Share News

తూర్పు కనుమలను కాపాడండి

ABN , Publish Date - Jun 17 , 2025 | 02:55 AM

తూర్పు కనుమలు ఉత్తరాంధ్ర జీవనాడి. ప్రస్తుతం ఈ కనుమలు ప్రమాదం అంచున ఉన్నాయి. అడవులను నరకడం వల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఉత్తరాంధ్రకు నీటిని అందించే అనేక వాగులు...

తూర్పు కనుమలను కాపాడండి

తూర్పు కనుమలు ఉత్తరాంధ్ర జీవనాడి. ప్రస్తుతం ఈ కనుమలు ప్రమాదం అంచున ఉన్నాయి. అడవులను నరకడం వల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఉత్తరాంధ్రకు నీటిని అందించే అనేక వాగులు, వంకలు ఎండిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించాలి. ఈ వాగు వంకల పరీవాహక ప్రాంతంలో చెట్లు లేకపోవడంతో వన్య మృగాలు, పలు జాతుల పక్షులు అంతరించిపోయాయి. గిరిజనులకు కూడా అడవి నుంచి వచ్చే ఫలసాయం తగ్గిపోయింది. కేవలం చింత, పనస వంటి అటవీ ఫలసాయం మాత్రమే ప్రస్తుతం గిరిజనులకు లభిస్తోంది. వీరికి ఆదాయం లేకపోవడంతో మనుగడ సమస్య ఏర్పడింది. వీరు ఇప్పుడు మైదానాలకు వలసపోతున్నారు. ఈ పరిస్థితిని తప్పించేందుకు ప్రభుత్వం ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించాలి.

ఉత్తరాంధ్రకు రాబోయే నీటి కొరతను తప్పించాలంటే ఆ వాగు వంకల ప్రవాహాల వెంట మనం అడవులను సృష్టించాలి. విస్తృతంగా పండ్ల మొక్కలను నాటాలి. స్థానికంగా ఉండే మొక్కలతో అడవులను పెంచడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడినవాళ్లం అవుతాము. కాఫీ ప్లాంటేషన్లకు నీడ కోసం వాడుతున్న సిల్వర్, ఓక్ వంటి విదేశీ జాతుల మొక్కల పెంపకాన్ని తగ్గిస్తే మంచిది. స్థానికంగా పెరిగే తెల్ల మద్ది, నల్ల మద్ది, మామిడి, జామ, ఉసిరి, చింత వంటి మొక్కల ద్వారా అడవులు పెంచి కాఫీ, మిరియాల వనాలను వృద్ధి చేయాలి. తద్వారా గిరిజనులకు ఉపాధి లభిస్తుంది. జంతువులకు, పక్షులకు ఆహారమూ లభిస్తుంది. తూర్పు మన్యంలో నిమ్మ జాతి మొక్కలు విరివిగా పెరుగుతాయి. కాబట్టి నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, పంపర పనస వంటి మొక్కలను పెంచాలి. మన్యంలో పండే రాజ్మా చిరుధాన్యాలు వంటి ఉత్పత్తులను కూడా విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చవచ్చు. మిరియాలు, కాఫీ, పసుపు, పనస ఆధారంగా మనం విలువ జోడించే సముదాయాలను రూపొందించటం వల్ల వేలాది మంది గిరిజనులకు ఉపాధి లభిస్తుంది. ఈ మన్యంలో పనస ఎక్కువగా పండేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే పనస తక్కువగా పండే రాష్ట్రాల్లో పనస విలువ ఆధారిత ఉత్పత్తుల మీద ఎక్కువ ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ విస్తృతంగా పనస పండే తూర్పు మన్యంలో ఈ సౌకర్యాలు గానీ, శిక్షణ గానీ లేదు!


స్థానికంగా లభించే వెదురు, కలపతో వస్తువులు, బొమ్మలు తయారు చేయడం గిరిజనులకు నేర్పించాలి. ఇది వారికి ఆదాయాన్ని ఇస్తుంది. పండిన పంటకు విలువ జోడించడం మీద కూడా వారికి శిక్షణనివ్వాలి. వారు తరతరాలుగా ఆచరిస్తున్న కళలను ప్రభుత్వం పునరుద్ధరించాలి. ఇలా పర్యావరణంపై దృష్టి పెట్టడం ద్వారా నాలుగైదు సంవత్సరాల్లోనే తూర్పు మన్యాన్ని దట్టమైన అడవిగా, వర్షాన్ని గ్రహించే మంచి వనాలుగా మార్చవచ్చు. గిరిజనులున్న భూముల్లో అడవులతో పాటు వ్యవసాయ పర్యాటకాన్ని రూపొందించవచ్చు. ఇప్పటికే ఉన్న పర్యాటకానికి ఈ వ్యవసాయ పర్యాటకం ఊతం ఇస్తుంది. కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించడానికీ వీలు కలుగుతుంది.

ఆకుల చలపతిరావు

నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 02:55 AM