Share News

Pope Francis Legacy: మానవతను మేల్కొల్పిన మహాత్ముడు

ABN , Publish Date - Apr 30 , 2025 | 03:52 AM

పోప్ ఫ్రాన్సిస్ మానవతావాద దృక్పథం, శాంతి, సహన సందేశాలను ప్రపంచం లోని వివిధ మత గురువులతో కలిసి ప్రాచుర్యం చేసాడు. అతని చర్యలు, వలస వ్యతిరేకత, మత సంస్కృతుల మధ్య సౌహార్దం పెంపొందించడంలో ప్రేరణగా నిలిచాయి.

Pope Francis Legacy: మానవతను మేల్కొల్పిన మహాత్ముడు

బ్రహం మతాల – యూదు, క్రైస్తవ, ఇస్లాం–కు జన్మస్ధలమైన ఫలస్తీనాను సందర్శించి ఆ పుణ్యభూమిలో రక్తపాతాన్ని పోప్ ఫ్రాన్సిస్‌ తప్పుపట్టారు. అరబ్బు దేశాలలోని ఇస్లామిక్ మత గురువులతో మైత్రిని ఆకాంక్షించి వారితో సౌహార్ద సంబంధాలు నెలకొల్పుకున్నారు. ఇస్లాం, క్రైస్తవ మత గురువులు సంయుక్తంగా ప్రపంచ శాంతికి కృషి చేయాలని కోరిన విశాల హృదయుడు పోప్ ఫ్రాన్సిస్‌.

న్నత స్ధానాలలోని వ్యక్తుల ప్రసంగాలను ప్రజానీకం శ్రద్ధగా ఆలకించడం కద్దు. వాటి నుంచి స్ఫూర్తి, ప్రేరణ పొందుతారు. అందునా ఆధ్యాత్మిక ప్రముఖుల ప్రవచనాల ప్రభావశీలత ప్రజలపై అధికంగా ఉంటుంది. సాధారణంగా దైవభక్తి ప్రవచనాలను బోధించే మత గురువులు వర్తమాన సామాజిక సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తే, సహజంగానే జనులు అందరూ వాటిని అమితాసక్తితో వింటారు. ఇటీవల మరణించిన అత్యున్నత క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ నిస్సందేహంగా ఒక విశిష్ట వ్యక్తి. వినయం, కరుణ, శాంతి సందేశాలతో కోట్లాది ప్రజలకు స్ఫూర్తినిచ్చిన సమున్నత ఆధ్యాత్మికవేత్త. మెరుగైన జీవన స్థితిగతులకు ఆరాటపడుతూ అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్లిన వారి పక్షాన తన గొంతుక వినిపించిన మహానుభావుడు పోప్‌ ఫ్రాన్సిస్‌. అమెరికా, ఐరోపాలు అవలంబిస్తున్న కఠోర వలస విధానాలను విమర్శించి, తమ మాతృభూమిని వదిలి వచ్చిన వారి పట్ల సానుభూతి చూపాలని సంపన్న రాజ్యాల ప్రభుత్వాధినేతలకు పోప్‌ ఫ్రాన్సిస్‌ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వలస వ్యతిరేక విధానాలను ఆయన ఆక్షేపించారు. అంతేకాదు, మెక్సికో – అమెరికా సరిహద్దులో సామూహిక ప్రార్థనలు నిర్వహించి వినూత్నంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసిన మానవతావాది పోప్‌ ఫ్రాన్సిస్‌. ప్రపంచ క్రైస్తవ మత పెద్దగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంప్రదాయాలకు భిన్నంగా ఆయన ఇటలీలోని ఒక జైలుకు వెళ్ళి ఖైదులో ఉన్న అక్రమ చొరబాటుదారుల పాదాలను పవిత్ర జలాలతో అభిషేకించారు. తద్వారా పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న శరణార్ధి వ్యతిరేక విధానాలను ఆయన నిరసించారు. పొట్టకూటి కొరకు వచ్చే పేదలూ మానవులే అని పాశ్చాత్య దేశాల పాలకులకు సందేశమిచ్చారు. ఆఫ్రికా నుంచి లిబియా మీదుగా వచ్చే శరణార్ధులతో సతమతమవుతున్న ఇటలీ అనేక సందర్భాలలో ఆ అభాగ్యులను తీసుకువచ్చే పడవలను తమ తీరప్రాంతాలకు చేరేందుకు అనుమతి నిరాకరించి అవి మునిగిపోవడానికి కారణమై విమర్శలకు గురయింది.


