SC Reservations: క్రీమీలేయర్’కు రిజర్వేషన్లా
ABN , Publish Date - Nov 23 , 2025 | 03:10 AM
సంపన్న శ్రేణి (క్రీమీలేయర్) విధానం ఎస్సీలలో ప్రవేశపెట్టాలా, వద్దా? అనే చర్చ చాలాకాలంగా ఉంది. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల ద్వారా అత్యధికంగా లబ్ధిపొందిన ఎస్సీలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎస్సీ వర్గీకరణ...
సంపన్న శ్రేణి (క్రీమీలేయర్) విధానం ఎస్సీలలో ప్రవేశపెట్టాలా, వద్దా? అనే చర్చ చాలాకాలంగా ఉంది. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల ద్వారా అత్యధికంగా లబ్ధిపొందిన ఎస్సీలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎస్సీ వర్గీకరణ అనుకూల ఎస్సీ మేధావులు కూడా ఈ సంపన్నశ్రేణి విధానం దగ్గరికి వచ్చేసరికి, ప్రగతి నిరోధకంగా వ్యవహరించడం ఆశ్చర్యకరం.
వీరి వాదనలు ఇలా ఉంటాయి. (1) ఆధిపత్య కులాల వారి సంపదలకు ఏ విధమైన పరిమితులూ విధించనప్పుడు, తమకు మాత్రం ఈ సంపన్న శ్రేణి విధానం వర్తింపజేయాలని కోర్టులు, ప్రభుత్వాలు ఆలోచిస్తూ వుండటం అన్యాయం (2) ఎస్సీల సమస్య ఆర్థిక సమస్య కాదు, సామాజిక సమస్య, కొందరు ఆర్థికంగా బాగుపడినప్పటికీ, కులపరంగా వేదనకు గురయ్యే పరిస్థితులే ఉన్నాయి (3) కంప్యూటరైజేషన్, మెకనైజేషన్, కృత్రిమ మేధ, ప్రైవేటైజేషన్ వలన ప్రభుత్వ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ వర్గాల్లో అభివృద్ధి చెందినవారు సైతం ఇప్పటికీ ఆధిపత్య కులాల సంపన్నులతో పోటీపడలేకపోతున్నారు. పోటీపడాలంటే, రిజర్వేషన్ల ద్వారా లబ్ధిపొందినవారే మళ్లీ మళ్లీ అవకాశాలు అందుకుంటూ ఇంకా బలపడాలి కనుక ‘సంపన్నశ్రేణి’ సరికాదు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నవంబర్ పదహారో తేదీన, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ‘భారతదేశం–డెబ్బై అయిదేళ్ల సజీవ భారత రాజ్యాంగం’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఉపన్యసిస్తూ ‘రిజర్వేషన్ల దగ్గరికి వచ్చినపుడు ఒక ఐఏఎస్ అధికారి సంతతిని, ఒక పేద వ్యవసాయ కూలీ సంతతిని సమానంగా చూడరాదు’ అన్నారు. ఇది వాస్తవం. మండల్ జడ్జిమెంట్‌గా ప్రసిద్ధికెక్కిన ఇందిరా సహాని కేసులో 1992 నవంబర్ పదహారున సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పునిచ్చింది. అందులో వెనుకబడిన తరగతులలోని సంపన్నశ్రేణికి రిజర్వేషన్లు ఇవ్వవద్దని స్పష్టం చేసింది. ఈ తీర్పు వచ్చిన ముప్పై రెండేళ్ల తర్వాత, ఎస్సీ, ఎస్టీల ఉపవర్గీకరణ కేసుగా ప్రముఖమైన దావీందర్ సింగ్ కేసులో 2024 ఆగస్టు ఒకటో తేదీన ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పులో, వెనుకబడిన తరగతులలో మాదిరిగా ఎస్సీలలోనూ సంపన్న శ్రేణి విధానం అమలు చేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు రాసింది డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సామాజిక న్యాయ తాత్వికతకు దగ్గరివాడైన జస్టిస్ గవాయ్. శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన తన తీర్పును ప్రస్తావిస్తూ, ఈ అంశంపై మరింత లోతుగా వ్యాఖ్యానించారు.
వెనకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, తెగల వారి మధ్యలో రాజ్యం ద్వారా ఈ రిజర్వేషన్ల విధానం సమానత్వం, ఏకరూప అభివృద్ధి సాధించవలసి వుండింది. ఇందుకు బదులుగా, రిజర్వేషన్లు పొందిన కొన్ని కులాలు, కుటుంబాలే మళ్లీ మళ్లీ పొందుతూ, అసమానుల మధ్య అసమానతలను, వెనకబడిన వారి మధ్య మరింత వెనకబడిన పరిస్థితులను సృష్టించాయి. రిజర్వేషన్ల అమలు విధానాల ప్రభావాలను సమీక్ష చెయ్యడంలో ఆయా ప్రభుత్వాలు అనుసరించిన అలక్ష్యం, అలసత్వాలు ఈ ఆంతరిక వ్యత్యాసాల పెరుగుదలకు ఉపకరించాయి.
హోదాలు, జీతభత్యాలతో సహా, అన్ని రకాల సంపద అవకాశాలూ ప్రతి ఒక్కరికీ పంచాలని రాజ్యాంగం నిర్దేశించిన సంగతిని ఈ విద్యావంతులైన సంపన్నశ్రేణి మరువరాదు. సాంకేతిక అంశాలను, సమాజాన్ని గందరగోళంలోకి నెట్టే తప్పుడు వాదనలను, భయాలను, స్వార్థపూరిత దుష్ప్రచారాలను కొనసాగించవద్దు. ప్రతి కులానికీ, జాతికీ, తెగకూ రిజర్వేషన్లలో పంపిణీ న్యాయం జరగటానికి వీలుగా, ఉపవర్గీకరణ చేసి, హేతుబద్ధీకరించాలని నలభైఏళ్లపాటు దండోరా ఉద్యమం జరిగింది. వర్గీకరణ వ్యతిరేకవాదులు ఆటంకాలు కల్పించి, చివరకు ఓడిపోయారు. ఇలా జరక్కుండా, అత్యంత వెనకబడిన అణగారిన కుటుంబాలకు, సమూహాలకు ప్రాధాన్యతలతో కూడిన ప్రాతినిధ్య న్యాయం కల్పించడానికి ఇప్పుడు సంపన్న శ్రేణిలో చేరినవారు ప్రగతిశీల దృక్పథంతో క్రీమీలేయర్ అమలును స్వాగతించాలి.
ఒకప్పుడు ఎస్సీ వాడల్లో అన్నీ పూరిళ్ళే ఉండేవి. గత అరవై ఏళ్లలో చదువు, ఉద్యోగాల రిజర్వేషన్లు అనుభవించిన ఒక ధనిక తరగతి ఎస్సీల్లో, ఎస్టీల్లో అదీ కొన్ని కులాల్లో, తెగల్లో, కుటుంబాల్లో ఎదిగింది. పెంకుటిళ్లు, భవంతులు, ప్రహరీ గోడలు కట్టుకుని భద్రజీవితాలకు ఇది అలవాటుపడింది. ఇలా అభివృద్ధి చెందిన తరగతి, వారి కమ్యూనిటీలకు ఎటువంటి బాధ్యతాయుత పరిహారాలనూ తిరిగి ఇవ్వలేదు. పైగా పరిమిత కులాలలోని, అవకాశాలు పొందిన కుటుంబాలలోని వారే, మళ్లీ మళ్లీ రిజర్వేషన్లను పొంది, సంతోషపడటానికి అలవాటుపడ్డారు. తమ కమ్యూనిటీలలో తమకంటే బలహీనమైనవారు ముందు అవకాశాలు పొందగలిగేలా రిజర్వేషన్ల విధానం నుంచి ఈ సంపన్నశ్రేణి వైదొలగి (సోషల్ కేటగిరీ నుంచి కాదు), అభివృద్ధి చెందిన ఆధిపత్య సమూహాలతో పోటీపడాల్సిన సమయం ఆసన్నమైంది.
కృపాకర్ మాదిగ
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి