Share News

మన నిశ్శబ్ద విప్లవం తీరే వేరు!

ABN , Publish Date - Mar 18 , 2025 | 03:23 AM

ఉత్తర భారతదేశంలో నిశ్శబ్ద విప్లవం ఒకటి జరిగి తీవ్ర సామాజిక మార్పులకు దారితీసిందంటే ఒకపట్టాన నమ్మలేం! ఒకనాటి ఉత్తరాది గురించి అంబేడ్కర్‌ 1955లో అన్న మాటలను...

మన నిశ్శబ్ద విప్లవం తీరే వేరు!

ఉత్తర భారతదేశంలో నిశ్శబ్ద విప్లవం ఒకటి జరిగి తీవ్ర సామాజిక మార్పులకు దారితీసిందంటే ఒకపట్టాన నమ్మలేం! ఒకనాటి ఉత్తరాది గురించి అంబేడ్కర్‌ 1955లో అన్న మాటలను గుర్తుచేసుకుంటే ఆ విప్లవం ఇంకా విచిత్రంగా కనపడుతుంది. ‘‘ఉత్తర, దక్షిణాది మధ్య తేడా చాలా ఉంది. ఉత్తరాది సంప్రదాయశీలమైంది. దక్షిణాది పురోగమనభరితమైంది. ఉత్తరాది మూఢనమ్మకాలతో ఉంటే దక్షిణాది హేతుబద్ధంగా ఉంటుంది. విద్యలో దక్షిణాది ముందడుగు వేసింది. ఉత్తరాది వెనుకబడింది. దక్షిణాది సంస్కృతి ఆధునికమైంది. ఉత్తరాది సంస్కృతి ప్రాచీనమైంది’’ అంటూ ఎన్నో తేడాలను ప్రస్తావించిన అంబేడ్కర్‌ ఉత్తరాది పాలనను దక్షిణాది ఎలా సహించగలదు? అన్న ప్రశ్నను కూడా లేవనెత్తారు. ఉత్తర–దక్షిణాదుల మధ్య తేడాల గురించి అంబేడ్కర్‌కే గాక ఇప్పటికీ చాలా మంది మేధావులకు ఇలాంటి అభిప్రాయాలే ఉన్నాయి. దక్షిణాది నేతలు సైతం మూఢనమ్మకాలను పోత్సహిస్తున్నా రాజకీయ విమర్శలు చేసేటప్పుడు మాత్రం ‘ప్రగతిశీల దక్షిణాది’ అంటూ మాట్లాడుతూనే ఉన్నారు. రాజకీయ అంశంగా దక్షిణాది ప్రగతిశీలత మారినంత మాత్రాన ఆ భావనకు ఎంతోకొంత వాస్తవిక పునాది లేదని చెప్పలేం.


రాజకీయాలపరంగా 1980ల నుంచి ఉత్తరాదిలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. అగ్రకులాల రాజకీయ ఆధిపత్యాన్ని తోసిపుచ్చే జైత్రయాత్రను అక్కడి బీసీలు ఆరంభించారని పేర్కొంటూ దాన్నొక నిశ్శబ్ద విప్లవంగా సూత్రీకరిస్తూ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు క్రిస్టఫ్‌ జఫలాట్‌ 2003లో 500 పేజీల పుస్తకాన్నే రాశారు. దాని పేరు భారతీయ నిశ్శబ్ద విప్లవం. జఫలాట్‌ విశ్లేషణంతా ప్రధానంగా ఉత్తరాదికే పరిమితమైంది. బీసీలకు రిజర్వేషన్ల కల్పనలో దక్షిణాది ఎలా ముందుందో తగినంత లోతుగానే వివరించినా ఉత్తరాదిలో రాజకీయ మార్పులను వెల్లడించటమే ప్రధానంగా అందులో కనపడుతుంది.

