Share News

ఆలయ పరిరక్షణే ధర్మానికి బలం

ABN , Publish Date - Feb 09 , 2025 | 03:05 AM

దేశంలోని అన్ని వ్యవస్థల్లో జోక్యం చేసుకున్న బ్రిటిష్ వారు కూడా మన దేశంలోని దేవాలయాల పాలనలో జోక్యం చేసుకోలేదు. కారణం– కోట్లాది హిందూ ప్రజల మనోభావాలను గౌరవించటం వల్ల....

ఆలయ పరిరక్షణే ధర్మానికి బలం

దేశంలోని అన్ని వ్యవస్థల్లో జోక్యం చేసుకున్న బ్రిటిష్ వారు కూడా మన దేశంలోని దేవాలయాల పాలనలో జోక్యం చేసుకోలేదు. కారణం– కోట్లాది హిందూ ప్రజల మనోభావాలను గౌరవించటం వల్ల. నిజం చెప్పాలంటే ఆ కాలంలోనే దేశంలోని అన్ని దేవాలయాలు కళకళలాడాయి. పరమతావలంబీకులైనా కొందరు బ్రిటిష్ అధికారులు తిరుమల, కాంచీపురం, తిరువనంతపురం, మంత్రాలయం తదితర ఆలయాలకు కైంకర్యాలు సమర్పించుకున్నారని ఆయా దేవాలయాల చరిత్రలో చదువుకున్నాం. ఆ కాలంలో కూడా శ్రీవారికి ఇబ్బడిముబ్బడిగా సంపద వచ్చేది, దాన్ని శ్రీవారి సొమ్ము అని ఎంతో పవిత్రంగా చూస్తూ, ప్రతి పైసానీ సద్వినియోగం చేశారు. అంతేకాదు, ఎంతో పకడ్బందీగా జమాఖర్చుల పద్దునూ నిర్వహించేవారు. స్వాతంత్ర్యానంతరం కూడా ఎందరో రాజవంశీయులు, జమీందార్లు దేవాలయాల కోసం ఎన్నో విరాళాలు ఇచ్చారు, ఆభరణాలు చేయించారు. ఆలయాల అభివృద్ధి కోసం ఎంతో చేశారు కాబట్టే, ఈ రోజుకీ వారు నిర్మించిన ఆలయాల్లో వారి పేరున నిత్యం అర్చనలు జరుగుతున్నాయి.


స్వాతంత్ర్యానంతరం పరిస్థితులు మారాయి. దేవాదాయ ధర్మదాయ శాఖను ఏర్పాటు చేసి సొమ్ము బాగా వచ్చే ఆలయాలు, భూములున్న ఆలయాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని అజమాయిషీ చేయటం ప్రారంభించింది. ఆలయాలు ప్రభుత్వం చేతిలోకి వెడితే బాగుంటాయని కొందరు ఆలయాలతో పాటు వాటి ఆస్తులను కూడా ప్రభుత్వానికి అప్పగించారు. నాటి నుంచి అనేక ఆలయాల అజమాయిషీ రాజకీయ నాయకులు, భూకామందుల చేతుల్లోకి వెళ్లింది. తొలుత బాగున్నప్పటికీ, ప్రస్తుతం దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

