అమ్మ ఫొటో వేయడం సినారె కు నచ్చింది
ABN , Publish Date - Feb 03 , 2025 | 06:30 AM
1983 నుంచి రాసిన కవితలు కొన్ని తీసేసి, కొన్ని ఉంచి ఎంపిక చేసుకున్న నలభై మూడు కవితల సంపుటి ‘ప్రవహించే జ్ఞాపకం’ 1992 ఏప్రిల్ నెలలో అచ్చయింది. ఎనభై రెండు పేజీలు. వెల పది రూపాయలు. వెయ్యి కాపీలు అచ్చు వేశాను...

నా మొదటి పుస్తకం
1983 నుంచి రాసిన కవితలు కొన్ని తీసేసి, కొన్ని ఉంచి ఎంపిక చేసుకున్న నలభై మూడు కవితల సంపుటి ‘ప్రవహించే జ్ఞాపకం’ 1992 ఏప్రిల్ నెలలో అచ్చయింది. ఎనభై రెండు పేజీలు. వెల పది రూపాయలు. వెయ్యి కాపీలు అచ్చు వేశాను. కాళ్ళ గారు ముఖచిత్రం వేశారు. తెలుపు బ్యాక్ గ్రౌండ్ మీద ముళ్ళ చివరన గులాబీలోంచి మొదలై కన్నులోంచి ప్రవహిస్తూపోయే ప్రవా హంలా సింబాలిక్‌గా ఉంటుంది ఆ బొమ్మ. కాళ్ళ వేసిన బొమ్మ కదా, అదొక అపు రూపం. కవర్ పేజీ స్క్రీన్ ప్రింటింగ్ ఆయనే చేసిచ్చాడు.
ఆ రోజుల్లో త్రిపుర కథల గురించి ఎం.ఫిల్ పరిశోధనచేస్తూ మా వెంట ఉండే ఖమ్మం మిత్రుడు రమణమూర్తి ‘రెండు చందమామలు’ పేరిట ముందుమాట లాంటి వెనుకమాట రాసాడు. అప్పటికే ఆంధ్రజ్యోతి ‘చేరాతలు’లో చేకూరి రామారావు ‘ప్రవహించే జ్ఞాపకం’ కవితను గురించి రాసి ఉన్నాడు. ఆ కవిత శీర్షిక అందరిలో బాగా పాపులరై ఉంది. అదొక కారణంతో సంపుటికి అదే పేరు ఖాయం చేసాను-– అఫ్సర్, ప్రసేన్, సీతారాంలతో సంప్రదించి. యూని వర్సిటీలో గురువు, ఆ తర్వాత నాకు అండదండగా ఉన్న ఎన్. గోపి గారికి తొలి కవితాసంపుటి అంకితం ఇద్దామని నిర్ణయించుకుని, ‘తంగెడుపూల విషాద పరిమళాలు తెలిసిన మా సార్ డా.ఎన్. గోపి గారికి’ అని అంకిత వాక్యాలు రాసాను. వెనుక అట్టమీద కవి ఫోటో వేయడం అందరూ చేసేవారు. దానికి భిన్నంగా మా అమ్మ ఫోటో వేసి, అమ్మ గురించిన ‘అందరి అమ్మల్లాగే మా అమ్మ కూడా నన్ను కన్నది’ అనే కవిత అచ్చేసాను. అది ఆవిష్కరణ సభకు వచ్చిన సి.నారాయణరెడ్డి గారికి ఎంతో నచ్చింది. అలా వేయడం గురించి, ఆ కవిత గురించి ప్రత్యేకంగా ప్రశంసించడమే కాదు, అనేక సందర్భాల్లో ఆ కవితను ప్రస్తావించేవారు. ఆవిష్కరణ సభ మే 14, 1992న జరిగింది. దేవిప్రియ అధ్యక్షతన జరి గిన ఈ సభలో చేరా, కె. శివారెడ్డి, భమిడి పాటి జగన్నాథరావుగార్లు వక్తలు. పుస్తకం విడుదలైన తర్వాత కాకినాడలో చొక్కర తాతారావు, అద్దేపల్లి గారు, రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో సన్నిధానం గారు, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గారు ఈ సంపుటి గురించి చర్చలు నిర్వహించారు. శేషేంద్ర, ఇస్మాయిల్ ప్రత్యేకంగా ఉత్తరాలు రాసారు. బోలెడు ఉత్సాహం.