దక్షిణాదిలో రిజర్వేషన్లకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. దేశంలో రిజర్వేషన్లు విస్తృతస్థాయిలో అమలవ్వటానికి దక్షిణాది ప్రయోగాలే ప్రేరణ. ఎగుడుదిగుడులు ఎదుర్కొన్నప్పటికీ ఉత్తరాదితో పోల్చితే చాలా ముందుగా దక్షిణాదిలో బీసీ రిజర్వేషన్లు అమలయ్యాయి. అవెన్నో మార్పులనూ తీసుకొచ్చాయి. దక్షిణాదిన ఉద్యోగాల్లో బీసీల శాతం నిర్దేశించిన కోటాలను దాటటమూ ఆ మార్పుల్లో భాగమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1985 నాటికే ఉద్యోగుల్లో బీసీలు 28 శాతం ఉన్నారన్న విషయాన్ని జఫలాట్‌ ప్రస్తావించారు. ఓపెన్‌ కేటగిరీ పోస్టులకు సంబంధించి అగ్రకులాలతో పోటీపడటం బీసీలకు సాధారణమైంది. యాభైశాతానికి కాస్త అటూఇటూగా ఉద్యోగాలనూ విద్యారంగంలో సీట్లనూ దక్కించుకునే ప్రక్రియా మొదలైంది. మెడికల్‌, ఇంజనీరింగ్‌ సీట్ల విషయంలో ఇది స్పష్టంగా కనపడుతోంది. ఇటీవల తెలంగాణ గ్రూప్‌–1 ఉద్యోగాల మెయిన్‌ పరీక్ష ఫలితాలను చూసినా ఇదే అర్థమవుతుంది. అత్యధిక మార్కులు సాధించిన 500 మందిలో 228 మంది బీసీ అభ్యర్థులే ఉన్నారు. అంటే 45.6శాతం మంది. ఇక ఎస్సీ (50), ఎస్టీ (38) అభ్యర్థులను కూడా కలుపుకొంటే మూడు వర్గాల వారు 63.2శాతం మంది అవుతారు. అధిక మార్కులు సాధించిన వందమంది జాబితానే తీసుకుంటే బీసీ అభ్యర్థులు 48శాతం ఉన్నారు. ఇక్కడే మరో విషయాన్ని కూడా స్పష్టంగా చూడొచ్చు. జనాభా శాతానికి అనుగుణంగా బీసీలు లక్ష్యానికి చేరువవుతుంటే ఎస్సీ, ఎస్టీల్లో ఇంకా దూరంలోనే ఉన్నట్లుగా గ్రూప్‌–1 ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది. అధిక మార్కులు పొందిన 100 మందిలో ఎస్సీలు ముగ్గురు, ఎస్టీలు అయిదుగురు ఉండటమే దీనికి నిదర్శనం. అధిక మార్కులు వచ్చిన 500 ర్యాంకులను పరిగణనలోకి తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ శాతాలు కొంత పెరిగినా నిర్దేశించిన వాటా కంటే తక్కువే ఉన్నారు.


రిజర్వేషన్ల కోటాకు మించి బీసీలు ప్రగతి సాధిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ సోమవారం శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఇదో విచిత్రమైన సన్నివేశం. అందుబాటులోని కొన్ని గణాంకాలను చూస్తే ఇప్పటికే 42 శాతం దరిదాపుల దాకా బీసీల ప్రాతినిధ్యం చేరినట్లు కనపడుతుంది! పోటీ పరీక్షల ఫలితాల విశ్లేషణా దీన్నే సూచిస్తోంది. ఇది పక్కాగా నిర్ధారణ కావాలంటే అధికారిక సమాచారం ఉండాలి. అటువంటి సమాచారాన్ని ప్రభుత్వం మాత్రమే వెల్లడించాలి. కులగణన సర్వేలో లభ్యమైన సమాచారాన్నీ ఇంతవరకూ బహిరంగపర్చలేదు. బిహార్‌ ప్రభుత్వం తాను చేపట్టిన కులగణన సమాచారాన్ని ధైర్యంగానే వెల్లడించింది. ఉద్యోగాల్లో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో తెలిపింది. తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. బిల్లు లక్ష్యాలను వివరించే అనుబంధంలో స్థూలంగా కూడా అటువంటి సమాచారాన్ని పొందుపరచలేదు. బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని బుసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్‌ తేల్చిందని ప్రభుత్వం పేర్కొందే తప్ప సమగ్ర సమాచారాన్ని త్వరలో సభ ముందు ఉంచుతామనీ కూడా ప్రకటించలేదు. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగ విషయాల్లో రిజర్వేషన్లను పెంచేందుకు సిఫార్సులను చేసే పనినీ బుసాని కమిషన్‌కే అప్పగించారు. ఒకే వ్యక్తితో రెండు కమిషన్లు ఏర్పాటయ్యా యన్న మాట!

విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యంలేదని గణాంకాలతో నిరూపిస్తేనే న్యాయ సమీక్షముందు చట్టం నిలబడే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు సంబంధించి కులాల లెక్కలను తీయటం ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదు. కులం వెనుకుబాటు ఆధారంగా కల్పించే రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని ఎందుకు దాటాల్సి వస్తోందో వాదించటానికి గణాంకాలే ఆధారం. న్యాయస్థానాలకు వాటిని సమర్పిస్తేనే 50 శాతం పరిధిని పునఃపరిశీలించే అవకాశం కొంతైనా ఉంటుంది. మండల్‌ కమిషన్‌ నివేదికలో బీసీలకు సంబంధించి అటువంటి సమాచారాన్ని పొందుపరచారు కాబట్టే 27 శాతం రిజర్వేషన్లు గట్టెక్కగలిగాయి. 1980ల నాటికి కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీల ప్రాతినిధ్యం ఎస్సీల కంటే తక్కువగా ఉందనే విషయాన్ని మండల్‌ కమిషన్‌ పేర్కొంది. ఆ అంశమే అప్పుడు కీలకంగా మారింది. ఏకసభ్య కమిషన్‌ అలా చేసి ఉంటే కులాలవారీ ఉద్యోగుల, విద్యార్థుల సమాచారాన్ని సేకరించి మదింపుచేసి ఉండాలి.


జఫలాట్‌ విశ్లేషించినట్లుగా నిశ్శబ్ద విప్లవం ఉత్తరాది రాజకీయ రంగంలో కులాల బలబలాలను మార్చివేస్తున్నా కేంద్ర ఉద్యోగాల్లో బీసీల ప్రాతినిధ్యం ఇంకా ఆశించినంతగా పెరగటం లేదు. 27 శాతం రిజర్వేషన్లను ఇప్పటికీ బీసీలు ఉపయోగించుకోలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన సామాజిక సంక్షేమ గణాంకాల నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. 2022 జనవరి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 21.98శాతం మాత్రమే బీసీలు ఉన్నారు. అదే ఎస్సీ (16.82శాతం), ఎస్టీ (7.33 శాతం)లైతే వారికి నిర్దేశించిన రిజర్వేషన్లకు సమానంగానే ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లభించింది.

రాష్ట్రపతి ఆమోదాన్ని పొంది, కేసులేమైనా పడితే వాటినీ ఎదుర్కొని అనుకున్నట్లుగా 42శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలైన పక్షంలో ఉద్యోగ, విద్యాముఖ చిత్రం బాగా మారుతుంది. విద్య, ఉద్యోగాల్లో జనాభాని మించి ప్రాతినిధ్యం బీసీలకు భవిష్యత్తులో లభించే అవకాశాన్నీ కొట్టేయలేం. ఆ పరిణామం ఎలాంటి మార్పులకు, ప్రతిస్పందనలకు దారితీస్తుందో ఇప్పుడే చెప్పలేం. కులాల వర్గీకరణను మరింత విస్తృతపరచాలనే డిమాండ్లు తలెత్తవచ్చు. సంపన్నశ్రేణిపై వివాదాలూ పెరగొచ్చు.

