Share News

బహుముఖ ప్రజ్ఞావంతురాలు

ABN , Publish Date - Jun 10 , 2025 | 03:40 AM

కొందరి జీవితాలు మహోన్నత శిఖరాలై వెలుగొందుతాయి. వారు తమ వ్యక్తిత్వ శోభతో, ఆచరణాత్మక కృషితో సమాజానికి ఆదర్శప్రాయులవుతారు. జూన్‌ 1న ఈ లోకాన్ని వీడిన విదుషీమణి డా. పి.చిరంజీవినీకుమారి ఆ కోవకే చెందుతారు. ఆమె 1931 మార్చి 30న జన్మించారు...

బహుముఖ ప్రజ్ఞావంతురాలు

కొందరి జీవితాలు మహోన్నత శిఖరాలై వెలుగొందుతాయి. వారు తమ వ్యక్తిత్వ శోభతో, ఆచరణాత్మక కృషితో సమాజానికి ఆదర్శప్రాయులవుతారు. జూన్‌ 1న ఈ లోకాన్ని వీడిన విదుషీమణి డా. పి.చిరంజీవినీకుమారి ఆ కోవకే చెందుతారు. ఆమె 1931 మార్చి 30న జన్మించారు. తన బతుకుబాటలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. ఆమె రాసిన ‘శ్రీశ్రీ సప్తతి మహోత్సవం’ ఒక చరిత్ర. ‘తూర్పుగోదావరి జిల్లా చరిత్ర, సంస్కృతి’ ఒక సంచలనం. తూ.గో జిల్లా సాహిత్య చరిత్ర ఒక కరదీపిక. ‘తూగో జిల్లా గోదావరి కథలు... అలలు’ ఇతర ప్రాంతాల వారికి స్ఫూర్తి. ‘గొల్ల రామవ్వ’ కథపై పీవీ శతజయంతి సందర్భంగా ఆమె రాసిన అభిప్రాయ మాలిక ఒక ప్రాంతీయాతీత సహానుభూతి. ఇవన్నీ చిరంజీవినీకుమారి ఆలోచనల ప్రతిరూపాలే. విలువల విధ్వంసం పట్ల మానవ సంబంధాల్లో వచ్చిన అవాంఛనీయ ధోరణుల పట్ల తీవ్ర ఆవేదన కనబరిచేవారు. గొప్ప జ్ఞాపకశక్తి ఆమె సొంతం. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేసి కాకినాడ కేంద్రంగా ప్రతిభావంతంగా నిర్వహించిన ఘనత ఆవిడది. తన దృఢచిత్తంతో ఐడియల్‌ కాలేజీకి వన్నె తెచ్చారు. ఆ కాలేజీని మెరుగైన విద్యాసంస్థగా తీర్చిదిద్దారు. చిరంజీవినీ కుమారి తన జీవితకాలంలో ఎన్నో పదవులనధిరోహించారు. ఏపీ స్టేట్‌ ప్రైవేట్‌ కాలేజీస్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా, వేణుగోపాల సంస్కృత ప్రచారసభ సెక్రటరీగా, తూగో జిల్లా గ్రంథాలయ సంఘం కార్యదర్శిగా, గిరిజన ప్రాంతపు ‘స్పందన’ స్వచ్ఛంద సేవాసంస్థ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం ఉపాధ్యక్షురాలిగా, ఏపీ హిస్టరీ కాంగ్రెస్‌ సభ్యురాలిగా పని చేశారు.


ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సాధన సమితి వైస్‌ ప్రెసిడెంట్‌గా, అధికార భాషా సంఘం సభ్యురాలిగా ఇలా ఎన్నో పదవులకు వన్నె తెచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తుమ్మల సాహితీ సత్కారం, షీ ఫౌండేషన్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ ఉమెన్‌ వంటి అనేక పురస్కారాలు పొందారు. అభ్యుదయవాదిగా, ప్రగతిశీల రచయిత్రిగా చిరంజీవినీకుమారి కాకినాడకు కీర్తి కిరీటంలా వెలుగొందారు. యానాంలో నిర్వహించిన ఈ వ్యాసకర్త కళారత్న పురస్కార అభినందన సభకు విచ్చేసి ఆశీస్సులు అందించారు. అదే ఆవిడ చివరగా పాల్గొన్న సభ. ఆచరణవాదిగా చిరంజీవినీకుమారి ఆకాంక్ష మేరకు కుటుంబసభ్యులు ఆమె పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం రంగరాయ మెడికల్‌ కాలేజీకి అప్పగించారు.

దాట్ల దేవదానం రాజు

ఇవి కూడా చదవండి

ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్

పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 03:40 AM