ప్రయోగశాలగా మిగిలిన రెవెన్యూ
ABN , Publish Date - May 21 , 2025 | 05:44 AM
‘రోజులు మారాయి’ (1955) సినిమాలో కరణాన్ని కలెక్టర్ నిలదీసే సన్నివేశం పేద రైతులను బాగా ఆకట్టుకునేది. కరణం వేసే ఎత్తులు జిత్తులు చూడటం కోసం తండోపతండాలుగా వెళ్లి చూసిన అనుభవం. ప్రస్తుత పరిస్థితి అంతకంటే భిన్నంగా ఏమీ లేదు...
‘రోజులు మారాయి’ (1955) సినిమాలో కరణాన్ని కలెక్టర్ నిలదీసే సన్నివేశం పేద రైతులను బాగా ఆకట్టుకునేది. కరణం వేసే ఎత్తులు జిత్తులు చూడటం కోసం తండోపతండాలుగా వెళ్లి చూసిన అనుభవం. ప్రస్తుత పరిస్థితి అంతకంటే భిన్నంగా ఏమీ లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టగానే 1984లో పటేల్–పట్వారి వ్యవస్థను రద్దు చేసింది. దాన్నొక విప్లవాత్మక విజయంగా భావించారు. కానీ నిజానికి అది ముందూ–వెనకా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం. ప్రత్యామ్నాయం ఆలోచించకుండా ఆ వ్యవస్థను రద్దు చేయటం గ్రామీణ పాలనా వ్యవస్థను శూన్యంలోకి నెట్టివేసింది. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ల వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ప్రక్రియ మనకు కళ్ళ ముందే ఉంది. నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు కావలసింది ఏమిటో వదిలేసి పాలకులు గ్రామ రెవెన్యూ వ్యవస్థలను తమకు నచ్చిన పద్ధతుల్లో మారుస్తున్నారు. 1957–58 నుంచి ముప్ఫై ఏళ్ళ పాటు రాష్ట్ర భూమి శిస్తు ఆదాయం 29.5 శాతం ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక దేవుడికి ఇచ్చిన భూమికి పన్ను వసూలు ఏమిటంటూ భూమి శిస్తు రద్దు చేసింది. జాతీయ ఆదాయంలో భూమి శిస్తు జమ అయ్యేది 30.5 శాతంగా ఉండేది. అది 1991 నాటికి 1.7 శాతానికి పడిపోయింది. ప్రభుత్వాలకు భూమి శిస్తుతో అవసరం తీరిపోయి ఇది రద్దు అయ్యింది.
గ్రామీణ సమాజమంతా వ్యవసాయ భూమి చుట్టూ అల్లుకుని ఉంటుంది. భూమికి గ్రామ రెవెన్యూ రికార్డులు కీలకం. భూమి బదలాయించాలంటే రిజిస్ట్రేషన్ శాఖకు వెళ్లాలి. అలాగే భూమి మీద ఏదైనా పేచీ ఉంటే న్యాయస్థానాలకు వెళ్లాలి. భూమిపై యాజమాన్యపు బాధ్యతను ప్రభుత్వం తీసుకోదు. కానీ, యాజమాన్యపు హక్కులను నమోదు చేసుకొని పట్టాదారు సమ్మతితోనే ఆ భూమికి హక్కు (టైటిల్) స్థిరీకరించి కాపలాదారుగా (కస్టోడియన్) ఉంటుంది. రెవెన్యూ చట్టాల అమలుకు భూమి హక్కుల రికార్డు కీలకమైంది. ఒక తహశీల్దారుకు జ్యుడీషియల్ అధికారి హోదా ఉంటుంది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యమైతే పాలన కుంటుపడుతుంది. చివరికి నష్టపోయేది పేద రైతులే.
1984లో కరణం, పటేల్ వ్యవస్థ రద్దయిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ ఫోర్త్ పరీక్షలు రాసిన అభ్యర్థులను 4,800 మందిని భర్తీ చేసింది. మూడు నెలల ట్రైనింగ్ అనంతరం వీరికి ఐదు నుంచి ఆరు గ్రామాల బాధ్యతలు ఇచ్చారు. వీరంతా పనులు ప్రారంభించినప్పటికీ రికార్డుల నిర్వహణ, రెవెన్యూ పాలన అస్తవ్యస్తమయ్యింది. గ్రామానికి ఉన్న భూమి లెక్కలన్నీ తారుమారయ్యాయి. చివరికి భూ విస్తీర్ణం లెక్కలు చూపించగల జమాబందీ పనుల కోసం తొలగించిన గ్రామ కరణాల మద్దతు తీసుకోవలసి వచ్చింది.
