నీడలు కాదు, సమవుజ్జీలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:58 AM
ఆర్. వసుంధరాదేవి, ఆచంట శారదాదేవి, శివరాజు వెంకట సుబ్బ లక్ష్మి, అబ్బూరి ఛాయాదేవి, కె. రామలక్ష్మి – వీళ్ళందరి మధ్యా ఒక సామ్యం ఉంది. వారి భర్తలైన ఆర్.ఎస్. సుదర్శనం...
ఆర్. వసుంధరాదేవి, ఆచంట శారదాదేవి, శివరాజు వెంకట సుబ్బ లక్ష్మి, అబ్బూరి ఛాయాదేవి, కె. రామలక్ష్మి – వీళ్ళందరి మధ్యా ఒక సామ్యం ఉంది. వారి భర్తలైన ఆర్.ఎస్. సుదర్శనం, ఆచంట జానకీ రామ్, బుచ్చిబాబు, అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఆరుద్రలకు తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక విశిష్ట స్థానం ఉంది. అయిన ప్పటికీ వాళ్ళు భర్తచాటు భార్యల్లాగా ఉండిపోలేదు. రచయి త్రులుగా మర్రి చెట్ల నీడన కూడా మొలకలెత్తారు. శాఖోపశాఖ లుగా విస్తరించారు. తమకంటూ ఒక అస్తిత్వం సాధించుకున్నారు.
ఆర్. వసుంధరాదేవి కథలుగా అందుబాటులో ఉన్నది నలభై ఎనిమిది కథలు మాత్రమే. కొన్ని రచనలకు ఏకబిగిన చదివించే లక్షణం ఉంటుంది. కానీ ఈ నలభై ఎనిమిది కథలను మాత్రం ఏకబిగిన చదవలేం. ఒక్కో కథ పూర్తవగానే మనసు ఏదో తెలీని భారంతో నిండిపోతుంది. సాంద్రతతో బరువెక్కిన లోతైన పదాలు, వాక్యాలు, ఆ బరువునీ, దిగులునీ మన గుండె లోతుల్లోకి ప్రతిష్టి స్తాయి. చదువుతున్నంతసేపూ మనకే తెలియని ఒక నిర్వేదంలో చిక్కుకుపోయి ఊపిరాడనివ్వని గాఢమైన అనుభూతికి లోనవుతాం. ఒక పక్క అమృతం, ఒక పక్క హాలాహలంగా ఆలోచన రెండు రెండుగా విడిపోతుంటుంది. ‘‘ఈ మానవజాతి ఎదుటి మనిషితోనూ, అతని సుఖదుఃఖాలతోనూ, కష్టనిష్టూరాలతోనూ సంబంధం కోల్పో వడాన రోగగ్రస్థమై పోతున్నది. మానవజాతిని ఏడ్చే నవ్వే మను షులుగా, ఎదుటివాళ్ళను అర్థంచేసుకునే వాళ్ళుగా ఉండనీ స్వామీ’’ (పెంజీకటికవ్వల) లాంటి వాక్యాలు, పదబంధాలు ఆర్. వసుంధరా దేవి ప్రతిభకు, భావ వ్యక్తీకరణకు నిదర్శనం. శారదాదేవి కథల్ని కథలనే దానికన్నా ఆలోచనా శకలాలు అనవచ్చు. ఒక విషయం గురించి ఆలోచన ప్రారంభమై క్రమంగా విస్తరించి చివరికి కథగా మారిపోతుంది. అందుకే కె. రామలక్ష్మి శారదాదేవి కథల్ని ‘లౌడ్ థింకింగ్’ అంటారు.
ఆచంట శారదాదేవి కథలు ఎక్కడో ఆకాశం లోంచి ఊడిపడ్డట్టు ఉండవు. దిగజారిపోతున్న మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, నైతిక విలువలు సమాజపు పోకడలు – వీటి చుట్టూ కథలు నడుస్తుంటాయి. ఎక్కడో సముద్ర గర్భంలో మొదలైన అల తన ప్రయాణం మొదలుపెట్టి ఉవ్వెత్తున కెరటంలా ఎగసిపడి తీరంచేరడం ఎంత సహజంగా క్రమబద్ధంగా జరిగి పోతుందో శారదాదేవి కథ ఎత్తుగడ, నడక అంతే సహజంగా జరిగిపోతుంది. సమస్యలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ జీవితం మాత్రం అలాగే ఉంటుంది. జీవన క్రమంలో ఎదురైన సమస్యలను ఓర్పుతో నేర్పుతో పరిష్కరించుకోవడంలోనే మనిషి ప్రతిభ దాగుంటుంది అనే భావన అనేక కథల్లో అంతర్లీనంగా ప్రవహిస్తుంటుంది. ‘కారుమబ్బులు’, ‘ఇరుగూ పొరుగూ’, ‘ప్రేమ`పెళ్ళి’, ‘పగడాలు’, ‘పారిపోయిన చిలక’, ‘నిద్రలేని రాత్రి’, ‘తెల్లార్తే ముహూర్తం’ లాంటి కథలన్నీ ఏ కథకు ఆ కథ ఒక ఆణిముత్యం.
