Share News

ప్రగతిబాటలో పంచాయతీలు...!

ABN , Publish Date - Jan 16 , 2025 | 04:28 AM

గత ప్రభుత్వ నిరాదరణతో విలవిలలాడిన గ్రామ పంచాయితీలను ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభించింది. నిధుల దారి మళ్ళింపుతో నీరసపడ్డ పంచాయతీలను నిటారుగా నిలబెట్టే సన్నాహాలు జరుగుతున్నాయి...

ప్రగతిబాటలో పంచాయతీలు...!

గత ప్రభుత్వ నిరాదరణతో విలవిలలాడిన గ్రామ పంచాయితీలను ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభించింది. నిధుల దారి మళ్ళింపుతో నీరసపడ్డ పంచాయతీలను నిటారుగా నిలబెట్టే సన్నాహాలు జరుగుతున్నాయి. ఐదేళ్ళు కునారిల్లిన మన పంచాయతీలు నేడు జాతీయ స్థాయిలో ఏకంగా నాలుగు అవార్డులు సాధించటం గమనార్హం. పంచాయతీరాజ్ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ దార్శనికతతో గ్రామాల్లో అభివృద్ధి, ఉపాధి హామీ, ఉద్యోగ పాలన, నిధుల నిర్వహణ, జవాబుదారీతనం, పారదర్శకతలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆయన తన పరపతితో కేంద్రం నుంచి గ్రామ పంచాయితీలకు నిధులను సమీకరించటంతో పాటు, ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ, ప్రజల లోనే ఉంటూ గ్రామీణ ముఖచిత్రంపై తనదైన ముద్ర వేస్తున్నారు.


గత పాలకులు 15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్ళించి గ్రామాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారు. ఫలితంగా పంచాయితీల ప్రాథమిక విధులైన మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సౌకర్యాలు అందించటం కూడా కష్టమైంది. బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితికి గ్రామపాలన దిగజారింది. పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నాక 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయితీల ఎకౌంటుకు చేరేలా చర్యలు తీసుకున్నారు. గత పాలకులు ఉపాధి హామీ పథకం కోసం వచ్చిన నిధుల్ని కూడా సరిగా వినియోగించలేదు. ఈ నిధుల్ని ఉపాధి కోసం కంటే సచివాలయ భవనాల నిర్మాణాలకే ఎక్కువ ఖర్చుపెట్టారు. ఉపాధి పని దినాల సంఖ్యను పెంచే ప్రయత్నాలేమీ చేయలేదు. ఈ పథకంలో అవినీతి నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన సోషల్ ఆడిట్ అధికారులు కూడా పీకల్లోతు అవినీతిలో కూరుకు పోయారు. ఉపాధి హామీ కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి రూ.4500 కోట్లు సాధించగలిగారు. ఆ నిధులతో 87 రకాల పనులు, 9 కోట్ల పనిదినాలు, 54 లక్షల కుటుంబాలకి ఉపాధి కలిగించే నిర్ణయం చేసారు. సోషల్ ఆడిట్‌లో అవినీతి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా పంచాయితీ రాజ్ శాఖ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చెయ్యటం కోసం గత ఆగస్టు 23న రాష్ట్రం లోని 13,326 గ్రామసభల్ని ఒకే రోజు నిర్వహించి రికార్డు నెలకొల్పటం చూస్తే ప్రభుత్వం ఆ పథకానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్థం అవుతుంది. దీంతో పాటు గ్రామాల్లో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే, ఇతర జాతీయ పండుగల కోసం ఇచ్చే నిధుల్ని గణనీయంగా పెంచారు.


పల్లె పండుగ, విజిబుల్ వర్క్స్, PR(1) యాప్ ద్వారా గ్రామాల్లో అవస్థాపన పనులతో పాటు, సేవల నాణ్యతను పెంచడానికి సంకల్పించారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రాబోయే సంక్రాంతి లోపు సిమెంట్ రోడ్లు, ప్రహరీలు, కమ్యూనిటీ బిల్డింగులు పూర్తి చెయ్యాలని నిర్ణయించారు. అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు క్రమం తప్పకుండా మంచినీటి క్లోరినేషన్, ట్యాంక్‌లు శుభ్రం చెయ్యడం, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ వంటి పనుల్ని ప్రతి రోజూ ప్రభుత్వానికి నివేదించటానికి PR(1) యాప్ ప్రారంభించారు. దీనివల్ల అధికారులు ప్రతి రోజూ ఈ సమాచారాన్ని అప్‌లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేసే విధంగా విజిబుల్ వర్క్స్‌లో భాగంగా బోర్డుల మీద ప్రదర్శించాలనే నిబంధన ఏర్పాటు వల్ల పాలనలో పారదర్శకత పెరుగుతున్నది.

