Share News

తల్లిభాషను శ్వాసిస్తేనే వెల్గుల జీవితం

ABN , Publish Date - May 21 , 2025 | 05:47 AM

‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కృష్ణదేవరాయలు చెప్పిన మాటలు మనకు ఎప్పటికీ గర్వకారణం. తెలుగు భాషకు అద్భుతమైన చరిత్ర, సంప్రదాయం, సాహిత్యం ఉన్నాయి. కానీ ఆధునిక కాలంలో ఉద్యోగాల వేటలో, విదేశాల బాటలో పరుగులు పెడుతూ మనమే మన భాషను...

తల్లిభాషను శ్వాసిస్తేనే వెల్గుల జీవితం

‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కృష్ణదేవరాయలు చెప్పిన మాటలు మనకు ఎప్పటికీ గర్వకారణం. తెలుగు భాషకు అద్భుతమైన చరిత్ర, సంప్రదాయం, సాహిత్యం ఉన్నాయి. కానీ ఆధునిక కాలంలో ఉద్యోగాల వేటలో, విదేశాల బాటలో పరుగులు పెడుతూ మనమే మన భాషను విస్మరిస్తున్నాం. భవిష్యత్తుకు బాటలు వేసే బడి నుంచి తెలుగును నెమ్మదిగా వెలి వేశారు. ప్రైవేటు పాఠశాలల్లో మొదలైన ఈ పోకడ, రానురాను ప్రభుత్వ బడులకు కూడా పాకింది. కాన్వెంట్లలో చదివిన పిల్లలు ఆంగ్లం నేర్చుకొని, ఉన్నత విద్య పూర్తి కాగానే విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్నారన్న భావన సమాజంలో బలపడడంతో పల్లెల్లో కూడా ప్రభుత్వ బడులకు నిరాదరణ ఎదురైంది.

మాతృభాష అంటే కేవలం సంభాషణకు ఉపయోగించే భాష కాదు. అది మన భావోద్వేగాల ప్రతిబింబం, మన సంస్కృతికి మూలాధారం. తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలలో మాతృభాష పరిరక్షణకు ప్రభుత్వాలే కాకుండా ప్రజలు, ప్రజాసంఘాలు కూడా పాటుపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే తల్లిభాష పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని చూస్తున్నాం. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, మాతృభాషలో పునాది బలంగా ఉన్న విద్యార్థులు ఇతర భాషలను సులభంగా నేర్చుకుంటారు. పైగా మాతృభాషలో విద్యాబోధన వల్ల విద్యార్థులు బాగా అర్థం చేసుకుంటారు. ఇంట్లో మాట్లాడే భాషకు, బడిలో పాఠాలు నేర్చుకునే మాధ్యమానికి పొంతన లేకపోవడం వల్ల పిల్లలపై చిన్నప్పటి నుంచే భారం పడుతున్నది.

సమాజం ఎప్పుడూ పైకి చూస్తుంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్లను అనుసరిస్తుంది, అనుకరిస్తుంది. ఈ వైఖరే తెలుగును ప్రమాదపు అంచుల దాకా తీసుకుపోయింది. దాదాపు మూడు నాలుగు దశాబ్దాల క్రితం పల్లెల్లో డబ్బున్న వాళ్లు తమ పిల్లలను పక్క ఊళ్ళలోని ప్రైవేటు బడులకు పంపించడం, పట్టణాలూ నగరాల్లో పేరున్న విద్యాసంస్థల్లో చేర్పించడం మొదలయింది. అలా చదువుకున్న పిల్లలు మన దేశంలోనో పర దేశంలోనో బాగా డబ్బు సంపాదించి, సొంతూరికి వచ్చినప్పుడు మారిన జీవన శైలితో అందరి దృష్టిలో పడేవాళ్లు. అది చాపకింద నీరులా ఇంటింటికీ పాకింది. అప్పోసప్పో చేసైనా తమ పిల్లలను ప్రైవేటు బడులలో ఇంగ్లీషు మీడియం చదివించాలన్న భావన పల్లెల్లో బలపడింది.