పుస్తకం అచ్చువేయడం విషయంలో ఓ ప్రత్యేకత ఉంది. అప్పట్లో కంప్యూటర్ ప్రింటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో హైదరాబాద్‌లో రాలేదు. తొంభై తొమ్మిది శాతం పుస్తకాలు పాత అచ్చుపద్ధతి లోనే గాంధీనగర్ పద్మావతీ, చిక్కడపల్లి బాలాజీ వంటి లెటర్ ప్రెస్సుల్లోనే ప్రింట్ అయ్యేవి. నేనేమో కంప్యూటర్ కంపోజింగ్, వాటిని బ్రోమైడ్‌ల్లోకి తీసుకుని, వాటిని అవసరమైన పద్ధతిలో కత్తెరతో కట్ చేసి, వాటిని ప్లేట్లుగా మార్చి పుస్తకాలు ప్రింట్ చేసే పద్ధతిలో ప్రింటింగ్ చేయించాను. అప్పట్లో అది సరికొత్త పద్ధతి. అబిడ్స్ చిరాగలీలేన్‌లో ‘చరిత’ సుబ్బయ్య గారు, మరో మిత్రుడితో కలిసి ప్లానోగ్రాఫర్స్ అనే ప్రెస్ నడిపేవాడు. సుబ్బయ్యగారి సాయంతో పుస్తకం అచ్చువేయించాను.
‘మనుషులకు లాగానే పుస్తకాలకీ అదృష్టం ఉంటుంది’ అంటాడు ఎ. కుప్రీన్ రచన ‘రాళ్లవంకీ’కి రాసిన ముందు మాటలో అంద్రెయ్ చెర్నషోవ్. ఈ పుస్తకం విషయంలో అదే జరిగింది. కె.వి. రమణారెడ్డి, వేగుంట మోహన ప్రసాద్, అద్దేపల్లి రామమోహనరావు, ప్రొ. బేతవోలు రామబ్రహ్మం, యం. కె. సుగంబాబు, నారాయణమూర్తి రాజు, తెలకపల్లి రవి, మొక్కపాటి సుమతి, ఎ.ఎ.వి. ప్రసాద్‌లు పత్రికల్లో సమీక్షలు చేశారు. హిందీలోకి ప్రొ. భీంసేన్ నిర్మల్, దండమూడి మహీధర్ గార్లు, ఉర్దూ లోకి డా. యూసుఫ్ ఆజ్మీ, ఇంగ్లీష్ లోకి ప్రొ. దామోదరరావు, మోహనప్రసాద్ గారు కొన్ని కవితలను అనువదించి ఆయా భాషల పత్రికల్లో అచ్చేశారు. సంకలనాల్లో చేర్చారు. యలమంచిలి ‘ఎస్.వి.టి.దీక్షితులు అవార్డు’ నేను అందుకున్న తొలి అవార్డు. ఎన్నో ఉత్త రాలు ఈ సంపుటి సందర్భంగా అందుకున్నాను. కొత్తగా పెళ్లయి, పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న కాలం. ప్రతిరోజూ పోస్టుమాన్ కనీసం రెండు మూడు మనియార్డర్లు తెచ్చి ఇచ్చేవాడు. నెలాఖరు కష్టాల్లో అవి ఆదుకునేవి. శిలాలోలిత శ్రద్ధగా లిస్టులో పేర్లు రాసి పెట్టుకునేది. అచ్చు అయిన కొన్ని నెలల్లోనే సంపుటి ప్రతులు చెల్లిపోయాయి.