ప్రజావ్యతిరేక విధానాలకు ప్రతిఘటన
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:09 AM
నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల కారణంగా, పేదరికం, అసమానతలు, ఆకలి, నిరుద్యోగం పెరిగాయి. కార్మికుల వేతనాలు 2017–18 స్థాయి కంటే పడిపోయాయి. మరొకవైపు, కార్పొరేట్...
నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల కారణంగా, పేదరికం, అసమానతలు, ఆకలి, నిరుద్యోగం పెరిగాయి. కార్మికుల వేతనాలు 2017–18 స్థాయి కంటే పడిపోయాయి. మరొకవైపు, కార్పొరేట్ కుటుంబాల ఆస్తులు, సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి నాలుగు కార్మిక కోడ్‌లను అమలుచేయాలని ప్రయత్నించారు. కార్మికులు పోరాడి, అనేక త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులన్నిటినీ రద్దు చేయాలని భావించారు. రాజ్యాంగ స్ఫూర్తినీ, సుప్రీంకోర్టు తీర్పులనూ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలన్నిటినీ భూస్థాపితం చేయ సంకల్పించారు. కార్మిక కోడ్‌లు అమలులోకి వస్తే ఎనిమిది గంటల పనిదినం, కనీస వేతనాలు, సామాజిక భద్రత, సంఘం పెట్టుకునే హక్కు, సంఘాల రిజిస్ట్రేషన్లు– గుర్తింపు, సమిష్టి బేరసారాల హక్కు, సమ్మె హక్కు, ఆందోళనలు చేసే హక్కులు అన్నీ తీవ్రమైన ప్రమాదంలో పడిపోతాయి.
దేశంలో మొత్తం పౌరహక్కుల పైనే తీవ్రమైన దాడి జరుగుతోంది. కార్మికవర్గ హక్కులపై జరుగుతున్న దాడిని దీనిలో భాగంగానే చూడాలి. యూఏపీఏ, పీఎంఎల్‌ఏ, బీఎన్‌ఎస్ (భారతీయ న్యాయ సంహిత) చట్టాలను పౌర హక్కులపై దాడికి ప్రయోగిస్తున్నారు. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 111 ప్రకారం, కార్మికులు సంఘటితంగా తమ హక్కులను డిమాండ్ చేస్తే, దాన్ని సంఘటిత నేరంగా పరిగణించి, తీవ్రమైన జైలుశిక్షలు, పెనాల్టీలు విధించవచ్చు. రైతాంగ హక్కులపై ప్రయోగించటానికి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. రైతు సంఘాల సుదీర్ఘ, సమరశీల పోరాటాల ఫలితంగా వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, మరో రూపంలో ఆ రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పంటల గిట్టుబాటు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని రైతాంగం చేస్తున్న డిమాండ్ పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ప్రభుత్వ ఈ చర్యలన్నీ, కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే! చట్టాల సంస్కరణలతో పాటు, అనేక భారాలు వేసి, ప్రజల నుంచి కొల్లగొట్టి వసూలు చేస్తున్న పన్నుల నుంచి ఇటీవల కార్పొరేట్లకు మరికొన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. కానీ కార్మికులకు మాత్రం ఎటువంటి ప్రోత్సాహకాలు ఉండవు. పాతపెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) తిరిగి ప్రవేశపెట్టాలని లక్షలాదిమంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. కానీ పాలకులు పట్టించుకోవటంలేదు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం(1995) కింద కనీస పెన్షన్ పెంచాలనీ, ఈ పథకాన్ని మెరుగుపరచాలన్న డిమాండునూ పట్టించుకోవడం లేదు.
బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించివేస్తూ, గ్రామీణ ఉపాధిహామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థల విచ్చలవిడి ప్రైవేటీకరణకు పూనుకుంటున్నారు. ఎల్‌ఐసీలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. తపాలారంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని దెబ్బతీసే విధంగా పోస్టల్ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. కీలకమైన, దేశ భద్రతా అంశాలకు వాటిల్లబోయే ముప్పును కూడా పట్టించుకోవడం లేదు. రక్షణ, అంతరిక్షం, బ్యాంకులు, రైల్వే, పోస్టల్, విద్యుత్, పెట్రోలియం, జనరల్ ఇన్సూరెన్స్, బొగ్గు, ఉక్కు, విద్యుత్, స్పెక్ట్రం, భూగర్భంలోని ఖనిజాలు, సర్వం ప్రైవేట్ మయం చేస్తున్నారు.
ప్రభుత్వం, యాజమాన్యాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించే అధికారిక త్రైపాక్షిక వేదిక ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్. 1942 నుంచి ఇప్పటికి 46 సమావేశాలు జరిగాయి. చివరి సమావేశం 2015లో జరిగింది. గత 10సంవత్సరాలుగా, కేంద్ర కార్మిక సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశం జరపటం లేదు.
ఈ కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దేశ సరిహద్దులలో నెలకొన్న పరిస్థితుల వల్ల మే నెల 20న జరగాల్సిన సమ్మెను జూలై 9కి వాయిదా వేశారు. నాలుగు కార్మిక కోడ్‌ల రద్దుతో పాటు, రూ.26,000 కనీస వేతనం, 8 గంటల పనిదినం, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఆశా, అంగన్వాడి తదితర స్కీం వర్కర్స్ రెగ్యులరైజేషన్, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశ నిర్వహణ, మరికొన్ని డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మె జరుగుతున్నది. సంయుక్త కిసాన్ మోర్చా కూడా ఈ కార్యాచరణలో పాల్గొనాలని నిర్ణయించటమే గాక, అదే రోజున గ్రామీణ బంద్‌కు పిలుపునివ్వటం ముదావహం.
వెలుగూరి రాధాకృష్ణమూర్తి
ఏఐటీయూసీ నాయకులు
ఈ వార్తలు చదవండి:
అరబ్బు దేశంలో ఆటోమొబైల్ ఇంజినీర్.. ఆంధ్రలో ఆదర్శ రైతుగా..
యూఎస్ఏలో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం