Share News

వస్తువు, శిల్పం, దృక్పథం అవిభాజ్యం!

ABN , Publish Date - Feb 03 , 2025 | 06:33 AM

మానవ జీవితంలో సాహిత్యం నిర్వహించే పాత్రకు అల్లం రాజయ్య కథలు, నవలలు అత్యుత్తమ ఉదాహరణ. సృజనాత్మకమైన ప్రజా ఆచరణ నుంచి ఆయన సాహిత్యం...

వస్తువు, శిల్పం, దృక్పథం అవిభాజ్యం!

మానవ జీవితంలో సాహిత్యం నిర్వహించే పాత్రకు అల్లం రాజయ్య కథలు, నవలలు అత్యుత్తమ ఉదాహరణ. సృజనాత్మకమైన ప్రజా ఆచరణ నుంచి ఆయన సాహిత్యం రూపుదాల్చి తిరిగి ప్రజా ఆచరణను ప్రభావితం చేస్తుంది. జీవితంలో రద్దయిపోతున్న దాన్ని, నిర్మాణమవుతున్న దాన్ని ఎత్తి చూపడమే ఆయన సాహిత్య శిల్పం. తన రచనలతో తెలుగు సాహిత్యంలో వర్గ సంఘర్షణను బహుముఖాలుగా ఆయన ప్రవేశ పెట్టారు. చరిత్రతో ప్రజలు చేసే సంభాషణే సాహిత్య శిల్పమని ఆయన కథలు, నవలలు నిరూపిస్తాయి. ఇది ‘నవలా శిల్పం’ శీర్షకన ఆయనతో జరిపిన సంభాషణ.

పాత వ్యవస్థను అధిగమిస్తూ కొత్తను సృజనాత్మకంగా నిర్మించడమే మీ నవలా ఇతివృత్తం కదా. దానికి తగినట్లు మీరు ప్రత్యేకంగా శిల్పాన్ని ఎన్నుకుంటారా?

ఏ వ్యవస్థ అయినా దాని ఉత్పత్తి సంబంధాల వల్ల ఉనికిలో ఉంటుంది. అది ఏ రంగంలోనైనా మౌలిక మార్పులు రాకుండా నిరోధిస్తూ ఉంటుంది. వర్గపోరాటం దాన్ని ఎదుర్కొంటుంది. కొత్త వ్యవస్థను నిర్మిస్తుంది. ఈ లక్ష్యంతో కరడుగట్టిన భూ స్వామ్య సమాజంలో మార్పులు తీసుకురావడానికి 1967లో నక్సల్బరీ పోరాటం ఆరంభమైంది. 1977–78 నాటికి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ రైతాంగ పోరాటాలు రూపుదిద్దుకున్నాయి. వీటి వల్ల పాత ఉత్పత్తి సంబంధాల్లో కదలిక మొదలైంది. ఇక్కడి నుంచి కొత్త సాహిత్య వస్తువు వచ్చింది. సామాజిక సంఘర్షణ లోంచి వచ్చిన ఈ కొత్త కథా, నవలా వస్తువుకు తగిన శిల్పం అవసరమైంది. ప్రజలు అత్యంత సృజనాత్మకంగా వర్గపోరాటంలో పాల్గొంటున్నారు. నేను ఉన్న స్థల కాలాల్లో నా తరం ప్రజలందరిలాగే నేనూ అందులో భాగమయ్యాను. ఆ పోరాటాల్లో పాలుపంచుకుంటున్న ప్రజలందరికీ కొత్త సాహిత్యం అవసరమైంది. దాని కోసం భాషలో, వ్యక్తీకరణలో, కథన పద్ధతిలో వర్గ పోరాటం అందించిన సృజనాత్మకతను నా నవలా శిల్పంలోకి తీసుకొచ్చాను. చలనంలో ఉన్న, దృగ్గోచరం కాని సామాజిక వాస్తవికతను అర్థం చేసుకోడానికి తగిన శిల్పం అది. సోషలిస్టు వాస్తవికతా వాద సాహిత్యానికి అవసరమైన నవలా శిల్పాన్ని విప్లవోద్యమంలోంచి స్వీకరించాను. సృజనాత్మక వర్గపోరాటంలో భాగమైన ప్రజల భావోద్వేగాలను, ఆచరణను రాయడానికి పాత సంప్రదాయక నవలా శిల్పం సరిపోదు. ఉదాహరణకి– రైతుకూలీల సృజనాత్మక నిర్మాణ వ్యక్త రూపం, శిల్పం రైతుకూలీ సంఘం. దాని భాష, అవగాహన మౌఖికంగా నిరంతరం మారుతూ కొత్తగా అభివృద్ధి చెందుతున్నది. నా నవలల ఇతివృత్తమేగాక, శిల్పం కూడా ఆ కొత్తకు సంబంధించింది. ‘సృజన’ సాహితీ మిత్రుల వల్ల నా మొదటి నవల ‘కొలిమంటుకున్నది’ గూగీ చెప్పిన ‘వొరేచర్‌’ పద్ధతిలో తయారైంది.