నేను కృష్ణా జిల్లా వాసిని. జిల్లాలో ఒకప్పుడు వైభవంగా వెలిగిన కొన్ని ఆలయాలు ఇప్పుడెలా ఉన్నాయో చూస్తే మనసంతా వికలమయింది. నూజివీడు జమీందారుల హయంలో వారి సంస్థానంలో అనేక దేవాలయాలకు ఎన్నో భూములను దానం చేశారు. అవన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళటం వల్ల, స్థానిక రాజకీయ నాయకుల పెత్తనం వల్ల ప్రస్తుతం ఆ దేవాలయాల పరిస్థితి సంతృప్తికరంగా లేదు. నాకు తెలిసి ఒకప్పుడు వైభవంగా అనేక ఉత్సవాలు జరిగిన అతి పురాతన కానుమోలు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి, శ్రీరామనవమి కళ్యాణం మాత్రమే జరుగుతున్నాయి, అధ్యయన ఉత్సవాలు జరిగి అర్ధ శతాబ్దం అయింది. దేవునికి ఆదాయం వచ్చే పొలాలు ఉన్నా అదీ పరిస్థితి. ఆ స్వామికి మా తాతగారు తులసి వనానికి ఇచ్చిన స్థలం ఎవరి ఆధీనంలో ఉందో తెలియదు. అలాగే అదే గ్రామంలో సోమేశ్వరస్వామివారి పరిస్థితి కూడా అంతే. శివరాత్రి కళ్యాణం జరిగి చాలాకాలమయింది. ఒకప్పుడు జిల్లాలోనే సంపన్న ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన గొల్లపల్లి శ్రీ రఘునాథస్వామి కోవెల పరిస్థితి, రెండవ భద్రాద్రిగా ఖ్యాతిగాంచిన మోటూరు శ్రీ రామాలయం పరిస్థితి అంతంత మాత్రమే. మోటూరు అయ్యవార్లంగారుగా ఖ్యాతి గాంచిన శ్రీమత్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల వారి సంరక్షణలో వైభవంగా వెలిగిన ఆ ఆలయంలో కూడా పరిస్థితులు సరిగా లేవు. ఇలా రాష్ట్రంలో వందలాది దేవాలయాలు ఉన్నాయి. దీనికి కారణం ఆయా దేవాలయాల పాలకమండలికి ఆలయాల ఆస్తులపై, వారికొచ్చే లాభంపై దృష్టే గానీ, భగవంతుని సేవపై కాదు. అందరూ కాదు గానీ ఎక్కువ మంది ఈ కోవకు చెందినవారే.


గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిన విషయమే. ఆ దోషులు దొరలుగా తిరుగుతున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే తరతరాలుగా ఎంతో వైభవంగా నిర్వహించే ఉత్సవాలకు కూడా నిధులు తగ్గించటం. భగవంతునికి వేయటానికి పనికిరాని బంతిపూలల మాలలను కొన్ని ఆలయాల్లో వాడారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హిందూ దేవాలయాలపై వచ్చిన ధనమంతా ఏమవుతోంది? వందలాది గ్రామాల్లో ఆలయాల పరిస్థితులు ఇవి. ‘‘గ్రామాల్లో దేవాలయాలు బాగుంటే, గ్రామాలు బాగుంటాయి’’ అని శాస్త్రం అంటున్నది. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆలయాల పరిస్థితులను చక్కదిద్దాలి.

గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల విషయంలో క్షమించరాని తప్పులను చేసిన వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీకి కారకులైన వారికి శిక్ష పడితే ఆస్తిక లోకం హర్షిస్తుంది. సనాతనధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తామని చెప్పుకొనేముందు దైవదర్శనానికి ఉన్న రుసుముల్ని రద్దు చేయాలి లేదా తగ్గించాలి. దీంతో ఆలయాలకు భక్తుల రాక పెరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్మ ప్రచార పరిషత్‌లో రాజకీయ నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు కాకుండా, తరతరాలుగా అనేక దేవాలయాలలో స్థానాచార్యులుగా ఉండి, ఆలయ సాంప్రదాయాన్ని కాపాడుతున్న వారికి, ప్రచార–ప్రసార మాధ్యమాల్లో పని చేసి పదవీవిరమణ పొందిన సంప్రదాయవాదులకు చోటు కల్పిస్తే అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు.


రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలకు పాలకమండలి ఏర్పాటు చేసేటప్పుడు ఆలయ చరిత్ర, ఆరాధన విధానం, అలాగే భగవంతునికి సంబంధించిన స్తోత్రాలు కనీసం చూసి తప్పులు లేకుండా చదివే వారిని నియమిస్తే బాగుంటుంది. సంప్రదాయ పరిరక్షణ విషయంలో పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే, మన రాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవం వస్తుంది. అలాగే ప్రజల్లో కూడా మంచి మార్పు రావటమే కాకుండా, మతమార్పిడులు ఆగిపోతాయి.

అద్దంకి శ్రీరామకుమార్

ఆకాశవాణి విశ్రాంత వార్తా విభాగ ప్రతినిధి


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..

Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..

Updated Date - Feb 09 , 2025 | 03:05 AM