India Agriculture Reforms: సాగులో నయా పద్ధతులు అవసరం
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:43 AM
స్వాతంత్ర్యానంతర తొలినాళ్లలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండేది. నాటి సంప్రదాయ వ్యవసాయం వల్ల రైతులు ఆరుగాలం కష్టపడి పండించినా పట్టుమని పది బస్తాల ధాన్యం కూడా...
స్వాతంత్ర్యానంతర తొలినాళ్లలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండేది. నాటి సంప్రదాయ వ్యవసాయం వల్ల రైతులు ఆరుగాలం కష్టపడి పండించినా పట్టుమని పది బస్తాల ధాన్యం కూడా ఇంటికొచ్చేది కాదు. అప్పటి వంగడాలు తక్కువ దిగుబడినిస్తూ, చీడపీడలను తట్టుకునే స్వభావం చాలా తక్కువగా ఉండి, ఎక్కువ ఎత్తు పెరిగేవి. దాంతో పంట కోత సమయంలో గింజలు పొలంలోనే రాలిపోయి అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చేవి. దాంతో ‘షిప్ టు మౌత్’, ‘బెగ్గింగ్ బౌల్’ వంటి హేళనలను నాటి భారతం ఎదుర్కోవాల్సి వచ్చింది. అనంతర కాలంలో చేపట్టిన హరిత విప్లవం చాలా వరకూ సత్ఫలితాలనిచ్చింది. కానీ కొత్త వంగడాల రాకను ఆహ్వానిస్తూనే, పాత దేశవాళీ వంగడాలను కాపాడుకునే ప్రయత్నం నాటి వ్యవసాయాధికారులు చేయలేదు. నేడు ప్రపంచంలోని పలు దేశాలు వ్యవసాయరంగంలో అనేక వినూత్న పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాయి. ‘ఫుకోక నేచురల్ ఫార్మింగ్, పెర్మాకల్చర్, సిన్ట్రోపిక్ ఫార్మింగ్, కొరియన్ నేచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, హోలిస్టిక్ మేనేజ్‌మెంట్ నేచురల్ సీక్వెన్స్ ఫార్మింగ్, బయోడైనమిక్ ఫార్మింగ్, రీజెనెరేటివ్ అగ్రికల్చర్...’ మొదలైన సేంద్రియ వ్యవసాయ ప్రధాన పద్ధతులను పలు దేశాలు అనుసరిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాయి. మనదేశ వ్యవసాయ పద్ధతుల్లోనూ మార్పు రావాలి. 2024లో భారతదేశం 59.75 లక్షల హెక్టార్లలో సమర్థవంతంగా సేంద్రియ వ్యవసాయాన్ని చేయగలిగిందని ఐఎఫ్ఓఏఎం గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని ఇంకా పెంచుకుంటూ.. నూతన పద్ధతుల్లో దేశవాళీ వంగడాల సాగును ప్రోత్సహించాలి. రసాయన మందుల పిచికారీని వీలైనంత మేర తగ్గించాలి. సీడ్ బాల్స్‌ను వాడడం, సేంద్రియ ఆధారిత వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్‌కు ప్రభుత్వం పెద్దపీట వేయాలి.
బొంతా విద్యాధర్ పీజేటీఏయూ,
వరంగల్
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News