తెలుగు భాష ప్రమాదంలో పడిందని భాషాభిమానులు గ్రహించే లోగానే పరిస్థితి దాదాపు చేతులు దాటిపోయింది. మాతృభాషలో చదువుల ఆవశ్యకతను తెలియజేస్తూ కాళ్లకు బలపాలు కట్టుకొని ఊళ్లు పట్టుకొని తిరుగుతున్న వాళ్లకు ప్రోత్సాహం లభించకపోగా, ప్రతిఘటన ఎదురయింది. వీళ్లంతా తమ పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివించి, విదేశాలకు పంపించి, ఇప్పుడిప్పుడే బలపాలు పట్టుకున్న నిరుపేదల పిల్లలను ఎదగకుండా చేసేందుకే తెలుగుభాషా పరిరక్షణ పేరుతో వీధుల్లోకి వస్తున్నారనే వాదన తెరమీదికి వచ్చింది. తెలుగును కాపాడుకోవాలని పిలుపునిస్తున్న అధిక శాతం ప్రముఖుల పిల్లలుగానీ, వాళ్ల పిల్లలుగానీ తెలుగు మాధ్యమంలో చదవడం లేదు.

ఒక భాష మనుగడ కోల్పోతే, ఆ భాషతో పాటు ఆ సంస్కృతి, ఆ చరిత్ర కూడా అంతరించిపోతుంది. ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నెలకు సగటున రెండు భాషలు అంతరించిపోతున్నాయి. తెలుగు భాషకు అలాంటి ప్రమాదం ఇప్పుడే లేదు అనుకున్నా, మన నిర్లక్ష్య ధోరణి కొనసాగితే అది సమీప భవిష్యత్తులో విపత్తుగా మారవచ్చు. ఎంట్రెన్సుల కోసం విద్యార్థులను తోమీతోమీ ఆప్షనల్ సబ్జెక్టులను బట్టీ పట్టించే ప్రైవేటు విద్యాసంస్థలు దీనికి ఒక అడ్డదారి కనుగొన్నాయి. తెలుగుకు బదులుగా సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకుంటే పెద్దగా కష్టపడకుండానే నూటికి నూరు మార్కులు తెచ్చుకునే అవకాశం ఉండడంతో అందరినీ సంస్కృతం వైపు నడిపించాయి. ఇది తెలుగు భాషకు పెద్ద ప్రమాదంగా పరిణమించింది. చదువు జనం భాషలో ఉన్నపుడే చదువుకున్నవాళ్లకూ సామాన్యులకూ మధ్య వారథిగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించి ప్రభుత్వాలు ప్రతి విభాగంలోనూ తెలుగును ఆచరణీయమైన భాషగా అమలు చేయాలి.


మాతృభాషా పరిరక్షణ నినాదం ప్రతి ఇంటికీ చేరాలి. ప్రతి వ్యక్తిలోనూ భాషాభిమానం నింపాలి. ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులోనే మాట్లాడేలా ప్రోత్సహించాలి. కథలు చెప్పాలి, పాటలు పాడాలి. పండగలు, పబ్బాలలో తెలుగుదనం ఉట్టిపడేలా చూడాలి. పదో తరగతి దాకా తెలుగును తప్పనిసరిగా బోధించాలి. తెలుగు మీడియాన్ని ప్రోత్సహించాలి. ఇంగ్లీష్ ప్రాముఖ్యతను కాదనకూడదు కానీ తెలుగును తక్కువ చేయకూడదు; తెలుగు భాషా దినోత్సవాలు, సాహిత్య ఉత్సవాలు నిర్వహించాలి. తెలుగు అభివృద్ధికి బడ్జెట్ కేటాయించాలి. యువ రచయితలకు ప్రోత్సాహం ఇవ్వాలి; మొబైల్ యాప్స్, వెబ్‌సైట్స్, ఆన్‌లైన్ పాఠాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుగును సాంకేతికతలోనూ విస్తరించాలి. కృత్రిమ మేధ, అనువాద యంత్రాలు, వాయిస్ అసిస్టెంట్లకు తెలుగును మరింత అనుకూలంగా తీర్చిదిద్దాలి.

30 ఏళ్ల క్రితం తెలుగు భాషోద్యమ సమాఖ్య వాళ్లు ఉద్యమ కరదీపికగా ‘తెలుగువాణి’ అనే పక్షపత్రికను నిర్వహించేవారు. ఆ పత్రికలో ప్రచురితమైన ఒక వక్కపొడుల సంస్థ ప్రకటనలోని నినాదం నాకింకా గుర్తుంది. ‘వక్క పలుకుల రుచి మధురం, తెలుగు పలుకులు మృదుమధురం’. 15వ శతాబ్దంలో ఎక్కడో యూరప్ నుంచి విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన నికోల్ డి కంటి అనే భాషా పరిశోధకుడు తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అని కొనియాడాడు. తెలుగు భాషలో అనేక ప్రత్యేకతలున్నాయి. వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన తెలుగును కాపాడుకుందాం. భావి తరాలకు భద్రంగా అందిద్దాం.

పి. వేణుగోపాల్ రెడ్డి

ఏకలవ్య ఫౌండేషన్

ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 05:47 AM