Sachidanand Sinha: రేపటి భారత్‌కు ఒక భావయోధుని బాట
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:24 AM
ఇరవయో శతాబ్ది నవంబర్ 19, 2025న ముగిసింది. సోషలిస్టు భావజాలానికి చిరిగిపోయిన జెండా చిహ్నం లాంటి సచ్చిదానంద్ సిన్హా ఆ రోజున కన్నుమూశారు. ఆయన మరణం ఇరవయో శతాబ్దికి ముగింపు అని...
ఇరవయో శతాబ్ది నవంబర్ 19, 2025న ముగిసింది. సోషలిస్టు భావజాలానికి చిరిగిపోయిన జెండా చిహ్నం లాంటి సచ్చిదానంద్ సిన్హా ఆ రోజున కన్నుమూశారు. ఆయన మరణం ఇరవయో శతాబ్దికి ముగింపు అని నేను సునిశ్చితంగా విశ్వసిస్తున్నాను. అవును, ఒక శకం ముగిసింది. పట్టభద్రుడు కూడా కాని సచ్చిదా జీ మేధా దిగ్గజంగా ప్రభవించారు. మానవుడు నిర్మించిన, నిర్మిస్తోన్న సమస్త చరిత్రను సాధికారంగా వివరించగల వివేకశీలి, అంతఃప్రేరణతో ఒక సమున్నత లక్ష్య సాధనకు అంకితమైన ఆలోచనాశీలి సచ్చిదా జీ. తాను విశ్వసించిన భావజాలానికి విశేష గౌరవాన్ని సమకూర్చి, ప్రజామోదాన్ని సాధించిన సోషలిస్టు ఆలోచనా యోధుడు సచ్చిదానంద్ సిన్హా. ఆయన నిష్ర్కమణతో సోషలిస్టు భావజాల సంప్రదాయం కాలంలోకి జారిపోయింది. నాకు తెలిసిన సోషలిస్టు భావజాల ప్రాభవం అంతరించింది.
సచ్చిదానంద్ సిన్హా లాంటి ఆలోచనా యోధుడి మరణాన్ని మేధా ప్రపంచం పట్టించుకోకపోవడం ఈ కాలం లక్షణమేమో?! విద్యా ప్రపంచంలో ఇప్పుడు ప్రభావశీలురుగా ఉన్నవారెవరూ బహుశా, సచ్చిదా జీ గురించి విని ఉండకపోవచ్చు. ఇక మీడియా ప్రతినిధులు కూడా అందుకు భిన్నమైనవారు కాదు. పట్నా నుంచి వెలువడే హిందీ దినపత్రిక ‘ప్రభాత్ ఖబర్’, న్యూఢిల్లీ నుంచి వెలువడే ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో మాత్రమే ఆయన మరణ వార్త వచ్చింది. సమాజం బాగు కోసం శ్రమించిన కొంతమంది ఆలోచనాపరులను విస్మృతులను చేసిన కారణాలు సచ్చిదా జీ విషయంలో వర్తించవు. చాలా మంది క్రియాశీలురు అయిన ఆలోచనాపరుల వలే కాకుండా సచ్చిదా జీ విస్తృతంగా రచనా వ్యాసంగం చేశారు. ఆరు దశాబ్దాల ప్రజా జీవితంలో ఆయన రెండు డజన్లకు పైగా పుస్తకాలు, వందలాది వ్యాసాలు రాశారు. చాలా మంది సోషలిస్టుల వలే సచ్చిదా జీ కూడా ఆంగ్ల భాషను వ్యతిరేకించలేదు. తన రచనా వ్యాసంగం తొలి కాలంలో చాలా పుస్తకాలు, వ్యాసాలు ఇంగ్లీష్‌లోనే రాశారు. ‘సోషలిజం అండ్ పవర్’, ‘ది ఇంటర్నల్ కాలనీ’, ‘ది బిటర్ హార్వెస్ట్’, ‘ది క్యాస్ట్ సిస్టమ్’ ‘కేయాస్ అండ్ క్రియేషన్’ మొదలైన ఆయన ఆంగ్ల రచనలు భారతీయ సోషలిస్టు భావ జగత్తులో సుప్రసిద్ధమైనవి. ఆయన ప్రతి పుస్తకమూ సంబంధిత అంశాన్ని లోతుగా పరిశోధించి, స్థిరపడిన నమ్మకాలను నిశితంగా ప్రశ్నించింది. కొత్త ఆలోచనలను ప్రేరేపించింది. ఎనిమిది సంపుటాల ‘సచ్చిదానంద్ సిన్హా రచనావళి’ పేరిట ఆయన రచనలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆయన మౌలిక చింతకుడు. అసంపూర్ణంగా మిగిలిపోయిన మార్క్స్ ‘పెట్టుబడి’ గ్రంథం నాల్గవ భాగం గురించి 1950ల్లోనే సచ్చిదా జీ చాలా నిశితంగా, విపులంగా రాశారు. సమాజ భావి పునర్నిర్మాణానికి ఒక ప్రణాళికను ఆయన వెలయించారు. సౌందర్యశాస్త్రంలో కొత్త భావాలను ప్రతిపాదించారు. ఆయన వలే విస్తృతంగా వివిధ అంశాలపై రాసిన వ్యక్తి మరెవరైనా విద్యా ప్రపంచంలో ప్రముఖుడుగా వెలుగొందేవారు. అయితే సచ్చిదా జీకి అటువంటి ప్రఖ్యాతి లభించలేదు.
ఆ అనామకత్వానికి పాక్షిక కారణం ఆయన అసాధారణ జీవనయానమే. బిహార్‌లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో సచ్చిదా జీ జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో ఆయన రాజకీయ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రియాశీలత ఆయన్ను సోషలిస్టు ఉద్యమంలోకి తీసుకువెళ్లింది. ఫలితంగా ఆయన తన కళాశాల విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పవలసి వచ్చింది. బీఎస్సీ మొదటి సంవత్సరంలోనే ఆయన తన చదువును నిలిపివేశారు. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంగా ఉన్న ప్రాంతాలలోని గని కార్మికుల మధ్య పనిచేయాలని సోషలిస్టు పార్టీ సచ్చిదా జీని ఆదేశించింది. అక్కడ ఆయన కార్యదక్షతను గమనించిన పార్టీ నాయకత్వం ముంబైలో రైల్వే, ఓడరేవు కార్మికులను సంఘటితం చేసే బాధ్యతను అప్పగించింది (బిహార్ రాష్ట్ర ప్రభుత్వంలో సొంత తాతయ్య మంత్రిగా ఉండగా సచ్చిదానంద్ సిన్హా ముంబైలో రైల్వే కార్మికుడుగా ఉన్నారు). ప్రథమ సార్వత్రక ఎన్నికల (1952)లో ముంబైలో డాక్టర్ అంబేడ్కర్ తరఫున ఎన్నికల ప్రచారంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ముంబైలో ఆయన రాజకీయ విద్యాభ్యాసం పరిపూర్ణమయింది. పార్టీ కార్యాలయంలోని గ్రంథాలయాన్ని అందుకు ఆయన పూర్తిగా వినియోగించుకున్నారు. సాయంకాలం అధ్యయన శిబిరాలలో పాల్గొనేవారు. ఫ్రెంచ్, జర్మన్ భాషలను కూడా నేర్చుకున్నారు. సచ్చిదా జీ తొలి వ్యాసాలలోని మేధా నైశిత్యాన్ని గమనించిన రామ్‌మనోహర్ లోహియా తన మ్యాగజైన్ ‘మ్యాన్ కైండ్’ సంపాదకవర్గంలో చేరాలని సచ్చిదా జీని ఆహ్వానించారు.
