలుష్యం పరిమితులను మించిపోతోంది. సహజ అరణ్యాలను పరసీమల కలుపు మొక్కలు ఆక్రమిస్తున్నాయి. ఫలితంగా జీవ వైవిధ్యం నానాటికీ తరిగిపోతోంది.


మన దేశంలో సంభవిస్తోన్న పర్యావరణ దుర్వినియోగం, ధ్వంసాన్ని అర్థం చేసుకునేందుకు నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. మొదటిది– పర్యావరణ వినాశనాలలో వేటికీ వాతావరణ మార్పుతో సంబంధం లేదు. అసంబద్ధంగా రూపొందించి, అమలుపరుస్తున్న ఆర్థిక విధానాల ఫలితాలే ఆ విధ్వంసాలు. కార్పొరేట్‌ కంపెనీల పేరాశ, ప్రభుత్వాధికారుల ధన దాహం అందుకు అధిక భాగం దోహదం చేస్తున్నాయి; రెండోది– పర్యావరణ నష్టాలు స్వతంత్రంగా సంభవిస్తున్నప్పటికీ వాతావరణ మార్పు ఆ సమస్యలు మరింతగా విషమించేందుకు కారణమవుతోంది. విలువైన జలవనరులు, అపార జీవ వైవిధ్యం ఉన్న పశ్చిమ కనుమలలోను, హిమాలయ ప్రాంతాలలో తరచు చోటుచేసుకుంటున్న భూపాతాలు మొదలైన ప్రాకృతిక విపత్తులే అందుకు నిదర్శనాలు. అనియంత్రిత మైనింగ్‌ కార్యకలాపాలు, విచక్షణారహితంగా పర్యాటక కేంద్రాల పెరుగుదల, అధ్వాన్న రహదారులు తరచు కొండచరియలు విరిగిపడడానికి కారణమవుతున్నాయి. అకాల వర్షాలు మొదలైన వాతావరణ వైపరీత్యాలు ఆ విపత్తుల ప్రభావాలను మరింత తీవ్రం చేస్తున్నాయి. మూడోది– కాలుష్యం, పర్యావరణ ధ్వంసం కారణంగా కష్టనష్టాలను ప్రధానంగా ఎదుర్కొంటున్నది పేద ప్రజలే. ఢిల్లీలో కులీన వర్గాలవారు హైటెక్‌ ఎయిర్‌ ప్యూరిఫైయర్స్‌తో వాయు కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకుంటుండగా విష వాయువును పీల్చి అనారోగ్యం పాలవుతున్నది మురికివాడల వాసులే. ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌తో గనుల పొరుగున ఉన్న పంట భూములు చవుడు పట్టిపోతున్నాయి. సంపన్నులు రక్షిత మంచినీటిని సమకూర్చుకుంటుండగా పేదలకు కలుషితమైన నదీజలాలు, చెరువులు, బావుల్లో నీరు మాత్రమే అగత్యమవుతున్నది. కలుపు మొక్కల విస్తరణతో అడవులు శిథిలమవుతుండడం వల్ల పశువులకు ఆహారకొరత పెరిగిపోతోంది. చేతి వృత్తుల వారికి ముడిపదార్థాలు అలభ్యమైపోతున్నాయి. ఫలితంగా వేలాది పేద కుటుంబాలు జీవనాధారాలు కోల్పోయి అల్లాడుతున్నాయి.