1990లో వీఏఓ లను తీసుకున్నారు. ఇందులో గతకాలపు పటేల్ – పట్వారీలలో పదవ తరగతి పాస్ అయిన వారిని చేర్చుకున్నారు. కొంతలో కొంత వ్యవస్థ గాడిలో పడింది. ఆ కాలంలోనే 12–12–2001 తేదీన జీవో నెం.369 ద్వారా వీఏవో పేరును రద్దు చేసి పంచాయతీ కార్యదర్శిగా మార్చారు. ఎండిఓ అజమాయిషీలో వీరిని పని చేయిస్తూ అటు గ్రామ అభివృద్ధి, ఇటు రెవెన్యూ పనులు అప్పగించారు. ఇందులో మూడోవంతు పార్ట్ టైం అసిస్టెంట్స్‌గా చేరారు. ఇందులో రెవెన్యూ అనుభవం ఉన్నవారు కొందరే. మిగతా వారికి రెవెన్యూ వ్యవహారాల అనుభవం గాని, పరిజ్ఞానం గాని లేదు. ఎండిఓలు వీరి చేత గ్రామ అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారు. రెవెన్యూ పనుల్ని నిర్లక్ష్యం చేశారు. అంటే ఎమ్మార్వో, ఎండిఓ హోదాలను కలపాలని చూసారు. ఎండిఓలు తమ చేతికి రెవెన్యూ అధికారాలు వస్తాయని తెగ సంబరపడిపోయారు. భూ పరిపాలన మళ్లీ మొదటికి వచ్చింది. 2007లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జీవో 105 ద్వారా రెవెన్యూ సెక్రెటరీ అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. అప్పటికి ఉన్న విలేజ్ అసిస్టెంట్లతో పాటుగా 2,800 మందిని తీసుకున్నారు. అందులో నుంచి 1219 మందిని సూపర్ న్యుమరీ జూనియర్ అసిస్టెంట్లుగా నియమించారు. ఆ వ్యవస్థ కూడా 2019 వరకు సాగింది.
2014లో రాష్ట్రం విడిపోయాక 2020 వరకు పాత పద్ధతిలోనే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలు నడిచాయి. కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ వ్యవస్థలు బాగానే పనిచేశాయి. గత ప్రభుత్వం 2–11–2020లో కంప్యూటరైజ్డ్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ లేదా ల్యాండ్ రికార్డు అప్డేషన్ ప్రోగ్రాంగా (LRUP) అన్ని రెవెన్యూ రికార్డులను ధరణి పోర్టల్ పేరుతో చట్టంగా చేసింది. వ్యవసాయ భూములను జాయింట్ రిజిస్ట్రార్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసేలా తహశీల్దారుకు అధికారమిచ్చారు. వ్యవసాయేతర భూములను సబ్ రిజిస్ట్రార్‌కు రిజిస్ట్రేషన్ చేసేలా చట్టం చేశారు. ఇప్పటివరకు ఉన్న వీఆర్వోలు అందరూ అవినీతిపరులంటూ ‘ధర్మ ఘంట’ పేరుతో మీడియా ముందు అవమానించి తొలగించారు. రెవెన్యూ రికార్డులు అన్నీ ధరణి చూసుకుంటుందన్నారు. 4–11–2020న 5301 మంది వీఆర్వో లను, 23,000 మంది వీఆర్ఏ లను ఇతర శాఖలోకి పంపారు. రెవెన్యూ శాఖ మూగదయింది. వీరితోపాటు ఆర్డీవో, జాయింట్ కలెక్టర్లకు అధికారాలు లేకుండా చేసి వ్యవస్థను నాశనం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల వాగ్దానంగా వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను పునరుద్ధరిస్తామని చెప్పింది. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామని వాగ్దానం చేసింది. ధరణి స్థానంలో వచ్చిన భూ భారతి అనే భూమి హక్కుల చట్టంపై సవాలక్ష సందేహాలు ఉన్నప్పటికీ తెలంగాణ రైతాంగానికి అరచేతిలో స్వర్గంలా దీన్ని చూపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3–4–2025న జీవో 129తో 10,954 మందిని గ్రామస్థాయిలో అధికారులుగా నియమించాలని నిర్ణయించింది. ఇతర శాఖలోకి బదిలీ కాబడిన వీఆర్ఓలు తిరిగి రెవెన్యూ శాఖలోకి రావడానికి వెసులుబాటు ఇచ్చింది. వీఆర్‌ఏల పరిస్థితి ఇంకా అనిశ్చితమే. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక ‘గ్రామ పాలన అధికారి’ (GPA) అనే కొత్త పేరుతో కొనసాగబోతారు.
1984 నుంచి 2025 వరకు ఎనిమిది సార్లు భూ చట్టాలను మార్పులు, చేర్పులు చేసారు. ప్రభుత్వానికి ఏ ఆదాయ వనరులనూ సమకూర్చని భూ పాలనపై ప్రభుత్వాలకు ఆసక్తి పోయింది. దీనితో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించి ఇష్టానుసారం భూ చట్టాలతో దాన్ని ప్రయోగశాలగా మార్చేశారు. ప్రభుత్వాల బాధ్యతలేనితనాన్ని అన్ని రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు గుర్తించి భూమి సమస్యలపై ప్రభుత్వం చేత బాధ్యతగా పని చేయించగలిగేలా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది.
వి. బాలరాజు
రిటైర్డ్ తాసిల్దారు
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News