మేధావి అయిన సచ్చిదా జీ రాజకీయ కార్యకర్తగానే ఉండిపోయారు. పార్టీ పదవులకు సైతం ఆరాటపడలేదు. భావాలనే తన రాజకీయాలకు ప్రధాన ఆలంబనగా చేసుకున్నారు. ఢిల్లీలో రెండు దశాబ్దాలు గడిపిన అనంతరం స్వస్థలమైన ముజాఫర్‌నగర్ జిల్లాలోని మనికా గ్రామానికి తిరిగివచ్చి తన జీవితంలో చివరి నాలుగు దశాబ్దాలు అక్కడే ఉండిపోయారు. పదవులు, అవార్డులు, ఫెలోషిప్‌లకు ఆయన ఆరాటపడలేదు. చాలా కొద్ది మంది సోషలిస్టు కార్యకర్తలు, హిందీ రచయితలకు మినహా సచ్చిదాజీ మేధా ప్రపంచానికి బయటి మనిషిగానే ఉండిపోయారు. విశ్వవిద్యాలయాలలో కమ్యూనిస్టులకు ఉన్నట్టుగా సోషలిస్టులకు పలుకుబడి లేదు ఈ కారణంగానే ఆయన మేధా కృషి గుర్తింపునకు నోచుకోలేకపోయింది. తనకు రావలసిన పేరు ప్రఖ్యాతులు రానందుకు సచ్చిదా జీకి ఎటువంటి పట్టింపూ లేదు. అయితే ఆలోచనల ప్రపంచానికి ఆయన భావాల ఉపయుక్తత అపారంగా ఉన్నది. ఈ సత్యాన్ని గుర్తించడమే సచ్చిదా జీకి సముచిత నివాళి అవుతుంది.
సామాజిక ఒంటరితనం (భావసారూప్యత ఉన్న వ్యక్తుల నుంచి కూడా వేరుగా ఉండవలసిరావడం) కంటే కూడా మేధోపరమైన ఒంటరితనమే (ఆలోచనాశీలుర ప్రపంచపు ఆచారాలు, ఆనవాయితీలు అనుసరించేందుకు అచంచలమైన విముఖత చూపడంతో ఎదురైన ప్రతికూలతలు) సచ్చిదా జీ ఉపేక్షితుడై విస్మృతుడు అయ్యేందుకు దారితీసింది. నిర్దిష్ట, ప్రత్యేక ఆసక్తులు, నైపుణ్యాల ఆధారిత విద్యా ప్రపంచ క్రమశిక్షణ సరిహద్దులకు కట్టుబడి ఉండేందుకు ఆయన నిరాకరించారు. మానవీయ, సామాజిక శాస్త్రాలలోనే కాదు, భాషా సాహిత్యాలు, లలిత కళలలో కూడా ఆయనకు అపారమైన ఆసక్తి ఉన్నది. పలు విషయాలను ప్రగాఢంగా అధ్యయనం చేశారు. రాజకీయ ప్రాథమ్యాల ప్రాతిపదికన వివిధ విషయాలను లోతుగా పరిశోధించారు. ఆయన మేధో కృషి పుస్తకాలు, వ్యాసాల రచనకే పరిమితం కాదు. రాజకీయ కార్యకర్తల శిక్షణకు కరపత్రాలు, చిన్న పుస్తకాలు రాశారు. పార్టీ దైనందిన కార్యకలాపాలకు సంబంధించిన పత్రికా ప్రకటనలు కూడా ఆయనే రాసేవారు. బాలల కోసం పాటలు కూడా రాసిన సాహిత్యకుడు సచ్చిదానంద్ సిన్హా. ఆయన రచనలు సమగ్రమైన అవగాహనతో ఉంటాయి. నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించే అంతఃప్రేరణతో ఉంటాయి. ఆయన వచనం సరళంగా, సుబోధకంగా ఉంటుంది. ప్రత్యేక పరిభాష, ఊత పదాలను ఆయన ఉపయోగించరు. సందేశం సూటిగా, స్పష్టంగా ఉంటుంది. రాజకీయ కార్యకర్తలు, వివేచనాశీలురు అయిన పౌరులే సచ్చిదాజీ రచనల ప్రధాన పాఠకులు. ఆలోచన– ఆచరణ మధ్య వారధి నిర్మించేందుకు ఆయన రచనలు స్ఫూర్తినిస్తాయి.