విద్యా, ఉద్యోగ విషయాల్లో పరిణామాలన్నీ దక్షిణాదిన ఒకే రీతిలో జరుగుతూ బీసీల ప్రాతినిధ్యం జనాభా శాతానికి మించి పెరిగితే దాన్నొక నిశ్శబ్ద విప్లవంగానూ భావించొచ్చు! తమిళనాడులో లాగా రాజకీయాధికారం కూడా అగ్రకులాల చేజారితే సామాజిక పరివర్తన సంపూర్ణమవుతుంది! ఈ సామాజిక పరిణామంతో సమస్యలన్నీ తీరతాయా? దాన్నొక నిజమైన సామాజిక విప్లవంగా భావించొచ్చా? అన్నది అప్పటికీ పెద్ద ప్రశ్నగానే ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రాతినిధ్యాన్ని, రాజకీయ అధికారంలో మార్పులను కులదృష్టితో చూస్తే తమిళ సమాజమే ఆదర్శం అవుతుంది. కానీ ఆర్థిక అసమానతలతో పాటు అనేక సామాజిక సమస్యలు అక్కడ ఇంకా ప్రబలంగానే ఉన్నాయి. కొన్ని కులాలకు అనుచిత ఆధిపత్యమూ ఉంది. సత్తనాథన్‌ బీసీ కమిషన్‌ ఆ విషయాన్ని 1970ల్లోనే స్పష్టంచేసింది. మానవాభివృద్ధి సూచికలో కొంత మెరుగుగానే ఉన్నా మొత్తంగా తమిళనాడును అద్భుత ఆదర్శ నమూనాగా భావించే పరిస్థితి లేదు. ఆర్థిక అసమానతల వల్ల ఒకే కులంలో అనేక వర్గాలు పుట్టుకొచ్చాయి. అందుకే ఒక కులం మొత్తాన్ని ఒక వర్గంగా భావించే పరిస్థితి వేగంగా కనుమరుగైపోతోంది.


ఉత్తర–దక్షిణాది తేడాలకు సంబంధించి మరొక విషయాన్ని కూడా ప్రస్తావించుకోవచ్చు. ఉత్తరాదిన రాజకీయాల్లో వచ్చిన నిశ్శబ్ద విప్లవం ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెద్దగా పెంచలేదు. దక్షిణాదిన మాత్రం మహిళల ప్రాతినిధ్యం గణనీయంగానే పెరుగుతోంది. తెలంగాణ గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్షలో అత్యధిక మార్కులు పొందిన 100 మందిలో 41 మంది మహిళలు ఉన్నారు. 500 ర్యాంకుల వరకూ తీసుకుంటే 204 మంది మహిళలకు చోటు లభించింది. ఇవేమీ చిన్న విషయాలు కావు. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో వెల్లడించిన 111 గ్రూప్‌–1 పోస్టుల ఫలితాల్లో 51 మంది మహిళలకు చోటు దక్కింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఎమ్మెల్యేల సంఖ్యను చూస్తే ఉత్తర–దక్షిణాది తేడాలు స్పష్టంగా కనపడతాయి. తెలంగాణలో బీసీ ఎమ్మెల్యేలు 19 మంది ఉన్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారి సంఖ్య 20కి మించలేదు. అంటే అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం 16 శాతం మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక శాతం అటూఇటూగా పరిస్థితి అంతే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 1972కు ముందైతే అది 15 శాతం దాటలేదు. బిహార్‌లో అయితే 1995 అసెంబ్లీ ఎన్నికల నాటికే బీసీ ఎమ్మెల్యేల సంఖ్య దాదాపుగా 50 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత శాతాల్లో కొంత మార్పు వచ్చినా తెలుగు రాష్ట్రాలంత తక్కువ స్థాయిలో ఎప్పుడూ లేదు. ఉత్తరప్రదేశ్‌లో కూడా బీసీలకు ప్రస్తుత అసెంబ్లీలో 38శాతం ప్రాతినిధ్యం ఉంది.


తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకూ ఒకటి స్పష్టంగా కనపడుతోంది. రాజకీయ పదవుల విషయంలో బీసీలు వెనుకబడి ఉన్నా విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. అగ్రకులాలతో పోటాపోటీగా ముందడుగులు వేస్తున్నారు. రాజకీయ పదవుల్లో అధిక ప్రాతినిధ్యం ఉంటేనే సామాజిక, ఆర్థికంగా ముందడుగు వేయటం సాధ్యమవుతుందనే సూత్రీకరణను అన్ని సందర్భాల్లో చేయలేం. ఉత్తరాది–దక్షిణాదిలో బీసీల ప్రాతినిధ్యాల చరిత్ర చెప్పే సారం అదే! దేశమంతటికీ వర్తించే సాధారణ సూత్రీకరణలను భారత్‌లో రూపొందించటం అంత తేలికకాదు!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఇవి కూడా చదవండి...

KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన పాపం ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్

Pawan Kalyan on NREGS: ఉపాధి హామీ పథకంలో అవకతవకలను బయటపెట్టిన పవన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 18 , 2025 | 03:23 AM