దేశ ఖనిజ భవిష్యత్తుకు ‘సప్తపది’
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:01 AM
గనులు, ఖనిజాలు దేశ సంపద సృష్టికి మూలం. వేలాది సంవత్సరాలుగా భారతదేశ ఆర్థికాభివృద్ధి, ప్రజల సంక్షేమం, దేశ భద్రతల్లో ఖనిజాల పాత్ర అత్యంత కీలకం. ప్రఖ్యాత తత్వవేత్త,...

గనులు, ఖనిజాలు దేశ సంపద సృష్టికి మూలం. వేలాది సంవత్సరాలుగా భారతదేశ ఆర్థికాభివృద్ధి, ప్రజల సంక్షేమం, దేశ భద్రతల్లో ఖనిజాల పాత్ర అత్యంత కీలకం. ప్రఖ్యాత తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త అయిన చాణక్యుడు కూడా తన అర్థశాస్త్రంలో దేశాభివృద్ధిలో ఖనిజాలు, గనుల పాత్ర ఎంత కీలకమో వివరించారు. 2500 ఏళ్ల క్రితం రాజస్థాన్‌లోని జావర్‌లో జింక్ మైనింగ్ జరిగిందని చారిత్రక ఆధారాలున్నాయి. కోహినూర్ వంటి విలువైన వజ్రాలు మన గనుల తవ్వకాల సందర్భంగా బయటపడ్డవే.
భారతదేశంలో స్వాతంత్ర్యానంతరం ఖనిజ సంపదపై ప్రత్యేకమైన దృష్టి సారించలేదు. కానీ గత పదేళ్లుగా ఈ రంగానికి పునరుత్తేజం కల్పించేందుకు వివిధ చర్యలు చేపట్టాం. గనుల వేలంలో పారదర్శకతను తీసుకువచ్చి 440కు పైగా బ్లాక్స్‌ను వేలం వేశాం. దీని వల్ల దాదాపు రూ.2.7 లక్షల కోట్ల లబ్ధి రాష్ట్రాలకు చేకూరింది. నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ (NMET) ద్వారా రూ.6వేల కోట్లు జమ అయ్యాయి. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (DMF)లో లక్ష కోట్లకు పైగా నిధులు జమ అయ్యాయి. అదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, కీలకమైన ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్) దేశ భద్రతలోనూ కీలకపాత్ర పోషించనున్నాయి. ఈ సందర్భంలో మన స్వాతంత్ర్యానికి వందేళ్లు పూర్తయ్యేనాటికి అంటే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం జరగాలనేది ప్రధానమంత్రి మోదీ ఉక్కు సంకల్పం. ఇందుకోసం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదంతో అభివృద్ధి, సంక్షేమంతో పాటుగా భద్రమైన దేశ భవిష్యత్తుకు సమ ప్రాధాన్యతనిస్తోంది. క్రిటికల్ మినరల్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడుతూ, ఈ రంగంలో దేశ భవిష్యత్తును నిర్దేశించేందుకు ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ను (NCMM) ప్రారంభించింది.
వికసిత భారత లక్ష్యాలను చేరుకోవడంలో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అత్యంత కీలకం. దేశ సుస్థిరాభివృద్ధితో పాటు, రవాణా, వ్యవసాయం, వైద్యం, ఇంధన భద్రత, సాంకేతిక పురోగతి, టెలికమ్యూనికేషన్స్, క్లీన్ ఎనర్జీ, తయారీ రంగంలో అడ్వాన్స్‌మెంట్, రక్షణ తదితర రంగాలకు క్రిటికల్ మినరల్స్ తగినంతగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
మరీ ముఖ్యంగా ప్రపంచదేశాలన్నీ క్లీన్ ఎనర్జీ వైపు, ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేస్తున్న తరుణంలో క్రిటికల్ మినరల్స్ ఒక ‘న్యూ ఆయిల్’ (ప్రత్యామ్నాయం)గా కనబడుతున్నాయి. లిథియం, కోబాల్ట్, నికెల్ వంటివి ఎలక్ట్రిక్ వాహనాల్లో, పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థలో, సెమీకండక్టర్స్‌లో కీలకం. అదే ఫాస్పేట్, పొటాష్, గ్లకొనైట్ మొదలైనవి వ్యవసాయ రంగానికి అవసరం. టైటానియం, బెరీలియం వంటి ఖనిజాలు వైమానిక రంగం, రక్షణ రంగంలో చాలా కీలకం. ఇలా క్రిటికల్ మినరల్స్.. దేశ భద్రత, ఇంధన భద్రత, ఆహార భద్రత, ఆర్థికాభివృద్ధిలో అత్యంత ప్రముఖమైన పాత్ర పోషించనున్నాయి.
భారతదేశం క్రిటికల్ మినరల్స్ కోసం పెద్దమొత్తంలో దిగుమతులపై ఆధారపడుతోంది. దీన్ని తగ్గించుకుని, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు, దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, విదేశాల్లో క్రిటికల్ మినరల్స్ గనులను తీసుకుని అక్కడి నుంచి ఉత్పత్తిని పెంచుకోవడం వంటివి చాలా అవసరం. అందుకే 24 క్రిటికల్ మినరల్స్ జాబితాను నిర్దేశించుకుని, దేశీయంగా వెలికితీత, విదేశాల్లోని గనుల నుంచి సేకరణ, రీసైక్లింగ్ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని, వ్యూహాత్మకంగా ‘సప్తపది’ నినాదంతో మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులోని పలు అంశాలపై ఇప్పటికే పనిచేస్తున్నప్పటికీ, ఈ వేగాన్ని టాప్ గేర్‌లో ముందుకు తీసుకెళ్లేందుకు ఏడు అంశాలను నిర్దేశించుకుని పని మొదలుపెట్టనుంది.
