Share News

బయటి చూపు లోపలికి మళ్ళాక రాసుకున్న కవితలు

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:23 AM

‘‘ప్రభూ! నిన్ను సేవించుదామని ఎన్నో సుందర పుష్పాలు ఏరి తెచ్చాను. తుదకు వాటి సౌందర్యంపై మోహంతో నిన్నే విస్మరించాను’’ చలం అనువ దించిన టాగోర్ కవిత్వం...

బయటి చూపు లోపలికి మళ్ళాక రాసుకున్న కవితలు

నా మొదటి పుస్తకం

‘‘ప్రభూ! నిన్ను సేవించుదామని ఎన్నో సుందర పుష్పాలు ఏరి తెచ్చాను. తుదకు వాటి సౌందర్యంపై మోహంతో నిన్నే విస్మరించాను’’ చలం అనువ దించిన టాగోర్ కవిత్వం చదువుకున్నాక రాసుకున్న వాక్యాలివి.

కవిత్వం పలికితే రాయ టమే గానీ, పనిగట్టుకు రాయటం లేదు. ఇంటర్ చదివే రోజుల్లో సహ జంగా ఉండే ఉద్రేకాలతో పాటు, శ్రీశ్రీ, సామ్యవాద సాహిత్యాల ప్రభావంతో సమాజాన్ని మార్చాలనే ఆవేశంతో రాస్తున్న కవి తలు, టాగోర్‌ని చదివాక ఆగిపోయినట్టున్నాయి. బయటి చూపు లోపలికి మళ్ళాక, మారాల్సింది నేను అనిపించాక, రాసుకొనే కవిత్వం మారింది. దైవం, ప్రకృతి, మృత్యువు, ప్రేమ వంటి ఉదాత్తభావాలు కవితా వస్తువులయాయి.


డిగ్రీ చివర్లో, 1986లో చలం రాసిన ‘భగవాన్ స్మృతులు’ పుస్తకం దొరికింది. ఒక ఆధ్యాత్మిక గురువు అత్యంత సరళంగా, సహజంగా, సూటిగా, దయగా ఉండటం గమనించి శ్రీ రమణ మహర్షి పట్ల గురుభావం కలి గింది. వారి సహేతుకమైన బోధ ‘నిన్ను నీవు తెలుసుకో’ జీవిత లక్ష్యమైంది. ఆ తర్వాత వచ్చిన కవితలని, ఇంటర్ లోని తెలుగు మాష్టారు జీయస్వీ నరసింహా రావుగారికి చూపిస్తే, చాలా బాగా రాస్తున్నావన్నారు. 1989లో వీటిని పుస్తకంగా తీసుకురావాలనిపించింది.

మా ఊరు తణుకులో సాహిత్య వాతావరణం చైతన్యవంతంగానే ఉండేది. నన్నయ్య భట్టారక పీఠం, రీడర్స్ ఫోరం సాహిత్య సభలు జరిపేవి. అయితే, స్వతహాగా ఉన్న బిడియం వల్ల ఎవరినీ కలవటం జరగలేదు.

సంస్కృతాంధ్రాల్లో పండితులైన చెరువు సత్యనారా యణ శాస్త్రిగారి దగ్గర కూర్చుని ఎడిట్ చేద్దాం అన్నారు జీయస్వీగారు. ఎడిటింగ్‌కి ముందు కొన్ని చిత్రమైన ప్రశ్నలు అడిగారు శాస్త్రిగారు. రైలు ఎక్క టానికి స్టేషన్‌కి టైముకి వెళతావా, ముందుగానా వంటివి. జవాబులు విని, నీ సాహిత్యం ప్రసిద్ధి పొందు తుంది వంటి మాటేదో అన్నారు. ఎడిటింగ్ జరిగింది. నేను చదవటం, వారిద్దరూ విని, సరి చేయటం. ముందుమాట అడిగితే రాసుకోమని, చెప్పుకుంటూ వెళ్ళారు శాస్త్రిగారు. ఆరాధన టైటిల్ నేననుకున్నానో, వారు చెప్పారో గుర్తులేదు. ఆరాధన భగవాన్‌కి అంకితమైంది.