పర్యావరణ విధ్వంసకర అభివృద్ధి మూలంగా పేద ప్రజల ఆరోగ్యం, జీవన సంక్షేమానికి జరుగుతోన్న నష్టాలను నివారించేందుకు అవసరమైన వైజ్ఞానిక, సామాజిక శాస్త్రాల సంబంధమైన ప్రతిభా పాటవాలు మన దేశంలో అపారంగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలలో ప్రతిభావంతులు అయిన పర్యావరణవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, జల వాతావరణ శాస్త్రవేత్తలు, పట్టణ ప్రణాళికాకర్తలు, రవాణా, ఇంధన నిపుణులు ఎంతో మంది ఉన్నారు. ప్రశస్త వృత్తి నైపుణ్యంతో పాటు భారతదేశ సామాజిక, పర్యావరణ పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉన్న వారిని ప్రభుత్వాలు సరిగా వినియోగించుకోవడం లేదు. ఇది గర్హనీయం. రాజకీయవేత్తలు ఈ నిపుణులను సంప్రదించడమే అరుదు. ఒకవేళ సంప్రదించినా వారి సూచనలను పాటించడం అనేది జరగదు. ఈ శోచనీయ ధోరణి అన్ని రాజకీయ పార్టీల నాయకులలోను ప్రబలంగా ఉన్నది. అజ్ఞానానికి తోడు కపటబుద్ధి వల్లే రాజకీయ నాయకులు అలా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. శాస్త్రవేత్తలను ఇలా ఉపేక్షిస్తున్న, అనాదరిస్తున్న రాజకీయ నాయకులు గనుల యజమానులు, మౌలిక సదుపాయాల నిర్మాణ కాంట్రాక్టర్లు, ఫ్యాక్టరీ యజమానులకు కృతజ్ఞతాబద్ధులై ఉంటున్నారు. ఎన్నికల ప్రచారానికి, ఇతర వ్యయాలకు అవసరమైన నిధులు సమకూర్చేది ఆ సంపన్నులే కదా. సామాన్యులకు సంక్షేమాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా అవిరామంగా జరుగుతున్న ఆర్థికాభివృద్ధి, అంతకంతకూ పెచ్చరిల్లుతున్న వినియోగదారీ సంస్కృతి మధ్యతరగతి ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి. వారి దృక్పథంలో పర్యావరణవేత్తలు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నవారుగా కన్పిస్తున్నారు. భారత్‌ను అభివృద్ధి చెందని దేశంగా ఉంచడానికి పాశ్చాత్య దేశాల తరపున వ్యవహరిస్తున్నవారుగా పర్యావరణవేత్తలను పరిగణిస్తున్నారు.


వైజ్ఞానిక ప్రతిభాపాటవాలను రాజకీయవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా ఎలా ఉపేక్షిస్తున్నదీ ‘పర్యావరణం–అభివృద్ధి’ అన్న అంశంపై సుప్రసిద్ధ జర్నల్‌ ‘ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ’ ఇటీవల (11 జనవరి, 2025) వెలువరించిన ఒక ప్రత్యేక సంచికలో ప్రముఖ నిపుణులు రాసిన వ్యాసాలు విశదం చేశాయి. దేశ పర్యావరణం, లక్షలాది పేద కుటుంబాల జీవనాధారాల భద్రతను అధికార వర్గాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆ ప్రత్యేక సంచిక ఎడిటర్లు శరత్‌ చంద్ర లెలె, గీతాంజోయ్‌ సాహు నిరసించారు.

సమీప భవిష్యత్తులో మన దేశంలో పర్యావరణ సంక్షోభాలు అనివార్యంగా తీవ్రమవుతాయి. వాటి ప్రతికూల పర్యవసానాలు పేద ప్రజల ఆరోగ్యం, జీవనాధారాలపై విషమ ప్రభావాన్ని తప్పక చూపుతాయి. బహుశా, చారిత్రక దురభిప్రాయాలు, అపోహల భారం లేని వివేచనాశీలురు అయిన యువ భారతీయులు అంతిమంగా తమ మేధో, కార్యాచరణ సామర్థ్యాలను సమీకరించుకుని, అర్ధ శతాబ్ది క్రితం పర్యావరణ సుస్థిరతకు చిప్కో ఉద్యమ నిర్మాతలు సాహసోపేతంగా నిర్దేశించిన బాటలో తమ దేశాన్ని ముందుకు తీసుకువెళతారు. అభివృద్ధిని సామాజిక న్యాయంతో సమ్మిళితం చేసేందుకు ప్రయత్నించిన మార్గమది.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Feb 22 , 2025 | 05:28 AM