అదే విధంగా గ్రీస్‌పై కూడ వలసకారుల పట్ల అమానవీయంగా ప్రవరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు దేశాల సముద్ర జలాలలో నిరీక్షిస్తున్న శరణార్ధుల వద్దకు వెళ్ళి వారికి సంఘీభావం ప్రకటించిన దైవ పుత్రుడు ఫ్రాన్సిస్. సిరియా నుంచి ఐరోపాకు పారిపోతూ మార్గమధ్యంలో గ్రీసులో చిక్కుకుపోయిన ఒక డజను మంది సిరియన్‌ ముస్లింలను తన విమానంలో వాటికన్ నగరానికి తీసుకువచ్చిన మానవతామూర్తి పోప్‌ ఫ్రాన్సిస్. క్రైస్తవ మత కేంద్రమైన వాటికన్ నగరం స్వయం ప్రతిపత్తి ఉన్న దేశమైనా, అది పూర్తిగా ఇటలీపై ఆధారపడి ఉన్నది. అయినా, పోప్ ఫ్రాన్సిస్ తన అతిథ్య దేశమైన ఇటలీ వలస విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. మతం ప్రాతిపదికన రక్తపాతం జరుగుతున్న బర్మా, సిరియా, ఫలస్తీనా, సిరియా, ఇరాఖ్, ఇంకా అనేక ఆఫ్రికా దేశాలలో పర్యటించి అక్కడి హింసకాండను ఖండించిన పోప్, మతాలకు అతీతంగా సమస్త మానవాళికి ఒక ఆదర్శ పురుషుడు. అబ్రహం మతాల – యూదు, క్రైస్తవ, ఇస్లాం–కు జన్మస్ధలమైన ఫలస్తీనాను సందర్శించి ఆ పుణ్యభూమిలో రక్తపాతాన్ని పోప్ ఫ్రాన్సిస్‌ తప్పుపట్టారు. అరబ్బు దేశాలలోని ఇస్లామిక్ మత గురువులతో మైత్రిని ఆకాంక్షించి వారితో సౌహార్ద సంబంధాలను పెంపొందించుకోవడంలో ఆయన కొంతవరకు సఫలీకృతులయ్యారు. ఇస్లాం అధ్యాత్మిక ఫత్వాలకు ప్రపంచవ్యాప్తంగా కేంద్రమైన ఈజిప్టు రాజధాని కైరోలోని వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన అల్ అజహార్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి దాని ప్రధాన గురువు శేఖ్ అహ్మద్ తయీబ్‌తో సమావేశమై సమాలోచనలు జరిపారు. ఇస్లాం, క్రైస్తవ మత గురువులు సంయుక్తంగా ప్రపంచ శాంతికి కృషి చేయాలని కోరిన విశాల హృదయుడు పోప్ ఫ్రాన్సిస్‌. సహజంగానే ఆయన పట్ల ముస్లిం సమాజాలలో గౌరవాదరాలు పెరిగాయి.


మక్కాలో హాజ్ నమాజుకు నేతృత్వం వహించిన ఇస్లామిక్ విద్వాంసుడు శేఖ్ మోహమ్మద్ అల్ ఈసా కూడ వాటికన్‌కు వెళ్ళి పోప్‌తో సమావేశమయ్యారు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ రాజధాని ఆబుధాబి నగరంలో మూడు మతాలకు కలిపి ఒక చోట ఒకే పరిమాణంలో నిర్మించిన మస్జీద్, చర్చి, సినగోగ్‌లతో కూడిన అబ్రహం హౌస్ ప్రారంభోత్సవానికి హాజరు కావడం ద్వారా పోప్ ఫ్రాన్సిస్ మతసహన సందేశాన్నిచ్చారు. భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య స్వల్పమే. అయితే భారతీయ క్రైస్తవ జనాభా అనేక దేశాలలోని క్రైస్తవుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. భారతదేశాన్ని సందర్శించే అవకాశం పోప్‌ ఫ్రాన్సిస్‌కు రాలేదు. 2017లో ఆయన భారత్‌ను సందర్శిస్తారని భావించినా, అధికారికంగా ఆయనకు ఆహ్వానం అందకపోవడంతో బర్మా, బంగ్లాదేశ్‌కు వెళ్ళారని క్రైస్తవ ప్రముఖులు చెబుతారు, 2021లో ప్రధాని మోదీ వాటికన్‌ను సందర్శించి పోప్‌ను భారత పర్యటనకు అధికారికంగా ఆహ్వానించారు. పోప్ అంత్యక్రియల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాటికన్‌కు వెళ్ళి ఆయనకు నివాళి అర్పించడం ముదావహం. రాబోయే కొత్త పోప్‌తో పాటు ప్రపంచంలోని అన్ని మతాల గురువులు మానవీయ విలువలను తమ చేతల ద్వారా బోధిస్తే సమస్త మానవాళిలో సౌభ్రాతృత్వం విలసిల్లుతుంది.

-మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - Apr 30 , 2025 | 03:55 AM