వస్తువుకు స్థలకాలాలు ఉన్నట్లే శిల్పానికీ ఉంటాయా?

తప్పక ఉంటాయి. పాత ధ్వంసమైపోయి కొత్త సమాజం నిర్మాణమవుతున్నప్పుడు వస్తువులో ఇది కనిపించినంతగా శిల్పంలో వెంటనే కనిపించదు. సమాజం పరిమాణాత్మక దశ నుంచి గుణాత్మకంగా మారేటప్పుడు శిల్పంలో కూడా మార్పులు వస్తాయి. ఆ రకంగా శిల్పం స్థలకాలబద్ధంగా ఉంటుంది. వర్గపోరాటం మందకొడిగా ఉన్న సమాజాల్లో నవలా శిల్పంలో పెద్దగా మార్పు కనిపించదు. యూరప్‌ నుంచి వస్తున్న నవలల్లో ఇది చూడవచ్చు.

గత యాభైఏళ్ల విప్లవోద్యమ పోరాట రూపాలకు తగినట్లు మీ నవలా శిల్పాన్ని ఎట్లా మార్పుకుంటూ వస్తున్నారు?

మధ్యయుగాలనాటి కాన్‌సంట్రేషన్‌ క్యాంపుల్లా ఉండిన భూ స్వామ్య కుల వర్గ గ్రామ పునాదిని విప్లవోద్యమం కూలగొడుతున్న కాలంలో అదే మా కాలంలో గొప్ప సృజనాత్మక శిల్పం. ఒక పెనుమార్పుగా అది పాట, కవిత్వం, బ్యాలె, కథ, నవల, ప్రసంగం అన్నిటిలోకి వచ్చింది. అప్పుడు నేను నవలా రచన మొదలుపెట్టాను కాబట్టి అది ‘కొలిమంటుకున్నది’ నవలా శిల్పాన్ని నిర్ణయించింది. ఆ తర్వాత వర్గపోరాటం ఉధృతమై సామాజిక ఆర్థిక సాంస్కృతిక సంబంధాలు కొత్తగా నిర్మాణమయ్యే క్రమంలో దొరలు సాంఘిక బహిష్కారం అయ్యారు. ఉత్పత్తిదాయకమైన ప్రజలు గ్రామంలో కేంద్ర స్థానానికి వచ్చారు. కల్లోలిత ప్రాంత చట్టం వచ్చి గ్రామాల్లో రాజ్య నిర్బంధం పెరిగింది. తీవ్రమైన భావజాల సాంస్కృతిక సంఘర్షణ గ్రామాల స్వరూప స్వభావాన్ని మార్చేశాయి. అన్ని వైపుల నుంచి దాడులను అనేక పోరాట రూపాలతో ప్రజలు ఎదుర్కొని కొత్త సంబంధాలను కాపాడుకున్నారు. ప్రజలు గడించిన ఈ క్షేత్ర అనుభవం 1982లో రాసిన ‘ఊరు’ నవలలోని శిల్పాన్ని మార్చింది. అట్లాగే 1979 నుంచి విప్లవోద్యమం గెరిల్లా స్థావరాల నిర్మాణాన్ని చేపట్టింది. రైతాంగ ఉద్యమంలో తర్ఫీదైన మహిళలు ఈ ఉన్నత దశలో భాగమయ్యారు. దీని వల్ల పితృస్వామ్య వ్యతిరేక చైతన్యం పెరిగింది. స్త్రీలను విప్లవంలో పూర్తిస్థాయిలో భాగం చేయడం ఎలా? అనే కొత్త చర్చ వెనుక ఉన్న భావజాల, సాంస్కృతిక ఆచరణ అంతా ‘అగ్నికణం’ నవలా వస్తువునేగాక శిల్పాన్ని కూడా నిర్ణయించింది. అటవీ ప్రాంత ఉద్యమం విస్తరించే క్రమంలో ఇంద్రవెల్లి మారణకాండ జరిగింది. ఈ ప్రపంచాన్ని మార్చే పోరాటంలో భాగమైన ఆదివాసులు తమ గత పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకొచ్చారు. సమాజాన్ని ముందుకు తీసికెళ్లే వర్గపోరాటం నిరంతరం చరిత్రలోని గతంతో సంభాషించి వర్తమానాన్ని నిర్మిస్తుంది. ఈ అవగాహనతో ‘కుమురం బీం’ (1983) నవల సాహుతో కలిసి రాశాను. విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకపోవడంలో పాత నాయకత్వం వెనుకబడితే రైతాంగ, కార్మిక పోరాటాల నుంచి ఎదిగిన కొత్త నాయకత్వం ముందుకు పోవాలనుకుంది. ఈ ఘర్షణ రాజకీయ, సైనిక రంగాల్లో జరిగి ఉద్యమాన్ని కొత్త దశకు తీసికెళ్లింది. ఇదంతా ‘వసంతగీతం’ (1987) నవలలో కనిపిస్తుంది. 2017లో రాసిన ‘టైగర్‌ జోన్‌’ నవల వస్తు శిల్పాలు ఆదివాసీ ఉద్యమానికి సంబంధించినవైతే, 2021 రాసిన ‘సైరన్‌’ కార్మిక ఉద్యమ శిల్పంలో ఉంటుంది.

