Sardar Vallabhbhai Patel The Iron Man: దేశాన్ని ఏకం చేసిన దక్షత
ABN , Publish Date - Oct 30 , 2025 | 01:49 AM
ఉక్కు మనిషిగా పేరుగాంచిన గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్. దేశ సమైక్యత, సమగ్రత పట్ల ఆయన దూరదృష్టి, సాహసం, స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో...
ఉక్కు మనిషిగా పేరుగాంచిన గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్. దేశ సమైక్యత, సమగ్రత పట్ల ఆయన దూరదృష్టి, సాహసం, స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో పలు విపత్కర సమస్యలను ఎదుర్కొని దేశాన్ని ముందుకు నడిపించిన విధానాన్ని ప్రజలందరూ ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు.
గుజరాత్‌లోని నాడియాడ్‌లో 1875 అక్టోబర్ 31న జన్మించిన వల్లభ్‌భాయ్, బారిష్టరు చదువు పూర్తి చేసుకొని అహ్మదాబాద్‌లో లాయరుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర్య ఉద్యమంలో అడుగుపెట్టి, గాంధీతో పాటు ఎన్నో పోరాటాల్లో భాగస్వాములయ్యారు. లాయర్‌గా తన ప్రాక్టీస్‌ను వదిలిపెట్టి ఉద్యమాలు సాగించారు. పాశ్చాత్య వస్త్రధారణ వదిలేసి, నిరాడంబరత అలవర్చుకుని, స్వదేశీ భావనకు అలవాటుపడ్డారు. మహాత్మాగాంధీ ఆలోచనలను, భావాలను సరైన దృష్టికోణం నుంచి అర్థం చేసుకున్న రాజకీయ నాయకులలో సర్దార్ పటేల్ ఒకరు. గాంధీజీ ‘స్వరాజ్యం నుంచి సురాజ్యం’ గురించి చెబితే, పటేల్ స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్పు చేసే సుపరిపాలనకు, సంస్కరణలకు దారితీసిన ఆద్యుడు. గుజరాత్‌లోని ఖేదా, బార్డోలీ ప్రాంతాల్లో గాంధీ ప్రేరణతో పటేల్ నడిపిన సత్యాగ్రహం, అపూర్వమైన రైతాంగ ఉద్యమం ఆయనకు చరిత్రలో చిరస్థానాన్ని కల్పించాయి.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి, విభజన గాయాలు చెలరేగుతున్న అస్థిర కాలంలో మొదటి హోం శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పటేల్ మొదట సంస్థానాలను విలీనం చేసి దేశాన్ని ఏకం చేయటంలో ప్రముఖ పాత్ర పోషించారు. తన దౌత్య చాతుర్యంతో, ధైర్యంతో, స్పష్టమైన నిర్ణయాలతో అనేక సమస్యలను పరిష్కరించారు. బ్రిటిష్ పాలకులు దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినప్పటికీ సంస్థానాల విషయంలో మెలిక పెట్టి వెళ్లడం సమస్యగా మారింది. అప్పటికి దేశంలో ఉన్న 565 సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు ఆంగ్లేయులు. అందులో 562 సంస్థానాలను సామ దాన భేద దండోపాయాలతో పటేల్ భారత్‌లో చేర్చగా... కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని భీష్మించాయి.
గుజరాత్‌లోని జాంనగర్ పూర్వ రాజైన జాంసాహిబ్‌కు చెందినది. అధికార బదిలీకి ఇంకా రెండు నెలల గడువు ఉండగా ఈలోపే జాంసాహిబ్ కతియావర్ ప్రాంత రాష్ట్రాలన్నిటినీ కలిపి పాకిస్థాన్ సహాయంతో ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ ఉద్దేశ్యంతో ఢిల్లీలోని తోటి సంస్థానాధీశులను కలవబోతున్నాడని పటేల్‌కు తెలిసింది. ఆ వెంటనే జాంసాహిబ్ సోదరుడైన కల్నల్ హిమ్మత్‌సింగ్ ద్వారా వారిని తన ఇంటికి విందుకు తీసుకురావాలని పటేల్ కోరాడు. భోజన సందర్భంలో పటేల్ తన ఆత్మీయతతో, ప్రేమతో జాంసాహిబ్ హృదయాన్ని గెలుచుకున్నారు. జాంసాహిబ్ స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను విరమించుకున్నాడు.
మరో సంఘటన షేక్ అబ్దుల్లాకు సంబంధించినది. కశ్మీర్‌ను పాలిస్తున్న రాజా హరిసింగ్ భారత యూనియన్‌లో కలవాలనుకోగా, కశ్మీర్‌లో ‘నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ’ నాయకుడు షేక్ అబ్దుల్లా మాత్రం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఆశించి, దానికై ఎడతెగని ప్రయత్నాలు ఆరంభించాడు. దేశానికి మకుటమైన కశ్మీర్– రక్షణ దృష్ట్యా, సంస్కృతి దృష్ట్యా, ప్రకృతి సౌందర్యం దృష్ట్యా ఎంతో కీలకమైన ప్రదేశం. రాజ్యాంగ పరిషత్‌లో కశ్మీర్‌కు సంబంధించిన ‘ఆర్టికల్ 370’పై చర్చిస్తున్న సమయంలో అసహనంతో ఉన్న షేక్ అబ్దుల్లా తన స్థానం నుంచి లేచి ‘‘నేను తిరిగి కశ్మీర్‌కు వెళుతున్నాను’’ అని సభలో ప్రకటించాడు. దీంతో ప్రధాని నెహ్రూ లేని కారణంగా రాజ్యాంగ పరిషత్‌లో ఉన్న పటేల్, ‘‘ఈ రోజు సభ నుంచి వెళ్లి రైలులో కూర్చోవచ్చు. కానీ ఆ రైలు మాత్రం ఢిల్లీని దాటి వెళ్లబోదు’’ అనే సందేశాన్ని తెలియజేశారు. పరిణామాలను గ్రహించిన షేక్ అబ్దుల్లా తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.
హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఉంది. సొంత కరెన్సీ, సొంత రైల్వే, సొంత సైన్యం ఉన్న హైదరాబాద్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని నిజాం ప్రయత్నించారు. భారత్‌లో విలీనానికి గడువు కావాలని, అప్పటివరకు స్వతంత్రంగా ఉంటామని ప్రతిపాదించారు. అందుకు పటేల్ అంగీకరించలేదు. ఎందుకంటే, భారత్‌తో గడువు కోరిన నిజాం, మరోవైపు పాకిస్థాన్‌కు రూ.20 కోట్లు ఇచ్చినట్లుగా ఆధారాలు దొరికాయి. అంతేగాక, హైదరాబాద్ సంస్థానం తరఫున కరాచీలో ప్రజా సంబంధాల అధికారిని కూడా నిజాం నియమించారు. దీంతో నిజాం వైఖరిపై పటేల్‌కు సందేహం కలిగింది. పటేల్ ఆదేశాలతో మేజర్ జనరల్ జె.ఎన్.చౌధురి నేతృత్వంలో ‘ఆపరేషన్ పోలో’ 1948 సెప్టెంబర్ 13న మొదలై అదే నెల 18 సాయంత్రానికి పూర్తయింది. సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని రెండు వైపుల నుంచి ముట్టడించి పటేల్ స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 17న భారత్ యూనియన్‌లో విలీనం చేసి హైదరాబాద్ రాష్ట్రంలో మువ్వన్నెల భారత పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పటేల్‌ను ఉద్దేశించి రష్యా ప్రధాని నికోలయి బుల్గనిన్ ‘‘మీరు రాజులను అంతం చేయకుండానే, రాజుల పాలనను అంతం చేశారు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు పటేల్ పరిపాలనా దక్షతకు అద్దం పడుతుంది.
పటేల్ ఒక వైపు సంస్థానాల విలీనంతో పాటు మరోవైపు భారత పరిపాలన వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కూడా కృషి చేశారు. స్వాతంత్ర్యానంతరం పాలనలో సారూప్యతను, దేశ సమైక్యతను సాధించాలనే సంకల్పంతో అఖిల భారత సర్వీసులను (ఐఏఎస్, ఐపీఎస్) ఏర్పాటు చేశారు. అందుకే ఆయనను అఖిల భారత సివిల్ సర్వీసుల పితామహుడుగా (‘‘Father of All India Services’’) అభివర్ణిస్తారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడంలో పటేల్ కృషి మరువలేనిది. మొదటి సాంస్కృతికశాఖా మంత్రిగా కూడా బాధ్యతలు అందించిన పటేల్ గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. అంతర్గత భద్రత వ్యవస్థ, సరిహద్దు పరిరక్షణ, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ మొదలైన అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
నేడు దేశ సమగ్రత, సమైక్యత అత్యంత ప్రధానమైన అంశం. భాష పేరుతో, మతం పేరుతో, కులం పేరుతో రెచ్చగొట్టి దేశాన్ని ముక్కలు ముక్కలు చెయ్యాలని చూస్తున్న విదేశీ స్వార్థ శక్తులకు స్వదేశంలో కూడా వంత పాడేవాళ్లు తోడయ్యారు. దేశంలోను ‘దక్షిణమూ ఉత్తరమూ వేర్వేరు’ అనే భావనను రేకెత్తించేందుకు కొందరు పన్నుతున్న కుయుక్తులను అణచివేసి మనమందరం ‘145 కోట్ల భారతీయులం’ అన్న భావన తీసుకురావడమే ప్రధాన లక్ష్యం. ఆనాడు పటేల్ ఈ దృఢ సంకల్పంతోనే రజాకార్లను, ప్రత్యేకవాదులను అణచివేశాడు. నేడు పటేల్ స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం నేర్పింది.
జాతి సమైక్య సారథిగా, నవభారత వారధిగా మన దేశ చరిత్రలో పటేల్ స్థానం సుస్థిరం. పటేల్ అంత్యక్రియలకు హాజరైన నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ‘‘సర్దార్ శరీరాన్ని ఈ అగ్ని దహించివేయొచ్చు. కానీ, ఆయన కీర్తిని దహించే అగ్ని ఈ ప్రపంచంలో లేదు’’ అన్నారు. కాలాలు మారినా ఇనుమడిస్తున్న ఆయన కీర్తే అందుకు ఋజువు.
బండారు దత్తాత్రేయ
మాజీ గవర్నర్
(రేపు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి)
ఇవి కూడా చదవండి:
కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..
మొంథా తుఫాను ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు
Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..