Share News

బీళ్లకు మళ్లని ‘సీతారామ’ జలాలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:22 AM

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ (ఎస్‌ఎల్‌ఐఎస్‌) గుర్తింపు పొందింది. తొమ్మిదేళ్ల క్రితం కేసీఆర్‌ దీనికి శంకుస్థాపన చేశారు...

బీళ్లకు మళ్లని ‘సీతారామ’ జలాలు

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ (ఎస్‌ఎల్‌ఐఎస్‌) గుర్తింపు పొందింది. తొమ్మిదేళ్ల క్రితం కేసీఆర్‌ దీనికి శంకుస్థాపన చేశారు. గోదావ‌రి నుంచి 67 టీఎంసీల నీటిని ఎత్తిపోయ‌డం ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది సంకల్పం. అయితే డిజైన్లను, డీపీఆర్‌లను మార్చి, ప్రజలను ఏమార్చి ప్రాజెక్టు లక్ష్యానికి విరుద్ధంగా నీటిని తరలించుకుపోతున్న తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా– ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదుగానీ, రాజకీయ, ప్రజా ఉద్యమాలకు మాత్రం ఆజ్యం పోస్తోంది.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పి) ఎడమ కాలువ ద్వారా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. సూర్యాపేట నుంచి పాలేరు వరకు జోన్‌–1లో 50 వేల ఎకరాలు, పాలేరు నుంచి కల్లూరు వరకు జోన్‌–2లో 2.50 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందుతోంది. ఇదంతా కృష్ణా బేసిన్‌ పరిధిలోకి వస్తుంది. సాగర్‌ నీరుతో ప్రస్తుత ఖమ్మం జిల్లాలో 70శాతం భూములు సస్యశ్యామలంగా మారాయి. కానీ చెంతనే ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి బేసిన్‌లో ఉండటంతో సాగర్‌ నీరు అందే అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అప్పటి వైఎస్‌ ప్రభుత్వం గోదావరి జలాలపై దృష్టి పెట్టింది. సాగర్‌యేతర ఆయకట్టుకు సాగునీరు అందించడానికి దుమ్ముగూడెం వద్ద రాజీవ్‌సాగర్‌, రుద్రంకోట వద్ద ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. మొత్తం 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది అప్పుడు లక్ష్యం.


అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడగా, అదే క్రమంలో ఉమ్మడి ఖమ్మంలోని ఏడు మండలాలు ఏపీలోని పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలో కలిసిపోయాయి. ఇందిరాసాగర్‌ తలపెట్టిన ప్రాంతం విలీన మండలాల్లో ఉండటంతో రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులను కలిపి, కొత్త ప్రాజెక్టుగా డిజైన్‌ చేసి ‘సీతారామ ఎత్తిపోతల పథకం’గా కేసీఆర్‌ ప్రభుత్వం తెర మీద‌కు తీసుకువ‌చ్చింది. దీని ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో 4,15,621 ఎకరాలకు సాగునీరు అందించడం, మరో 3,89,366 ఎకరాలను స్థిరీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.7,926 కోట్ల అంచనా వ్యయంతో (ఇప్పుడు రూ.20 వేల కోట్ల‌కు పెరిగింది) పరిపాలన అనుమతి ఇచ్చి కేసీఆర్‌ 2016 ఫిబ్రవరి 16న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని టేకులపల్లి మండలం రోళ్లపాడు చెరువు వద్ద శంకుస్థాపన చేశారు. అలాగే దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై కాటన్‌ నిర్మించిన ఆనకట్టకు దిగువన 67 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మసాగర్‌ బ్యారేజిని ఏర్పాటు చేసి సీతారామ ప్రాజెక్టు ద్వారా నీరు పంపింగ్‌ చేసేలా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. గోదావరి నుంచి నీటిని లిఫ్ట్‌ చేసి రోళ్లపాడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ద్వారా ఫేజ్‌–1 కింద భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల పరిధిలో కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చి, ఆ తర్వాత ఫేజ్‌–2 కింద ఖమ్మం జిల్లా పరిధిలోని సాగర్‌ ఆయకట్టును స్థిరీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

2016లో ప్రాజెక్టు ప‌నులు ప్రారంభం కాగా, 2018 వచ్చేసరికి సీన్‌ మారిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలకు గోదావరి జలాలను అందించే ఫేజ్‌–1 డిజైన్‌ పక్కకు పోయి, ఖమ్మం జిల్లాలోని సాగర్‌ ఆయకట్టుకు తరలించే పనులు తెరమీదకు వచ్చాయి. పంప్‌హౌజ్‌లు, మెయిన్ కెనాల్ నిర్మాణ ప‌నులు ఆ దిశ‌గానే కొనసాగాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి–కృష్ణా జలాల అనుసంధానం అనే పేరుతో మొద‌టి ప్రాధాన్యంగా ఏన్కూరు (రాజీవ్‌) లింక్‌ కెనాల్‌పై దృష్టి పెట్టి ఆగ‌మేఘాల‌పై పూర్తి చేశారు. మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, కొత్తగూడెం, ములకలపల్లి, జూలూరుపాడు మీదుగా ఏన్కూరు లింక్‌ కెనాల్‌కు తరలించి వైరా రిజర్వాయర్‌ను నింపేందుకు; అలాగే కామేపల్లి, కారేపల్లి, గార్ల, డోర్నకల్‌, తిరుమలాయపాలెం మీదుగా పాలేరు రిజర్వాయర్‌ను నింపేందుకు పనులు జోరందుకున్నాయి. ఈ రెండు రిజర్వాయర్‌లు కృష్ణా బేసిన్‌ పరిధిలో ఉంటాయి. ఏన్కూరు లింక్‌ కెనాల్‌తో వైరా ఆయకట్టు స్థిరీకరణకు మార్గం ఏర్పడింది. ఆలాగే పాలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించే కాలువ పనులను, సత్తుపల్లి ట్రంక్‌ మెయిన్‌ కాలువ పనులను వడివడిగా పూర్తి చేయిస్తున్నారు. ఇవి పూర్తయితే సంపూర్ణంగా సాగర్‌ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. తద్వారా సాగర్‌ నుంచి కృష్ణా జలాలు విడుదల కాకున్నా, సీతారామ ద్వారా గోదావరి జలాలను తరలించి పంటలను సాగు చేసుకోవచ్చు.


