Railway Concessions: రైల్వే రాయితీల పునరుద్ధరణపై కేంద్రం నిర్లక్ష్యం
ABN , Publish Date - Jul 30 , 2025 | 01:06 AM
వృద్ధులకు ప్రయాణ టిక్కెట్లపై రాయితీలు, పాత్రికేయులకు ఉచిత రైలు పాస్‌లు ఇవ్వడం వంటి సదుపాయాలను గతంలో భారతీయ రైల్వే కల్పించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా 2020లో కేంద్రం...
వృద్ధులకు ప్రయాణ టిక్కెట్లపై రాయితీలు, పాత్రికేయులకు ఉచిత రైలు పాస్‌లు ఇవ్వడం వంటి సదుపాయాలను గతంలో భారతీయ రైల్వే కల్పించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా 2020లో కేంద్రం ఈ సదుపాయాలను తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనా తగ్గుముఖం పట్టి ఏళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఆయా రాయితీలను పునరుద్ధరించడం లేదు. పైగా ఈ సదుపాయాన్ని శాశ్వతంగా రద్దు చేసేలా కేంద్రం వ్యవహరించడం తీవ్ర ఆందోళనకరం. దేశ జనాభాలో సుమారు పది శాతం మంది వృద్ధులే. అంటే దాదాపు 14 కోట్లు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో పత్రికలు, ఆన్‌లైన్ మీడియా, ప్రాంతీయ చానెల్స్‌లో పనిచేసే పాత్రికేయులు వార్తల కవరేజీ కోసం నిరంతరం రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం కేంద్రం రాయితీలు నిలిపివేయడంతో వారందరికీ టికెట్ల భారం తప్పడం లేదు. బ్రిటన్ ప్రభుత్వం వృద్ధులకు ‘ఫ్రీడమ్ పాస్’ ద్వారా ఉచిత బస్సు, ట్రైన్ ప్రయాణాలు కల్పిస్తోంది. జర్మనీ, జపాన్, కెనడా వంటి దేశాల్లోనూ వృద్ధుల ప్రయాణ అవసరాలను గుర్తించి ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీలను ఇస్తున్నాయి. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థికభారాన్ని పూడ్చుకునేందుకే టికెట్ రాయితీలను నిలిపివేశామని చెబుతున్న కేంద్రం ప్రభుత్వం.. వందేభారత్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులకు మాత్రం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. 2023–24 రైల్వే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుల కోసం రూ. 2.4 లక్షల కోట్లు కేటాయించింది. టికెట్ రాయితీల వల్ల రైల్వేకు వార్షికంగా రూ. 1600 కోట్ల నష్టం జరుగుతోందని కరోనాకు ముందు(2019లో) కేంద్రం తెలిపింది. కానీ అదే ఏడాది రైల్వే ప్రకటనల కోసం రూ. 1200 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది! వృద్ధులకు, పాత్రికేయులకు ఇచ్చే రాయితీలను కొనసాగించలేకపోవడం నిధుల సమస్య అని చెప్పడం సత్యదూరం. రాయితీల పునరుద్ధరణ కోరుతూ దేశవ్యాప్తంగా పలు పౌర, పాత్రికేయ సంఘాలు కేంద్రానికి ఎన్ని వినతులు సమర్పించినా ఫలితం శూన్యం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైల్వే టికెట్లపై రాయితీలను పునరుద్ధరించాలి.
అప్పన్న గొనప, విశాఖపట్నం
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News