శుద్ధిమంత్రం ఆయన పాట!
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:26 AM
హరిసంకీర్తనాచార్యుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ విష్ణుదేవుని పాదార్చనకై ఉత్తరాయణ పుణ్యకాలంలో వైకుంఠానికి తరలివెళ్లారు. వారితో నాకు చాలాకాలంగా స్నేహం ఉంది...

హరిసంకీర్తనాచార్యుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ విష్ణుదేవుని పాదార్చనకై ఉత్తరాయణ పుణ్యకాలంలో వైకుంఠానికి తరలివెళ్లారు. వారితో నాకు చాలాకాలంగా స్నేహం ఉంది. నేను రేడియోలో చేరిన తొలినాళ్ల నుంచి అంటే సుమారుగా నలభై ఏళ్లుగా వారితో నాకు పరిచయం. వారితో స్నేహం మాపటిపూట పొద్దులాంటిది. మొదట ‘ఓహో మీరా’ అంటే ‘ఓహో తమరా’ అంటూ మొదలైన మా స్నేహం క్రమేపీ బలపడుతూ వచ్చింది. రేడియోలో కొలువు ముగిసాక కొన్నేళ్లు నేను టీటీడీలో స్వామిసేవలో ఉన్నాను. టీటీడీ స్టాఫ్ క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు తరచూ కలుసుకుంటుండేవాళ్లం. ఎన్ని పాటల ముచ్చట్లో!
గరిమెళ్ల వారి సార్థక సంగీత కళామూర్తిమత్వాన్ని వివరించటానికి మాటలు చాలవు. పాడిన ప్రతి పాటకు శాశ్వతత్వం కల్పించారు. వారి గానంలో కమనీయత ఉంది. నిండైన వ్యక్తిత్వం. సంగీతమూ ఇంగితమూ రెండూ ఆ వ్యక్తిత్వంలో పెనవేసుకుని ఉన్నాయి. సౌజన్యం, సౌశీల్యం, సౌమనస్యం మూర్తీభవించిన మనీషి. అణువంత ప్రతిభకే ఎగిరెగిరి పడే ఈ రోజులలో ఆకాశమంత ప్రజ్ఞ ఉండి కూడా ఏ మాత్రం గర్వోద్ధతి లేకుండా చివరి క్షణం వరకు తాను నమ్మిన దేవుడు వేంకటేశునియందు, గురువులైన నేదునూరి కృష్ణమూర్తి, బాలమురళి, పశుపతి గార్లయందు ఉత్కృష్టమైన భక్తిభావనతో మెలిగారు. 1978లో తిరుమల తిరుపతి దేవస్థానం – అన్నమాచార్య ప్రాజెక్టులో గాయకునిగా చేరి రమారమి మూడు దశాబ్దాలకు పైగా స్వామికి సంగీత స్వరార్చన చేశారు. ఉద్యోగ విరమణ చేసిన ఆరేళ్ల తరువాత వారిని టీటీడీ ఆస్థాన గాయకునిగా నియమించింది. గాయకునిగా, ఆస్థాన విద్వాంసునిగా బాలకృష్ణ ప్రసాదు గారు ఆ స్థానపు విలువను పెంచారు. ఆరు వందలకు పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరచారు. దేశ విదేశాలలో వేలాది కచేరీలు చేశారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు గరిమెళ్ల వారి పాటను శ్లాఘిస్తూ, ‘‘వారి పాటకు వైశిష్ట్యం ఉంది. మార్దవం, మాధుర్యం, ఆర్ద్రత, శాస్త్రీయత ఉన్నాయి. వారు వాగ్గేయకారులు. వేంకటేశుని మీద, హనుమ మీద అనేక పాటలు రాశారు. అవన్నీ అజరామరం,’’ అన్నారు.
గరిమెళ్ల వారు స్వరపరచిన కీర్తనల్లో- ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘క్షీరాబ్ధికన్యకకు’, ‘నారాయణ నీ నామమే’, ‘ఇతడొకడే సర్వేశ్వరుడు’, ‘జగడపు చనవుల జాజర’, ‘పిడికిట తలంబ్రాల’... వంటి అనేక కీర్తనలు బహుళ ప్రాచుర్యం పొందాయి. కించిదనునాసికఛాయ కలగలసిన ఆ గాత్రంలో అద్భుత వశీకరణశక్తి ఉంది.
1948 నవంబరు 9న జన్మించిన బాలకృష్ణ ప్రసాదు స్వస్థలం రాజమండ్రి. నరసింహారావు – కృష్ణవేణి దంపతులకు జన్మించారు. అప్పటికే ఇంట సంగీతం కొలువుతీరి ఉండటంతో స్వరజ్ఞానం సులువుగా నోటికి అందివచ్చింది. శృతిలయల మాధుర్యం తెలుసుకునే సులువు అలవడింది. గడచిన నలభై ఐదు సంవత్సరాలుగా తిరుపతిలో ఉంటూ స్వామికి, అన్నమయ్యకు సంగీత సాహిత్య బంధువయ్యారు. అన్నమయ్య సంకీర్తనా స్వరసంపుటి, అన్నమయ్య నృసింహకీర్తనం, అన్నమయ్య సంకీర్తనారత్నావళి, ఆంజనేయ కృతిమణిమాల మొదలైన గ్రంథాలను రచించారు. హనుమ వైభవాన్ని కీర్తిస్తూ యాభై, గణేశుని మీద యాభై కీర్తనలు రచించారు.
ఆరుమాసాలక్రితం కలిశాను. కొన్నాళ్లుగా ఆరోగ్యం సడలిందనీ పట్టు తప్పిందనీ వారు చెప్పారు గానీ ఆ గానఝరి, గాన సిరి ఏ మాత్రం వన్నె తగ్గలేదు. బాలకృష్ణ ప్రసాదుగారు లాంటివారు అపురూపంగా ప్రభవిస్తారు. ఆయన కళానిధి. సంగీత విద్వన్మణి. అటు శాస్త్రీయం, ఇటు లలిత, జానపద సంగీతాలను ఆపోసనం పట్టిన అగస్త్యులు. మేము కలుసుకున్న ప్రతిసారీ ‘‘స్వామిసేవకు, నాదోపాసనకు సమాప్తి అంటూ లేదు. ఇలా పాడుకుంటూ వెళ్లిపోతే చాలు సార్’’ అనేవారు.
గరిమెళ్లగారు సార్థక జన్ములు. తెలుగునాట సంకీర్తనాయజ్ఞం అనే ప్రక్రియకు వారే ఆద్యులు. 2020వ సంవత్సరంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. అపర అన్నమయ్య, అన్నమాచార్య సంకీర్తనామహతి వంటి అనేక బిరుదులు పొందారు.
సాహిత్యం స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా, శాస్త్రీయత చెడకుండా, శ్రవణసుభగంగా పాడేవారు. ప్రాణాంతక వ్యాధులబారినుంచి రక్షించే సిద్ధమంత్రం వేంకటేశుని నామమైతే, శ్రోతలమనసు, బుద్ధి కలుషితం కాకుండా కాచి కాపాడే శుద్ధిమంత్రం గరిమెళ్లవారి పాట. వారి పాట శాశ్వతం. వారి కీర్తి అజరామరం.
డా.పాలపర్తి శ్యామలానందప్రసాద్ గారు గరిమెళ్ల వారికి శ్రధ్ధాంజలి ఘటిస్తూ,
‘‘ఏడు స్వరముల కొండలనెక్కిదిగుచు
అన్నమయ్యతో నేటికి నున్నయట్లు
స్వామి మురిపించు నటనమ్ము చాలుననుచు
గాలినడకన చేరితే బాలకృష్ణ’’ అని ఘనంగా కీర్తించారు. ఇన్నాళ్లూ ఆయన కంఠంలో కాపురం ఉన్న సంగీత దేవతలంతా ఆయనను స్వర్గానికి తోడ్కొని వెళ్లారన్నమాట!
ప్రయాగ రామకృష్ణ
ఈ వార్తలు కూడా చదవండి:
IT Raids: శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు.. నిర్ఘాంతపోయిన అధికారులు..
AP News: రాజధానిలో భూకేటాయింపులపై మంత్రుల కమిటీ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..