గ్రామాల్లో మంచినీటి సమస్యను అధిగమించి, రక్షిత మంచినీటిని అందించటంపై పవన్ కళ్యాణ్‌ దృఢ సంకల్పంతో ఉన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలకి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోవటాన్ని ఆయన అనేక సార్లు ప్రస్తావించారు. ఆయన ఇటీవల ఉత్తర ఆంధ్రాలోని ఏజెన్సీ, ఆదివాసీ గ్రామాల్లో పర్యటించినప్పుడు కూడా ఇదే ప్రధానాంశంగా ముందుకి వచ్చింది. ఇప్పటివరకు మంచి నీరు అందని ప్రతి ఇంటికీ జలజీవన్ మిషన్‌లో భాగంగా రక్షిత మంచినీటి సరఫరా అందించటం కోసం కుళాయిల్ని ఏర్పాటు చెయ్యటానికి ప్రభుత్వం నిర్ణయించటం ఒక శుభ పరిణామం.


పంచాయితీ ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీల్లో అవకతవకలు, అవినీతి ఒక ఆచారంగా మారిపోయింది. అస్మదీయులకే ప్రమోషన్లు, కోరుకున్న చోటుకి బదిలీలు. అందువల్ల అర్హులైన ఉద్యోగులకి అన్యాయం జరిగేది. ఈ పరిస్థితికి పుల్‌స్టాప్‌ పెడుతూ పవన్ కళ్యాణ్ ప్రతి నెల సీనియారిటీని బట్టి ప్రమోషన్లు ఆటోమేటిక్‌గా జరిగిపోయే విధంగా మార్పులు తెచ్చారు. గతంలో పంచాయతీ రాజ్ శాఖలోని జిల్లా పరిషత్ సిఈఓ, డీఆర్‌డీఏ, డ్వామా విభాగాల్లో ఉన్నత స్థానాల్లో రెవెన్యు శాఖ అధికారులు డిప్యుటేషన్‌పై చేరి పెత్తనం చేసేవారు. పవన్ కళ్యాణ్ ఆ పద్ధతికి స్వస్తి పలికి మాతృ శాఖలోని సీనియర్లకే అర్హతల్ని బట్టి అవకాశాలు వెళ్ళేలా చర్యలు చేపట్టారు.


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పారిశుద్ధ్య కార్మికులకి సన్మానం చెయ్యాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించటం విప్లవాత్మకమని చెప్పాలి. అయితే గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఆరు వేల రూపాయలలోపే ఉంటున్నాయి. అవి కూడా గ్రామంలో నిధులు ఉంటేనే ఇస్తారు. లేకపోతే ఎన్ని నెలలైనా వాళ్ళు ఇబ్బందులు పడాల్సిందే! ప్రజారోగ్య రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషించే ఈ విభాగంలో పనిచేసే సిబ్బందికి కనీస వేతనం నెలకు పదిహేను వేల వరకూ పెంచాల్సిన అవసరం ఉందని అనేక స్వచ్ఛంద సంస్థలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయినా ఆ దిశగా అడుగులు పడటం లేదు. పాలకులు దృష్టి సారించాలి. అనేక సంవత్సరాల నుంచి సమస్యల్లో కూరుకుపోయి ఉన్న ఒక వ్యవస్థని రాత్రికి రాత్రే స్వర్గంగా మార్చటం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఉన్న పరిధుల్లోనే సాధ్యమైనంత ప్రగతి సాధించాలనే పవన్ కళ్యాణ్ పట్టుదల, తపన మన గ్రామాల పునర్నిర్మాణానికి ఎంతో సాయపడుతున్నది.

ప్రొఫెసర్ శ్రీపతి రాముడు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

Updated Date - Jan 16 , 2025 | 04:28 AM