సచ్చిదా జీ తన సొంత మేధా అజెండాను నిర్దేశించుకుని దానికి నిబద్ధమయ్యారు. అయితేనేం తన సమకాలికులను అమితంగా ప్రభావితం చేసిన మేధా చర్చల ప్రధాన అంశాలను ఆయన ముందుగానే సూచించారు. ‘అంతర్గత వలసవాదం’ (ఇంటర్నల్ కలోనియలిజం)పై ఆయన సిద్ధాంతం 1960లలో లాటిన్ అమెరికాలో ప్రభవించిన ‘పరాధీన’ (డిపెండెన్సీ) ఆలోచనా విధానాన్ని (సంపన్న, పేద దేశాల మధ్య అంతరాన్ని తగ్గించడంలో రెండవ ప్రపంచ యుద్ధానంతరం అనుసరించిన అభివృద్ధి నమూనాల వైఫల్యానికి ప్రతిస్పందనగా ఇది మొదలయింది) ప్రతిపాదించింది. 1990ల్లో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారానికి రాకపూర్వమే అధికార పీఠాల స్వరూపంగా రాజకీయ పార్టీల సంకీర్ణాలను ఆయన సమర్థించారు. కులం, రిజర్వేషన్లు విద్యా జగత్తులో అధ్యయన, పరిశోధనాంశాలుగా ప్రాధాన్యం పొందకముందే సచ్చిదా జీ ఆ విషయాలపై తన దృష్టిని కేంద్రీకరించారు. అభివృద్ధికి పరిమితులు ఉన్నాయని, పర్యావరణ విధ్వంసానికి అది దారితీస్తుందనే సత్యాలను ప్రపంచం గ్రహించకముందే ఆయన వాటి గురించి విస్పష్టంగా మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాహిత మేధావులు ప్రభావశీలంగా చర్చిస్తున్న వివిధ అశాలపై తాను ప్రతిస్పందించవలసిన అవసరముందని ఆయన భావించలేదు. వర్తమాన భారతదేశానికి అవసరమైన వినూత్న రాజకీయ చింతనాపరులకు సచ్చిదా జీ నిస్సందేహంగా ఒక ఆదర్శప్రాయుడు.
‘సాదా జీవన్, ఉచ్ఛ విచార్’ (నిరాడంబర జీవనం, ఉన్నత ఆలోచనలు) అన్న నీతివాక్యం గురించి పాఠశాల విద్యాభ్యాసంలో మేము నేర్చుకున్నాము. ఆ సమున్నత ఆదర్శానికి ప్రతినిధులుగా జీవించిన సచ్చిదానంద్ సిన్హా జీ, కిషన్ పట్నాయక్ జీ, అశోక్ శెక్సారియా జీ లను కలుసుకోవడం నా జీవిత మహద్భాగ్యంగా భావిస్తున్నాను. సచ్చిదా జీ ఒక సాధువుగా జీవించారు. భౌతిక సౌఖ్యాల పట్ల పూర్తి ఉదాసీనత చూపారు. రాజకీయ అధికారాన్ని కోరుకోలేదు. ప్రజాదరణ పొందాలనే దృష్టి లేదు. గుర్తింపు కోసం ప్రాకులాడలేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఒక సమున్నత ఆశయ సాధనకు కట్టుబడి తనను తాను పట్టించుకోని నిస్వార్థజీవి సచ్చిదా జీ. తనను తాను ప్రముఖుడుగా భావించుకోని మహోన్నతుడు ఆయన. తన ఆలోచనలను వ్యతిరేకిస్తున్న వారి భావాలనూ ఆయన గౌరవించారు. రాజకీయ నిబద్ధతలపై రాజీపడలేదు. మేధా చిత్తశుద్ధిని వీడలేదు. వర్తమాన భారతదేశంలో రాజకీయ వివేచనా శూన్యతను తొలగించి, సమ్మిళిత, వినూత్న ఆలోచనలను పెంపొందించదలుచుకున్నవారు తొలుత సచ్చిదానంద్ సిన్హా రచనలను అధ్యయనం చేయాలి.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఇవి కూడా చదవండి
5 బీసీ కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమించిన ప్రభుత్వం
అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్