మా ఊరిలోనే రవి ప్రింటర్స్ లో పుస్తకం అచ్చుకి ఇచ్చాను. కవర్‌పై నా ఫోటో వేసుకోవాలనే ఆలోచన అప్పటికే ఉన్నట్టుంది. పాలంగి లోని రాయల్ ఆర్ట్స్ దగ్గరికి వెళ్ళి, ఫోటో ఇచ్చి, బొమ్మ గీయించాము. 1989 చివర్లో పుస్తకం వచ్చింది. ఆవిష్కరణ సభ తలపెట్టలేదు. తొలికాపీ దేవుడి దగ్గర పెట్టి ఉంటాను. లేదా తల్లిదండ్రులకి ఇచ్చి వుంటాను. కొన్ని పత్రికలకి సమీక్షలకి పంపి ఊరుకున్నాను.

తర్వాత చలంగారి సన్నిహితులు చిక్కాల కృష్ణా రావుగారికి పంపిస్తే, వారంలో ఉత్తరం వచ్చింది. మరునాడు ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చారు కృష్ణా రావుగారు చెప్పారంటూ. ఆలపాటి రాంబాబుగారు, పుల్లేశ్వరరావుగారు. 2018లో వెళ్ళిపోయేవరకూ, సుమారు మూడు దశాబ్దాలు లోపలి అన్వేషణలో సహచరుడిగా, సంక్లిష్ట సమయాల్లో ఆప్తుడిగా ఉన్నారు రాంబాబుగారు.


తర్వాత రోజుల్లో చిరునామాలు దొరికిన ప్రము ఖులకి పుస్తకాలు పంపించాను. ‘‘మీవి మాటలతో రాయబడినప్పటికీ, మాటలను దాటి వెళ్ళిపోయాయి, సంవేదనా జగత్తును వదిలి, శుద్ధవేదనా జగత్తుకు’’ అన్నారు సంజీవదేవ్. ‘‘కవి తన్ను తాను వెదుక్కునే ప్రయత్నంలోనే కవిత్వం పుడుతుంది. అందుకనే నిజమైన, స్వచ్చమైన కవిత్వం రాయగలిగారు’’ అన్నారు ఇస్మాయిల్. ‘‘పట్టుపురుగులోంచి పట్టు వచ్చినట్లు, మీలోంచి కవిత్వం నిర్గతమవుతోంది’’ అన్నారు శేషేంద్ర.

2017లో ఆరాధన మూల కవితలు చదివితే, ఎడిటెడ్ కన్నా అవే మరింత సహజంగా తోచాయి. వాటినే కాల క్రమంలో కూర్చి, ఆరాధన రెండో ప్రతి తయారు చేసి ఆన్లైన్ లో ఉంచాను. కవర్ పై సవరించిన ప్రతి అని రాశాను గానీ, నిజానికి సవరించని ప్రతి అని రాయాలి.

1994లో తణుకు వచ్చి, నన్ను వెదికి పట్టుకున్న కొప్పర్తి గారి స్నేహం తర్వాత, ౧995 లో నా తొలి హైకూ సంపుటి ‘దృశ్యాదృశ్యం’ వచ్చింది. తణుకులో ఆవిష్కరణసభకి చేరా, ఇస్మాయిల్, కె. రామ్మోహన్ రాయ్ గార్లు వచ్చారు. బివివి ప్రసాద్ అప్పటి నుండి సాహిత్య ప్రపంచానికి తెలియటం మొదలైంది. తర్వాతి కాలంలో నాగభైరవ, ఓల్గా, అద్దేపల్లి ‘ఆరాధన’ చదివి సాంద్రమైన అనుభూతితో స్పందించారు.

బివివి ప్రసాద్

90320 75415


Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..

Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..

Updated Date - Feb 17 , 2025 | 12:24 AM