శివరాజు వెంకట సుబ్బలక్ష్మి దాదాపు యాభై కథల వరకూ రాశారు. మొదట మొదట తనకు కథలు రాయడం అంత అల వాటు లేదని, బుచ్చిబాబు గారి కోసం ఇంటికి వచ్చే స్నేహితులు, అతిథులు ‘మీరేం చేస్తుంటారు’ అని అడుగుతుండడంతో చిన్నగా కథలు రాయడం ప్రారంభించానని చెప్పే శివరాజు వెంకట సుబ్బ లక్ష్మి మంచి చిత్రకారిణి కూడా. సుబ్బలక్ష్మిగారి కథలన్నీ ఒక స్త్రీ హృదయంలోంచి వచ్చే కథలు. స్త్రీలు మాత్రమే రాయగలిగిన కథలు. పురుషుడు ఎంత ప్రతిభావంతుడైనా స్త్రీ స్వభావాన్ని తనకు అర్థమైన రీతి లోనే ఆవిష్కరించగలడు. ఒక స్త్రీ మాత్రమే మరొక స్త్రీ నిగూఢమైన అంతరంగ లోతుల్ని వెదికి పట్టుకోగలదు. ఆ రకంగా శివరాజు సుబ్బలక్ష్మి కథలు మధ్యతరగతి స్త్రీల మనో విశ్లేషణ కథలని చెప్పుకోవచ్చు. ‘అదృష్టరేఖ’, ‘నీలంగాటు అయ్య గారు’, ‘తీర్పు’, ‘కావ్య సుందరి కథ’, ‘ఒడ్డుకు చేరిన కెరటం’, ‘మనో వ్యాధికి మందుంది’, ‘శివరాజు సుబ్బలక్ష్మి కథలు’ లాంటి ఆమె నవలలు, కథల్లోని పాత్రలన్నీ సమస్యల్ని సహనంతో ఎదుర్కొం టాయి తప్ప ఆత్మహత్య పరిష్కారం అనే దిశగా పయనించవు.
అబ్బూరి ఛాయాదేవి అబ్బూరి వరదరాజేశ్వరరావు ఛాయ, ప్రచ్ఛాయ కాకుండా అబ్బూరి ఛాయాదేవిగా స్వయంసిద్ధ రచయిత్రి. ఛాయాదేవిపై చలం, జిడ్డు కృష్ణమూర్తి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఎంతో సంక్లిష్టమైన జిడ్డు కృష్ణమూర్తి రచనల్ని కూడా ఆమె ఎంతో ప్రతిభావంతంగా, మూలంలోని అర్థం, భావం ఏ మాత్రం చెడకుండా అచ్చతెలుగులో అను వాదం చేసి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకు న్నారు. ‘తన మార్గం’ అనే కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న అబ్బూరి ఛాయాదేవి మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, పురుషాధిక్య సమాజంలో అడుగడుగునా స్త్రీలు ఎదుర్కొనే వివక్ష ప్రధానంగా కథలు రాయడమే కాకుండా ఆ అనాచారాలన్నిటినీ ధైర్యంగా ప్రశ్నించాలని అంటారు. ఆడపిల్లల పెంపకం లోనూ, మగపిల్లల పెంపకంలోనూ వివక్ష చూపిస్తూ వివాహం అయిన తర్వాత బోన్సాయి మొక్కలానే స్త్రీల రెక్కల్ని కూడా కత్తిరించి ‘భార్య’ అనే బిరుదు తగిలించి ఆమెను కూడా బోన్సాయి మొక్కలా తయారు చేయడాన్ని తప్పు పడతారు ఛాయాదేవి (‘బోన్సాయి బ్రతుకు’). తండ్రి అంటే భయం తప్ప తండ్రి ప్రేమ, ఆత్మీయ స్పర్శ తెలియని కూతురి వేదనీ; భర్తల ఆధిపత్యం కింద నలిగిపోయే భార్యల అంతర్మధనాన్నీ... ఇలా ప్రశ్నించడానికి అవకాశం వచ్చిన ఏ సందర్భాన్నీ ప్రశ్నించకుండా వదిలిపెట్టరు ఛాయాదేవి.