తెలుగులో సంప్రదాయ నవల శిల్పాన్ని అధిగమించడానికి శిల్పం మీదే కేంద్రీకరించారా? లేక వస్తువు, దృక్పథాల వైపు నుంచి కూడా సాధన చేశారా?

వస్తువు, శిల్పం, దృక్పథం అవిభాజ్యమైనవి. సంప్రదాయక వస్తువు నుంచి, దృక్పథం నుంచి విప్లవోద్యమం తెలుగు సాహి త్యాన్ని బయటపడేసింది. వైయక్తిక అనుభవానికన్నా విప్లవంలోని క్షేత్రస్థాయి అనుభవం వస్తువు అయినప్పుడు విప్లవకరమైన శిల్పం అవసరం అవుతుంది. వస్తువులా దృగ్గోచరం కాని శిల్పాన్ని శాస్త్రీయ దృక్పథం తోనే అర్థం చేసుకోగలం. అన్ని రకాల సంప్రదాయాలను వెనక్కి నెట్టేసిన విప్లవోద్యమం ఇతివృత్తాన్ని, దృక్పథాన్ని, శిల్పాన్ని వేర్వేరుగా ఎంచుకోవడం ఉండదు. కొత్తగా నిర్మాణమవుతున్న ప్రజా జీవితంలో ఇవి కలిసే ఉంటాయి. కాబట్టి నా నవలల్లోకి అవి కలిసే వచ్చాయి. చలనంలో ఉన్న సమాజాన్ని రాయడానికి అధ్యయనం, ఆచరణ దోహదం చేశాయి. ఇది కూడా సమిష్టిగానే సాగింది. నా నవలా శిల్పాన్ని నా సహ విప్లవ రచయితల సృజనాత్మకత ప్రభావితం చేసింది.

ప్రధానంగా వ్యక్తుల జీవితం కేంద్రంగా ఉండిన తెలుగు నవలను ప్రజల జీవితం కేంద్రంగా మార్చేక్రమాన్ని ఎట్లా సాధించారు?

నక్సల్బరీ వ్యక్తికి–సమష్టికి ఉన్న గతితార్కిక సంబంధాన్ని కొత్తగా నిర్వచించింది. ప్రధాన వైరుధ్యం పరిష్కారం కోసం జరిగే పోరాటంలో ప్రజలు వ్యక్తుల దగ్గరి నుంచి సమిష్టిగా మారే ప్రక్రియ అద్భుతంగా జరిగింది. విరసం సభ్యుడిగా నేను ఈ మార్పును క్షేత్రస్థాయిలో ప్రజా జీవితం నుంచి గ్రహించాను. వ్యక్తి కేంద్రంగా ఉన్న సమాజంలో రావాల్సిన మార్పు కోసం విప్లవోద్యమం కృషి చేస్తోంది. అదే నా నవలల్లో కనిపిస్తుంది.

ఇంటర్వ్యూ

n పాణి

Updated Date - Feb 03 , 2025 | 06:33 AM