Share News

నిరుద్యోగం కోరల్లో యువత

ABN , Publish Date - May 21 , 2025 | 05:33 AM

భారతదేశంలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. డిగ్రీలు పుచ్చుకున్న చాలా మంది యువతకు సరైన ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. దేశంలోని మొత్తం జనాభాలో నిరుద్యోగ రేటు 2024 ప్రారంభంలో సగటున 7.5 శాతంగా ఉంది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య యువతలో...

నిరుద్యోగం కోరల్లో యువత

భారతదేశంలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. డిగ్రీలు పుచ్చుకున్న చాలా మంది యువతకు సరైన ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. దేశంలోని మొత్తం జనాభాలో నిరుద్యోగ రేటు 2024 ప్రారంభంలో సగటున 7.5 శాతంగా ఉంది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య యువతలో ఇది 16.1 శాతంగా నమోదవడం ఆందోళన కలిగించే అంశం. 2022లో ఈ యువ నిరుద్యోగిత రేటు 23.2 శాతంగా ఉండేది. నగరాల్లో ఈ రేటు 5.1 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 3.4 శాతం. కానీ రాష్ట్రాల వారీగా చూస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.

విద్యా వ్యవస్థ, నైపుణ్యాల లేమి నిరుద్యోగ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. దేశంలో ప్రతి సంవత్సరం 15 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంజినీరింగ్‌ విద్యలో పట్టభద్రులవుతున్నా, వారిలో 80 శాతం మందికి ఆ ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు (Aspiring Minds) లేవని నివేదిక చెబుతోంది. ప్రస్తుతం కృత్రిమ మేధ (AI) కారణంగా చాలామంది ఉద్యోగాలను కోల్పోతున్నారు.


గ్రామీణ భారతంలోనూ ఈ నిరుద్యోగ సమస్య అధికంగానే ఉంది. దేశంలోని సుమారు 45 శాతం మందికి వ్యవసాయరంగం ఉపాధిని కల్పిస్తున్నా, దేశ జీడీపీలో దాని వాటా కేవలం 16.18 శాతం మాత్రమే! ఈ నిరుద్యోగ సమస్య సామాజికంగానూ తీవ్ర ప్రభావం చూపుతోంది. నిరుద్యోగిత, నేరాల మధ్య స్పష్టమైన సంబంధం ఉంది. NCRB నివేదిక ప్రకారం నిరుద్యోగం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో దోపిడీలు, దొంగతనాలు, హత్యల వంటివి అధికంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న యువత మానసిక ఒత్తిడికిలోనై, అనేక చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. ఇది దేశ భద్రతకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది.

MGNREGA ద్వారా గ్రామీణులకు 100 రోజులు ఉపాధి కల్పిస్తున్నా, వారి వాస్తవ జీతం సగటున రోజుకు రూ. 220–240 మాత్రమే! స్కిల్ ఇండియా ద్వారా శిక్షణ పొందినవారి లోనూ కేవలం 15 శాతం మందికే స్థిరమైన ఉద్యోగాలు లభిస్తున్నాయి. స్టార్టప్ ఇండియా ద్వారా 70,000కు పైగా స్టార్టప్‌లు రిజిస్టర్ అయినా, నిధుల కొరత, మానిటరింగ్ లోపాల కారణంగా వాటిలో సుమారు 95 శాతం స్టార్టప్‌ సంస్థలు ఐదు సంవత్సరాల్లోనే మూతబడ్డాయి. .


ఈ పరిస్థితిని అధిగమించాలంటే తయారీ రంగానికి దేశం అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. MSME లకు ఆర్థిక సాయం అందించాలి. విద్యా విధానాన్ని మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, ఉద్యోగాలు కల్పించేలా రూపొందించాలి. సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలి. యువతలో స్కిల్స్‌ పెంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. గ్రామీణ, పట్టణ వ్యత్యాసాలను తగ్గించే విధంగా సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం వ్యూహరచన చేయాలి.

మహమ్మద్ ఉబైద్‌ఖాన్

ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 05:33 AM