‘తెలుగు స్వతంత్ర’లో సబ్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కె. రామలక్ష్మి ఆరుద్ర సతీమణి గానే కాకుండా కె. రామలక్ష్మిగానే సుప్రసిద్ధులు. తొంభై రెండేళ్ళ జీవితంలో రామలక్ష్మి ‘మెరుపు తీగె’, ‘అవతలి గట్టు’, ‘ఆంధ్రనాయకుడు’, ‘మానని గాయం’, ‘నా కూతురు ఫెమినిస్ట్’ తదితర నవలలు; ‘ఎ సర్టిఫికెట్’, ‘అందుకో ఈ ప్రేమలేఖ’, ‘అందమైన పొరుగు’, ‘అద్దం’, ‘అదెక్కడ’ లాంటి అసం ఖ్యాక కథలతో తెలుగు సాహితీ ప్రపంచంలో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నారు. సంప్రదాయకతకు, ఆధునికతకు మధ్య సంధియుగంలోని మధ్యతరగతి కుటుంబాలు, ఆ కుటుంబా ల్లోని ఆడపిల్లలు, భార్యలు ఎదుర్కొన్న అనేక సమస్యల గురించి, స్త్రీల హక్కుల గురించి, స్త్రీల ఇంటి చాకిరికి గుర్తింపు లేకపోవడం గురించి ప్రశ్నిస్తారు రామలక్ష్మి. కేవలం రచనలకే పరిమితం కాకుండా మహిళా సంక్షేమ సంస్థలతో కూడా కలసి పనిచేసిన రామలక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవ లసింది ఒకటుంది. 1970 ప్రాంతాల్లో ఆంధ్ర పత్రిక సచిత్ర వారపత్రికలో సుదీర్ఘంగా నడిచిన కె. రామలక్ష్మి ‘ప్రశ్నలు– జవాబులు’ శీర్షిక గురించి. ఎవరన్నా కొంటె ప్రశ్నలు వేస్తే అంతే చురుక్కు మనిపించేలా సమాధానం ఇచ్చేవారు. ఆ ఒక్క పేజీ పాఠకుల మొహాల్లో నవ్వుల పువ్వులు పూయించేది.
1960, 70 దశకాన్ని ఒక రకంగా మహిళా రచయితల దశకంగా చెప్పుకోవచ్చు. పాఠకుల్ని అందమైన ఊహాలోకంలో కలల ప్రపంచంలో విహరింపచేసే రచనలు ఒకవైపు, అపుడపుడే మొలకెత్తుతున్న స్త్రీ అస్తిత్వపు స్పృహ, చైతన్యం, అన్నిటినీ ప్రశ్నించే ధోరణులతో కూడిన రచనలు మరోవైపు– ఈ రెండు ధోరణులు సమాంతరంగా ప్రయాణించే సాహిత్య వాతావరణం కొత్తగా ఏర్పడింది. యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి తదితర రచయి త్రులు మొదటి వర్గం కాగా ఆర్. వసుంధరాదేవి, ఆచంట శారదాదేవి, మాలతి చందూర్, తురగా జానకీరాణి, కళ్యాణ సుందరీ జగన్నాథ్, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, కె. రామ లక్ష్మి, అబ్బూరి ఛాయాదేవి, పి. శ్రీదేవి తదితరులు రెండో వర్గం.
నిజానికి అప్పట్లో యద్దనపూడి తదితరుల రచనా ధోరణే ప్రధాన ప్రవాహంగా, అన్ని రకాల ఆకర్షణలు, ఆదరణలు కలిగి ఉండేది. ఆకాశమార్గాన ప్రయాణించే ఆ సాహిత్యాన్ని భూమార్గం పట్టించి రంగనాయకమ్మ, కె. రామలక్ష్మి, ఆర్. వసుంధరాదేవి తదితరులు ఆచార సంప్రదాయాల పేరుతో, మాతృత్వం పేరుతో, ఆదర్శ గృహిణి పేరుతో స్త్రీల చుట్టూ కమ్మిన మాయా మోహపు తెరలను, బంగారు సంకెళ్ళను ఛేదించడానికి అహర్నిశలూ కృషి చేశారు. 60, 70 దశకాలలోని స్వర్ణయుగపు రోజులు అంతరించి తర్వాత కొంత కాలానికి రచయిత్రుల రచనలను హేళన చేసి చిన్నచూపు చూసే ఒక కొత్త పరిణామం తలెత్తిన పుడు ఈ రెండో వర్గపు రచయిత్రులే ఆ అపప్రథ నుంచీ, అవమానం నుంచీ తప్పించి ఒక రకంగా రచయిత్రుల గౌరవానికి ప్రాణ ప్రతిష్ట కలిగించారని చెప్పుకోవచ్చు. అందుకే ఆర్.ఎస్. సుదర్శనం ఉన్నంత వరకూ ఆర్. వసుంధరా దేవి, ఆచంట జానకిరామ్ ఉన్నంత వరకూ ఆచంట శారదాదేవి, బుచ్చిబాబు ఉన్నంత వరకూ శివరాజు వెంకట సుబ్బలక్ష్మి, అబ్బూరి వరద రాజేశ్వరరావు ఉన్నంత వరకూ అబ్బూరి ఛాయాదేవి, ఆరుద్ర ఉన్నంత వరకూ కె. రామలక్ష్మి కూడా ఉంటారు. అయితే వాళ్ళ వెనక ఛాయలుగా, ప్రచ్ఛాయలుగా కాదు. వాళ్ళ పక్కనే సరి సమానంగా, సమాంతరంగా.
జి. లక్ష్మి
94907 35322
For Telangana News And Telugu News