Share News

ఆవేశం కాదు... ఐకమత్యం కావాలి

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:22 AM

గత ప్రభుత్వంపై భయంతోనూ, కూటమి నాయకత్వంపై నమ్మకంతోనూ ఏపీ ప్రజలు కూటమికి అత్యధిక మెజారిటీతో అధికారాన్ని అప్పగించారు. అభివృద్ధి చేసే విషయంలో...

ఆవేశం కాదు... ఐకమత్యం కావాలి

గత ప్రభుత్వంపై భయంతోనూ, కూటమి నాయకత్వంపై నమ్మకంతోనూ ఏపీ ప్రజలు కూటమికి అత్యధిక మెజారిటీతో అధికారాన్ని అప్పగించారు. అభివృద్ధి చేసే విషయంలో కూటమి నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో అనేక దుర్మార్గాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసినవారు ఇంకా తమ కళ్ళ ముందు తిరుగుతుండడం, గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వానికి జీ హుజూర్ అన్న ప్రభుత్వ ఉన్నతాధికారులే నేటికీ ఉన్నత స్థానాల్లో ఉండి చక్రం తిప్పడం చాలా మందికి రుచించడం లేదు. దీంతో కూటమి పార్టీల అనుకూల వ్యక్తులే ప్రభుత్వంపై కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బహిరంగంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అధికారంలోకి వచ్చి నెలలు దాటిపోతున్నాయి కానీ, వారిపై చర్యలు తీసుకోవడం లేదు, జైళ్లల్లో పెట్టడం లేదు, ఆ అధికారులను సస్పెండ్ చేయడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రజాస్వామ్య పాలనలో అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ దానికి ఒక పద్ధతి ఉంది.


వైసీపీ ప్రభుత్వం చేసినట్టు ఇప్పుడు చేయకపోవడమే ఉత్తమం. కూటమి ప్రభుత్వం కూడా చేస్తున్నది ఇదే! రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే రెండు కళ్లుగా భావిస్తున్న కూటమి ప్రభుత్వం ఎక్కడా సహనాన్ని కోల్పోకుండా వ్యవస్థలను చక్కబెట్టే పనిలో నిమగ్నమై ఉంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ విషయంలో రాజ్యాంగబద్ధంగా, చట్ట పరిధిలో తన పని తాను చేసుకుంటూ పోతోంది. సహజంగానే ఇది కొందరికి రుచించదు. అయినా కూడా న్యాయాన్యాయ విచక్షణ సామాన్య ప్రజలకు వదిలిపెట్టే అంశం కాదని కూటమి ప్రభుత్వానికి బాగా తెలుసు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల భావోద్వేగాలను బట్టి కాకుండా, ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలించాలి. రాజకీయాలు, ఎన్నికలు, న్యాయ నిర్ణయాలు వేర్వేరు అనే స్పృహ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు ఉండాలి. అధికారంతో, పలుకుబడితో, ప్రజల ఓట్లతో నిమిత్తం లేకుండా చట్టం అందరికీ సమానంగా వర్తించడం, చట్టమే పరిపాలన చేయడం, ప్రతి వ్యక్తి ఆ చట్టానికి లోబడి వ్యవహరించడం చట్టబద్ధ పాలనలో కీలకమయిన అంశాలు.


నిరంకుశ పాలనకన్నా సమిష్టి నిర్ణయాలు బాగుంటాయనే విశ్వాసం ప్రజాస్వామ్యానికి మూలం. అందుకే కూటమి ప్రభుత్వంలో ఉన్న అధినేతలు గత ప్రభుతంలో ఎన్ని అవమానాలకు, అవహేళనలకు, శారీరక, మానసిక హింసలకు గురైనా అధికారంలోకి వచ్చాక ఎటువంటి కక్షపూరిత చర్యలకూ పాల్పడకుండా, ఎక్కడా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా వ్యవస్థలకు, చట్టాలకు గౌరవాన్ని, స్వేచ్ఛను ఇచ్చి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. అందుకే ఈ తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్రం చెప్పుకోదగ్గ అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఇది అందరూ హర్షించదగ్గ, అభినందించదగ్గ విషయం.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గత ఐదేళ్లూ ఎంతో కృషి చేసిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఎలా దిగజారేదో ఆలోచించుకోవాలి. ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా 11 స్థానాలకు పరిమితం చేసినా ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి ఆటంకాలు సృష్టిస్తున్నారో, నిరంతరం విషం చిమ్ముతున్నారో గ్రహించాలి. ప్రజలను రాక్షస పాలన నుండి విముక్తి చేయడానికి, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వ్యక్తిగతంగా ఎన్ని మాటలు పడ్డారో, ఎన్ని అవమానాలు భరించారో గుర్తెరగాలి. కేవలం రాష్ట్రం కోసం ఈ ముగ్గురూ ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో చేసి చూపించిన విధానాన్ని, సాధించిన ఘన విజయాన్ని ఇక ముందు కూడా నిర్విఘ్నంగా కూటమి పార్టీలు కొనసాగించాలి. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తూ ఈ తొమ్మిది నెలల్లో అమలు చేసిన, అమలు చేయబోయే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కూటమి నాయకులు, కార్యకర్తల భుజస్కందాలపై ఉంది. ప్రజల భావోద్వేగాలను బట్టి కాకుండా, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలి.


బీదరికాన్ని నిర్లక్ష్యం చేసినా, సంపద సృష్టించకపోయినా, ఆర్థిక వ్యవస్థ, సమాజం అతలాకుతలమవుతాయి. అందుకే కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకుంటున్నది. కూటమి ప్రభుత్వ ఉద్దేశ్యం ‘మంచి జరగడానికి మార్గం సుగమం చేయడం, చెడుకు అడ్డుకట్ట వేయడం’ అనే విషయాన్ని ప్రచారం చేయాలి. కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి, పార్టీలకు బలం కావాలే గానీ, భారం కాకూడదు. అధినేతలకు తలనొప్పిగా మారకూడదు. ఈ దిశగా ఆలోచించిననాడు కూటమి నాయకత్వంలో రాష్ట్రం, దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంటుంది. కావాల్సిందల్లా ఓపిక, సహనం, ఐకమత్యం... అంతే!

కూసంపూడి శ్రీనివాస్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

ఈ వార్తలు కూడా చదవండి:

IT Raids: శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు.. నిర్ఘాంతపోయిన అధికారులు..

AP News: రాజధానిలో భూకేటాయింపులపై మంత్రుల కమిటీ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..

Updated Date - Mar 11 , 2025 | 12:22 AM