సీతారామ ప్రాజెక్టులో దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను తరలించడానికి అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు, ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం వద్ద వరుసగా పంప్‌హౌజ్‌లను ఏర్పాటుచేశారు. దుమ్ముగూడెం నుంచి మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, కొత్తగూడెం, ములకలపల్లి, జూలూరుపాడు మండలాల మీదుగా తవ్విన మెయిన్‌ కెనాల్‌.. సింగరేణి మండలంలో చీమలపాడు వద్ద ప్రతిపాదిత రోళ్లపాడు చెరువు వైపు మళ్లాలి. రోళ్లపాడును బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా ప్రతిపాదించారు. ఇక్కడి నుంచి పలు పంప్‌హౌజ్‌ల ద్వారా భ‌ద్రాద్రి, మ‌హ‌బూబాబాద్‌ జిల్లాల్లోని సుమారు 4,15,621 ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం.

కానీ, ఇక్కడే కథ అడ్డం తిరిగింది. మెయిన్‌ కెనాల్‌ను రోళ్లపాడు వైపు కాకుండా, పాలేరు లింక్‌ కెనాల్‌ వైపు తీసుకువెళ్లారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లా బీడు భూములకు చుక్క నీరు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. రోళ్లపాడు వైపు అటవీశాఖ భూములు, గుట్టలు, కొండలు ఉన్నాయని, ప‌నులు జాప్యం అవుతాయ‌నే సాకుతో... కాలువ తవ్వకం, పంప్‌హౌజ్‌ల నిర్మాణ పనులను ఉపేక్షించారు.


దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 104 కి.మీ. పొడవైన మెయిన్‌ కెనాల్‌ ద్వారా ప్రవహించి ఏన్కూరు లింక్‌ కెనాల్‌లో కలుస్తున్నాయి. మెయిన్‌ కాలువ కోసం ప్రభుత్వం వేలాది ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. తమ భూముల గుండా గోదావరి జలాలను తరలిస్తూ.. తమకు చుక్కనీరు ఇవ్వకపోవడం సహజ న్యాయానికి విరుద్ధం కాదా.. అని భద్రాద్రి జిల్లా రైతాంగం ప్రశ్నిస్తోంది. ప్రాజెక్టుపై ఇప్ప‌టివ‌ర‌కు ఖ‌ర్చు చేసిన‌ రూ.10వేల కోట్ల‌తో ఎవ‌రికి మేలు జ‌రిగింద‌ని వారు నిల‌దీస్తున్నారు. భ‌ద్రాద్రి జిల్లా బీళ్లు తెలంగాణ‌లో భాగం కాదా.. అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో 104 కి.మీ. ప్రవహిస్తున్న సీతారామ కెనాల్‌కు అనుబంధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ నిర్మిస్తే ఆ ప్రాంతంలో వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. కానీ, వాటిని పట్టించుకోకుండా ఖమ్మం జిల్లాలోని సాగర్‌ ఆయకట్టును స్థిరీకరించడానికే ఖ‌మ్మం జిల్లాకు చెందిన‌ మంత్రులు వెంపర్లాడటం సమర్థనీయం కాదు.


భద్రాద్రి జిల్లాలో బలమైన రాజకీయ నాయకత్వం లేకపోవడం ఈ సమస్యకు కారణం. కేసీఆర్‌ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో భద్రాద్రి, మహబూబాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులు... సీతారామ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ మిన్నకుండిపోయారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు అఖిలపక్షంగా ఏర్పడి సీతారామ జలాల కోసం పోరాటం ప్రారంభించారు. ఈ అంశం ఇప్పుడు అన్ని పార్టీల ఎజెండాగా మారింది. ఇటీవల అఖిలపక్షం నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పిస్తే... పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ, అది ఆచరణలోకి వచ్చే వరకు భద్రాద్రి, మహబూబాబాద్‌ ప్రాంత రైతాంగం– తలాపున ప్రవహిస్తున్న గోదావరిని చూస్తూ బాధపడక తప్పదు.

శంకర్‌రావు శెంకేసి

సీనియర్‌ జర్నలిస్టు

ఈ వార్తలు కూడా చదవండి...

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు

Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..

Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 04:22 AM