వ్యవస్థీకృత అవినీతి
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:24 AM
ప్రభుత్వ వ్యవస్థాపరమైన అవినీతి సంక్లిష్టమవుతున్నది. సాధారణ పౌరులకు మాత్రమే కాదు మొత్తం దేశంలోని లా అండ్ ఆర్డర్‌కు పెనుసవాలు కానున్నది....

ప్రభుత్వ వ్యవస్థాపరమైన అవినీతి సంక్లిష్టమవుతున్నది. సాధారణ పౌరులకు మాత్రమే కాదు మొత్తం దేశంలోని లా అండ్ ఆర్డర్‌కు పెనుసవాలు కానున్నది. వాస్తవ ఘటనలతో వివరిస్తే ఇందులో తీవ్రత అర్థమవుతుంది. ఒక వ్యక్తి 2000 సంవత్సరంలో కొనుక్కున్న ఆస్తిని 2006లో అమ్మేసుకున్నాడు. ఆ కొన్నతను 2012లో దాన్ని అమ్మేసుకున్నాడు. ఆ కొన్నతను 2015లో దాన్ని ప్రస్తుత యజమానికి అమ్మేసుకున్నాడు. ఈ లావాదేవీలు అన్నీ ఒకే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగాయి. 2000 సంవత్సరంలో ఆస్తిని కొనుక్కున్న వ్యక్తి 2018లో చనిపోయాడు. అప్పుడు అతని కుటుంబ సభ్యులు తమ వద్ద ఎటువంటి ఆస్తి దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు లేకపోయినా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి కాపీలు తీసుకుని కోర్టులో ఆస్తి పంపకాల వివాదాన్ని కేసుగా నమోదు చేశారు. న్యాయమూర్తి ఆస్తి మీద ఎటువంటి ‘‘క్రొత్త వ్యవహారం నమోదు చేయవద్దు’’ అని సబ్ రిజిస్ట్రార్‌ను నిర్దేశించారు. సబ్ రిజిస్ట్రార్ ప్రస్తుత యజమానికి సమాచారం ఇవ్వకుండానే ఆస్తిని నిస్తేజపరిచేశారు. ప్రస్తుత యజమాని ఆ ఆస్తిని అమ్ముకుని రిజిస్టర్ చేద్దామని వెళితే, ‘‘మీ ఆస్తి కోర్టు ఆదేశాల మేర నిస్తేజపరచబడింది’’ అని సబ్ రిజిస్ట్రార్ ఆ లావాదేవీని తిరస్కరించారు.
ఇలా ఎందుకు జరిగిందో ప్రస్తుత యజమానికి తెలియాలంటే ఆర్టీఐ ద్వారా మాత్రమే విన్నవించుకోవాలి. ఆ విన్నపానికి ప్రత్యుత్తరంగా ఆర్టీఐ ‘‘కోర్టు నిర్దేశం, అనుబంధంగా ఆస్తుల వివరాల చిట్టా’’ను ఇచ్చింది. ప్రస్తుత యజమాని వెళ్ళి సబ్ రిజిస్ట్రార్‌తో ‘‘అయ్యా! 2018లో చనిపోయిన వ్యక్తి వారసులు 2000 సంవత్సరం నాటి ఆస్తుల చిట్టా పెట్టి కేసు వేశారు. తమరు అది చూసినట్లు లేరు. మీరు ఈ విషయం కోర్టుకు తెలియపరచండి. నా ఆస్తిని ‘నిస్తేజ’ స్థితి నుండి తొలగించండి’’ అని మౌఖికంగా అడిగారు. దీనికి ‘‘మేమెందుకు కోర్టు వ్యవహారంలో జోక్యం చేసుకుంటాం? మీరు కోర్టులో తేల్చుకొని మీకు అనుకూలంగా ఆదేశం తెచ్చుకోండి,’’ అన్న జవాబు వచ్చింది. ఈ విషయంపై న్యాయవాదులందరూ ఇదే చెప్పారు. ఇక్కడ చట్టబద్ధంగా నడుచుకున్నవాడు తన నిజాయితీని నిరూపించుకోవాల్సి రావడం విడ్డూరం కాదూ?
ఈ మొత్తం వ్యవహారంలో ఒక పద్ధతి ప్రకారం క్రమబద్ధీకరించబడిన అవినీతిని చూద్దాం. సదరు ఆస్తి వివరాల పూర్వ కాపీలను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసువారు ప్రస్తుత యజమానికి తెలియకుండా సంబంధం లేని వ్యక్తులకు ఇచ్చేశారు. అలా వాటిని సదరు ఆస్తితో సంబంధం లేని వారికి ఇవ్వడం అవినీతి కాదా?
కేసు విచారణలో న్యాయమూర్తి వాద ప్రతివాదుల నుంచి ‘‘అసలు దస్తావేజులు ఏవి?’’ అనే ప్రశ్నకు సమాధానం వెతకకుండానే, సదరు ఆస్తి వర్తమాన పరిస్థితి ఏమిటి అనేది పరీక్షించకుండానే, జిరాక్స్ కాపీల మీద ‘‘సదరు ఆస్తిని నిస్తేజపరచండి’’ అని ఆదేశాలు సబ్ రిజిస్ట్రార్‌కు ఇచ్చేశారు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల ముందు సమర్పించబడిన సమాచారం సవాలు కాబడనంతవరకూ అదే నిఖార్సైన నిజంలా పరిగణించబడుతుంది. సరే, ఆదేశం ఇచ్చేశారు! మరి న్యాయమూర్తుల ఆదేశాలను గుడ్డిగా అమలుచేయడమే తప్ప సబ్ రిజిస్ట్రార్ హోదాకు ఇంకే అధికార బాధ్యతలూ లేవా?
ఎందుకు లేవు, ఉన్నాయి! దేశంలో నడుస్తున్న ‘ఆస్తి నమోదు చట్టం 1908’, అలానే ‘సివిల్, క్రిమినల్ ప్రొసీజర్’ల సెక్షన్‌లు, రూల్స్ ప్రకారం సబ్ రిజిస్ట్రార్ అనే హోదా కూడా సివిల్ జడ్జ్ మెజిస్ట్రేట్ బాధ్యతలను, అధికారాలను కలిగిన ప్రభుత్వ హోదానే. నేరానికి శిక్ష వేసే అధికారం సబ్ రిజిస్ట్రార్‌కు లేకపోయినా స్థిరాస్తి వ్యవహారాలలో నేరం దృష్టికి వచ్చినపుడు, నేర విచారణ నిర్ధారణ చేస్తూ, పోలీసుల వద్ద నేరం నమోదు చేయించి, న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చేయగలిగే అధికార హోదా సబ్ రిజిస్ట్రార్‌కు ఉన్నది. న్యాయస్థానాలు తమ ముందు సమర్పించిన ప్రతి సమాచారం సవాలు కాబడనంత వరకూ నిజమే కావచ్చు అనే ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’తో విచారణ చేస్తాయి. అలాంటి న్యాయస్థానం నుంచి ఆదేశం వస్తే, దాని లోటుపాట్లు తరచి చూసి చర్యలకు పూనుకోవాలా? లేక న్యాయస్థానం ఆదేశం అని గుడ్డిగా అమలుచేసేయాలా?
ఈ సమస్యపై జరిగిన చర్చల్లో న్యాయవాదులు చెప్పిన దాని ప్రకారం– సబ్ రిజిస్ట్రార్ ముందు ఇద్దరు నిలబడి ‘‘రిజిస్ట్రేషన్ చేయండి’’ అని డబ్బు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్‌లకు తాము చేసే వ్యవహారాలపై ఉద్యోగపరంగా ఎటువంటి జవాబుదారీతనం ఉండటం లేదు. ఇలాంటి తప్పుడు వివాదాలు తయారు చేస్తే కేసులు తయారై ఆదాయం వస్తుంది అన్న దురాలోచనతోనే ఇదంతా చేస్తున్నారన్నది సుస్పష్టం. న్యాయస్థానాల్లో నమోదు అవుతున్న అనేక కేసులకు మూలకారణం– ప్రభుత్వ ఉద్యోగులు తమ పని పద్ధతులను అతిక్రమించడం. కోర్టులు విచారణలో భాగంగా ఈ అతిక్రమణలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ పరిస్థితిలో సాధారణ పౌరులకు రక్షణ ఏదీ?
కొడాలి ఏకాంబర్
ఈ వార్తలు కూడా చదవండి:
IT Raids: శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు.. నిర్ఘాంతపోయిన అధికారులు..
AP News: రాజధానిలో భూకేటాయింపులపై మంత్రుల కమిటీ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..