ఈ సప్తపదిలో మొదటిది- దేశీయంగా క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తిని పెంచడం. దిగుమతులను తగ్గించుకునేందుకు ఇదొక కీలకమైన ప్రక్రియ. భారతదేశంలోనూ గణనీయమైన ఖనిజ సంపద ఉంది. దీన్ని వెలికి తీసి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ఎక్స్‌ప్లొరేషన్ ప్రయత్నాలను వేగవంతం చేసింది. 2020–-21లో GSI చేతిలో 65 ప్రాజెక్టులు మాత్రమే ఉంటే, 2025–-26 నాటికి 227 ప్రాజెక్టుల్లో ఎక్స్‌ప్లొరేషన్ పనులు చేపట్టింది. దీంతోపాటుగా NMET ద్వారా ప్రైవేటు ఏజెన్సీలకు కూడా ఐదు విడతల క్రిటికల్ మినరల్స్ గనులను వేలం విషయంలోనూ ఊహించని స్పందన కనిపించింది. 10 రాష్ట్రాల్లోని 23 క్రిటికల్ మినరల్ బ్లాక్స్ కేటాయింపులు పూర్తయ్యాయి. ఇలా దేశీయంగా క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తికి బాటలు పడటం, మన వనరులను వెలికితీయడంతోపాటుగా గ్లోబల్ సప్లయ్ చైన్స్‌పై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తాయి.
రెండో కీలకమైన అడుగు– విదేశాల్లోని కీలకమైన ఖనిజాల గనుల్లో నుంచి క్రిటికల్ మినరల్స్‌ను సేకరించడం. భారతదేశంలో లిథియం, నికెల్, కోబాల్ట్ మొదలైన కొన్ని మినరల్స్ లభ్యత తక్కువగా ఉంది. అందుకోసం ఈ ఖనిజాల లభ్యత ఎక్కువగా ఉన్న దేశాలతో ఒప్పందాలు చేసుకుని అక్కడినుంచి వీటిని సేకరించేందుకు ‘కాబిల్’ (ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్) అనే ప్రభుత్వ రంగ సంస్థ 2019లో ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఇప్పటికే అర్జెంటీనాతో పాటుగా వివిధ దేశాలతో ఆ దేశాల్లోని ఖనిజాల సేకరణకు ఒప్పందాలు చేసుకుని ముందడుగు కూడా వేశాం. అర్జెంటీనాలో 15,500 హెక్టార్ల పరిధిలో 5 లిథియం బ్లాక్స్‌లో ఎక్స్‌ప్లొరేషన్ ఒప్పందం జరిగింది. ఇతర దేశాల్లోనూ ఇదే విధంగా క్రిటికల్ మినరల్ బ్లాక్స్‌ను చేజిక్కించుకునేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నాం. ఇందులో ప్రైవేటు సంస్థల సహకారం చాలా కీలకం. అందుకే ఆయా సంస్థలకు కూడా పెద్దపీట వేస్తున్నాం.
మూడోది– క్రిటికల్ మినరల్స్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయడమూ, విదేశాల నుంచి సేకరించడమూ ఒక ఎత్తయితే.. వినియోగం పూర్తయిన వాటిని రీసైక్లింగ్ (శుద్ధి చేసిన తర్వాత పునర్వినియోగం) చేయడం మరో కీలకమైన అంశం. రీసైక్లింగ్ పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలను మరో అడుగు ముందుకు తీసుకెళ్లినట్లవుతుంది.
నాలుగోది– క్రిటికల్ మినరల్స్ వినియోగానికి సంబంధించి దేశీయంగా మార్కెట్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం. దీనికి సంబంధించిన పెట్టుబడులను ఆహ్వానిస్తూ పోటీ తత్వాన్ని పెంచేందుకు NCMM దోహదపడుతుంది.
దీంతోపాటుగా క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్, రీసైక్లింగ్‌పై విస్తృతంగా పరిశోధనలు జరపడంతోపాటుగా సాంకేతికత పురోగతి కోసం 2031 నాటికి మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఏర్పాటుచేయడం క్రిటికల్ మినరల్ మిషన్‌లో ఐదవది. ఈ మిషన్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో నిపుణత కలిగిన మానవ వనరుల అభివృద్ధి చేస్తాం. ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన నిధుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉంది. మొత్తం 16,300 కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. ఇది కాకుండా ప్రైవేటు రంగం, ప్రభుత్వ రంగ సంస్థలను భాగస్వాములు చేస్తూ వారి ద్వారా మరో రూ.18 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది కాకుండా క్రిటికల్ మినరల్స్‌ను తీసుకొచ్చేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఫండింగ్, ఫైనాన్సింగ్, ఇన్సెంటివ్స్ (టాక్స్ క్రెడిట్, సాఫ్ట్ లోన్స్ వంటి వాటి ద్వారా క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తికి ప్రోత్సాహం కల్పించడం) వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తాం.
ఇదంతా వచ్చే ఆరేళ్ళ కోసం నిర్దేశించుకున్న ప్రణాళిక మాత్రమే. ఆ తర్వాత దీన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తూ 2047 నాటికి ‘వికసిత భారత లక్ష్యా’న్ని సాకారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆలోచిస్తోంది. వివిధ రంగాల్లో ఆధునికతను తీసుకురావడంతోపాటుగా, భవిష్యత్తులో దేశభద్రతను సునిశ్చితం చేసే ఈ క్రిటికల్ మినరల్స్ విషయంలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకం. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా, ఆత్మనిర్భరతను చాటుకునేందుకు, భారతదేశ ఆకాంక్షల సాకారానికి క్రిటికల్ మినరల్ మిషన్ ఓ మైలురాయిగా నిలవనుంది.
కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి
Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం