Share News

మైలారం గుట్టపైన మైనింగ్‌ భూతం!

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:45 AM

ప్రకృతిని గర్భశోకానికి గురిచేయకుండా అభివృద్ధి సాధించడం మన పాలకులకు సాధ్యం కాదా? అభివృద్ధి పురోగమనానికి ప్రకృతి విధ్వంసం పూర్వ రంగం కావాలని అర్థశాస్త్రంలో ఎక్కడా లేదు. కానీ ప్రకృతి...

మైలారం గుట్టపైన మైనింగ్‌ భూతం!

ప్రకృతిని గర్భశోకానికి గురిచేయకుండా అభివృద్ధి సాధించడం మన పాలకులకు సాధ్యం కాదా? అభివృద్ధి పురోగమనానికి ప్రకృతి విధ్వంసం పూర్వ రంగం కావాలని అర్థశాస్త్రంలో ఎక్కడా లేదు. కానీ ప్రకృతి విధ్వంసం చేయకుండా, జీవావరణాన్ని దెబ్బతీయ కుండా అభివృద్ధి ప్రాజెక్టులను పట్టాలెక్కించడాన్ని పెద్ద సవాలుగా భావిస్తున్నాయి ప్రభుత్వాలు. ఎక్కడ చూసినా అభివృద్ధి పేరిట గుట్టల విద్వంసం, పచ్చని చెట్లు నరికివేత, పంట పొలాల వినాశనం, అడవుల విధ్వంసం, విచ్చలవిడిగా కొనసాగుతుంది. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం దేశ భూభాగంలో 33 శాతం విస్తీర్ణంలో అడవులు కలిగి వుండాలి. కాని నేడు 24 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. ప్రకృతి విధ్వంసం ఇదే రీతిలో కొనసాగితే రానున్న కాలంలో మనిషి ఊపిరి తీసుకోవడానికి ప్రాణ వాయువు కూడా దొరకని దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా సమతుల్య సాధనకు నడుం బిగించాలి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, చెట్లను నరికివేత, పరిశ్రమల స్థాపన, అంతులేని అక్రమ మైనింగ్‌ వంటి చర్యలు అడవుల విధ్వంసానికి కారణమవుతున్నాయి.


దాదాపుగా 2300 కి.మీ.లలో విస్తరించిన నల్లమల అడవి అంచున ఉన్న గ్రామం మైలారం. ఇది నాగర్‌కర్నూలు జిల్లా, బల్మూరు మండల కేంద్రంలోకి వస్తుంది. ఈ గ్రామం మైలారం గుట్టని ఆనుకొని వుంది. ఈ గుట్ట ఆ ప్రజలకు జీవనాధారం. ప్రాణవాయువును, కలపను సమృద్ధిగా అందిస్తుంది. అనేక ఫల వృక్షాలకు, ఔషధ మొక్కలకు, ఇతర వృక్ష జంతు జలవనరులకు ఈ గుట్ట ఆలవాలం. వేంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, మారెమ్మతల్లి, ఈదమ్మ, శివుడు కొలువై వున్న ప్రశాంతమైన ప్రాంతం ఇది. జాతీయ పక్షి నెమలి, ఇతర పక్షులు, అనేక రకాల జంతువులతో అలరారుతుంటుంది. 120 ఎకరాల ఈ గుట్ట చుట్టూ ఆహ్లాదకరమైన చెరువులు, కుంటలు నిండుకుండలై మరింత శోభను తెచ్చిపెట్టాయి. కాకతీయుల కాలంనాటి సమాధులు, శివాలయం, పురాతన చరిత్రకు ఆధారాలుగా మిగిలాయి. ఈ గ్రామ స్త్రీలు ప్రకృతిలో భాగమైన ఈ గుట్టతో అనుసంధానం కలిగి ఉంటారు. 77 ఏళ్ళ స్వతంత్ర భారతంలో గిరిజన, బహుజన, దళిత, వ్యవసాయ మహిళా కూలీలకు ప్రాతఃకాలపు ఆత్మగౌరవ ప్రతీకగా ఈ గుట్ట నిలిచింది.


ఈ గుట్ట అందించే ఔషధ మొక్కలతో ప్రాణాలను కాపాడుకోవడం, అది అందించే ఫలాలను తిని బ్రతకడం మాత్రమే వారికి తెలుసు. వారు ఈ గుట్టను తల్లిగా భావిస్తారు. కలలో కూడా ఈ గుట్టకు హాని తలపెట్టరు. అయితే ఈ గుట్టపై ఇటీవల ఓ పెట్టుబడిదారుడు రాబందులా వాలి తన ఇనుప గోళ్ళతో ఆ తల్లిలాంటి గుట్ట పొట్టను చీల్చుతున్నాడు. ఆ గుట్ట గర్భంలోని లేతవర్ణపు గోధుమ రంగు స్ఫటిక రాళ్ళ (క్వార్డ్‌జ్‌ & వెల్డ్‌స్పర్‌) కుప్పను ఎత్తుకెళుతున్నారు. గ్రామస్థుల కడుపుకొట్టి విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. గ్రామస్థులంతా ఒక్కటై గుట్ట తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. ‘మైలారం గుట్ట పరిరక్షణ పోరాట కమిటీ’గా నిర్మాణమై గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. గుట్టను ధ్వంసం చేసి అందులోని విలువైన ఖనిజాన్ని తరలిస్తున్న కాంట్రాక్టరు పోలీసులను దింపి హింసకు పాల్పడుతున్నాడు. గ్రామ యువకులను, పెద్దలను విచక్షణారహితంగా అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మలయ్యారు. ఊరిలో పోలీసు క్యాంపు వెలసింది. మహిళలు, పిల్లలు, వ్యవసాయ కూలీలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గుట్ట తవ్వకాలు తీవ్రమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. భారీ వాహనాలు, లారీలు, జేసీబీలు, డ్రిల్లింగ్‌ మిషన్‌లు, తిరుగాడుతుండంతో రోడ్లు మట్టికొట్టుకుపోతున్నాయి. డ్రిల్లింగు మిషన్‌ల శబ్దాలకు చంటి పిల్లలు నిద్రలోనే ఉలిక్కిపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం నుండి తనకు అన్ని అనుమతులు ఉన్నాయని ధీమాగా వ్యవహరిస్తున్నాడు కాంట్రాక్టరు. ఆ అనుమతులన్నీ మోసపూరితంగానే తెచ్చుకున్నాడు. గుట్ట మైనింగును నిలిపివేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి అనేక విన్నపాలు సమర్పించుకున్నారు గ్రామస్థులు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. నల్లమల రిజర్వు ఫారెస్టుకు అతి సమీపంలో ఉన్నా కూడా అటవీ అధికారులు దీనిని నిలువరించడం లేదు. చివరకు గ్రామస్థులే నడుం బిగించారు. తమ సమస్యలే ఆ ప్రజలను చైతన్యవంతుల్ని చేశాయి. అందులోంచి నాయకత్వాలు ఎదుగుతున్నాయి.


‘మైలారం గుట్ట పరిరక్షణ పోరాట కమిటికి’ యువకులు నాయకత్వం వహిస్తున్నారు. పెద్దలు సలహాలు సూచనలు అందజేస్తున్నారు. మరోవైపు న్యాయపోరాటానికి కూడా సిద్ధపడ్డారు. ఇంకోవైపు ప్రభుత్వం ఉద్యమాన్ని ఆదిలోనే అణచివేయాలని నిర్బంధాన్ని ప్రయోగిస్తూ అరెస్టులకు, రిమాండులకు పాల్పడుతున్నది. దామగుండం అటవీ ప్రాంతంలో నిర్మించ తలంచిన రాడార్‌ స్టేషన్‌ కింద నలిగిన ప్రజలు, లగచర్ల ఉద్యమంలో జైలుపాలైన రైతులు, ఇథనాల్‌ కంపెనీ వల్ల పచ్చని పొలాలు కోల్పోతున్న రైతులు, హైడ్రా జేసీబీల దాడి కింద చితికిపోయిన ప్రజలు, మూసీ పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితులు ఈ ఉద్యమానికి సంఫీుభావంగా నిలవాలని కోరుతున్నారు. పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు, పౌర సమాజం తమ న్యాయమైన పోరాటానికి అండగా నిలవాలని కోరుకుంటున్నారు.

లక్ష్మణ్‌ గడ్డం

పౌరహక్కుల సంఘం అధ్యక్షులు

Updated Date - Jan 07 , 2025 | 12:45 AM